టాకీలు మొదలైన గత 90 సంవత్సరాలుగా తెలుగు సినిమా అనేది వాణిజ్యపరంగానూ, నిర్మాణ పరంగానూ, సాంకేతికంగానూ, సృజనాత్మక కోణంలోనూ, కథా వస్తువుల పరంగానూ ఎన్నో మార్పులకు లోనైంది, ఎన్నో మలుపులు తిరిగింది. ప్రపంచవ్యాప్తంగా సుమారుగా గత 100 సంవత్సరాలకు పైగా సినిమా అనేది ఒక బలీయమైన మాధ్యమంగా ఎదుగుతూ వచ్చింది, ఇంకా ఎదుగుతూ ఉంది. భారతదేశంలోనూ అందులోనూ తెలుగు వాళ్లలోనూ సినిమా అనేది మన జీవన విధానంలో ఒక విడదీయరాని భాగం అయ్యింది. సినిమా రంగం గురించి మాట్లాడని, ఆలోచించని తెలుగు వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారని అంగీకరించవలసిందే. సంవత్సరానికి 05 సినిమాలు విడుదలయ్యే దశ నుండి సంవత్సరానికి 200 సినిమాలు విడుదలవుతూనే వందల కోట్ల వ్యాపారం జరిగే స్థాయికి తెలుగు సినిమా చేరుకుంది. కేవలం ఒక్క సినిమా నిర్మాణమే 100 కోట్లు దాటినటువంటి సాహసానికి తార్కాణంగా నిలిచింది.
తెలుగు చిత్ర సీమలో 1932 – 1942 వరకు సంభవించిన మార్పులు..
సినిమా చిత్రీకరణ ప్రబలంగా ఉన్న మద్రాసులో 1942లో చిత్ర పరిశ్రమ మూత పడింది. మద్రాసులో బాంబులేస్తారేమోనని చిత్రీకరణలన్నీ ఆపేశారు. ముడి ఫిలిం రాకపోవడంతో అక్కడున్న చిత్రం నిర్మాణ సంస్థలన్నీ కూడా తమ తమ దుకాణాలు కట్టేసి చిత్రీకరణలు ఆపేసి వాళ్ళ వాళ్ళ స్వగ్రామాలకు వెళ్లిపోవడం జరిగింది. 1942లో వచ్చిన రెండో ప్రపంచ యుద్ధంతోబాటుగా 1932 నుంచి 1942 సంవత్సరాలలో తెలుగు సినిమాలలో వచ్చిన మార్పులను విశ్లేషిస్తూ ఆ రోజులలో ఒక తెలుగు పత్రికలో ఒక వ్యాసం వచ్చింది. ఆ వ్యాసంలో ఒక విశ్లేషణ ప్రకారం కరాఖండిగా వాళ్ళు తేల్చి చెప్పిన విషయం ఏమిటంటే? “తెలుగు సినిమా పని అయిపోయింది. నిర్మాణం ఖర్చులు పెరిగిపోయాయి. ఆదాయం తగ్గిపోయింది. చాలామందికి నష్టాలు వస్తున్నాయి. ఒకటి రెండు సంవత్సరాల్లో తెలుగు సినిమా తుడిచిపెట్టుకుపోతుంది”.
ఆ వ్యాసం వచ్చిన 70 సంవత్సరాల తరువాత కూడా పరిస్థితులు అలానే ఉన్నాయి. పెట్టుబడి పెరిగిపోవడం, ఆదాయం తగ్గిపోవడం. కానీ తెలుగు చిత్ర పరిశ్రమ ముందుకు వెళుతూనే ఉంది. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమ నిర్విరామంగా, అవిశ్రాంతంగా, నిరాటంకంగా ముందుకు వెళుతూ ఉన్నప్పటికీ 1942లో ఆ వ్యాసంలో ఏ విశ్లేషణ ప్రకారం తెలుగు చిత్ర పరిశ్రమ మూతపడుతుందని చెప్పారు? పది సంవత్సరాల లో తెలుగు సినిమా పరిశ్రమ వ్యాపార పరంగా ఎలాంటి మార్పులకు లోనైంది? ఏ ఏ కారణాల వలన తెలుగు పరిశ్రమ మూతపడుతుందని నిర్ణయానికి వచ్చారు? ఈ విషయాలు ముందుగా తెలుసుకుందాం.
రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో…
యుద్ధ జ్వాలలు ప్రపంచమంతా చుట్టుముట్టాయి. ప్రతీ దేశంలోనూ ఆర్థిక వ్యవస్థలతో బాటు, రాజకీయ వ్యవస్థలు నేలమట్టమవ్వడంతో ఆయా దేశాలు అల్లాడిపోయుతున్నాయి. ఒక దేశానికి మరో దేశానికి మధ్య వ్యాపార వ్యవహారాలు బొత్తిగా స్తంభించిపోయాయి. సామ్రాజ్యవాద బాసిస్టు తత్వాలు కనీ వినీ ఎరుగని రీతిలో స్తంభించిపోయాయి. నాగరికత పేరుతో అవిచ్ఛిన్నంగా అంతవరకు సాగిన పరిశ్రమలన్నీ కూకటివ్రేళ్లతో సహా కుప్పకూలిపోతున్నాయి. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా హిందూ దేశం కూడా అమాంతంగా రణక్షోణిలోకి లాగబడింది. శత్రువుల చేత మన దేశ తలుపులు కూడా తట్టబడ్డది. విదేశాల నుండి ముడిఫిలిం సరఫరా మీద ఆధారపడ్డ హిందూ దేశ సినీ పరిశ్రమ ప్రస్తుతం కాలగర్భంలో కలిసిపోయే పరిస్థితులు ఉదయించాయి. మన తెలుగు సినిమా పరిశ్రమ కూడా కాలచక్రానికి ఆహుతి అయిపోతుంది. తెలుగుదేశంలో తెలుగు చిత్రపరిశ్రమ మీద సరైన నమ్మకం పుట్టలేకపోయింది.
ఇలా మొదలైన వ్యాసం చివరిలో “ఈ పదేళ్ల జీవితంలో తెలుగు సినీ పరిశ్రమ అనుభవం లేని, పరిశీలన చేయలేని, జాతీయ భావాలు లేని, సంకుచిత భావాలు విడనాడని, మిలిటెంట్ స్పిరిట్ తెలియని వ్యక్తుల చేతులలో మెలిగింది. అందుచేత తెలుగు సినిమా పరిశ్రమ దెబ్బకు గురైందని తెలిసిన విద్యార్థులు తండోపతండాలుగా ఈ పరిశ్రమరంగం లోకి అడుగుపెట్టలేకపోయారు. వచ్చిన వ్యక్తులు కూడా కొండంత వ్యూహాలు కలవారు. పైసా లేక ప్రస్తుత విధానం క్రింద మసలలేక తగ్గిపోయారు అని చెబుతూనే ముడి ఫిలిం అస్సలు దొరకడం లేదు. ఎక్స్పోజ్ చేసిన నెగటివ్ ఫిలింలో ప్రింట్ చేయడానికి పాజిటివ్ ఫిలిం లేక, ఇటు ఆర్థిక వనరులు లేక అలల్లాడుతున్నారు. మద్రాసులో బాంబులు పడతాయని భయంతో నిర్మాణ సంస్థలన్నీ చెల్లా చెదరైపోయాయి. నటీనటులు చెట్టుకొకరు, పుట్టకొకరు తయారయ్యారు. తారల జీవితం ఇంతటితో సమాప్తి అని చెప్పే దినం ఎంతో దూరంలో లేనట్టు కనబడుతోంది. ఇది 1942లో పత్రికలో వచ్చిన వ్యాసం యొక్క ఉద్దేశ్యం.
పదేళ్ల సినిమా ను మూడు భాగాలుగా విడదీస్తే..
ఆ రోజులలో చిత్ర పరిశ్రమను తరచి చూస్తే 1932 నుండి 1942 వరకు గల పది సంవత్సరాలలో మొత్తం 105 సినిమాలు విడుదలయ్యాయి. అందులో పౌరాణిక సినిమాలు 75, సాంఘిక చిత్రాలు 20, డాక్యుమెంటరీ చిత్రాలు 02, చారిత్రాత్మక చిత్రాలు 03, ఇంకా ఇతరత్రా సినిమాలు 05, మొత్తం కలిపి 105 చిత్రాలు విడుదలయ్యాయి. మొట్టమొదటి పది సంవత్సరాలను పెట్టుబడి, వ్యాపారం, రాబడి దృష్ట్యా మూడు భాగాలుగా విభజించినట్టయితే.. 01) 1929 నుండి 1936 వరకు.. 02) 1936 నుండి 1939 వరకు.. 03) 1939 నుంచి 1942 వరకు.. అని అనుకుంటే ఈ మూడు భాగాలలోనూ సినిమా పరిశ్రమ మూడు రకాలుగా మార్పు చెందుతూ వచ్చిందని చెప్పవచ్చు.
1929 నుండి 1936 వరకు..
తెలుగు సినిమా టాకీలు 1932వ సంవత్సరంలో మొదలయ్యాయి. దానికి మూడు సంవత్సరాల ముందు, టాకీలు మొదలైన నాలుగు సంవత్సరాల తర్వాత వరకు చిత్ర నిర్మాణం కోసం ఎక్కువగా కలకత్తా నుండి, బొంబాయి నుండి వ్యాపార నిపుణులు వచ్చారు. వాళ్ళు కొల్లాపూర్ లోనూ, బొంబాయి లోనూ, కలకత్తా లోనూ, తెలుగు సినిమాలు తీశారు. అప్పట్లో రెండే చిత్ర నిర్మాణ సంస్థలు ఉండేవి. ఇంపీరియల్ నిర్మాణ సంస్థ, ఈస్ట్ ఇండియా నిర్మాణ సంస్థ. ఈ రెండు సంస్థలు తెలుగేతరులవి (తెలుగు వారివి కాదు), పెట్టుబడి పెట్టినవారు తెలుగువారు కాదు. కానీ అందులో పని చేసింది మాత్రం తెలుగువారే. తెలుగు వారు కానీ వ్యాపారస్తులు తెలుగు సినిమాలు తీసి, తెలుగు ప్రేక్షకుల డబ్బును, వాళ్ళ భౌతిక శక్తిని, మేథా శక్తిని కూడా కొల్లగొట్టారు అని ఆ వ్యాసంలో వ్రాశారు. ఆ తరువాత రోజులలో పెట్టుబడి పెట్టడానికి తెలుగు వారు వచ్చారు. కానీ ఆ సినిమా వ్యాపారంలో ఉన్న లోటు పాట్లు, మాయ మర్మాలు ఎవ్వరూ కూడా ఎక్కువగా తెలుసుకోలేదు.
