CINEMATelugu Cinema

తెలంగాణ కంచుకంఠం నటి శకుంతల.

తెలంగాణా శకుంతల (27 మార్చి 1951 – 14 జూన్ 2014)

అవకాశం వచ్చినప్పుడు అందుకోవడమే కాదు, వందకు వంద శాతం సద్వినియోగం చేసుకోవాలి కూడా. అందులో మనదైన ముద్ర కనబరచాలి. అప్పుడే మనకు ఎంతో గుర్తింపు లభిస్తుంది. అవకాశాల కోసం వెతుక్కోవాల్సిన పనుండదు. అవకాశాలే మనల్ని వరిస్తాయి. అందుకు ఉదాహరణ నటి తెలంగాణ శకుంతల. ఓ ప్రాంత మాండలికాన్ని తన చిరునామాగా మార్చుకొన్నారు.

గయ్యాళి పాత్ర అయినా, ప్రతినాయక పాత్ర అయినా, హాస్య ప్రధానమైన పాత్రయినా, తనకు తానే సాటి అని నిరూపించుకున్న నటి తెలంగాణ శకుంతల. ఆమె అసలు పేరు కడియాల శకుంతల. తెలంగాణ యాసతో సంభాషణలు చెప్పడంలో దిట్ట కావడంతో ఆమె ఇంటిపేరు తెలంగాణగా మారిపోయింది.

శకుంతల గారూ వరంగల్లు వెళితే తెలంగాణ శకుంతల అంటారు. రాయలసీమకు వెళ్తే కడప రెడ్డమ్మ వచ్చింది అంటారు. ఒసేయ్ రాములమ్మ లో తెలంగాణ భాషతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో ఆమె నిజంగానే తెలంగాణ శకుంతల అనుకున్నారు. నరసింహనాయుడు లో శక్తివంతమైన సంభాషణలు చెప్పడంతో రాయలసీమ శకుంతల అనుకున్నారు.

కానీ వాస్తవానికి ఆమె స్వస్థలం తెలంగాణ కాదు, రాయలసీమ కాదు, కోస్తాంధ్ర అసలే కాదు. ఆ మాటకొస్తే ఆమెది తెలుగు రాష్ట్రమే కాదు. మహారాష్ట్రలో పుట్టి మన రాజధానికి చేరి రంగస్థల నటిగా జీవితాన్ని ప్రారంభించి, సినిమా నటిగా స్థిరపడ్డ కళాకారిణి. రెండు సార్లు కారు ప్రమాదాల్లో కాలు బాగా దెబ్బతిన్నా కూడా కలవరపడకుండా సినీ ప్రస్థానం కొనసాగించారు.

జననం.

తెలంగాణ శకుంతల గారు 27 మార్చి 1951 లో భారతదేశంలోని మహారాష్ట్రలో జన్మించారు. శకుంతల గారి అసలు పేరు కడియాల శకుంతల. ఆమె తండ్రి ఆర్మీ అధికారి, తల్లి గృహిణి. ఆమెకు నలుగురు సోదరీమణులు ఉన్నారు. శకుంతల గారూ వాళ్ళలో రెండో వారు. శకుంతల గారిని వాళ్ళ అమ్మానాన్నలు ఎంతో ప్రేమగా పెంచారు. శకుంతల గారూ ఆ నలుగురిలో ధైర్యవంతురాలిగా, చురుగ్గా ఉండేవారు. దాంతో తనకు అబ్బాయి లేని లోటు తీర్చుకునేలా శకుంతల గారిని అబ్బాయి లాగా పెంచుకుందాం అని అనుకున్నారు వాళ్ళ అమ్మ గారు.

