శ్రీకృష్ణుని పేరు చెబితే ఎన్టీఆర్ ఎలా గుర్తొస్తారో, సీత అనగానే గుర్తొచ్చే ఏకైక పేరు అంజలీదేవి. అంజలీదేవి సినీ రంగ ప్రవేశం చేసిన తొలి రెండు సంవత్సరాల్లో 20 సినిమాలలో నటించారు. తాను సినీ రంగ ప్రవేశం చేసిన మూడు సంవత్సరాల లో సినిమా నిర్మాతగా కూడా మారారు. తాను వేశ్య పాత్రతో మొదలుపెట్టి మూడు నాలుగు సంవత్సరాలు వేశ్య పాత్రలే పోషించి, ఆ తరువాత కథానాయిక పాత్రలకు మళ్లి, ఆ తరువాత పౌరాణిక పాత్రలకు పెట్టింది పేరుగా పేరుగాంచారు. ఈ విధంగా ఒక రకమైన పాత్రలతో మొదలుపెట్టి మంచి పాత్రలకు మారిన నటిమణి కూడా అంజలీదేవి అయ్యుండాలి. కాలక్రమేణా తాను ధరించిన వేశ్య పాత్రలు ప్రేక్షకులకు గుర్తుకు రానీయకుండా, వృత్తిపరమైన సీత పాత్రలో ఒదిగిపోయారు.
1940 ప్రాంతంలో 30 వేల రూపాయలు పారితోషికంగా తీసుకున్న ఏకైక నటి అంజలిదేవి. కథనాయికగా మారిన తరువాత రెండో షిప్టులలో పనిచేయడం కూడా అంజలీదేవి తోనే మొదలయింది. కథనాయికగా చిత్రరంగ ప్రవేశం చేసిన మూడు నాలుగు సంవత్సరాలకే రెండు షిప్టులలో పనిచేసిన నటీమణి అంజలిదేవి. అంజలిదేవి తన 23 వ సంవత్సరంలో సౌత్ ఇండియా ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి ఉపాధ్యక్షురాలిగా ఎంపికయ్యారు. అంత చిన్న వయస్సులో ఆ పదవికి ఎంపికైన ఏకైక నటీమణి అంజలిదేవి. ప్రఖ్యాత తమిళ నటుడు శివాజీ గణేషన్ గారిని తెలుగు తెరకు పరిచయం చేసిన వ్యక్తి కూడా అంజలీదేవి. అంజలీదేవి మరియు ఆమె భర్త ఆదినారాయణ రావు కలిసి తాము నిర్మించిన “పరదేశి” అనే సినిమా ద్వారా తనను తెలుగు తెరకు పరిచయం చేశారు.
వీరు సంయుక్తంగా నిర్మించిన “సువర్ణసుందరి” సినిమా ఆ రోజుల్లో “మాయాబజార్” తో పోటీపడి విజయం సాధించింది. బోధన్ లాంటి చిన్నచిన్న ఊర్లలో కూడా ఆ సినిమా సిల్వర్ జూబ్లీ జరుపుకున్నది. నందమూరి తారకరామారావు గారు నటించిన మొట్టమొదటి సినిమా “పల్లెటూరిపిల్ల” లో కథనాయిక అంజలిదేవి నే. ఆ రోజుల్లో నందమూరి తారకరామారావు, అంజలిదేవి గార్ల పటం ఆంధ్రదేశం ప్రజల పూజ గదులలో ఉండేది. అంజలిదేవి తెలుగుదేశంలో అవుట్ డోర్ చిత్రీకరణ కు వెళితే రైతులు ఆమె కారు ఆపి పాదాలకు దండం పెట్టి వరి కంకులను అంజలిదేవి పాదాల దగ్గర ఉంచేవారు. ఎందుకంటే ఆమెను అంజలిదేవి గా కాకుండా భూదేవి కూతురు సీతాదేవిగా భావించేవారు. ఆవిడకు చీరలు పెట్టి ఆదరిస్తూ ఆమెలో సీతమ్మను చూసుకునే వారు ప్రేక్షకులు.
