CINEMATelugu Cinema

కథానాయకుడి నుండి ప్రతినాయకుడిగా మారిన స్ఫురద్రూపి. కైకాల సత్యనారాయణ..

ఇరవై ఎనిమిదేళ్ల తన నటప్రస్థానం ముగుస్తున్న సమయంలో విశ్వనటచక్రవర్తి, నటసార్వభౌమ బిరుదాంకితులు “ఎస్వీ రంగారావు” స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే చర్చ మొదలైంది. ఆ విశ్వనటుడు స్థానాన్ని నిజంగా ఎవరైనా భర్తీ చేయగలరా? అని సినీ ప్రముఖులు ఆందోళన పడుతున్న రోజులు అవి. సరిగ్గా అదే సమయానికి కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామానికి చెందిన కైకాల సత్యనారాయణ నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు.

గంభీరమైన వాచకంతో, నవరసభరితమైన నటనతో, అబ్బురపరచే ఆంగికంతో, హావభావాలను చిలికిస్తూ నటనకే భాష్యం చెప్పిన ఆ నటులు, తన వీర, రౌద్ర, బీభత్స రసాలను అటు పౌరాణిక జానపదాల్లోను, ఇటు చారిత్రాత్మక, సాంఘిక చలన చిత్రాలలోను తనదైన శైలితో మెప్పిస్తున్నారు. ఆయన నటనా శైలిని గమనించిన ఎస్వీయార్ కైకాల సత్యనారాయణనే నా నటనా వారసులు, ఆయనే మరో యస్వీయార్ అని తేల్చి చెప్పారు. యస్‌.వి.రంగారావు మరణానంతరం ఆయన పోషించాల్సిన గంభీర పాత్రలు ఎక్కువగా సత్యనారాయణనే వరించాయి. దాంతో గుణచిత్ర నటులుగా తనని తాను మలుచుకునే అవకాశం కైకాల సత్యనారాయణకు దక్కింది.

ఎస్వీ రంగారావు ప్రభావం తన నటనమీద పడకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు కైకాల సత్యనారాయణ. తనకంటూ ఒక ప్రత్యేక శైలిని అలవరుచుకుంటూనే నవరసాల నట చక్రవర్తి అయ్యారు. తాను నటించిన ప్రతీ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి, అందరి మన్ననలను పొందిన మేటి నటులు కైకాల సత్యనారాయణ. 1959లో “సిపాయి కూతురు” అనే చిత్రంతో సినీరంగప్రవేశం చేసిన ఆయన తన 60 సంవత్సరాల సినీజీవితంలో సుమారు 777 సినిమాల్లో నటించారు. కైకాల సత్యనారాయణ అచ్చుపోలినట్లు ఎన్టీఆర్ లానే వుండేవారు. నిలువెత్తు విగ్రహంతో యన్‌.టి.రామరావు కృష్ణుడి పాత్ర పోషిస్తే, సత్యనారాయణ సుయోధనుడుగా నటించేవారు. రామారావు రాముడైతే, సత్యనారాయణ రావణాసురుడు. విఠలాచార్య ప్రోత్సాహంతో ప్రతినాయకునిగా రాణించిన అనుభవశాలి. వెండితెరపై భయంకరమైన విలన్ గా మెరిసిన కైకాల సత్యనారాయణ ప్రేక్షకుల గుండెల్లో గొప్ప నటుడిగా నిలిచిపోయారు.