1929 నుండి 1936 వరకు వచ్చిన సినిమాలో ఒక్కో సినిమాకు నిర్మాణ వ్యయం 30 వేల రూపాయల నుండి 40 వేల రూపాయలు అయ్యేవి. రాబడి మాత్రం రెండు లక్షల రూపాయలు వచ్చేవి. అందువలన మొట్టమొదట తెలుగు సినిమాలు తీసిన నిర్మాతలు బాగుపడ్డారు. మూకీ సినిమాలను ఒక ప్రక్కనుంచితే టాకీ సినిమాలకు బాగా డబ్బులు వచ్చాయి. ఈ దోపిడీలో మన నటీనటులకు ముట్టింది చాలా తక్కువ. రైలు బత్యాలు, ఏరోజుకు ఆరోజు, లేక నెల జీతం మాదిరి జీతభత్యాలు ఉండేవి. మధ్యలో వచ్చినటువంటి దుబాసీలు (మధ్యవర్తులు) ఎక్కువ జీతం పొందేవారు. దుబాసీలు తెలుగు నటీనటులను తీసుకువచ్చి సినిమా నిర్మాణం చేస్తున్న నిర్మాతలకు పరిచయం చేసేవారు. అలా దుబాసీలు ఎక్కువగా బాగుపడ్డారు. అలాగే మొదటి ఏడేళ్లలో బలీయంగా తెలుగు వాళ్ళు కానటువంటి నిర్మాతలు తీసినంత దృఢంగా సినిమాలు తీసే నిర్మాత తెలుగుదేశం నుండి రాలేకపోయాడు.
1936 వరకు తెలుగుదేశం నుండి తెలుగు వాడు పంపిణీదారుడుగా లేడు. థియేటర్లు ఎక్కువ లేవు. సినిమాను కొనుగోలు చేసినవాళ్ళు మిషనరీ కొని, టాకీ సినిమాలు తీసుకొని ఊరూరా తిరుగుతూ ప్రదర్శించేవాళ్ళు. వాళ్లకు మాత్రం డబ్బులు బాగా వచ్చేవి. నటీనటులకు మాత్రం ఎక్కువగా పారితోషికం రాలేదు. దర్శకులు మాత్రం అయిదుగురు, ఆరుగురు దర్శకులు తెలుగువారు దర్శకులు అయ్యారు. టాకీలు మొదలైన నాలుగు సంవత్సరాలలో (1932 నుంచి 1936 వరకు కూడా) సాంకేతిక నిపుణులు, సాంకేతిక శాఖలో తెలుగువారు ఎవ్వరూ పనిచేయలేదు. 1935 వ సంవత్సరంలో బందరు నుండి వెళ్లిన ఒకతను వేల్ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను మొదలుపెట్టారు. కానీ తాను తెలుగేతర నిర్మాతలున్నంత దృఢంగా, దీక్షగా తాను నిలబడలేకపోయారు. “సరస్వతి టాకీస్” అనే చిత్ర నిర్మాణ సంస్థలు స్థాపించి విజయవాడకు చెందిన కురుకూరి సుబ్బారావు, పారేపల్లి శేషయ్య అనేవారు మద్రాసుకు వెళ్లి సినిమాలు నిర్మించారు. అప్పటి నుండి తెలుగు నిర్మాతలు సినిమా పరిశ్రమలో దృఢంగా ఉన్నారని ఒక విశ్లేషణగా చెప్పుకోవచ్చు.
1936 నుండి 1939 వరకు..
ఈ సంవత్సరాలలో (1936 – 1939) సినిమా నిర్మాణం చూసుకుంటే అంతకు ముందు 40 వేల రూపాయలు ఉన్న సినిమా నిర్మాణం ఆ తరువాత మూడు సంవత్సరాలకు 80 వేల రూపాయలకు తక్కువ కాకుండా పెరిగింది. నిర్మాణ వ్యయం ఎంత ఎక్కువగా పెరగడానికి కారణం స్టూడియోలు లేకపోవడం. మద్రాసులో స్టూడియోలు ఎక్కువగా లేవు. మద్రాసులో తెలుగు నటీనటులు ఉన్నారు. కానీ నటీనటులు ఆంధ్రదేశం అంతటా నాటకాలు వేస్తూ ఉండేవారు. నిర్మాతలు వీరిని తీసుకొని కొల్లాపూర్, బొంబాయి, కలకత్తా వెళ్లి అక్కడ స్టూడియోలో సినిమా నిర్మాణం చేపట్టేవారు. వీళ్ళందరినీ తీసుకెళ్లడానికి జీతభత్యాలు, దారి భత్యాలు ఇవ్వాలి. అందువలన దాదాపు పది శాతం సినిమా నిర్మాణం పెరిగింది.