ఆ నలుగురిలో శకుంతల లోని ధైర్యం, మాటలు, ప్రవర్తన వాళ్ళమ్మకు బాగా నచ్చి తనకు నిక్కర్లు, చొక్కా వేసి కొడుకు లాగా పెంచడం మొదలు పెట్టింది. శకుంతల గారూ ఊరిలో పిల్లలతో ప్రతిరోజు గోళీకాయలు ఆడేవారు. విపరీతమైన అల్లరి చేస్తూ, అబ్బాయిలను ఆటపట్టిస్తూ వారిపై తన పెత్తనం చూపేవారు. ఇలా అల్లరి చిల్లర చేష్టలతో గొడవలు చేస్తూ ఆనందంగా బాల్యన్ని ఆస్వాదిస్తున్న తనకు ఒక రోజు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తన 12 యేండ్ల వయస్సులో వాళ్ళ నాన్నగారికి హైదరాబాదుకు బదిలీ అయ్యింది. దాంతో మహారాష్ట్ర నుండి హైదరాబాదుకు వచ్చేశారు.

విద్యాభ్యాసం.

శకుంతల గారి మాతృభాష మరాఠి. ప్రభుత్వ పాఠశాలలోనే తన విద్యాభ్యాసం కొనసాగింది. ఆర్మీ అధికారి అయిన వాళ్ళ నాన్న గారికి హైదరాబాద్ బదిలీ అవ్వడంతో వాళ్ళు పూనే నుండి హైదరాబాదు కు మకాం మార్చేశారు. తన మాతృభాష మరాఠి కావడంతో తెలుగు భాష మాట్లాడడానికి బాగా ఇబ్బంది పడేవారు. తన తండ్రి ఆకస్మిక మరణంతో నలుగురు అమ్మాయిలతో కుటుంబం గడవడం కష్టంగా మారి శకుంతల గారిని చదువు మాన్పించడంతో పదవతరగతి తోనే తన చదువు ఆగిపోయింది.

వివాహం.

తండ్రి మరణించడంతో చదువు మధ్యలోనే మాన్పించి శకుంతల గారికి తన పదహారవ యేటనే వివాహం చేసింది తల్లి. శకుంతల గారికి ఒక అబ్బాయి, ఒక అమ్మాయి జన్మించారు. పిల్లల పోషణ, సంసారం భారంతో ఇబ్బందులు మొదలయ్యాయి. చదువుతున్నప్పుడే నాటకాలు వేస్తూ వచ్చిన శకుంతల గారికి భర్త నుంచి సహకారం కొరవడింది. నాటకాలు వేస్తూ వచ్చిన డబ్బుతోనే తమ కుటుంబాన్ని పోషిస్తూ వచ్చారు. మరోవైపు తన తల్లికి తన అండ లేకపోతే కుటుంబం గడవని పరిస్థితి. అందుకే శకుంతల గారూ నాటకాలను వదులుకోలేకపోయారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా కూడా లక్ష్య పెట్టకుండా నాటకాలను కొనసాగిస్తూ వచ్చారు. క్రమంగా నాటకాలలో తన సంపాదన కూడా పెరగడంతో ఆర్థిక వెసులుబాటు లభించింది.

నాటకరంగం ఆరంగ్రేటం.

పిల్లలతో కలిసి ఆటలాడుతూ పెద్ద గొంతుతో అరుస్తూ చిందులేసే శకుంతల గారిని వారి ఇంటికి ఎదురుగా ఉండే ఇంజనీరు జయరామారావు గారూ చూశారు. వారు ఇంజనీరుగా పనిచేస్తూనే తీరిగ్గా ఉన్నప్పుడు నాటకాలు వేయిస్తూ ఉండేవారు. ఓసారి వాళ్ళ ఆఫీసులో ఒక నాటకం వేయాల్సి వచ్చింది. అందులో యువతిగా నటించేందుకు శకుంతల గారిని పంపమని వాళ్ళ అమ్మని అడిగారు జయరామారావు గారూ. అది విని శకుంతల గారి అమ్మ గారు ఇంత అల్లరిచిల్లరగా ఉండే దీనిని మీరు భరించగలరా అంటూ అభ్యంతరం చెప్పింది. దాంతో ఎలాగోలా నచ్చజెప్పి జయరామారావు గారూ శకుంతల గారిని నాటక రిహార్సల్ కు తీసుకెళ్లారు. ఆ సమయానికి శకుంతల గారికి ఏవో చిన్న చిన్న మాటలు తప్ప తెలుగు రాదు.