అంజలిదేవికి అంత పేరు ప్రఖ్యాతులు వచ్చాక ఆ పేరును తగ్గించే పాత్రలు ఏమాత్రం కూడా చేయలేదు. ఆ పేరును అలాగే నిలుపుకున్నారు అంజలిదేవి. సినీ రంగ ప్రవేశం చేసాక అంజలిదేవి ఎలా ఎదుగుతూ వచ్చారో, ఆదినారాయణ రావు కూడా సంగీతంలో అలా ఎదుగుతూ వచ్చారు. అంజలిదేవి, ఆదినారాయణ గార్లని అమ్మాయిగారు – అబ్బాయిగారు అని పిలుచుకుంటూ ఉండేవారు. అంజలీదేవి కథనాయికగా, ఆదినారాయణ రావు గారు సంగీత దర్శకుడిగా ఎదిగి ఇద్దరు కలిసి చలనచిత్రాలను నిర్మించారు. తెలుగు చలనచిత్ర రంగ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే సువర్ణసుందరి, అనార్కలి లాంటి సినిమాలను వీళ్ళిద్దరి సంయుక్త నిర్వహణలోనే నిర్మించబడ్డాయి.
జీవిత విశేషాలు…
జన్మ నామం : అంజలీదేవి
ఇతర పేర్లు : అంజనీ కుమారి
జననం : 24 ఆగస్టు 1927
స్వస్థలం : పెద్దాపురం, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్
వృత్తి : నటి
తండ్రి : నూకయ్య
తల్లి : సత్యావతి
జీవిత భాగస్వామి : ఆదినారాయణ రావు
మరణ కారణం : గుండెపోటు
మరణం : 13 జనవరి 2014,
మరణించిన స్థలం : విజయ హాస్పిటల్, చెన్నై, తమిళనాడు
యంగ్ మెన్ హ్యాపీ క్లబ్…
1916లో కాకినాడలో దంటు సూర్యరావు అనే అతను “యంగ్ మెన్ హ్యాపీ క్లబ్” ను మొదలుపెట్టారు. అప్పటికీ మూకీ సినిమాలు రాలేదు. టాకీలు అసలు లేవు. ఆ రోజులలో నాటకాలు వేయడమే పెద్ద ప్రొఫెషనల్ గా ఉండేది. ప్రేక్షకులకు కూడా నాటకాలు చూడడమే కాలక్షేపంగా ఉండేది. ఆ “యంగ్ మెన్ హ్యాపీ క్లబ్” ని 1916లో మొదలు పెట్టాక దానిని ఒక సంస్థలా పెంచి పోషించారు దంటు సూర్యరావు గారు. అలా ఆ నాటక సంస్థను ప్రణాళికాబద్ధంగా పెంచుతూ దానిని ఒక రెసిడెన్షియల్ స్కూల్ లాగా చేశారు. ఆ నాటక సంస్థలో చేరిన పిల్లలకు నాటకాలు నేర్పించి, చిన్న పిల్లల బాధ్యతలు కూడా వారే తీసుకునేవారు.
ఆ రోజుల్లో “కాకినాడ – నాటకం – సినిమా” మూడు పేర్లు కలిసి ఎవరైనా ఉన్నారు అంటే అది “యంగ్ మెన్ హ్యాపీ క్లబ్” ద్వారా నాటకాలు వేసే వారు మాత్రమే. ఆ రోజుల్లో సినిమాలలో ఎంతో పేరు తెచ్చుకున్న కస్తూరి శివరావు, ఎస్వీ రంగారావు, రేలంగి, సూర్యకాంతం, జగపతి రాజేంద్రప్రసాద్, పూర్ణోదయ క్రియేషన్స్ పతాకంపై సినిమాలు నిర్మించిన ఏడిద నాగేశ్వరరావు లాంటి వారందరూ కూడా “యంగ్ మెన్ హ్యాపీ క్లబ్” లో ఒకసారి లేదా అంతకంటే ఎక్కువసార్లు నాటకాలు వేసినవారే. అది అందులో ఉన్న ప్రత్యేకత. ఆ క్లబ్ లో ముందు అబ్బాయిగారు (ఆదినారాయణ రావు), ఆ తరువాత కొన్నాళ్ళకు అమ్మాయిగారు (అంజలీదేవి గారు) ప్రవేశించారు.
