Telugu Cinema

తెలుగు ప్రేక్షక హృదయాలలో చెరగని హాస్య ముద్ర.. సుత్తి వీర భద్ర రావు..

“కోడలేదంటే గోడల కేసి, నీడల కేసి చూస్తావేంట్రా ఊడల జుట్టు వెధవ సుత్తి వీర భద్ర రావు

“ఏకాకీ కాకీక కాకికి కోక, ఆ కాకీక కాకికి కాక కోకికా కుక్కకా” ఇందులో 24 క లున్నాయిరా ఎలా వుంది..??

ఇలాంటి హాస్యాస్పదమైన సంభాషలు అత్యద్భుతమైన అభినయం అభినయించాలంటే సుత్తి వీరభద్ర రావు గారికే చెల్లుతుంది.

హాస్య బ్రహ్మ గా పేరుగాంచిన జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు  తెలుగు చిత్ర సీమకు సుత్తి జంటగా (సుత్తి వేలు, సుత్తి వీర భద్ర రావు) పరిచయం చేసి తెలుగు వెండితెర పై నవ్వుల వెలుగుల్ని పూయించారు.

సాధారణంగా చిత్ర పరిశ్రమ లో ముఖ్యంగా హాస్య నటులకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. ఒక్కోసారి వీరే సినిమాకు పెద్ద దిక్కుగా నిలబడి సినిమాను విజయవంతం చేస్తూ ఉంటారు. ఇక నాటి నుంచి నేటి వరకు హాస్యనటులకు సినీ ఇండస్ట్రీలో ఒక పెద్ద పీఠం వేశారని చెప్పవచ్చు. అలాంటి వారిలో సుత్తి వీరభద్ర రావు కూడా ఒకరు.. ఇక సుత్తి వీరభద్ర రావు గా మంచి గొప్ప ప్రసిద్ధిగాంచిన ఈయన అసలు పేరు మామిడిపల్లి వీరభద్ర రావు.

నానీ నానీ నానూనె నానూనె నీనూనె నీనూనె నేనై నేను నీనూనె నానూనెని నానూనె నీనూనెని నన్ననా నిన్నను నేనా నోనో నేనన్నానా నున్నని నాన్న నైనైనై… ఇందులో 56 న లున్నాయి లెక్కచూసుకో..

గస్తీ గుమస్తాలా చంకన సర్టిఫికెట్ల బస్తాతో బస్తీ అంతా గస్తీ తిరిగొస్తున్నట్టున్నావు.. ఏమైంది ఉద్యోగం వచ్చిందా..??

అంటూ సుత్తి వీరభద్ర రావు గారు, సుత్తి వేలు మధ్య తండ్రీ కొడుకులు గా హాస్యాన్ని పండించిన దృశ్యాలను ఏ తెలుగు వారు మరచిపోగలరు. తన మరణంతో తెలుగు ప్రేక్షకులు మనసారా నవ్వడం మానేశారు. తాను చేసిన పాత్రలు ఎప్పటికీ సంచలనాలే. తనను అభిమానించని దర్శకులు ఎవ్వరూ ఉండరు. 1981 లో చిత్రసీమ లోకి వచ్చిన తాను 1988 వరకు కేవలం 7 సంవత్సరాలలో 70 కి పైగా చిత్రాలలో నటించిన వీరు అతి పిన్న వయస్సులోనే (41 సంవత్సరాలలోనే) మరణించడం విశేషం.

జీవిత విశేషాలు…

జన్మ నామం :    సుత్తి వీరభద్ర రావు

ఇతర పేర్లు  :    మామిడిపల్లి వీరభద్రరావు

జననం    :  06 జూన్ 1947

స్వస్థలం   :   అయనాపురం, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్, భారతదేశం

