CINEMATelugu Cinema

తెలుగు సినీ కళామ్మతల్లికి నుదుట తిలకం… కాంతారావు..

కాంతారావు (16 నవంబరు 1923 – 22 మార్చి 2009)..

రెండు దశాబ్దాలకు పైగా వందలాది తెలుగు జానపద చిత్రాల్లో కథానాయకునిగా నటించి వెండితెరపై తన ఖడ్గ విన్యాసంతో స్వైర విహారం చేసిన కథా నాయకుడిగా చరిత్రకెక్కిన ఎకైక మహానటుడు తాడేపల్లి లక్ష్మీకాంతారావు. మొత్తం భారతీయ సినిమా రంగంలో పలుభాషలలో, జానపద సినిమాలలో హీరోలుగా నటించిన వారు చాలా మందే ఉన్నారు. కానీ వారంతా కేవలం ఈ కోవకు చెందిన సినిమాలకే పరిమితమై తమ సినీ ప్రస్థానాన్ని కొనసాగించలేదు.

టి.ఎల్‌. కాంతారావుగా, కత్తియుద్ధాల రాకుమారుడిగా తెలుగు సినిమా అభిమానులందరికి చిరపరిచితులైన వీరు తెలంగాణ నుండి సినిమాల్లోకి వెళ్లి ఒకవెలుగు వెలిగిన హీరోలలో అగ్రశ్రేణిలో నిలిచిపోయారు. కాంతారావు పేరు చెప్పగానే మనకు వెంటనే పలు జానపద, పౌరాణిక చిత్రాలు, వాటిలో ఆయన పోషించిన పాత్రలు మన కళ్లముందు మెదుల్తాయి. మన తెలంగాణ ప్రాంతంనుండి, సినిమాల్లోకి వెళ్లి స్వయంకృషి, పట్టుదల, నటనా ప్రతిభలతో వెండితెర కలల రాకుమారుడుగా ఒక వెలుగు వెలిగిన మహానటుడు మన కాంతారావు.

జీవిత విశేషాలు..

జననం..      16 నవంబరు 1923

స్వస్థలం..    గుదిబండ, కోదాడ, సూర్యాపేట జిల్లా, తెలంగాణ..

తండ్రి..         కేశవరావు..

తల్లి ..           సీతారామమ్మ..

భార్య…         సుశీల, హైమవతి ..

పిల్లలు :          నలుగురు మగపిల్లలు ప్రతాప్, కేశవ, రాజా, సత్యం – ఒక కూతురు సుశీల…

నివాసము :       మద్రాసు, హైదరాబాదు..

నటించిన సినిమాలు :  దాదాపు 400 పైచిలుకు,

నటించిన భాషలు :   తమిళ, కన్నడ , తెలుగు,

పురస్కారాలు…    రఘుపతి వెంకయ్య అవార్డు,

రాష్ట్రపతి అవార్డు,

నంది అవార్డు

మరణం..     22 మార్చి 2009

   హైదరాబాదు, తెలంగాణ..

జననం…

తాడేపల్లి లక్ష్మీ కాంతారావు గారూ 16 నవంబరు 1923 నాడు ప్రస్తుత తెలంగాణ లోని సూర్యాపేట జిల్లాకు చెందిన కోదాడ పట్టణం దగ్గరలో గల గుడిబండలో కాంతారావు గారూ జన్మించారు. వీరి తల్లిదండ్రులు సీతారామమ్మ, కేశవరావు గార్లు. సీతారామమ్మ గారిది తల్లి రాజ్యలక్ష్మమ్మ. రాజ్యలక్ష్మమ్మ గారిది ఏలూరు దగ్గరలో గల వంగూరు. రాజ్యలక్ష్మమ్మ గారి భర్త చనిపోవడంతో తన ఇద్దరి కూతుర్లను వెంటబెట్టుకుని ఏలూరు వచ్చి ఒక హోటల్ పెట్టుకుని స్వతంత్రంగా బ్రతకడం ప్రారంభించారు. రాజ్యలక్ష్మమ్మ గారి పెద్ద కూతురు సుశీలకు కూడా పెళ్లయి భర్త చనిపోయారు. అప్పటికీ ఆమె వయస్సు 20 సంవత్సరాలు.