ఆదినారాయణ రావు జననం…
ఆదినారాయణ రావు గారు విజయవాడలో జన్మించారు. వాళ్ళ నాన్న గారి వ్యాపార రీత్యా ఆదినారాయణ రావు గారు విశాఖపట్నంలో పెరిగారు. వాళ్ళ నాన్నగారికి సంగీతంతో పరిచయం ఉండేది. నాన్న గారికి సంగీత పరిజ్ఞానం వలన ఆదినారాయణ రావు గారికి కూడా సంగీతం అంటే మక్కువ ఏర్పడింది. దానితో పాటు పాటలు పాడడం కూడా అలవాటయ్యింది. కాలక్రమేణా రంగస్థలం నాటకాలు కూడా వేసేవారు వాళ్ల నాన్న గారు. కొడుకు అభిరుచిని గమనించిన తాను శాస్త్రీయ సంగీతం నేర్పిద్దామని ఆదినారాయణ రావు గారిని చిన్నతనంలో విజయనగరం పంపించారు. అప్పట్లో సంగీతం నేర్చుకోవాలంటే విజయనగరం వెళ్లేవారు. అక్కడ శాస్త్రీయ సంగీతం, నృత్యం నేర్చుకున్నారు.
ఆదినారాయణ రావు గారు 8వ తరగతిలో ఉండగానే వాళ్ళ అమ్మగారు చనిపోయారు. దాంతో అక్కడి నుండి వాళ్ళ అమ్మమ్మ గారి ఊరు కాకినాడకు వచ్చి పాఠశాలలో చేరారు. అక్కడ ఉన్న “యంగ్ మెన్ హ్యాపీ క్లబ్” లో చేరి సంగీతాన్ని సమకూరుస్తూ, ఆ క్లబ్ లో సభ్యుడు అయ్యారు. ఆ విధంగా అబ్బాయిగారు “యంగ్ మెన్ హ్యాపీ క్లబ్” కు వచ్చేసారు. ఆదినారాయణ రావు గారు సంగీతం అందించడమే కాకుండా నాటకాలలో స్క్రిప్టు సాయం చేసేవారు. రంగస్థలంలో నటించడం తప్ప వెనకాల అన్ని పనులు ఆదినారాయణ రావు గారే చూస్తుండేవారు. ఆయనకు సాహిత్యంలో మంచి పట్టు ఉండేది. పాఠశాలలో ఎక్కువ చదువుకోకపోయినా బయట ఎక్కువ పుస్తకాలు చదివారు. ఆంగ్ల నవలలు కూడా ఎక్కువగా చదివారు. ఆయనను నాటక సంస్థ గురించి ఎక్కువగా తెలిసిన వారు గనుక తనని అందరూ గౌరవిస్తూ ఉండేవారు.
అంజలీదేవి జననం…
తూర్పు గోదావరి జిల్లాలోని పెద్దాపురంలో నివసించే నూకయ్య, సత్యవతిని దంపతులకు నలుగురు పిల్లలు. వారిలో ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి. అందరికంటే పెద్ద అమ్మాయి పేరు అంజనీ కుమారి. ఈమె 24 ఆగస్టు 1927నాడు జన్మించారు. చిన్నప్పుడు వాళ్ళ నాన్నగారికి వ్యవసాయం ఉండేది. తాను వ్యవసాయం చేసుకుంటూనే నాటకాల మీద ఆసక్తి కనబరచేవారు. నూకయ్య గారికి నాటకాలు వేయించడం, వాటికి సంగీతం వాయించడం లాంటి వాటి మీద ఆసక్తి ఉండేది. తబలా, డోలక్ లాంటి వాయిద్యాలు వాయిస్తూ ఉండేవారు. నాటకాల మీద మమకారంతో పెద్దాపురంలోనే కాకుండా కాకినాడలో ఎక్కడ నాటకాలు జరిగిన వెళుతుండేవారు. అంజనీ కుమారి పెద్దాపురంలో బాలికల పాఠశాలలో చదువుకుంటూ ఉండేది.
ఎనిమిదేళ్ళకే నాటకరంగం లో…
1934 ప్రాంతంలో ఆమె నాలుగో తరగతి చదువుతుండగా ఒకరోజు వాళ్ళ నాన్నగారు వచ్చి ఆమెను గబగబా బయటికి తీసుకెళ్ళారు. పెద్దాపురం మున్సిపల్ థియేటర్ వద్ద గ్రీన్ రూమ్ కి తీసుకెళ్లారు. హరిశ్చంద్ర నాటకంలో లోహితుడు పాత్రధారి రాలేదు. నాటకం వేయించే భద్రాచార్యులు, నూకయ్య గారికి మిత్రులు. ఆ నాటకానికి బాలిక కావాలంటే నూకయ్య గారు వాళ్ళ అమ్మాయిని తీసుకెళ్లారు. అక్కడికి తీసుకెళ్లగానే అంజని కుమారికి తనను నాటకానికి తీసుకువచ్చారని అర్థం అయ్యింది. అబ్బాయి పాత్రధారి అయిన లోహితుడికి మీ అమ్మాయికి అంజనీ కుమారి సరిపోతుంది.