కానీ ఎవ్వరికీ కూడా మద్రాసులో స్టూడియో పెడదామన్న ధైర్యం రాలేదు. అందుకే 1936 నుండి 1939 వరకు గల మూడేళ్లలో 1936 వ సంవత్సరంలో తీసిన తెలుగు సినిమాలు ఎక్కువగా లాభాలు రాలేదు. 1937 లో ఉత్తర సర్కారు నుండి, నెల్లూరు నుండి కొంతమంది పెట్టుబడి పెట్టడానికి మద్రాసుకు వచ్చారు. 1938లో కొల్లాపూర్, బొంబాయి, కలకత్తా వెళ్లే బదులు మనమే స్టూడియోలు పెట్టుకుందామనుకొని విశాఖపట్నంలోనూ, రాజమండ్రి లోనూ, మద్రాసులోనూ తెలుగువారి పెట్టుబడులతో మూడు స్టూడియోలు వెలిశాయి. దురదృష్టం ఏమిటంటే ఆ తరువాత సంవత్సరం మూడు స్టూడియోలలో రెండు స్టూడియోలు మూతపడ్డాయి.
1939 నుండి 1942 వరకు…
1939 నుండి 1942 వరకు అంటే రెండో ప్రపంచ యుద్ధం మొదలవ్వడానికి ముందు వరకు. ఈ సంవత్సరాలలో సినిమా నిర్మాణాల సంఖ్య పెరిగింది. పెట్టుబడులతో బాటు లాభాలు రావడం మొదలైంది. 80 వేల రూపాయల నుండి చిత్ర నిర్మాణం లక్ష రూపాయల వరకు పెరిగింది. సాంకేతికంగా 1932 నుండి 1939 వరకు సినిమా రంగంలో చాలా మార్పులు వచ్చాయి. కాబట్టి వాటన్నిటిని జీర్ణం చేసుకోవడం, సాంకేతిక నైపుణ్యాన్ని ఉపయోగించుకోవడంతో చిత్ర నిర్మాణ వ్యయం ఒక లక్ష రూపాయల వరకు వెళ్ళింది. కొంతమంది సినిమాలు తీద్దామని వచ్చి వాటి మీద అవగాహన లేక ఎలా సినిమాలు తీయాలో తెలియక డబ్బులు పోగొట్టుకున్న వాళ్లు ఉన్నారు 1939 నుండి 1942 వరకు పెరిగారు. కొంతమంది నిర్మాతలకి నష్టాలు వచ్చేసరికి సినిమా నిర్మాణంలో మోసం లేదు అనే భావనలు పోయినాయి. అందరూ జాగ్రత్తగా ఉండాలి సినిమాలో డబ్బులు పెడితే తిరిగిరావు అనే భావన మొదలైంది. ఒకటి, రెండు సినిమాలు తప్ప 1940లో ఏ సినిమాకి పెట్టుబడి పెట్టిన వాళ్ళ డబ్బులు వెనక్కి రాలేదు. 1941 లో రెండో ప్రపంచ యుద్ధం హడావిడి మొదలైంది. ఆ సంవత్సరం సినిమాలు తీయడానికి కొత్త వాళ్ళు ఎవ్వరూ ముందుకు రాలేదు. పాత వాళ్ళు నిలదొక్కుకొని కొంచెం లాభాలు వచ్చే పరిస్థితి నెలకొంది.
1942 వచ్చేసరికి పూర్తిగా నడిసంద్రంలో సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి పూర్తిగా దెబ్బతిన్నాయి. దానిని బట్టి చూస్తే సినిమా పరిశ్రమ గల్లంతవుతుందని చెప్పారు. ఈ విధంగా 1939 నుండి 1942 వరకు కూడా వచ్చినటువంటి సినిమాలు వాణిజ్యపరంగా చూస్తే ఎన్నో మార్పులు వచ్చాయి. 1942 వచ్చేసరికి సినిమా పరిశ్రమ మూతపడే పరిస్థితి వచ్చింది. విహంగ వీక్షణం లో ఈ వ్యాపార అంశాలను పరిశీలన చేసి చూస్తే మొత్తం ఆ 10 సంవత్సరాలలో తెలుగు సినిమాల పెట్టుబడి మొత్తం 105 సినిమాలకు మొత్తం ఖర్చు 75 లక్షల రూపాయలు. దాంట్లో నిర్మాతలకు మొత్తం తిరిగి వచ్చింది 50 లక్షల కు మించి లేదు. మొత్తంగా చూసుకుంటే ఆ పది సంవత్సరాలలో 25 లక్షల రూపాయలు నష్టం వాటిల్లింది. ఆరోజులలో పారితోషికం మగ తారల కంటే ఆడ తారలకు ఎక్కువగా ముట్టింది. పరిశ్రమ మీద ఆధారపడ్డ సాంకేతిక నిపుణులు మాత్రం భుక్తికి లోటు లేకుండా బాగానే గడిచింది. ఆ పది సంవత్సరాలలో స్టూడియో ప్రొడక్షన్స్, డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిటర్ లాంటి వాటిల్లో ఇరవై వేల మంది తెలుగు వారికి ఉపాధి దొరికింది. ఆ పది సంవత్సరాలలో స్టూడియోలు పెట్టిన వారికి లాభాలు రాలేదు, సరికదా కోలుకోలేనంత నష్టం వచ్చింది.