 వృత్తి      :    తెలుగు రచయిత, సినిమా రచయిత 

జీవిత భాగస్వామి   :    శేఖరి

ప్రముఖ పాత్రలు    :    బాబాయ్ అబ్బాయ్

పిల్లలు    :    ఒక అబ్బాయి, ఒక అమ్మాయి 

మరణం    :   30 జూన్ 1988

నేపథ్యము…

సుత్తి వీరభద్ర రావు గారు 06 జూన్ 1947 న ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా లో గల అయనాపురం లో జన్మించారు. వీరు తల్లిదండ్రులకు ఏకైక కుమారులు. తానే వారికి ప్రథమ సంతానం కూడా. తనకు ఇద్దరు చెల్లెళ్ళు. తన స్వస్థలం గోదావరి జిల్లాను వదిలి తన తండ్రి గారు ఉద్యోగ నిమిత్తం విజయవాడకు వలస వెళ్ళారు. దాంతో సుత్తి వీర భద్ర రావు గారు కూడా విజయవాడ కు వెళ్ళవలసి వచ్చింది. దాంతో సుత్తి వీర భద్ర రావు గారు విజయవాడలో ఉన్న ఎస్.ఆర్.ఆర్ అండ్ సి.వి.ఆర్ కళాశాల నుండి పట్టభద్రుడయ్యారు.

ఆల్ ఇండియా రేడియో లో…

వీరభద్రరావుకు గారికి బాల్యం నుంచే నటనపై ఎనలేని ఆసక్తి ఉండేది. ఆ మక్కువ తోనే పాఠశాల స్థాయిలోనే రంగస్థల నాటకాల్లో నటించేవారు. ఎస్‌.ఆర్‌.ఆర్‌ కళాశాల విజయవాడలో డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే తన మిత్రుడు, క్లాస్‌మేట్‌గా ఉన్న జంధ్యాల గారితో జట్టు కట్టి యూనివర్సిటీ స్థాయిలో అనేక పోటీలల్లో పాల్గొన్నారు. ఈ టీమ్ హాస్య పాత్రలకు సంబంధించి చిత్ర పరిశ్రమలో హిట్ టీమ్‌లలో ఒకటిగా నిలిచింది. నాటకరంగంపై ప్రేమతో తాను గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన పిమ్మట ఆల్ ఇండియా రేడియో (AIR), విజయవాడ లో ఉద్యోగంలో చేరారు.

రేడియోలో పనిచేస్తున్న రోజులలోనే విజయవాడలోని వేలేదండ్ల, తుమ్మలపల్లి కళాక్షేత్రం, హనుమంతరాయ గ్రంథాలయంలో ఎన్నో నాటకాలను ప్రదర్శించారు. తాను ఆల్ ఇండియా రేడియో నుండి ప్రసారం చేయబడిన ఎన్నో నాటకాలలో కూడా పాల్గొన్నారు. ఆల్ ఇండియా రేడియో, విజయవాడ లో తాను పనిచేసిన రోజులలో, తాను నండూరి సుబ్బారావు, విన్నకోట రామన్న పంతులు, ఉషశ్రీ, రామమోహన్ రావు, సి.యస్.ఆర్ ఆంజనేయులు,  విన్నకోట విజయరామ్, పి. పాండురంగారావు, ఇంద్రకంటి శ్రీకాంత్ శర్మ వంటి తెలుగు రంగస్థల మరియు సాహిత్య ప్రముఖులతో కలిసి పనిచేశారు.

కోకా సంజీవ రావు, పేరి కామేశ్వరరావు, ఏ.బి.ఆనంద్, బాలత్రనపు రజనీకాంత రావు (రజని) ఆల్ ఇండియా రేడియో లోకి ప్రవేశించడానికి ప్రముఖ పాత్ర పోషించారు. తెలుగు భాషలోని మొత్తం 56 అక్షరాలను స్పష్టమైన స్వరంతో ఉచ్చరించగలిగితేనే శ్రీ రజనీ తన సిబ్బందిని ఎంపిక చేసుకుంటారు. సరైన ఉచ్చారణ మరియు ఉచ్ఛారణతో “కొంటేరు నాటక పరిషత్‌” లో ప్రదర్శించిన “కృష్ణ పక్షం” అనే నాటిక అతని రంగస్థల ప్రస్థానంలో అత్యంత ప్రజాదరణ పొందిన రంగస్థల నాటకం.