జయరామారావు గారూ ఒక్కో మాట పలికిస్తూ తెలుగు సంభాషణలు నేర్పించారు. దాదాపు మూడు నెలల పాటు నానా తంటాలు పడి నాటకం పూర్తి చేసింది. 14 ఏళ్ల వయస్సులో ఆమె నాటకం వేసేందుకు మొట్టమొదటిసారిగా రవీంద్రభారతిలో వేదిక నెక్కారు. ఆ నాటకం పేరు “దిక్కులేని పక్షులు”. ప్రారంభంలో కొద్దిగా భయం భయంగా కదిలిన శకుంతల గారూ తర్వాత పూర్తిస్థాయిలో పాత్రలో లీనమైపోయి నాటకాన్ని రక్తి కట్టించారు. నాటక ముగిసిందో లేదో చెవులు చెల్లెలు పడేలా వీక్షకుల నుండి ఒకటే చప్పట్లు. ఆ చప్పట్లే శకుంతల గారి జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పాయి. శకుంతల గారిని పూర్తిగా నటనకు అంకితమయ్యేలా ప్రేరేపించాయని చెబుతున్నప్పుడు ఆమె కళ్ళలో ఏదో తెలియని అనుభూతి లీలగా కదలాడేది.

నాటకాల మోజులో పడిన శకుంతల గారూ తన పదో తరగతి తప్పారు. మరోవైపు తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి క్షీణించింది. నలుగురికి చదువులు, వారికి స్కూలు ఫీజులు, ఇంట్లో ఇతర ఖర్చులు శకుంతల గారి తల్లికి భారంగా మారాయి. నాటకాలు వేస్తే వచ్చే డబ్బుతోనే శకుంతల గారూ  తల్లికి చేదోడు వాదోడుగా నిలవాలి అనుకున్నారు. తెలుగు భాష మీద పట్టు లేని ఆమె మూడేళ్లలో తెలుగు అనర్ఘళంగా మాట్లాడడం నేర్చుకున్నారు. నాటకాలలో తెలుగులో తాను పలికే సంభాషణల విధానం అద్భుతంగా ఉండేది. దాంతో శకుంతల గారికి రేడియో నుండి, టీవీ ల నుంచి కూడా అనేక అవకాశాలు వచ్చాయి. తన పారితోషకాలు కూడా పెరగడంతో తల్లి తర్వాత తనే ఇంటికి పెద్దదిక్కుగా మారిపోయారు. అక్కను, చెల్లెళ్లను చదివిస్తూ వారి అవసరాలను తీరుస్తుండేవారు శకుంతల గారూ.

నాటకాల్లో నటిస్తున్న శకుంతల గారూ నాటకరంగంలో కథానాయికగా తనకు తిరుగులేని స్థానం సంపాదించారు. హైదరాబాదులో తరచూ పరిషత్తు నాటక పోటీలు జరుగుతుండేవి. శకుంతల గారూ ఒకే పరిషత్తులో రెండు మూడు నాటక సమాజాలకు ఒకేసారి కథానాయికగా నటించేవారు. అలా నటించడం అనేది అంత తేలికైన విషయం కాదు. రెండు విభిన్న రకాల మనస్తత్వాలను జీర్ణించుకుని ఎక్కడ ఏవిధమైన పొంతన లేని రీతిలో రెండు రకాల పాత్రలలో జీవించాల్సి ఉంటుంది.