వేసేది అబ్బాయి వేషం కనుక జుట్టు కత్తిరించాలని భద్రాచార్యులు ఆదేశించగా అప్పటికప్పుడు జుట్టు కత్తిరించారు. అప్పటికప్పుడు పాత్ర వేయడానికి రెండు రోజులు శిక్షణ కూడా ఇచ్చారు. అలా నాలుగువ తరగతి చదువుకుంటున్న వయస్సులో మొట్టమొదటిసారి హరిశ్చంద్ర నాటకంతో రంగస్థలం ఎక్కింది. భద్రాచార్యులు అక్కినేని నాగేశ్వరావు గారికి కూడా నాటకాలు నేర్పించారు. ఆ నాటకంలో లోహితుడి పాత్రలో చనిపోయినట్టు పడిపోవాలి. అలా పడిపోతూ పడిపోతూ అలాగే చాలా సేపు నిద్రపోయింది. అలా తన మొట్టమొదటి నాటకం పూర్తి చేసింది ఆ చిన్న పిల్ల అంజనీకుమారి.
యంగ్ మెన్ హ్యాపీ క్లబ్ లో చేరిక…
ఆ తరువాత తనను పాఠశాల మాన్పించి నృత్యం నేర్పించడం, సంగీతం చెప్పించడం మొదలుపెట్టారు. దాంతో బాటు నాటకం కూడా నేర్పించాలనే ఉద్దేశంతో అంజనీ కుమారిని తన పది సంవత్సరాల వయస్సులో ఆదినారాయణ రావు గారిని కలుసుకొని తనకు నాటకం నేర్పించే విషయం తెలియజేశారు. దాంతో అంజనీ కుమారికి “యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్” లో చేర్చుకున్నారు ఆదినారాయణ రావు గారు. అలా ఆమెను ఆదినారాయణ రావు గారే సమస్తమయ్యారు. ఆదినారాయణ రావు గారికి అంజనీ కుమారి కి మధ్య 13 సంవత్సరాల వయస్సు వ్యత్యాసం ఉంది. తన అనుభవంతో ఆదినారాయణ రావు గారు ఆంజనీకుమారి కి ప్రాపంచిక జ్ఞానం, పుస్తకాల గురించి, సాహిత్యం గురించి, పాటల గురించి, పెద్దవాళ్ల గురించి, నటన గురించి చెబుతూ ఉండేవారు. దాంతో ఆంజనీకుమారికి ఆదినారాయణ రావు గారిపై ఆరాధన భావం ఏర్పడింది.
రుక్మిణీ పాత్రలో…
ఇలా నాటకంలో శిక్షణ ఇస్తూ, ఇవన్నీ నేర్పిస్తూ తన బాగోగులు చూస్తే ఉండేవారు ఆదినారాయణ రావు గారు. అంజనీకుమారి “యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్” లో నాటకాలు వేస్తూనే, ఇతర సంస్థలకు కూడా నాటకాలు వేస్తుండేవారు. బర్మా షెల్ సంస్థ తరపున కూడా అంజనీకుమారి నాటకాలు వేస్తుండేవారు. “కాకు” అనే నాటకాన్ని వక్కలంక రామరాజు గారు వ్రాశారు. ఆ నాటకాన్ని వాట్స్ దొరతో కలిసి అంజనీకుమారి ప్రదర్శించారు. సామర్లకోటలో డాక్టరు సన్యాసి రాజు గారికి వాణి నాట్యమండలిని నాటకం ఉండేది. దాని తరపున కూడా అంజనీకుమారి నాటకం వేసేవారు. ఒకసారి అంజనీకుమారిని భక్తకుచేల నాటకానికి తీసుకెళ్లి రుక్మిణీ పాత్రను వేయించారు. ఆ నాటకంలో సత్యభామకు అక్కినేని నాగేశ్వరావు గారు వేషం వేశారు.