కథానాయకుడిగా, కరుడుగట్టిన ప్రతినాయకుడిగా, హాస్యనటుడిగా, గుణచిత్రనటుడిగా కైకాల పోషించని పాత్ర లేదు, ఆయన వేయని వేషం లేదు. తెలుగు సినిమా మాటలు నేర్చిన తొంభై సంవత్సరాల చలనచిత్ర చరిత్రలో గుణచిత్ర నటులలో సూపర్ స్టార్ హోదాను అనుభవించినవారు ఒకరు ఎస్వీ రంగారావు అయితే, మరొకరు నిస్సందేహంగా కైకాల సత్యనారాయణ. “నిప్పులాంటి మనిషి” సినిమాలో ప్రాణ్‌ను మరపించిన షేర్ ఖాన్ పాత్రలో, “శారద” లో చెల్లెలి కోసం ప్రాణం త్యాగానికి సిద్ధపడే అన్నగా, “తాత మనవడు” లో నిర్దయుడైన తనయునిగా, “యమగోల” సినిమాలో ‘‘యముండ’’ అంటూ దయామయుడైన శిక్షకునిగా, “వేటగాడు” సినిమాలో అమాయక చక్రవర్తిగా, ఉంగరాల సాంబయ్యగా “సావాసగాళ్లు” సినిమాలోను, సంగీతానికి జీవితాన్నే వెచ్చించిన కళాకారునిగా “సూత్రధారులు” సినిమాలోను, “సిరిసిరిమువ్వ” లో వికలాంగుడైన చేతగాని తండ్రిగా, “గురువును మించిన శిష్యుడు” లో ధర్మపాలునిగా వైవిధ్యమైన నటనకు కైకాల ఊపిరులూదారు. అరవై ఏళ్ల నటనానుభవాన్ని, అన్నిటినీ మించి అసాధారణ జీవితసారాన్ని ఆపోసన పట్టిన మహామేధావి కైకాల. ఆ నటసార్వభౌముడు పుట్టినరోజు సందర్భంగా కొన్ని విశేషాలు.

జీవిత విశేషాలు…

జన్మ నామం   :    కైకాల సత్యనారాయణ 

ఇతర పేర్లు    :    నవరస నటసార్వభౌమ 

జననం    :    25 నవంబరు 1935   

స్వస్థలం   :    కౌతరం గ్రామం, గుడ్లవల్లేరు మండలం, కృష్ణా జిల్లా..

వృత్తి      :   సినిమాలు, రాజకీయం

తండ్రి       :     కైకాల లక్ష్మీనారాయణ.

జీవిత భాగస్వామి :  నాగేశ్వరమ్మ

పిల్లలు      :   కైకాల లక్ష్మీనారాయణ, కైకాల రామారావు (చిన్నబాబు), కైకాల రమాదేవి లతో సహా మరో కూతురు 

మరణ కారణం   :    అనారోగ్యం 

మరణం   :   23 డిసెంబరు 2022, హైదరాబాదు

నేపథ్యం…

కైకాల సత్యనారాయణ 25 జులై 1935 నాడు కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి కైకాల లక్ష్మీనారాయణ. ఆయన ప్రాథమిక విద్యను గుడ్లవల్లేరు, ప్రాథమికోన్నత విద్యను విజయవాడలో పూర్తిచేసి చివరగా “ది గుడివాడ కళాశాల” (ఏఎన్ఆర్ కళాశాల) నుండి పట్టభద్రులయ్యారు. ఇంటర్మీడియట్‌ చదివే రోజులలోనే వివిధ నాటక సంస్థల తరపున రాష్ట్రమంతా పర్యటించి “పల్లెపడుచు”, “బంగారు సంకెళ్లు”, “ప్రేమలీలలు”, “కులంలేని పిల్ల”, “ఎవరుదొంగ” వంటి నాటకాలలో నటిస్తూ ఒకవైపు ప్రతినాయకుడిగా, మరో వైపు కథానాయకుడిగా నటిస్తూ ఎన్నో బహుమతులు గెలుచుకున్నారు. నాటకాలలో నటిస్తున్న సమయంలో సినిమాలలో నటిస్తారా? అని ఒక దర్శకుడు అడిగిన ప్రశ్నకు “నేను డిగ్రీ పూర్తి చేసిన తరువాతనే సినిమాల గురించి ఆలోచిస్తాను అని చెప్పి, చదువు పూర్తిచేసుకున్న తరువాతనే ఆయన అవకాశాల కోసం మద్రాసు వెళ్లారు. 1955 నాటికే డిగ్రీ పూర్తయిన సత్యనారాయణకు ఉద్యోగం రాలేదు. రాజమండ్రిలో కైకాల కుటుంబానికి కలప వ్యాపారం ఉండేది. అక్కడ కొంతకాలం గడిపి, స్నేహితుడు కె.ఎల్‌.ధర్‌ సలహాలపై సినిమాల్లో ప్రయత్నాలు సాగించేందుకు మద్రాసు వెళ్లారు.