వైధవ్యంతో వున్న సుశీలకు పెళ్లి చేయడం కోసం సంబంధాలను వెతకడం ప్రారంభించారు రాజ్యలక్ష్మమ్మ గారూ. ఎందుకంటే ఆ రోజుల్లో అంటే సుమారు వందేళ్ల క్రిందట  వితంతు వివాహాలు నేరంగా భావించబడే మూఢనమ్మకాలు వున్న సమయంలో తన కూతురు సుశీలకు పెళ్లిచేయడం కోసం సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు రాజ్యలక్ష్మమ్మగారూ. వీరేశలింగం గారి అడుగుజాడలలో నడిచే తన శిష్యులు అయిన టి.రామారావు గారూ భార్య చనిపోయి వున్న కేశవరావు గారి పేరును రాజ్యలక్ష్మమ్మ గారికి సూచించారు.

అప్పటికే రెండు పెళ్లిళ్లు జరిగి ఇద్దరు భార్యలు మరణించిన కేశవరావు తో వివాహం జరిపించడానికి మొదట్లో రాజ్యలక్ష్మమ్మ గారూ సంకోచించినా, రామారావు గారి సూచన మేరకు  తప్పనిసరి పరిస్థితుల్లో తన కూతురు సుశీలను కేశవరావు గారికి ఇచ్చి పెళ్లి చేశారు రాజ్యలక్ష్మమ్మ గారు. అప్పటికి కేశవరావు గారికి వయస్సు 57 సంవత్సరాలు, సుశీల గారికి 20 సంవత్సరాలు. కేశవరావు గారి పూర్వీకులు విజయవాడ దగ్గర్లోని తాడేపల్లి లో నివసించేవారు. దాంతో తాడేపల్లి వీరి ఇంటిపేరుగా మారిపోయింది.

కేశవరావు గారికి 600 ఎకరాల ఆస్థి ఉండేది. కేశవరావు, సుశీల దంపతులకు కాంతారావు గారూ జన్మించిన కొద్దిరోజులకు కేశవరావు గారూ భగవంతుడి సేవచేసుకొని అక్కడే తనువు చలించాలని కాశీకి వెళ్ళిపోయారు. అది తెలిసిన కేశవరావు గారి తమ్ముడు భార్య కూడా కేశవరావు గారికి సేవ చేయడానికి తనతో పాటు కాశీకి వెళ్ళింది. తనకు కొద్దికాలం సేవచేసి తన 600 ఎకరాల ఆస్థిని తన పేరున వ్రాయించుకుని కేశవరావు గారూ మరణించిన తరువాత ఆ ఆస్తి దస్తావేజులతో ఇంటికి తిరిగివచ్చింది.. ఆ ఆస్థిని కాంతారావు గారూ కోర్టుల చుట్టూ తిరిగి చేజిక్కించుకోవడానికి సుమారు 15 ఏళ్ళు పట్టింది.

వివాహం..

కాంతారావు గారికి సుశీల గారితో తన పదిహేడవ యేట వివాహం అయ్యింది. తన వివాహం అయిన కొద్దిరోజులకే ఏలూరులో తన పిన్నివాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ బందా కనకలింగేశ్వరరావు వంటి పెద్దలతో పరిచయం పెరిగింది. దాని తరవాత కాంతారావు గుదిబండకు వచ్చి ‘మాలీ పటేల్’ (మునసబు) ఉద్యోగంలో చేరాడు. అప్పట్లో తెలంగాణా ఉద్యమం పెద్దపెట్టున సాగుతోంది. సాంఘిక ప్రయోజనాల నేపథ్యంలో వుండే నాటకాల్లో చురుగ్గా పాల్గొనడంతో కాంతారావును కమ్యూనిస్టు సానుభూతి పరుడుగా ముద్ర వేశారు. ఆయన మీద అరెస్టు వారెంట్ కూడా జారీ అయింది. 1948లో హైదరాబాద్ సంస్థానం భారత దేశంలో విలీనమైన తరవాత వారెంట్ ను ఎత్తివేశారు. కాంతారావు గారి దంపతులకు ఒక పాప జన్మించింది. జన్మించిన ఆరు నెలలలో ఆ పాప అనారోగ్యంతో మరణించింది. కాంతారావు గారికి 22వ యేట 1945 వ సంవత్సరంలో ఒక బాబు జన్మించారు. జగ్గయ్యపేటలో వేసే మా “భూమి” నాటకం చూడడానికి వెళ్లిన కాంతారావు గారూ కొన్ని అనివార్య కారణాల వల్ల జగ్గయ్యపేటలోనే ఉండాల్సి వచ్చింది. కాంతారావు గారూ ఉండే వీధిలోనే ఓరుగంటి సత్యనారాయణ శాస్త్రి గారూ ఉండేవారు. వారికి హైమావతి అనే కూతురు ఉంది.