సినీ రంగ ప్రవేశం…

సుత్తి వీర భద్ర రావు గారు చిన్నతనము నుండే నాటక రంగం మీద వున్న మక్కువతో, తన తండ్రి చూసిన ఉద్యోగావకాశాలను వద్దనుకుని, నటుడిగా అటు నాటకాలలో, ఉద్యోగరీత్యా ఆకాశవాణిలో స్థిరపడ్డారు. సరదాగా మిత్రుని దగ్గరకు వెళ్ళిన వీరభద్రరావుని మాదాల రంగారావు బలిపీఠం సినిమాతో చిత్రరంగ ప్రవేశం చేయించారు. తన ప్రాణ మిత్రుడు, శ్రేయోభిలాషి అయిన జంధ్యాల గారి దర్శకత్వములో వచ్చిన నాలుగు స్తంభాలాట చిత్రంతో తెలుగు చిత్రసీమలో స్థిరపడ్డాడు. 1988లో జంధ్యాల గారి దర్శకత్వంలో వచ్చిన “చూపులు కలసిన శుభవేళ” చిత్రమే తాను అభినయించిన ఆఖరి చిత్రం.

నాలుగు స్తంభాలాట..

జంధ్యాల దర్శకత్వంలో నరేష్, ప్రదీప్, పూర్ణిమ, తులసి ముఖ్యపాత్రల్లో తెరకెక్కించిన చిత్రం “నాలుగు స్తంభాలాట”. 1982 లో నవతా కృష్ణంరాజు నిర్మించిన ఈ చలనచిత్రం, నలుగురు యువతీయువకుల జీవితంతో ప్రేమ, పెళ్ళిళ్ళతో జీవితం ఆడుకున్న ఆటగా ఈ కథను రాసుకున్నారు జంధ్యాల గారు. భారమైన ప్రేమకథ తో సినిమాల్లో అంతగా అనుభవం లేని హీరోహీరోయిన్లతో నటింపజేసి జంధ్యాల గారు అద్భుతమైన విజయం సాధించారు. హిందీలో ఈ సినిమాను సంజయ్ దత్, అశోక్ కుమార్, పద్మినీ కొల్హాపురి ముఖ్యపాత్రల్లో బేకరార్ అన్న పేరుతో పునర్నిర్మించారు.

“కారణం లేని నవ్వు తోరణం లేని పందిరి పూర్ణం లేని బూరె పనికిరావన్నాడు శాస్త్రకారుడు”. మీకు ఇవేమి తెలియవు. మీ ఇంగ్లీష్ పల్లెల్లో లింకన్ ఎప్పుడు పుట్టాడు? టంకర్ ఎప్పుడు చచ్చాడు. ఇవే తప్ప రాముడు, కృష్ణుడు ఎవరు ఏమి చెప్పి తగలడరు, లాంటి హాస్యరస సన్నివేషాలతో అలరించారు సుత్తి జంట.

హాస్యంతో ఈ సినిమాలో సుత్తి వీరభద్రరావు, సుత్తివేలు చేసే హాస్యం చాలా ప్రాచుర్యం పొంది, సుత్తి అన్న పదాన్ని తెలుగు నాట ప్రాచుర్యంలోకి తీసుకువచ్చింది. ఆ సినిమా నుంచి వేలు, వీరభద్రరావుల పేర్లకు సుత్తి అనేది ఇంటిపేరు అయ్యింది.

పుత్తడి బొమ్మ..

జంధ్యాల గారి దర్శకత్వం లో నరేష్, పూర్ణిమ, అరుణ లు నటించిన చిత్రం పుత్తడి బొమ్మ. ఈ చిత్రంలో సుత్తి వీరభద్రరావు గారు ఒక కవి. తన కవిత్వంతో తన చుట్టుపక్కల వారినందరినీ బెదరగొట్టేస్తుంటాడు. అతని బెడద వదిలించుకునేందుకు ఆ ఊరి ప్రజలంతా ఓ ఎత్తు‌ వేస్తారు. ‌కవిరాజుకు గజారోహణం చేయించి, ఆ గజాన్ని ఆయనకే బహుకరించాలని తీర్మానిస్తారు. తనకు సన్మానం జరగబోతుందని తెలిసి వీరభద్రరావు ఎంతో సంబరపడిపోతాడు. కవిసామ్రాట్‌ “విశ్వనాథ సత్యనారాయణ” తర్వాత తనకే ఆ గౌరవం లభిస్తోందని సగర్వంగా చెప్పుకుంటాడు.