కానీ శకుంతల గారూ రిహార్సల్ అయిపోయి ఇంటికి వచ్చిన తరువాత కూడా అవే సంభాషణలను మననం చేసుకోవడం, ఆ పాత్ర ప్రవర్తనను గుర్తు తెచ్చుకుంటూ పూర్తిగా వృత్తికి అంకితం అయిపోవడం వల్లే అది సాధ్యమైంది అంటారు శకుంతల గారూ. అహ్మదాబాదులో జరిగిన అఖిల భారతస్థాయి నాటక పోటీల్లో “పుణ్యస్థలి”లో శకుంతల గారూ ఉత్తమమైన అవార్డు అందుకున్నారు. అది చలనచిత్ర రంగంలో ఊర్వశివార్డుతో సమానం. ఆవిడ గారికి ఆ బహుమతి ప్రధానం చేయగానే “ఉప్పల దత్” అనే పెద్దాయన గబగబా వచ్చి శకుంతల గారిని భుజాల మీద ఎక్కించుకొని వేదిక మీద చుట్టూ తిప్పారు. ఇలా ఎంతోమంది మహానుభావులు తనకు అందించిన ప్రోత్సాహంతో నటిగా ఆవిడ రాటుదేలిపోయానని చెబుతుంటారు.

అంతర్జాతీయ నాటక పోటీలో ప్రసంశ.

1976 భోపాల్ లో అంతర్జాతీయ స్థాయి నాటక పోటీలు జరుగుతున్నాయి. మన రాష్ట్రం నుంచి వెళ్లిన నాటక సమాజం “తరంగాలు” అనే నాటకం ప్రదర్శించింది. ఆ పోటీలను తిలకించడానికి శంభుమిత్ర గారూ వచ్చారు. వారు నాటకారంగానికి గురువు లాంటి వ్యక్తి. వారి భార్య కూడా మంచి పేరు ఉన్న రంగస్థలం కళాకారిణి. “తరంగాలు” నాటకం పూర్తవ్వగానే వాళ్ళిద్దరూ నాటక గదిలోకి వెళ్లారు. ఆ నాటకంలో మూడు విభిన్న పాత్రలు పోషించిన కథానాయికను పలకరించారు. అంత పెద్దవారు తన దగ్గరకు వచ్చి మరీ పలకరించడంతో శకుంతల గారూ ఉబ్బితబ్బిబ్బవుతూ గౌరవపూర్వకంగా వారిని నమస్కరించారు. ముదిమి వయస్సులో ఉన్న శంభుమిత్ర ఆమెను ఆత్మీయంగా కౌగిలించుకుని గట్టిగా ఏడ్చేశారు.

విషయం అర్థం కాక శకుంతల గారూ ఒక్క క్షణం తడబడింది. ఆమె అయోమయాన్ని పటాపంచలు చేస్తూ శంభుమిత్ర ఆమెతో ఎంత బాగా నటించావు తల్లీ. కొన్ని వందల నాటకాలు చూశాను. ఎన్నో నాటకాలలో నటించాను. కానీ నాకు నువ్వు ఒక అద్భుతంలా అగుపించావు. ఒకే నాటకంలో మూడు విధాలుగా ఒకదానికి మరొక దానికి ఏమాత్రం కలవకుండా గొప్పగా నటించావు. ఒక దశలో నేను ముగ్గురు వేర్వేరు అమ్మాయిలు  నటించారో ఏమో అనుకున్నాను అన్నారు. అదంతా కలో, నిజమో అర్థం కాలేదు శకుంతల గారికి. ఆ ఆనందభరిత క్షణాలనుండి తేరుకోగానే ఆమె శంభుమిత్ర దంపతుల పాదాలకు నమస్కరించారు. తెలంగాణ శకుంతల గారూ నాటకాలలో తన నటనా ప్రాభవం అలా ఉండేది.

మొదటి సారి కారు ప్రమాదం.

1992 వ సంవత్సరంలో త్యాగరాయ గాన సభలో నాటక సప్తాహం సందర్భంగా తొలిరోజు శకుంతల గారికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆవిడ గారూ సంతోషంగా ఇంటి నుండి కార్యక్రమానికి బయలుదేరి వెళుతుండగా, కారు పెద్ద ప్రమాదానికి గురైంది. కారు వెనకనుంచి మరో వాహనం వచ్చి ఢీకొట్టడంతో కారు నుజ్జు నుజ్జయి మధ్యలో ఆమె కాలు ఇరుక్కుపోయింది. శకుంతల గారూ స్పృహ కోల్పోయారు. అప్పటికప్పుడే అక్కడికి జనం చేరుకొని హడావుడిగా ఆసుపత్రికి తరలించారు.