సినీ రంగ ప్రవేశం…
తాండ్ర సుబ్రహ్మణ్యం గారు తాను తీయబోయే “మేనరికం” సినిమాలో నటించేందుకు గానూ అంజనీకుమారిని పంపించమని నూకయ్య గారిని అడిగారు. అప్పుడు నూకయ్య గారు ఆదినారాయణ రావు గారితో విషయం చెప్పి అంజనీ కుమారిని బొంబాయి తీసుకెళ్లారు. చాలా రోజులు గడిచిపోయాయి. సినిమా ఇంకా మొదలు కాలేదు. ఆ సమయంలో బొంబాయిలో మతకల్లోలాలు మొదలయ్యాయి. అంజనీకుమారి చేతికున్న గాజులు అమ్మేసిన నూకయ్య గారు ఆ డబ్బులతో రైల్వే టిక్కెట్టు కొనుక్కుని తన కూతురుతో సాహా కాకినాడకు వచ్చేసారు. “యంగ్ మెన్ హ్యాపీ క్లబ్” లో “వసంతసేన” నాటకం వేయమని దంటు సూర్య రావు గారు అడుగగా దానికి అంజనీకుమారి ఒప్పుకున్నారు.
వైవాహిక జీవితం…
అంజనీకుమారి కి పద్నాలుగు సంవత్సరాలు వచ్చినాయని పెళ్లి చేయాలని సంబంధాలు వెతుకుతుండగా, ఆమెకు తన గురువు ఆదినారాయణ అంటే ఇష్టమని తననే పెళ్లి చేసుకుంటానని చెప్పారు. అప్పటికే ఆదినారాయణ రావు గారికి పెళ్లి అయ్యింది. పిల్లలు కూడా ఉన్నారు. పెద్దవాళ్లు ఎంతగా చెప్పి చూసినా కూడా అంజనీకుమారి వినలేదు. తాను ఆదినారాయణ రావు గారి ఆధ్వర్యంలోనే ఎదిగానని, ఆదినారాయణ గారి నీడలోనే, అతను ఇచ్చిన విజ్ఞానంతోనే ఈ స్థాయికి వచ్చానని, తనకు ప్రభావితమయ్యానని అంజనీకుమారి తెగేసి చెప్పేసింది. దాంతో ఆదినారాయణ రావు గారి కుటుంబ సభ్యులను ఒప్పించి అంజనీకుమారిని ఆదినారాయణ రావు గారికి ఇచ్చి పెళ్లి చేశారు.
వరూధిని తో భర్తకు అవకాశం…
అంజనీకుమారి పెళ్లి తరువాత కూడా నాటకాలు కొనసాగిస్తూనే ఉన్నారు. తనకు ఒక అబ్బాయి జన్మించారు. మళ్ళీ గర్భం దాల్చి ఉంది. ఆ గర్భంతోనే కాకినాడలో ఒక నాటకం వేస్తున్నప్పుడు అంజనీకుమారి వేస్తున్న “స్ట్రీట్ సింగర్స్” అనే నాటకాన్ని చిత్తజల్లు పుల్లయ్య గారు చూసి, తాను తీయబోయే “గొల్లభామ” సినిమా లో అంజనీకుమారిని నటింపజేస్తానని చెప్పారు. కానీ తాను ఏడవ నెల గర్భిణీతో ఉండడం వలన వారు ఒప్పుకోలేదు. ఆదినారాయణ రావు గారి మిత్రుడు అయిన సామర్ల వెంకట రంగారావు గారు తన మామగారు అయిన రామానందం గారు తీయబోయే “వరూధిని” సినిమాకు సంగీత దర్శకుడిగా అవకాశం ఇప్పిస్తానని ఆదినారాయణ రావు గారికి చెప్పారు. దాంతో ఆదినారాయణ రావు గారు తమిళనాడులోని సేలంలో జరిగే వరూధిని చిత్రీకరణకు అంజనీకుమారిని, ఇద్దరు పిల్లలు తీసుకొని వెళ్లారు. అక్కడికి వెళ్లినాక “వరూధిని” సినిమాకు రెండు పాటలు వ్రాసి, సంగీతం కూడా సమకూర్చారు ఆదినారాయణ రావుగారు.