ఈ సినిమా నిర్మాణ సంస్థల్లో ఒకటో, రెండో తప్పితే మిగతావన్నీ కూడా నాలుక వెళ్లబెట్టాయి. పంపిణీదారులు చాలామంది వచ్చినా కూడా వారు నష్టాలతోనే వెనుతిరిగలవలసి వచ్చింది. పది సంవత్సరాలలో 30 మంది తెలుగువారు దర్శకులుగా వచ్చారు. ఛాయాగ్రహకులలో ఓకే ఒక తెలుగువాడు పి.వి.పద్ధి అనే వాడు అంతర్జాతీయ ప్రఖ్యాతినార్జించారు. సౌండ్ ఇంజనీర్లలో వెతికితే ఇద్దరు, ముగ్గురు తెలుగు వాళ్ళు కనిపించారు. మిగతా శాఖలలో తెలుగువారు “కిమిన్నాస్తి” అని పత్రికలలో వ్రాశారు. పెట్టుబడి పెట్టిన వారు అందరూ కూడా బెంగాలీ వాళ్లే, కాబట్టి పరిశ్రమలో ఎక్కువగా బెంగాళీలు ఉండేవారు. 1932 నుంచి 1942 వరకు తెలుగు చిత్ర పరిశ్రమ వాణిజ్యపరంగా, పెట్టుబడి పరంగా చూసుకుంటే ఎన్నో ఒడిదుడుకులకు లోనైంది. తెలుగు పరిశ్రమకు తెలుగు దర్శకులు వచ్చారు. తెలుగు నిర్మాతలు 1936 – 37 నుండి పరిశ్రమలో అడుగు పెట్టడం ప్రారంభమైంది. 1942 తర్వాత తెలుగు సినిమా పరిశ్రమ మూతపడుతుందని అనుకున్నప్పటికీ, ఆ తరువాత కోలుకొని ఇప్పటివరకు కూడా అదే యవనాశ్వంలాగా పరుగులు తీస్తూనే ముందుకు వెళుతుందండటంలో ఏమాత్రం సందేహం లేదు.
మొట్టమొదటి టాకీ భక్త ప్రహ్లాద…
తెలుగు టాకీలు మొదలయిన తరువాత వచ్చిన మొట్టమొదటి చిత్రం “భక్త ప్రహ్లాద”. ఇది 15 సెప్టెంబరు 1931 నాడు విడుదల అయ్యింది అని చరిత్రలో వ్రాసి ఉంది. కానీ అది పొరపాటు అని నిజానికి 06 ఫిబ్రవరి 1932 నాడు అది విడుదల అయ్యిందని రెంటాల జయదేవ్ అనే ప్రముఖ పాత్రికేయుడు సెన్సార్ సర్టిఫికెట్ వగైరా నిదర్శనాలతో సహా 2011 లో నిరూపించారు. అప్పటి నుండి తెలుగు టాకీలు 06 ఫిబ్రవరి 1932 నాడు మొదలైనావని భావిస్తున్నారు. దీనికి కొంచెం ముందు ఆర్దేశిర్ ఇరానీ గారు హిందీలో “ఆలం ఆరా” తీశారు. ఆ తరువాత తెలుగులో కూడా టాకీ సినిమా తీయాలనిపించి పెట్టుబడిదారులతో మాట్లాడి హనుమంతప్ప మునియప్ప రెడ్డి (హెచ్.ఎం.రెడ్డి) దర్శకత్వంలో సినిమా తీయడానికి ఒప్పించారు.
06 ఫిబ్రవరి 1932 నాడు తొలి సెన్సారు..
అయితే ముందుగా తమిళంలో అక్టోబర్ 1931 లో విడుదలైన కాళిదాసును తీశారు హెచ్.ఎం.రెడ్డి గారు. పేరుకే కాళిదాసు అనేది తమిళ సినిమా. కానీ దాంట్లో నటించిన ప్రధాన నటుడు తెలుగు వాడే. అందువలన ఆ సినిమాలో కొన్ని సంభాషణలు తెలుగులో, కొన్ని సంభాషలో తమిళంలో చెప్పారు. పూర్తి తెలుగు టాకీ చిత్రం భక్త ప్రహ్లాద 06 ఫిబ్రవరి 1932 నాడు విడుదల అయితే, అది సెన్సార్ జరుపుకున్నది మాత్రం 22 జనవరి 1932లో. మొట్టమొదట టాకీ సినిమా అయిన “ఆలం ఆరా”, “కాళిదాసు”, “భక్త ప్రహ్లాద” మూడింటిలోనూ నటించిన (హిందీ, తమిళ, తెలుగు) ఓకే ఒక నటుడు ఆ తర్వాత రోజులలో అత్యంత ప్రముఖుడైన వ్యక్తి అక్కినేని లక్ష్మీ వరప్రసాద్ (ఎల్వీ ప్రసాద్) గారు. ఆయన మొట్టమొదటి హిందీ టాకీలో ఉన్నారు, మొట్టమొదటి తమిళ టాకీలో ఉన్నారు, మొట్టమొదటి తెలుగు టాకీలో కూడా నటించారు.