కాంతారావు గారి భార్య సుశీల గారూ అనారోగ్యంతో ఉండగా బాబు బాగోగులు మొత్తం హైమావతి అనే అమ్మాయి చూసుకుంటూ ఉండేది. దాంతో కాంతారావు గారి మొదటి సుశీల గారి భార్య అభ్యర్థన మేరకు ఓరుగంటి సత్యనారాయణ కూతురు అయిన హైమావతిని కాంతారావు గారికి రెండవ భార్యగా వివాహం చేశారు. ఇది జరిగిన కొద్దిరోజులకే అనారోగ్యంతో వున్న కాంతారావు గారి మొదటి భార్య సుశీల గారూ మరణించారు.

సంపాదన లేకుండా వున్న ఆస్తిని హరిస్తూ కాలం గడుపుతున్నాడని తల్లి అంటున్న మాటల్ని సహించలేక ప్రత్యామ్నాయ ఉపాధికోసం కాంతారావు గారూ అన్వేషణ మొదలెట్టాడు. కాంతారావు గారి మిత్రులు “నీకు మంచి రూపురేఖలు, అంగసౌష్టవం ఉన్నాయి, చక్కగా పాడగలవు, నాటకానుభవం వుంది…మద్రాసు సినిమాలో ప్రయత్నించు” అని సలహా ఇచ్చారు. అప్పుడే కాంతారావు కు ‘బాలనాగమ్మ’ సినిమాలో బాలవర్దిరాజు గా నటించిన విశ్వం గుర్తుకొచ్చాడు. అతనిది జగ్గయ్యపేట. విశ్వంతో కాంతారావుకు సత్సంబంధాలు, రాకపోకలూ వున్నాయి

సినీ ప్రస్థానం..

1950లో 28 ఏళ్ళ వయసులో కాంతారావు మద్రాసులో అడుగు పెట్టారు. అతని మామగారి మిత్రుడి ఇంటిలో ఆశ్రయం దొరికింది. అప్పట్లో టి. హయగ్రీవాచారి మేనల్లుడు కృష్ణమాచారి ‘రోహిణి’ సంస్థలో సహాయ దర్శకుడిగా పనిచేస్తూ ఉండేవాడు. అతడు తన పేరును ‘టి.కృష్ణ’ గా మార్చుకొని వ్యవహరించేవాడు. కాంతారావు రోజూ కృష్ణతో కలిసి ‘రోహిణి’ కార్యాలయానికి వెళ్ళేవారు. రోహిణీ సంస్థ అధిపతి ‘టాకీపులి’గా పేరుతెచ్చుకున్న హెచ్.ఎం.రెడ్డి (హనుమప్ప మునియప్పరెడ్డి) కొత్త కొత్త ప్రయోగాలు చేయడంలో పెద్ద సాహసి.  అప్పుడే కాంతారావు కు ‘మేవార్’ అనే నాటకంలో మొహబ్బత్ ఖాన్ పాత్రలో నటించే అవకాశం వచ్చింది. కాంతారావు నటనతో పాటు ఉర్దూ ఉచ్చరణ పురుషోత్తమరెడ్డి, సార్వభౌమరావులకు ఎంతగానో నచ్చింది. అప్పట్లో రోహిణిలో పురుషోత్తమరెడ్డి సంస్థ ప్రొడక్షన్ మేనేజర్ గా, సార్వభౌమరావు సహకార దర్శకుడిగా పనిచేస్తుండేవారు. వారితో వెంటనే కాంతారావును ‘నిర్దోషి’ చిత్రంలో రైతుబిడ్డగా ఒక చిన్న పాత్రలో నటింపజేశారు