సినీ రంగం…

సినిమాలో అవకాశం ఇస్తాను, నాలుగు రోజులు ఆగిరమ్మని చెప్పిన దర్శకుడి మాట విని మద్రాసులోనే కొన్ని రోజులు ఉండి పోదామని నిర్ణయించుకుని అవకాశాల కోసం చాలా రోజులు ఎదురు చూసినా ఏ సినిమాకి కూడా ఎంపిక కాలేదు. అవకాశాలు వెతుకుతున్న సమయంలో ఉండడానికి ఆవాసం లేక 15 రోజులు ఒక పార్కులోనే పడుకున్నారు. ఇంత కఠిన సమయంలో కూడా మద్రాసు వదిలి వెళ్ళకూడదని నిశ్చయించుకొని అక్కడే ఉండి ప్రయత్నాలు చేసేవారు. కైకాల సత్యనారాయణ మంచి స్ఫురద్రూపి, రింగుల జుట్టుతో చూపరులను అమితంగా ఆకట్టుకునే ఆయన చూడడానికి ఎన్టీఆర్‌లా కనిపించేవారు. దాంతో సినిమాల మీద అభిరుచి పెరిగి ఎప్పటికైనా మంచి సినిమా నటుడిగా ఎదగాలని కలలు కనేవారు. ప్రసాద్‌ ప్రొడక్షన్స్‌ సంస్థలో సహాయ కళాదర్శకుడిగా తన మిత్రుడు కె.యల్.ధర్ పనిచేస్తుండేవారు. “కొడుకులు – కోడళ్లు” అనే సినిమా కోసం దర్శక, నిర్మాతకు ఆయన కైకాలను పరిచయం చేయగా దర్శకులు ఎల్‌.వి.ప్రసాద్‌, సత్యనారాయణకు స్క్రీన్‌ టెస్టులన్నీ చేసి ఆయనను ఎంపికచేశారు. దురదృష్టవశాత్తు ఆ సినిమా ప్రారంభం అవ్వలేదు.

దురదృష్టం వెంటాడినా ధైర్యం కోల్పోకుండా…

ఎల్‌.వి.ప్రసాద్‌ దర్శకత్వంలో సినిమా ప్రారంభం కాకున్నా కూడా సత్యనారాయణ మొక్కవోని ధైర్యంతో దర్శకనిర్మాత బి.ఎ.సుబ్బారావును కలువగా ఆయన సత్యనారాయణను ప్రముఖ దర్శకనిర్మాత కె.వి.రెడ్డి వద్దకు పంపించారు. ఆయన మేకప్‌ టెస్ట్‌, వాయిస్‌ టెస్ట్‌, స్క్రీన్‌ టెస్ట్‌ అన్నీ చేయించి కూడా కైకాలకు అవకాశం కల్పించలేకపోయారు. కె.వి.రెడ్డి తెరకెక్కిన “దొంగరాముడు” సినిమాలో కైకాలకు దక్కాల్సిన పాత్ర ఆర్‌.నాగేశ్వరరావుకు దక్కింది. ఆఖరికి దేవదాసు నిర్మాత డి.ఎల్‌.నారాయణ సత్యనారాయణను దేహదారుడ్యాన్ని నచ్చి చందమామ బ్యానర్‌పై చెంగయ్య దర్శకత్వంలో తీసిన “సిపాయి కూతురు” (1959) లో కథానాయకుడిగా జమున సరసన నటింపజేశారు. సత్యనారాయణ సినీరంగ ప్రవేశం చేసిన మొదటి సినిమా.