వీరభద్రరావుకి ఊరి ప్రజలు సన్మానం చేసి, గజారోహణ అనంతరం ఆ ఏనుగును ఆయనకే బహూకరిస్తారు. అప్పటి నుంచి ఆ కవిరాజుకు పాట్లు మొదలవుతాయి. ఆ ఏనుగుకు తిండి పెట్టలేక సతమతమవుతుంటాడు. ఏనుగును ఇంట్లో ఉంచలేక ఆరుబయట కట్టేస్తాడు. ఏనుగు ఘీంకారాలతో చుట్టుపక్కల వారు ప్రతిరోజూ అతనితో గొడవపడుతుంటారు. ఇల్లు ఖాళీ చేయమని ఇంటి యజమాని అల్టిమేటం జారీచేస్తాడు.

ఇంకా నయం ఏనుగు బట్టలు కట్టుకోదు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఎన్ని తానులైనా సరిపోరు. శాకాహారి కాబట్టి గానీ, మాంసాహారి అయితే ఇంకేమైనా ఉందా? అంటూ కవిరాజు తల్లడిల్లిపోతుంటారు. గడ్డం పెరిగిగిపోయి, బక్కచిక్కిన దేహం, చిరిగిన దుస్తులతో కవిరాజు బిచ్చగాడిలా తయారవుతాడు. ఏ ఏనుగుమీదైతే గజారోహణం చేస్తాడో, అదో ఏనుగుపై కూర్చుని కవిరాజు భిక్షాటన చేస్తుంటాడు. ఇలాంటి సన్నివేశాలు అద్భుతంగా పండించారు సుత్తి వీరభద్ర రావు గారు.

“వీరు మేకే కాదు ఊక (ఊహ కవి), ఊకే కాదు పేక (పేదల కవి), పేకే కాదు బాక (బాధల కవి), బాకే కాదు తోక (తోడైన కవి), తోకే కాదు ఆక (ఆలోచనల కవి), ఆకే కాదు పాక (పాటల కవి), పాకే కాదు ఈ ఊరికి ఠీకా (ఠీవీ దర్జా ఉన్న కవి)”.

“మీ మొహం లో వరాహమూర్తి, మీ శార్దంలో భైరవ మూర్తి ఉన్నారు. అందుకే గాడిదలు మిమ్మల్ని గౌరవిస్తాయి. మీరు ఇలాగే వెయ్యేళ్ళు ఇలాగే మీరు ప్రజల్ని తింటా బ్రతకాలని కోరుకుంటా”.. 

ఇలా ఆ సన్మాన సభలో తనని సన్మానం చేసినప్పుడు ప్రసంగం నవ్వులు తెప్పిస్తాయి.

శ్రీవారికి ప్రేమలేఖ..

1984లో విడుదలైన ఉషాకిరణ్ మూవీస్ వారి తొలిసినిమా “శ్రీవారికి ప్రేమలేఖ”. ఈ సినిమాతోనే రామోజీరావు గారు నిర్మాతగా మారి తర్వాతి కాలంలో ప్రతిఘటన, మౌనపోరాటం, మయూరి లాంటి సంచలనాత్మకమైన చిత్రాలను నిర్మించారు. రచయిత్రి పొత్తూరి విజయలక్ష్మి గారు వ్రాసిన నవల “ప్రేమలేఖ” పేరుతో చతుర మాసపత్రికలో ప్రచురితమైంది. దీనిని కథగా ఎంచుకుని జంధ్యాల గారు నరేష్, పూర్ణిమ నటీనటులుగా “శ్రీవారికి ప్రేమలేఖ” అనే చిత్రాన్ని తెరకెక్కించారు.

సుత్తి వీరభద్రరావు, నూతన్ ప్రసాద్, మెల్కోటే, ఎస్. కె. మిశ్రో, జిత్ మోహన్ మిత్రా, డబ్బింగ్ జానకి, ముచ్చెర్ల అరుణ, పొట్టి ప్రసాద్, రాళ్ళపల్లి లాంటి వారు నటించిన ఈ చిత్రంలో సుత్తి వీరభద్రరావు గారు పండించిన హాస్యం అద్భుతమనే చెప్పాలి. సుత్తి వీరభద్ర రావు, రాళ్లపల్లి మధ్య జరిగే సంభాషణలు ఇలా.. “నీ పిండం పిచ్చుకలకు పెట్ట, నీ శార్ధం చెట్టు క్రింద పెట్ట, నీ నవరాంధ్రాలలో మైనం కూరుస్తానురోయ్.. నీ శవాన్ని ఈ కొంపకి దిష్టిబొమ్మలా వ్రేలాడదీస్తాను. నీ నరాలు పీకి పంచరేయించుకుంటాను, అక్కు పక్షి, కుంకన్నర కుంక”.. అని చెప్పే డైలాగులతో ఆద్యంతం నవ్వులు పూయించారు.