1951 వ సంవత్సరంలో విడుదలైన “నిర్దోషి” చిత్రంలో పల్లెటూరు రైతు పాత్రలో కొద్దిసేపు మాత్రమే తెరపై కనిపించిన కాంతారావు గారూ, తనని పూర్తిస్థాయిలో కాంతారావు పేరుతో ఆయన ప్రేక్షకులకు పరిచయం చేసిన తొలి సినిమా మాత్రం “ప్రతిజ్ఞ” అని చెప్పాలి. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషలలో తయారయ్యింది. తమిళ వెర్షన్ “వంజమ్” లో మాత్రం కాంతారావు పాత్రకు వేరే వాళ్ళతో డబ్బింగ్ చెప్పించారు. చిత్రికరణ జనవరి 1952లో ప్రారంభమైన ఈ చిత్రం ఆగస్టు 1953లో విడుదల అయ్యింది. ఈ చిత్రంలో కాంతారావు గారి సరసన సావిత్రి గారూ నటించారు. అప్పటికి ఇంకా సావిత్రి గారూ “దేవదాసు” చిత్రంలో కథానాయికగా ఎంపిక అవ్వలేదు.

మొదట్లో దేవదాసు చిత్రంలో పార్వతి పాత్రకు “షావుకారు జానకి”ని అనుకుని ఆ తర్వాత ఆమెను కాదని ఆస్థానంలో సావిత్రి గారిని ఎంపిక చేశారు. “ప్రతిజ్ఞ” చిత్రం కంటే దేవదాసు చిత్రం ముందు విడుదలైంది. ఆ చిత్ర విజయం ఈ సినిమాకు అదనపు బలం చేకూరినట్లు అయ్యింది. సంవత్సరం పాటు చిత్రికరణ జరిగిన నిర్మాణ కాలంలో కాంతారావు గారికి నెలకు 250 రూపాయలు చొప్పున జీతం చెల్లించేవారు దర్శక నిర్మాత హెచ్ఎం రెడ్డి గారూ. ఈ సినిమా విడుదలైన తర్వాత అందులో నటించిన నటీనటులను ఆంధ్రదేశానికి తీసుకువెళ్లి ప్రేక్షకులకు పరిచయం చేశారు హెచ్ఎం రెడ్డి గారూ. ఈ పరిచయ చిత్రం ద్వారా రాజనాల కూడా తెలుగు వారికి పరిచయమయ్యారు.

జానపద కథనాయకుడిగా..

తెలుగు చిత్రసీమలో కాంతారావు గారూ ఎక్కువగా జానపద కథానాయకుడిగా తనదైన ముద్ర వేశారు. అలా జానపద కథానాయకుడిగా కత్తుల వీరుడిగా కాంతారావు గారూ కీర్తింపబడడానికి తొలి బీజం వేసిన చిత్రం జయసింహ. ఇది నందమూరి తారక రామారావు గారి సొంత చిత్రం కావడం గమనార్హం. ఈ చిత్రంలో ఎన్టీఆర్ తమ్ముడు విజయసింహ పాత్రకు మొదట అక్కినేని నాగేశ్వరావు గారిని అనుకున్నారు. కానీ అక్కినేని నాగేశ్వరావు గారూ ఇతర చిత్రాలతో తీరిక లేకుండా ఉండడంవల్ల, ఆ తర్వాత జగ్గయ్య గారి పేరు ప్రస్తావనకి వచ్చింది. సుదీర్ఘ చర్చ అనంతరం ఆ పాత్రకు కాంతారావు గారి పేరును ఖరారు చేశారు. నందమూరి తారక రామారావు గారూ అప్పటికే కథనాయకుడిగా మంచి పేరు ఉండడంతో ఎన్టీఆర్ తో కలిసి నటించే అవకాశం తన రెండవ చిత్రంతోనే లభించడం కాంతారావు గారికి ఎంతో లాభించింది.

కాంతారావు గారిలో అద్భుతమైన నటనా ప్రతిభను గ్రహించిన ఎన్టీఆర్ గారూ ఆ తర్వాత కాలంలో ఎన్నో పాత్రలకు కాంతారావు గారిని రికమండ్ చేశారు. జయసింహ చిత్రంలో నటించినందుకు గానూ కాంతారావు గారూ 1500 రూపాయలు పారితోషికం పొందారు. ఎన్టీఆర్ గారూ, జూనియర్ శ్రీరంజని జంటగా నటించిన “శ్రీ గౌరీ మహత్యం (1956)” చిత్రంలో శివుడి పాత్రను కాంతారావు గారూ పోషించారు. ఇదే కాంతారావు గారికి తొలి పౌరాణిక పాత్ర. ఆ తర్వాత భక్త మార్కండేయ, శ్రీరామాంజనేయ యుద్ధం లాంటి తదితర చిత్రాల్లో శివుడిగా నటించారు. 1957లో వచ్చిన “సతీ అనసూయ”, 1960లో విడుదలైన “దేవాంతకుడు”, “విష్ణు మాయ”  తదితర చిత్రాలలో విష్ణుమూర్తిగా నటించారు కాంతారావు గారూ.