ఆ సినిమా ఆశించినంత విజయాన్ని సాధించలేదు. కైకాలకు ఎన్టీఆర్‌కు దగ్గర పోలికలుండటం వలన సత్యనారాయణ ఖాళీగా ఉండకుండా ఆయనకు డూపుగా అనేక సినిమాలలో నటించారు. ఎన్టీఆర్‌ చొరవతోనే 1960లో “మోడరన్‌ థియేటర్స్‌” వారి “సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి” చిత్రంలో అతిథి పాత్రలో నటించారు. ఈ సినిమా దర్శకుడు ఎస్‌.డి.లాల్‌ విఠలాచార్య శిష్యుడు. అందువలన సత్యనారాయణలో ఉన్న ప్రతిభను గుర్తించిన ఆయన విఠలాచార్యకు చెప్పి “కనకదుర్గ పూజామహిమ” లో ప్రతినాయకునిగా నటింపజేశారు. అందులో ఆయన పోషించిన సేనాధిపతి పాత్ర అతన్ని ప్రతినాయకుడిగా నిలబెట్టింది. దాంతో కథానాయకుడిగా నిలదొక్కుకోవలసిన సత్యనారాయణ దుష్ట పాత్రలకే పరిమితం కావలసి వచ్చింది. ఆయన చేత బి.ఎన్‌.రెడ్డి “రాజమకుటం” సినిమాలో ఒక చిన్న పాత్ర పోషింపజేశారు.

ప్రతినాయక పాత్రలలో…

కైకాల సత్యనారాయణకు 1962లో మంచి అవకాశాలు వచ్చాయి. వై.ఆర్‌.స్వామి దర్శకత్వంలో “స్వర్ణగౌరి” లో శివుడి పాత్ర, “మదనకామరాజు కథ” లో ధర్మపాలుడు, “శ్రీకృష్ణార్జున యుద్ధం” లో కర్ణుడు, చిత్తజల్లు పుల్లయ్య రంగుల చిత్రం “లవకుశ” లో భరతునిగా, “నర్తనశాల” లో దుశ్శాసనునిగా, “పరువు ప్రతిష్ట” లో ప్రతినాయకునిగా నటించారు. విఠలాచార్య “అగ్గిపిడుగు” లో రాజనాల ఆంతరంగికునిగా, “జిస్‌ దేశ్‌ మే గంగా బెహతీ హై” లో ప్రాణ్‌ పాత్రలో, “పాండవవనవాసం”, “శ్రీకృష్ట పాండవీయం” లలో ఘటోత్కచునిగా, “శ్రీకృష్ణావతారం”, “కురుక్షేత్రం” లో సుయోధనుడిగా, “దానవీరశూరకర్ణ” లో భీమునిగా, “చాణక్య చంద్రగుప్త” లో రాక్షస మంత్రిగా, “సీతాకల్యాణం” లో రావణాసురునిగా నటించి తన అసమాన ప్రతిభను చాటిచెప్పారు. అదేవిధంగా “కథానాయిక మొల్ల” లో శ్రీకృష్ణదేవరాయలుగా నటించి మెప్పించారు కైకాల. “ఉమ్మడికుటుంబం” సినిమాలో ఎన్టీఆర్‌కు జాలిగొలిపే అన్నగా, “వరకట్నం” సినిమాలో కృష్ణకుమారి సోదరునిగా తన నటనను పోషించారు. “శారద” వంటి సినిమాతో సత్యనారాయణ మంచి గుణచిత్ర నటునిగా గుర్తింపు పొందారు. కేశవవర్మ పాత్రలో “ప్రేమనగర్‌” లో, విభిన్నమైన ప్రతినాయకుడి పాత్రలో “అడవిరాముడు”, “వేటగాడు” వంటి సినిమాలలో పోషించిన పాత్రలు అద్భుతంగా ఆకట్టుకున్నాయి.