కుడికాలు పచ్చడిలా అయిపోయింది. చికిత్స చేసి కాలులో రాడ్లు వేశారు. రెండు రోజుల తరువాత గాని ఆవిడ గారూ ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఆవిడకు తెలియలేదు. గాయం నయమయ్యి మళ్ళీ లేచి తిరుగుతానని, నాటకాలు వేస్తానని శకుంతల గారూ అనుకోలేదు. ఎంతోమంది వచ్చారు. ధైర్యం చెప్పారు. పది రోజుల్లో మళ్ళీ లేచి తిరుగుతావని అన్నారు. ఆవిడ గారికి ఆత్మీయ బంధువులు అనేకమంది ఉన్నారని నాటకాలే ఆమెకు ఆస్తిపాస్తులు అని అప్పుడే తెలిసింది.

అన్నిటికన్నా ముఖ్యంగా స్ట్రెచర్ లో కూర్చుని లిఫ్టులో పై అంతస్తుదాకా వచ్చి “నీకు తలిగింది పెద్ద దెబ్బే కాదు ధైర్యంగా ఉండు. ఇలాంటి ప్రమాదాలు ఎన్ని జరిగినా మన లక్ష్యాన్ని దెబ్బ తీయలేవు” అని చెప్పిన నూతన ప్రసాద్ గారి మాటలు ఇవాల్టికి నాకు గొప్ప ప్రేరణ కలిగిస్తాయి అంటారామే. నిరాశను మనం ఏ దశలోనూ దగ్గరికి చేరనివ్వకూడదంటూ ఆ దెబ్బ నుంచి మెల్లగా కోలుకొని కర్రల సాయంతో నాటకాలు ప్రారంభించారు. మళ్ళీ నాటకాలు ఒప్పుకున్నారు వేదికనెక్కి నటన కౌశల్యాన్ని ప్రదర్శించారు. విచిత్రం ఏమిటంటే ప్రమాదం జరగడానికి ముందు ఆమె వేసిన నాటకం “భస్మ సింహాసనం” కోలుకున్నాక వేసిన మొదటి నాటకం “అజరామరం”. ఇదంతా ఎంత యాదృచ్ఛికమో తన జీవితంలోని సంఘటనలన్నీ అంతే కాకతాళీయంగా జరిగాయని నమ్ముతారు.

సినిమా అవకాశాలు.

తెలుగు చిత్ర పరిశ్రమ అప్పట్లో మద్రాసులో కేంద్రీకృతమై ఉండేది. హైదరాబాదులో చాలా తక్కువ సినిమాలు షూటింగ్ జరిగేవి. నిజానికి శకుంతల గారికి సినిమా అవకాశాలు చాలా వచ్చాయి. కానీ ఆమెపై ఉన్న కుటుంబ బాధ్యతల కారణంగా ఆవిడ గారూ చెన్నైకి మారడం సాధ్యం కాలేదు. ఆమెకు వచ్చిన సినిమా అవకాశాలు ఏమైనా ఏమైనా ఉన్నాయి అంటే ఆమె ప్రతిభను వెతుక్కుంటూ వచ్చినవే. నరసింహారావు తీసిన “మాభూమి” సినిమాలో అవకాశం అలాగే వచ్చింది. ఆ తర్వాత “కుక్క” అనే సినిమాలో నటన గాను ఆమెకు ఉత్తమ నటిగా నంది అవార్డు లభించింది. “ఎర్రసైన్యం”, “ఒసేయ్ రాములమ్మ” సినిమాలతో నటిగా మంచి పేరు తీసుకువచ్చాయి.

రెండవ సారి కారు ప్రమాదం.