వైవాహిక జీవితం…

సుత్తి వీరభద్రరావు గారు 1970లో శేఖరి ని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు.

ఒక కుమారుడు మరియు కుమార్తె ఉన్నారు. తన కుమార్తె 2013లో క్యాన్సర్‌తో మరణించింది.

సుత్తి వీరభద్రరావు గారు తెలుగు మరియు ఇంగ్లీషులో సాహిత్యాన్ని ఆసక్తిగా చదివేవారు.

విశ్వనాథ సత్యనారాయణ గారి వేయి పడగలు మరియు శ్రీమద్ భాగవతం వంటి కొన్ని పుస్తకాలతో తనకు స్వంత గ్రంథాలయం కూడా ఉంది.

తెలుగులో రచించిన చాలా నాటకాలను సేకరించి తన గ్రంథాలయంలో పదిలపరుచుకున్నారు. సుత్తి వీరభద్ర రావు గారు పేదల సహాయార్థం పెద్ద మొత్తంలో డబ్బును విరాళంగా ఇచ్చేవాడు.

అతని నుండి సహాయం పొందిన లబ్ధిదారులు అనేక మంది ఉన్నారు.

తాను చాలా సాధారణమైన జీవితాన్ని గడిపారు. ఇతరులకు సహాయం చేసే దయాగుణం కలిగిన దయార్థ హృదయలు వీరు.

చిత్ర సమాహారం…

నాలుగు స్తంభాలాట (1982)..

మంత్రి గారి వియ్యంకుడు (1983)..

మూడు ముళ్ళు (1983)..

రెండుజెళ్ళ సీత (1983)..

ఆనంద భైరవి (1984)..

కాంచన గంగ (1984)..

మెరుపు దాడి (1984)..

శ్రీవారికి ప్రేమలేఖ (1984)..

పుత్తడి బొమ్మ (1985)..

స్వాతిముత్యం (1985)..

చంటబ్బాయి (1986)..

శాంతినివాసం (1986)..

అహ! నా పెళ్ళంట! (1987)..

రాక్షస సంహారం (1987)..

చిన్ని కృష్ణుడు (1988)..

చూపులు కలిసిన శుభవేళ (1988)..

పృథ్వీరాజ్ (1988)..

వివాహ భోజనంబు (1988)..

మరణం..

సుత్తి వీరభద్ర రావు గారు 1988లో హైదరాబాదు లో “చూపులు కలసిన శుభవేళ” చిత్రములోని ఒక పాటని చిత్రీకరిస్తున్నప్పుడు ఆకస్మికంగా కాలు బెణికింది.

మధుమేహంతో ఉన్న వీరభద్రరావు గారిని విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు.

ఆ సినిమా చిత్రీకరణ పూర్తి అవ్వగానే తాను విశ్రాంతి కోసం చెన్నైలోని ఒక ఆసుపత్రిలో చేరాడు.

కేవలం విశ్రాంతి కోసం ఒక రాత్రి నిద్రకోసం ఇచ్చిన ఇంజక్షను వికటించి గుండెపోటు వచ్చింది.

అవే తన ఆఖరి క్షణాలు. అది 30 జూన్ 1988 తెల్లవారుఝామున జరిగింది. అలా గుండె పోటుతో తిరిగిరాని లోకాలకు పయనమయ్యారు.

ఒకవేళ వైద్యులు చెప్పినట్లు, మొదట్లోనే విశ్రాంతి తీసుకుని ఉంటే సుత్తి వీరభద్రరావు గారు బతికేవారేమో? మరి చిన్న పొరపాటు వల్ల ఆయన హఠాన్మరణం చెందారు.

Show More
Back to top button