గుణచిత్ర నటునిగా…

యస్‌.వి.రంగారావు మరణానంతరం ఆయన పోషించాల్సిన గంభీరమైన పాత్రలు సత్యనారాయణనే ఎక్కువగా వరించేవి. అందువలన గుణచిత్ర నటునిగా తనని తాను మలుచుకున్నారు. “గూండా”, “గ్యాంగ్‌లీడర్‌”, “సమరసింహారెడ్డి” వంటి సినిమాలలో బాధ్యాతాయుతమైన పోలీసు అధికారిగా నటించి ఆ పాత్రలకే వన్నె తెచ్చారు. “తూర్పుపడమర”, “తాత మనవడు”, “చదువు సంస్కారం”, “సిరిసిరిమువ్వ”, “నేరము శిక్ష”, “బంగారు కుటుంబం”, “తాతయ్య ప్రేమలీలలు”, “అన్వేషణ”, “మంత్రిగారి వియ్యంకుడు”, “బొబ్బిలిరాజా”, “శ్రుతిలయలు”, “ఒంటరిపోరాటం”, “అత్తకు యముడు అమ్మాయికి మొగుడు”, “రుద్రవీణ”, “అల్లుడుగారు” వంటి సాంఘిక చిత్రాలలో కైకాల సత్యనారాయణ విభిన్న పాత్రలు పోషించి మెప్పించారు. సామాజిక అతీంద్రియ, ఇంద్రజాల చిత్రాలు “యమగోల”, “యమలీల”, “యముడికి మొగుడు” వంటి చిత్రాలలో యముడిగా నటించారు. చివరిసారిగా ఆయన “దరువు” సినిమాలో  కనిపించారు. రమా ఫిలిమ్స్‌ పేరిట చిత్రనిర్మాణ సంస్థను ప్రారంభించిన ఆయన “ఇద్దరు దొంగలు”, “గజదొంగ”, “కొదమ సింహం”, “బంగారు కటుంబం”, “ముద్దుల మొగుడు” వంటి ఎనిమిది ప్రయోజనకరమైన చిత్రాలు తీసి విజయం సాధించారు. చిరంజీవి సినిమాలకు కొన్నింటికి సహా నిర్మాతగా కూడా వ్యవహరించారు.

పోరాట సన్నివేశాలు మాని హాస్య పాత్రలకు చేరి…

ఒకసారి అక్కినేని నాగేశ్వరావు సినిమా చిత్రీకరణ కోసం సినిమా తెరకెక్కించే స్థలానికి ఉదయమే వెళ్లారు కైకాల సత్యనారాయణ. ఆ రోజు పోరాట సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. పైగా వర్షంలో ఆ ఫైట్ ను చిత్రీకరణ చేస్తున్నారు. దాంతో కైకాల సత్యనారాయణ కాస్త ఇబ్బంది పడుతూనే ఆ రోజు చిత్రీకరణలో పాల్గొన్నారు. చిత్రీకరణ మొదలయ్యింది. ఆ ఫైట్ లో ఒక షాట్ చాలా ప్రమాదకరంగా ఉంది. దాంతో ఆ షాట్ చేయనని కైకాల సత్యనారాయణ తెగేసి చెప్పారు. కానీ అందుకు దర్శక, నిర్మాతలు అంగీకరించలేదు. డబ్బు తీసుకున్నందుకు కచ్చితంగా చేయాలి అని వారు దెప్పిపొడిచారు. కైకాల సత్యనారాయణ మనసు గాయపడింది. నేరుగా ఆ సినిమా కథానాయకులు అక్కినేని నాగేశ్వరావు వద్దకు వెళ్లి ఇదే విషయాన్ని చెప్పారు.

కైకాల మాటలు విన్న అక్కినేని “చూడండి సత్యనారాయణ గారు ఆ పోరాట సన్నివేశాలలో నేనే కూడా నటిస్తున్నాను. నిర్మాత అప్పు తెచ్చి సినిమా చేస్తున్నారు. మనం ఇలాంటివి తప్పకుండా చేయాలి.  ప్రేక్షకులు ఇవి కోరుకుంటున్నారు” అంటూ అక్కినేని చెప్పుకుంటూ పోయారు. ఆ సమయంలో అక్కినేని చెప్పిన మాటలు కైకాల సత్యనారాయణకి నచ్చలేదు. వెంటనే కైకాల అక్కడి నుండి కోపంగా లేచి వెళ్లిపోయారు. కానీ, ఆ మరుసటి రోజు ఆ ప్రమాదకరమైన సన్నివేశాన్ని కైకాల సత్యనారాయణ చేశారు. కానీ ఆ తరువాత నుండి కైకాల సత్యనారాయణ పోరాట సన్నివేశాలలో నటించడం తగ్గిస్తూ వచ్చారు. ఆ తరువాత ఆయనకు హాస్య పాత్రలు కూడా వచ్చాయి. హాస్యం కైకాల వల్ల అవుతుందా? అని విమర్శలు చేసినవారు కూడా వున్నారు. అందుకే, హాస్య పాత్రలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కైకాల కసితో నటించారు.