శకుంతల గారికి అవకాశాలు విస్తరిస్తున్న సమయంలో మరొకసారి భారీ దెబ్బ తగిలింది. ఒక చిత్రానికి డబ్బింగ్ చెప్పేందుకు వెళుతుండగా ఆవిడ వెళ్లే కారుకు మళ్ళీ ప్రమాదం జరిగింది. రాడ్లు అమర్చిన కాలికే మళ్లీ పెద్ద దెబ్బ తగిలింది. మోకాలు చిప్ప పూర్తిగా ఊడిపోయింది. అప్పటికే రాడ్లు ఉన్న కాలికి శస్త్ర చికిత్సలు చేయడం డాక్టర్లకు పరీక్ష అయ్యింది. 20 రోజులు విశ్రాంతి అనంతరం నరసింహనాయుడు షూటింగ్ కు వెళ్లాల్సి వచ్చింది. అది పెద్ద సంస్థ సినిమా. మంచి అవకాశం వదులుకోలేక బి.గోపాల్ గారు ఫోన్ చేయగానే స్ట్రెచర్ మీదే కారులో వైజాగ్ వెళ్ళారు. అక్కడికెళ్లాక శకుంతల గారి పరిస్థితి చూసి ముందుగా కూర్చొని చెప్పే సన్నివేశాలు చిత్రికరించారు.

అత్యధికంగా యాంగ్రీ వుమెన్ పాత్రలే పోషించిన శకుంతల గారూ నిజ జీవితంలో చాలా ప్రశాంతంగా కనిపిస్తారు. కలివిడిగా మాట్లాడుతారు. కష్టపడుతూ శ్రమించడమే ధ్యేయంగా ముందుకు సాగుతారు. 1972లో శకుంతల గారూ నాటక రంగంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి మొదటిసారి ప్రమాదం జరిగి బెడ్ మీద ఉన్న 11 నెలలు మాత్రమే తాను తాపీగా విశ్రాంతి తీసుకున్నారట. వాళ్ళ అమ్మ గారూ తనను మగపిల్లాడిలా పెంచినందుకు అదే ధైర్యంతో కుటుంబ బరువు బాధ్యతలు భరించారు. ఒక అక్క, ఇద్దరు చెల్లెళ్ళ పెళ్లిళ్లు చేశారు. వాళ్ల కుటుంబ అవసరాలు అన్ని తానే చూసుకున్నారు. తన కూతురు పెళ్లి చేశారు. డబ్బు లేనప్పుడు దూరమైన బంధువులు ఆవిడ విజయం సాధించిన తరుణంలో ఆమెను వెతుక్కుంటూ వచ్చేవారు.

మరణం.

తన సంభాషణలతో ప్రేక్షకులకు వినోదం అందించిన తెలంగాణ శకుంతల గారూ తన 63 సంవత్సరాల వయస్సులో 14 జూన్ 2014 శనివారం తెల్లవారు జామున రెండు గంటలకు కన్నుమూశారు. హైదరాబాద్ శివారు ప్రాంతమైన కొంపల్లిలో ఆమె తన స్వగృహంలో గుండెపోటు రావడంతో దగ్గర్లో గల “నారాయణ హృదయాలయం” ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. తెలంగాణ యాసలో ప్రతినాయిక పాత్రలను ఎన్నో చేసినా ఆమె వెండితెరపై హాస్యాన్ని కూడా పండించి మరో సూర్యకాంతంగా పేరు తెచ్చుకున్నారు. గులాబీ, ఒక్కడు, నువ్వు నేను, గంగోత్రి, ఎవడి గోల వాడిది, అన్నవరం, లక్ష్మీ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకుంది. ఆమె నటించగా విడుదలైన చివరి చిత్రం పాండవులు పాండవులు తుమ్మెద. ఇప్పటికి 250 పైగా చిత్రాల్లో నటించారు.

శకుంతల గారి ఇష్టాలు.