తొలి ద్విపాత్రాభినయం చిత్రపు “నరసింహ రావు”..
మొట్టమొదటి తెలుగు టాకీ భక్త ప్రహ్లాదలో రెండు పాత్రలు ధరించిన వ్యక్తి (బ్రహ్మగాను, చెండామార్కుడు గాను) పేరు చిత్రపు నరసింహ రావు గారు. ఆయనది కృష్ణా జిల్లా బందరు. ఆయన తరువాత రోజులలో సినిమా దర్శకుడు అయ్యారు. ఆయన తమ్ముడు చిత్రపు నారాయణమూర్తి. ఆయన కూడా తర్వాత రోజులలో సినిమా దర్శకుడై 1964 లో వచ్చిన “భక్త ప్రహ్లాద” సినిమాకు దర్శకత్వం వహించారు. భక్త ప్రహ్లాద (1932) సినిమా విడుదలైన రెండు నెలలకు భారతీ అనే మాసపత్రికలో ఒక వ్యాసం ఈవిధంగా వ్రాశారు. “ఈ తెలుగు టాకీలు అనేవి తెలుగు ప్రజలకు శనిలా దాపురించాయి. వీటిని అరికట్టవలెను. వీటి మూలంగా నాటకాలు పాడైపోతున్నాయి. రానున్న రోజులలో నాటకాలకు భవిష్యత్తు ఉండదు. కాబట్టి మనం ఈ టాకీలను ఆదరించవద్దు. ఈ టాకీలు కనుక ముందుకెళితే అంతరాల వల్ల ప్రమాదం ఉంది” అని ఒక పెద్ద వ్యాసం వ్రాశారు. టాకీల వల్ల బొమ్మలు మాట్లాడుతున్నాయి. దేశానికి అరిష్టం పట్టిందని చాలా మంది గుళ్లోకి వెళ్లి పూజలు చేశారట. ఏది ఏమైనా మొట్టమొదటి టాకీగా “భక్త ప్రహ్లాద” చరిత్రలో నిలిచిపోయింది.
మొదటి శ్రీరాముడు “యడవెల్లి సూర్యనారాయణ”..
1932 వ సంవత్సరం డిసెంబరు రెండవ టాకీ చిత్రం “శ్రీరామ పాదుకా పట్టాభిషేకం” వచ్చింది. దాని దర్శకుడు బాదామి సర్వోత్తమ్ బెంగుళూరులోని చెన్న పట్టణానికి చెందినవారు. ఆ సినిమా 24 డిసెంబరు 1932 నాడు మద్రాసులో కినిమా థియేటరులో విడుదలైంది. అలాగే 1933 సంక్రాంతికి విజయవాడలోని దుర్గా కళామందిర్ లో ఆ సినిమాను విడుదల చేశారు. అప్పట్లో నిజానికి థియేటర్లు ఎక్కువగా ఉండేవి కాదు. ప్రొజెక్టర్ లను ఊరూరా తిప్పి సినిమాలను ప్రదర్శిస్తుండేవారు. థియేటర్లు లేవు కాబట్టి మూడు ప్రింట్లు మాత్రమే వేసేవారు. దుర్గా కళామందిర్ లో విడుదలైనప్పుడు పత్రికలో ఒక ప్రకటన ఇలా వ్రాశారు. “ఈ సినిమా చూడని తెలుగువాడి బ్రతుకు వ్యర్థం. ఈ సినిమా మద్రాసులో అద్భుతంగా ఆడింది. మద్రాసు వారు ఒక వారం ఆడించాక బెంగళూరులో ఉండే నిర్మాతలకు టెలిగ్రామ్ ఇచ్చి మరొక వారం సినిమా ఆడించడానికి అనుమతి ఇవ్వండి అని అడిగారు. ఈ సినిమా బెజవాడ వస్తుంది మీరందరూ తప్పక చూసి తరించండి” అని పేపరులో ప్రకటన ఇచ్చారు. “శ్రీరామపాదుక పట్టాభిషేకం” లో శ్రీరాముడిగా పాత్ర ధరించిన వ్యక్తి యడవెల్లి సూర్యనారాయణ. మొట్టమొదటి సీతగా నటించినది “సురభి కమలా బాయి”.
మొట్టమొదటి యమధర్మరాజు “మునిపల్లె సుబ్బయ్య”..