పౌరాణిక చిత్రాలలో నారదుడి పాత్రలో…

కాంతారావు గారికి గుర్తింపు తెచ్చిన పౌరాణిక పాత్రలు శ్రీకృష్ణుడు, రాముడు, అర్జునుడు. ముఖ్యంగా ఎన్టీఆర్ గారూ నటించిన పౌరాణిక చిత్రాలలో తప్పనిసరిగా కాంతారావు గారూ ఉండేవారు. ఎన్టీఆర్ గారూ కృష్ణునిగా నటిస్తే కాంతారావు గారూ అర్జునుడిగా, ఎన్టీఆర్ గారూ అర్జునుడి గా నటిస్తే కాంతారావు గారూ కృష్ణుడిగా నటించి ప్రేక్షకులను పరవశింప చేసేవారు. ఎన్టీఆర్ గారి ప్రోత్సాహం వల్ల చిత్ర పరిశ్రమలో కాంతారావు గారూ చిరకాలం కొనసాగారు. ఎన్టీఆర్ గారి అండదండలతో ఎన్నో మంచి పాత్రలు పోషించగలిగానని కృతజ్ఞతా స్వరంతో కాంతారావు గారూ ఎల్లప్పుడూ చెబుతుండేవారు.

నారదుని పాత్రలో తొలిసారిగా 1958 లో వచ్చిన “గంగా గౌరీ సంవాదం” చిత్రంలో ప్రేక్షకులకు కనిపించారు కాంతారావు గారూ. ఈ సినిమా విజయం సాధించకపోవడంతో కాంతారావు గారూ పోషించిన పాత్ర గురించి చాలా మందికి తెలిసే అవకాశం కలుగలేదు. 1960లో వచ్చిన దీపావళి చిత్రంలో మరోసారి నారదుని పాత్రలో నటించారు కాంతారావు గారూ. ఈ సినిమాలో శ్రీకృష్ణుడు, నారదుడు మధ్య సన్నివేశాలు చాలా ఉన్నాయి. కాంతారావు గారూ పోషిస్తున్న పాత్ర తీరు చూసి ముగ్దులైన ఎన్టీఆర్ గారూ (కృష్ణ పాత్రధారి) నేను పౌరాణిక పాత్రలు ఎన్ని చేసినా నారదుని పాత్ర మాత్రం మీకే వదిలేస్తున్నాను అన్నారట. అలాగే నారదుడి పాత్ర గురించి ఎన్టీఆర్ కు మరో ఆలోచన రాకుండా తన ప్రతిభతో ఆ పాత్రకు మరిన్ని మెరుగులు దిద్దుకుని తనకు తానే సాటి అనిపించుకున్నారు కాంతారావు గారూ.

ముఖ్యంగా “శ్రీకృష్ణతులాభారం” చిత్రంలో సత్యభామ నుంచి శ్రీకృష్ణుని దానంగా స్వీకరించడం “భలే మంచి చౌక బేరం” అంటూ నడివీధిలో శ్రీకృష్ణునికి అమ్మకాన్ని పెట్టడం ఇత్యాది సన్నివేశాలలో నారదుడిగా కాంతారావు గారూ ప్రదర్శించిన నటన చిరకాలం గుర్తుండిపోతుంది. అలాగే అగ్ర కథానాయకులు ఎన్టీఆర్ గారూ, అక్కినేని గారూ కలిసి నటించిన “శ్రీకృష్ణార్జునయుద్ధం” చిత్రంలో కూడా నారదుడిగా నటించారు కాంతారావు గారూ. అలాగే ఎన్టీఆర్ యముడు పాత్ర పోషించిన “సతీసావిత్రి”లో కూడా నారదుడిగా నటించారు కాంతారావు గారూ. బహుశా కాంతారావు గారూ నారదుడి పాత్ర పోషించిన చివరి చిత్రం ఇదేనేమో..

ద్విపాత్రభినయం..