సాలీడు పడిన కాఫీ త్రాగి…

కైకాల సత్యనారాయణ  మద్రాసులో ఒక సినిమా చిత్రీకరణ పూర్తిచేసుకుని ఇంటికి వచ్చేశారు. మాములుగానే ఇంటికి రాగానే కాఫీ త్రాగే అలవాటు ఉన్న ఆయనకు తన పనిమనిషి కాఫీ ఇచ్చింది. సోఫాలో తీరిగ్గా కూర్చుని కాఫీ త్రాగుతున్నారు. కాఫీ త్రాగడం పూర్తయ్యాక చూస్తే ఆ కప్పు అడుగున “సాలీడు” పురుగు కనబడింది. అది చూసి ఆయనకు గుండె గుబేలుమంది. ఆ విషయం తెలుసుకున్న కొందరు ఆయనను  వైద్యుడి వద్దకు వెళ్లాలని సలహా ఇచ్చారు. కొందరు ఏకంగా హడావిడి చేసి ఆయనను కలవరపెట్టారు. కానీ కైకాల సత్యనారాయణ మాత్రం మొండిగా వైద్యుడి వద్దకు ససేమిరా వద్దు అన్నారు. తన అదృష్టం బాగుంటే బ్రతికి బయట పడతానని అనుకుని భారమంతా దేవుడి మీద వేసి నిద్రపోయారు. ఆ మరునాడు ఉదయం ఎప్పటిలానే నిద్దురలేవడంతో హమ్మయ్య అనుకున్నారు. ఇదే విషయాన్ని ఓసారి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు కైకాల సత్యనారాయణ.

ఆరున్నర దశాబ్దాల సినీ జీవితం…

87 ఏళ్ళ తన జీవన మజిలీలో 63 యేండ్లు సినిమాలకే అంకితం చేయడం మాములు విషయం కాదు. విభిన్న చిత్రాలలో అనేక పాత్రలతో మెప్పించి రాణించారు కైకాల సత్యనారాయణ. ఈ అరవై మూడేళ్ళ సినీ ప్రస్థానంలో 1959లో “సిపాయి కూతురు” చిత్రంతో సినిమాలలో అడుగుపెట్టిన ఆయన 777 సినిమాలలో నటించారు. ఈ క్రమంలో 200 మందికి పైగా దర్శకుల వద్ద పనిచేశారు. 28 పౌరాణిక చిత్రాలు, 51 జానపద చిత్రాలు, 9 చారిత్రక చిత్రాలు, వీటితో పలు సాంఘిక చిత్రాలలో నటించారు. తన సినీ ప్రస్థానం తొలిదశలో ఎక్కువగా విలన్ పాత్రలనే చేసిన సత్యనారాయణ, తరువాత కాలంలో గుణచిత్ర నటులుగా పేరు తెచ్చుకున్నారు. 

ఒడ్డూపొడవు అచ్చుపోలినట్లు నందమూరి తారకరామారావు లాగానే ఉండడంతో కైకాల సత్యనారాయణ తొలి రోజుల్లో ఎన్టీఆర్ కు డూప్‌గా నటించేవారు. గంభీరమైన స్వరం, నిండైన విగ్రహంతో సత్యనారాయణ పౌరాణిక పాత్రలలో కూడా రాణించారు. దుర్యోధనుడు, రావణాసురుడు, యమధర్మరాజు లాంటి పాత్రలలో ఆయనకు సాటిలేరన్న ప్రశంసలు అందుకున్న కైకాల శ్రీకృష్ణార్జున యుద్ధం, లవ కుశ, రాజ మకుటం, పాండవ వనవాసం, నర్తనశాల, శ్రీకృష్ణ పాండవీయం, ఏకవీర, సంపూర్ణ రామాయణం, యమగోల, దాన వీర శూర కర్ణ, కురుక్షేత్రం, యముడికి మొగుడు, భైరవ ద్వీపం, యమలీల, ఘటోత్కచుడు, యమగోల మళ్లీ మొదలైంది మొదలగు ఎన్నో సినిమాలలో పౌరాణిక పాత్రలు చేశారు.