  • వృత్తి…  సినిమా నటి (లేడీ కమెడియన్ లేడీ విలన్)
  • మతం…      హిందూ..
  • ఇష్టమైన నటుడు..   చిరంజీవి
  •  మరియు సూపర్ స్టార్ కృష్ణ..
  •  ఇష్టమైన నటి…  రాధికా శరత్ కుమార్..
  • ఇష్టమైన…  పాలక్ పన్నీరు మరియు రోటి..
  • ఇష్టమైన ప్రదేశం.. బెంగళూరు..
  • ఇష్టమైన చిత్రం..  గంగోత్రి మరియు ఒక్కడు..
  • ఇష్టమైన హాస్యనటుడు… యం.యస్.నారాయణ మరియు కోవై సరళ..

శకుంతల గారూ నటించిన కొన్ని చిత్రాలు.

శకుంతల గారూ “మా భూమి” చిత్రంతో తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టి సుమారు 250 పైగా చిత్రాలలో నటించారు. మా భూమి, కుక్క, అహ నా పెళ్ళంటా, గులాబి, సీతారామయ్యగారి మనవరాలు, కొండవీటి సింహాసనం, తప్పుచేసి పప్పుకూడు, ఇంద్ర, అభిమన్యు, వీడే, విష్ణు, గంగోత్రి, ఒక్కడు, అడవి రాముడు, దొంగ – దొంగది, ఆంధ్రావాలా, పల్లకీలో పెళ్ళి కూతురు, ఒక్కడే, ఎవ్వడి గోల వాడిది, సదా మీ సేవలో, సైనికుడు, లక్ష్మీ, అన్నవరం, జగడం, దుబాయ్ శీను, దేశముదురు, లక్ష్మీ కళ్యాణం, మల్లెపువ్వు, కుబేరులు, సిద్దు ఫ్రం శ్రీకాకుళం, పిస్తా, బెండు అప్పారావ్ ఆర్. ఎం. పి, కరెంట్, ఎవరైనా ఎప్పుడైనా, మస్కా, బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం, ఒక్క క్షణం, కొమరం భీం, చాప్టర్ 6, బిందాస్, రంగ ది దొంగ, కళ్యాణ్ రామ్ కత్తి, మా నాన్న చిరంజీవి, బురిడి, పంచాక్షరి, పిల్లదిరికితే పెళ్ళి, రాజన్న, ఈ వేసవిలో ఓ ప్రేమ కథ, గౌరవం, పీపుల్స్ వార్, ఏమైంది ఈవేళ, పాండవులు పాండవులు తుమ్మెద, కొరియర్ బాయ్ కళ్యాణ్, సమ్మక్క సారక్క, ఒసేయ్ రాములమ్మ తదితర చిత్రాలలో నటించారు.

సశేషం.

వశీకరణం, ఒంటికాలి పరుగు నాటికల్లో.. గారడి, సంధ్యాఛాయ నాటకాల్లో శకుంతల గారూ ఎక్కువసార్లు నటించారు. రాష్ట్రవ్యాప్తంగా పరిషత్తు పోటీలు జరిగే ప్రతి గ్రామంలోనూ వేదిక ఎక్కారు. దాదాపు తొమ్మిది వేల నాటకాలలో నటించి వెయ్యి సార్లకు పైగా “ఉత్తమ నటి” బహుమతులను అందుకున్నారు. తెలంగాణ శకుంతల గారూ తన విశేష నటనతో అశేష ప్రేక్షకులను అలరించి ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్నారు. నిరంతరం ధైర్య సహాసాలను ప్రదర్శించే శకుంతల గారూ తన కుటుంబం కోసం ఎన్నో కష్టాలు అనుభవించారు. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా తన వృత్తిని మాత్రం వదలలేదు. తనలాగే అందరూ ఆడపిల్లలు ధైర్యవంతంగా ఉండాలని  కోరుకునేవారు. ఎవరికి తలవంచకుండా తన కాళ్ళ మీద తాను నిలబడ్డారు. చాలా గొప్ప నటిగా అందరినీ అలరించి, అందరిని మెప్పించి, అందరి హృదయాల్లో గొప్పగా నిలిచిపోయారు.

Show More
Back to top button