అంజలీదేవి గా మార్చిన “గొల్లభామ”…
చిత్తజల్లు పుల్లయ్య గారి సహాయకులు అయిన రేలంగి వెంకట్రామయ్య గారిని సేలం పంపించి అంజనీకుమారిని, భర్త ఆదినారాయణరావు ఇద్దరు పిల్లలతో సాహా తీసుకురమ్మని పంపించారు. రేలంగి వెంకట్రామయ్య గారు వెళ్లి ఆదినారాయణ రావు గారిని ఒప్పించారు. 1946 ప్రాంతంలో సంక్రాంతి ముందు రోజు అంజనీకుమారి, ఆదినారాయణ రావులు తమ పిల్లలతో సహా మద్రాసులో రైలు దిగారు. చిత్తజల్లు పుల్లయ్య గారు తీయబోయే సినిమా “గొల్లభామ” లో కథనాయకుడు ఈలపాటి రఘురామయ్య, కథనాయకి కృష్ణవేణి. అంజనీకుమారి దంపతులకు ఈలపాటి రఘురామయ్య గారి ఇంట్లోనే ఆవాసం కల్పించారు. నెల రోజుల పాటు అంజనీకుమారికి రిహార్సల్ ఇచ్చారు. చిత్తజల్లు పుల్లయ్య గారు ఈ సినిమాలో అంజనీకుమారి పేరును “అంజలీదేవి” గా మార్చారు. ఆ విధంగా అంజనీకుమారి పేరు కాస్త గొల్లభామ సినిమాతో అంజలీదేవిగా మారిపోయింది. దాంతో అంజలీదేవి మొట్టమొదటి సినిమా “గొల్లభామ” గా చెప్పుకోవచ్చు.
తొలిసినిమా లో వేశ్య పాత్రలో…
“గొల్లభామ” సినిమాలో కృష్ణవేణి కథానాయిక. అంజలీదేవి “మోహినీ” పాత్ర ధరించారు. ఒకరకంగా అది వేశ్య పాత్ర. అందులో ఈలపాటి రఘురామయ్య గారు ఒక సన్నివేశంలో అంజలీదేవి గారిని కౌగిలించుకొనే సన్నివేశాన్ని చిత్రీకరించినప్పుడు తనను గట్టిగా కౌగిలించుకున్నారు. దాంతో ఇబ్బంది పడ్డ అంజలీదేవి గారికి చిత్తజల్లు పుల్లయ్య గారు నచ్చజెప్పారు. ఈ సినిమాలో నటిస్తుండగానే అంజలీదేవికి అవకాశాలు వెల్లువలా వచ్చిపడ్డాయి. దాంతో గొల్లభామ చిత్రం నిర్మాణంలో ఉండగానే నాలుగు సినిమాలకు సంతకాలు చేశారు అంజలీదేవి గారు. మొత్తానికి “గొల్లభామ” సినిమా విడుదలైంది. అంజలీదేవి గారికి మంచి పేరు వచ్చింది.
కథానాయకి గా “పల్లెటూరి పిల్ల”…
“గొల్లభామ” సినిమాలో మొదలైన వేశ్య పాత్ర కొనసాగుతూనే ఆ తరువాత మూడు సంవత్సరాల్లో తాను నటించిన 20 సినిమాలలో కూడా వేశ్య పాత్రలే వచ్చాయి. “శ్రీ లక్ష్మమ్మ కథ” అనే సినిమాలో అక్కినేని, అంజలీదేవి నాయకా, నాయికలుగా నటించారు. ఆ సినిమా లో అంజలీదేవి పతివ్రత పాత్రలో నటిస్తే చాలామంది అభ్యంతరం చెప్పారు. కానీ ఘంటశాల బలరామయ్య గారు మాత్రం ఆమెను అదే పాత్రలో కొనసాగించే అవకాశం ఇచ్చారు. ఆ సినిమా అడగకపోయినా ఆ పాత్ర అంజలిదేవి గారిని మంచి పాత్రలవైపు మళ్ళించడానికి దోహదం చేసింది. ఆ తరువాత “పల్లెటూరి పిల్ల” లో హీరోయిన్ గా నటించిన అంజలీదేవి గారు తరువాత పదహారు సంవత్సరాల పాటు కథనాయికగా కొనసాగారు. “పల్లెటూరు పిల్ల” సినిమాకు సంగీత దర్శకత్వం వహించిన ఆదినారాయణ రావు గారు, అంజలీదేవి గారితో సమాంతరంగా ఎదుగుతూ వచ్చారు.