1933 వచ్చేసరికి సినిమా పట్ల అవగాహన పెరిగింది. ఎక్కువ వ్యాపార దృక్పథం ఉన్న వారు కూడా సినిమా పరిశ్రమలోకి రావడం మొదలుపెట్టారు. 1933లో రెండు జంట చిత్రాలు “సతీ సావిత్రి” సినిమాలు వచ్చాయి. “రామదాసు” పేరుతో రెండు చిత్రాలు వచ్చాయి. రికార్డుల పరంగా చూస్తే మొట్టమొదటి యమధర్మరాజు సతీ సావిత్రి సినిమాలో నటించిన “మునిపల్లె సుబ్బయ్య”. మొదటి సావిత్రి సినిమా 04 ఫిబ్రవరి 1933 నాడు విడుదలయితే, రెండో సావిత్రి మరునాడే 05 ఫిబ్రవరి 1933 నాడు విడుదలైంది. అప్పటికే బెజవాడలో రెండే సినిమా థియేటర్లు ఉన్నాయి. ఒకటి దుర్గ కళామందిర్ లో విడుదల అయితే, మరొకటి మారుతి టాకీస్ లో విడుదల అయ్యింది. తెలుగు తెరపై మొట్టమొదటి నారదుడు సతీసావిత్రిలో నటించిన “హేమ్ సింగ్”. రెండు రామదాసు చిత్రాలలో జూన్ లో ఒకటి విడుదలయితే, సెప్టెంబరులో మరొకటి విడుదలైంది.
మొదటి కృష్ణుడు ఈలపాటి రఘురామయ్య…
అదే సంవత్సరంలో వచ్చిన చెప్పుకోదగ్గ చిత్రం చింతామణి (1933). చింతామణి నాటకం వ్రాసిన కాళ్లకూరి నారాయణరావు గారి అబ్బాయి కాళ్ళకూరు సదాశివరావు దర్శకత్వంలో చింతామణి సినిమా వచ్చింది. డిసెంబరు 1933 లో పృథ్వి పుత్ర పారిజాతాపహరణ నరకాసుర వధ సినిమా విడుదలైంది. ఈ సినిమా ప్రత్యేకత ఏమిటంటే విజయవాడలో మారుతి టాకీస్ కట్టించినటువంటి పోతిన శ్రీనివాసరావు గారు ఆ సినిమాను తీశారు. పృథ్వి పుత్ర పారిజాతాపహరణ నరకాసుర వధ సినిమా పోతిన శ్రీనివాసరావు గారే కథ, మాటలు, దర్శకత్వం. టాకీలు వచ్చిన రెండవ సంవత్సరంలోనే కథ, మాటలు, దర్శకత్వం చేసిన మొదటి వ్యక్తిగా పోతిన శ్రీనివాసరావు గారి పేరు నమోదైంది. నరకాసుర వధలో శ్రీకృష్ణుడు తెరపై కనిపించాడు. అలా వెండితెర మీద మొట్టమొదట శ్రీకృష్ణుడిగా కనిపించినది “కళ్యాణం వెంకటసుబ్బయ్య” (ఈలపాటి రఘురామయ్య).
తొలి విజయవంతమైన చిత్రం లవకుశ…
1934వ సంవత్సరంలో పినపాల వెంకట దాసు (మినర్వా టాకీస్ 1925, రేపల్లెలో శ్రీకృష్ణ టాకీస్ 1933లో కట్టారు) గారు మద్రాసు వచ్చి వేల్ పిక్చర్స్ స్థాపించారు. అక్కడ ఉన్న కొంతమంది తమిళులని భాగస్వాములను కలుపుకొన్నారు. చిత్రీకరణకు స్టూడియో లేకపోవడంతో పిఠాపురం రాజా వారి బంగ్లా తీసుకొని వాటికి తడకలు అడ్డుపెట్టి అక్కడ “సీతాకళ్యాణం” (1934) అనే సినిమా తీశారు. అది తెలుగువాడు నిర్మాతగా తీసిన రెండవ సినిమా. ఇందులో కన్నాంబ గారు తొలిసారిగా చిత్రరంగ ప్రవేశం చేశారు. ఆ సంవత్సరంలోనే తెలుగులో అద్భుతమైన విజయం సాధించిన చిత్రం లవకుశ (1934). దానికి దర్శకులు చిత్తజల్లు పుల్లయ్య గారు.
శ్రీకృష్ణ లీలలు (1935) లో పినపాల వెంకటదాసు నిర్మాణంలో తీశారు. దాంట్లో బాలకృష్ణుడుగా వేసింది మాస్టర్ రాజేశ్వరరావు. ఈయనే తరువాత రోజులలో ప్రముఖ సంగీత దర్శకుడు సాలూరు రాజేశ్వరరావు. ఇందులో వందేమాతరం పాటను పెట్టారు. ఆ తరువాత 1935లో హరిశ్చంద్ర అనే సినిమా వచ్చింది. అందులో తొలిసరిగా “కన్నాంబ” గారు నటించారు. ఆ తరువాత శ్రీకృష్ణతులాభారం (1935) సినిమా వచ్చింది. ఆ సినిమాలో చిన్న వేషంతో కాంచనమాల గారు సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ తరువాత మొట్టమొదటి సాంఘిక చిత్రం “ప్రేమ విజయం” 1936 లో నిర్మించారు. తొలి తెలుగు సాంఘిక చిత్రం అది. అందులో నటించిన తొలి సాంఘిక కథనాయకుడిగా ప్రబల కృష్ణమూర్తి, కథానాయికగా గుంటూరు భానుమతి గార్లను పరిగనణిస్తారు.