ఫైట్ పూర్తి చేస్తే గండం గడిచినట్టే…

నిజానికి నటులలో చాలామంది తమ సినిమా ప్రస్థానం మొదట్లో ప్రతినాయక పాత్రలు పోషించి, ఆ తరువాత గుణచిత్ర నటులుగా అభినయించి, చివరికి కథానాయకుడిగా మారుతుంటారు. కానీ, కైకాల సత్యనారాయణ విషయంలో ఇది అపసవ్య దిశలో (రివర్స్) జరిగింది. తన సినీ ప్రస్థానం తొలినాళ్లలో కథానాయకుడిగా నటించిన ఆయన, ఆ తరువాత ప్రతినాయకుడిగా అనేక సినిమాలలో నటించారు. ప్రతినాయకుడిగా నటించాలంటే చాలా శారీరక కష్టం ఉంటుందని చెప్పే ఆయన ఎన్టీఆర్ నటించిన ఎన్నో చిత్రాలలో ప్రతినాయకుడిగా నటించారు. ఎన్టీఆర్ తో పోరాట సన్నివేశం పూర్తి చేస్తే ఒక పెద్ద గండం గడచినట్టే భావించేవారు. ఒకసారి భీమసేనుడు (ఎన్టీఆర్) – కీచకుల (కైకాల) యుద్ధంలో భాగంగా సన్నివేశాలలో నటిస్తున్నారు. సన్నివేశం సహజంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఎన్టీఆర్, తన రొమ్ముల మీద గుద్దుతుంటే చచ్చినంత పనైందని అన్నారు కైకాల సత్యనారాయణ. ఇంకోసారి మరో సన్నివేశంలో నిజంగానే ఎన్టీఆర్ కత్తితో కైకాలను పొడిచేశారట. అప్పట్లో ఆ నిబద్ధత ఆవిధంగా ఉండేదంటూ సత్యనారాయణ ఓ సందర్భంలో చెప్పారు. కైకాలను మొదటిసారిగా వెండితెరపై ప్రతినాయకుడిగా చూపించిన మాంత్రికుడు విఠలాచార్యనే.

స్వర్గప్రాప్తి…

తెలుగు సినిమా తొలితరం అగ్ర కథనాయకులు సూపర్ స్టార్ నాగయ్య తరంతో మొదలెట్టి అక్కడినుండి ఎన్టీఆర్, అక్కినేని, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, ఇప్పటి స్టార్ హీరోలు మహేష్ బాబు, ఎన్టీఆర్ వరకూ ఐదు తరాల కథనాయకులతో కైకాల సత్యనారాయణ నటించారు. వీరే కాకుండా తమిళంలో రజనీకాంత్, కమల్ హాసన్ మరియు హిందీలో దిలీప్ కుమార్, అనిల్ కపూర్ వంటి కథనాయకులతో కైకాల సత్యనారాయణ నటించారు. నటుడిగా ప్రతినాయకత్వంలో వినోదం పండించి కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా, నటుడిగా వెండితెరపై వైవిధ్యానికి మారుపేరుగా నిలిచిన కైకాల సత్యనారాయణ 2011లో రఘుపతి వెంకయ్య పురస్కారం అందుకున్నారు. 23 డిసెంబరు 2022 నాడు అనారోగ్యంతో హైదరాబాదులో స్వర్గప్రాప్తి పొందిన “నవసర నటనా సార్వభౌమ” కైకాల సత్యనారాయణకు పద్మశ్రీ పురస్కారం రాకపోవడం బాధకరమైన విషయం.

Show More
Back to top button