కాంతారావు గారూ తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసిన సినిమా “మెరుపు వీరుడు”. 1970లో విడుదలైన చిత్రాన్ని బి.వి.కృష్ణమూర్తి, కె.మహేంద్ర కలిసి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని బి.హరి నారాయణ దర్శకత్వంలో తెరకెక్కించారు. రాజనాల గారూ విలన్ గా నటించిన ఈ చిత్రంలో రాజ్యశ్రీ, లక్ష్మీ నాయికలుగా నటించారు. అదే సంవత్సరం కాంతారావు గారూ మరోసారి ద్విపాత్రాభినయం చేసిన “రైతేరాజు” చిత్రం కూడా విడుదలైంది.

రఘుపతి వెంకయ్య అవార్డు కోసం అక్కినేని గారి సిఫారసు…

అక్కినేని నాగేశ్వరావు గారితో కలిసి కాంతారావు గారూ చాలా తక్కువ చిత్రాలలో నటించారని చెప్పాలి. 1956 లో వచ్చిన “ఇలవేల్పు” చిత్రంలో కాంతారావు గారూ అతిథి పాత్రలో నటించారు. ఇందులో అక్కినేని గారూ కథానాయకులు. 1960లో విడుదలైన “శాంతినివాసం” సినిమా కాంతారావు గారికి మంచి పేరు తెచ్చిపెట్టింది. “రహస్యం”, “బంగారు గాజులు”, “బంగారు కలలు”, “మహాత్ముడు”, “మహాకవి క్షేత్రయ్య” తదితర చిత్రాలలో అక్కినేని గారితో కలిసి నటించారు కాంతారావు గారూ. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య అవార్డు 2000 సంవత్సరంలో కాంతారావు గారికి రావడానికి అక్కినేని గారూ ఎంతో కృషి చేశారు. కాంతారావు గారికి ఆ అవార్డు ఇవ్వాల్సిందే అని అక్కినేని గారూ గట్టిగా సిఫారసు చేశారు.

క్యారెక్టర్ నటుడిగా…

వయస్సు పైబడుతున్నప్పుడు దానికి అనుగుణంగా వయస్సుకు తగ్గ పాత్రలు చేస్తూ సుదీర్ఘకాలం నటుడిగా కొనసాగిన వారు చిత్ర పరిశ్రమలో చాలామంది కనిపిస్తారు. 1973లో వచ్చిన “నేరము శిక్ష” చిత్రంతో క్యారెక్టర్ నటుడిగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు కాంతారావు గారూ. విభిన్న పాత్రలు పోషిస్తూ మరింత బిజీ అయ్యారు. బాపు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న “ముత్యాలముగ్గు”, “గోరంత దీపం”, “మన ఊరి పాండవులు”, “వంశవృక్షం” తదితర చిత్రాలలో కాంతారావుకి మంచి పాత్రలు లభించాయి. 34 ఏళ్ల పాటు ఏదో ఒక పాత్రను పోషిస్తూ క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన ప్రస్థానం కొనసాగించిన కాంతారావు గారూ తాను చివరిసారిగా నటించిన చిత్రం 2007లో విడుదలైన “శంకర్ దాదా జిందాబాద్”.

చిత్ర నిర్మాణ రంగంలో…

చిత్రసీమలో విజయపరంపరతో  ఓ వెలుగు వెలిగిన నటీనటులు  తరువాత నిర్మాణ రంగంలోకి దిగి రాణించిన వారున్నారు. అలాగే ఆర్థికంగా దెబ్బతిన్న వారున్నారు. కాంతారావు గారూ రెండో కోవకు చెందినవారు. నటుడిగా మంచి పేరు, తగినంత డబ్బు సంపాదించుకున్న కాంతారావు గారూ చిత్ర నిర్మాణంలోకి దిగి చేతులు కాల్చుకున్నారు. కాంతారావు గారూ నిర్మాతగా సినిమాలు తీయడం ప్రారంభించేసరికి అపజయాలతో తన దగ్గర ఉన్న డబ్బు క్రమక్రమంగా కరిగిపోవడం ప్రారంభించింది.