కాంచనమాల ను అందాలతార ను చేసిన విప్రనారాయణ (1937)..
1936 లో చిత్తజల్లు పుల్లయ్య గారు తీసిన సతీ అనసూయ నిడివి సరిపోకపోవడంతో, చిన్న సినిమా “భక్త ధృవ” తో కలిపి ఈ రెండు సినిమాలు ఒకే సినిమాగా విడుదల చేశారు. వీరాభిమన్యు (1936) చిత్రంలో కాంచనమాల గారు పెద్ద పాత్ర పోషించి “డ్రీమ్ గర్ల్” గా పేరొందారు. ద్రౌపది వస్త్రాపహరణం (1936), ద్రౌపది మాన సంరక్షణ (1936) రెండు చిత్రాలు ఒకే సంవత్సరం ఒకేసారి విడుదలయ్యాయి. అదే సంవత్సరం శశిరేఖ పరిణయం (మాయాబజార్) తీశారు. ఆ సినిమా సగంలో ఉండగానే దురదృష్టవశాత్తు చిత్ర నిర్మాత పిణపాల వెంకట దాసు మరణించారు. 1936లో రాజమండ్రిలో ఉన్న ఒక స్టూడియోలో సంపూర్ణ రామాయణం నిర్మించబడింది.
ఆ తరువాత విప్రనారాయణ (1937) అనే సినిమా వచ్చింది. ఆ సినిమాలో కాంచనమాల గారు తెలుగు ప్రజల యొక్క హృదయాభినేత్రిగా, మొట్టమొదటి వెండితెర అందాల తారగా స్థిరపడిపోయారు. హెచ్.ఎం.రెడ్డి గారు సొంతంగా రోహిణి పిక్చర్స్ స్థాపించి బి.యన్.రెడ్డి, చిత్తూరు వి.నాగయ్య గారు కలిసి నిర్మించిన చిత్రం గృహలక్ష్మి (1938). కన్నాంబ గారిని మరి కొంతమందిని కలుపుకొని గృహలక్ష్మి సినిమా తీశారు. ఈ సినిమాతో చిత్తూరు వి.నాగయ్య గారు సినీ రంగ ప్రవేశం చేశారు. అలాగే ఈ సినిమాకు సీనియర్ సముద్రాల గారు మాటలు, పాటలు రాశారు. బి.యన్.రెడ్డి గారు గృహలక్ష్మి సినిమాకి సహాయ దర్శకుడుగా ఉన్నారు. కే.వి.రెడ్డి గారు క్యాషియర్ గా పనిచేశారు.
నిషేధిత చిత్రం రైతుబిడ్డ (1939)..
గూఢవల్లి రామబ్రహ్మం గారు మాలపిల్ల (1938) తీశారు. ఒక సాంఘిక దృక్పథంతో, సామాజిక సంక్షేమ దృష్ట్యా, సామాజిక సమస్యలను దృష్టిలో ఉంచుకుని తీసిన చిత్రం మాలపిల్ల (1938). అప్పట్లో ఈ సినిమా సంచలనం సృష్టించింది. తరువాత వరవిక్రయం (1939) సినిమాతో అద్భుతమైన నటిమణి సినీ రంగ ప్రవేశం చేశారు. ఆవిడే భానుమతి గారు. వరవిక్రయం సినిమాతోనే హిందీ నటి రేఖ తల్లి పుష్పవల్లి గారు సినీ రంగ ప్రవేశం చేశారు. 1939 లో “రైతుబిడ్డ” సినిమాను గూఢవల్లి రామ బ్రహ్మంగారు తీశారు. అది మొట్టమొదటి నిషేధిత చిత్రమైంది. 1940లో మొట్టమొదటి నవలా చిత్రం బారిష్టరు పార్వతీశం సినిమాను తీశారు. 1941లో “ధర్మపత్రి” అనే సినిమా తీశారు. అందులో ఒక కుర్రాడు బాల నటుడుగా సినీరంగ ప్రవేశం చేశాడు. ఆ కుర్రాడే అక్కినేని నాగేశ్వరరావు. 1942లో రెండు బాలనాగమ్మ చిత్రాలు వచ్చాయి. ఒక “బాలనాగమ్మ” కాంచనమాల గారి చిట్టచివరి సినిమా అద్భుతమైన విజయం సాధించింది. ఈ సినిమా తర్వాత కాంచనమాల గారు సినీ రంగం నుండి విరమించారు. కె.వి.రెడ్డి గారి దర్శకత్వంలో “భక్త పోతన” 1942 లో చిత్ర నిర్మాణం జరుపుకుంది.