సొంత నిర్మాణంలో…

కాంతారావు గారూ నిర్మించిన తొలి చిత్రం “సప్త స్వరాలు” (1969), వేదాంతం రాఘవయ్య దర్శకుడు. ఆరు లక్షల రూపాయల వ్యయంతో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో రాజశ్రీ కథానాయిక. సరస్వతి పాత్రను విజయనిర్మల గారూ పోషించారు. చిత్ర నిర్మాణం సజావుగానే జరిగినా, విడుదల సమయానికి ఎన్నో అవరోధాలు ఎదురయ్యాయి. సినిమాను కొనే నాథుడే కరువయ్యారు. ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ గారూ విడుదల కోసం ఏర్పాట్లు చేయించారు. అయితే అదే సమయంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జోరుగా ఉంది. అటువంటి సమయంలో విడుదలైన “స్వప్త స్వరాలు” చిత్రాన్ని తెలంగాణకు చెందిన కాంతారావు గారూ నిర్మించారని వ్యతిరేక ప్రచారం జరగడంతో ఆంధ్ర ప్రాంతంలో ఈ చిత్రం ప్రేక్షకుల నిరాదరణకు గురైంది.

నష్టాల భారిన కాంతారావు గారూ..

ఆ తర్వాత కే.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వంలో కాంతారావు గారూ నిర్మించిన రెండవ చిత్రం “గండరగండడు” (1969). ఈ సినిమా వల్ల కాంతారావు గారికి లక్ష రూపాయల లాభం వచ్చింది. మొదటి సినిమాను హేమ ఫిలిమ్స్ బేనర్ పై, రెండవ చిత్రాన్ని సంజీవిని ఫిలిమ్స్ పతాకంపై కాంతారావు గారూ నిర్మించారు. రెండో సినిమాకు లాభాలు రావడంతో అదే బేనరును కొనసాగిస్తూ “ప్రేమ జీవులు” (1971) చిత్రం తీశారు కాంతారావు గారూ. ఇందులో కృష్ణ గారూ హీరోగా నటించారు. హీరోయిన్ రాజశ్రీ చిత్ర నిర్మాణంలో హీరో కృష్ణ గారూ ఎంతో సహకరించినా కూడా ఆ చిత్రం ప్రేక్షకుల ప్రశంసలు పొందలేకపోయింది.

చిత్ర నిర్మాణానికి మూడేళ్లు విరామం తీసుకున్న కాంతారావు గారూ హిందీలో రూపుదిద్దుకున్న “గుమ్ నామ్” చిత్రం ఆధారంగా “గుండెలు తీసిన మొనగాడు” (1974) సినిమా తీశారు. 12 లక్షల రూపాయలతో రంగులతో తీసిన ఈ చిత్రం విజయవంతం కాకపోవడంతో అప్పులలో మునిగిపోయారు కాంతారావు గారూ. 1989లో చివరిసారిగా నిర్మించిన “స్వాతి చినుకులు” చిత్రం కూడా విజయం సాధించకపోవడంతో తన ఆస్తులు మొత్తం అమ్మేసి అప్పుల భారంతో హైదరాబాద్ చేరుకొని, చిన్నాచితకా వేషాలు వేస్తూ శేష జీవితాన్ని ఇక్కడే గడిపారు కాంతారావు గారూ.

మరణం…

కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో అనారోగ్యానికి గురైన కాంతారావు గారూ 22 మార్చి 2009 నాడు హైదరాబాదులోని యశోద హాస్పిటల్లో రాత్రి సమయంలో 9:50 ని.లకు కన్నుమూశారు. అత్యంత వైభవంగా, వైభవోపేతంగా సాగిన తన సినీ జీవితం, సినీయేతర జీవితం మలిదశలో విషాదకరంగా ముగిసిపోవడం అత్యంత బాధకరం. దానధర్మాలు చేసి, సినిమాలు నిర్మించి తన 600 ఎకరాల ఆస్థిని పోగొట్టుకుని, మద్రాసులో తాను ఇష్టంగా కట్టుకున్న ఇల్లు అమ్మేసి, అప్పులు తీర్చి, హైదరాబాదు వచ్చి సాధారణంగా బ్రతికిన కాంతారావు గారి జీవితం చరమాంకం కడు శోచనీయం.

సశేషం…

కాంతారావు గారూ దాదాపు 600 చిత్రాల్లో నటించారు. కాంతారావు గారిని తనకు సంతృప్తి కలిగించిన చిత్రాలు ఏమిటని అడిగినప్పుడు లవకుశ (1963), గురువులు మించిన శిష్యుడు (1963), ఆకాశరామన్న (1965), ఏకవీర (1969), గోరంత దీపం (1978) అని చెప్పారు. వీటిల్లో “లవకుశ” చిత్రంలో తాను పోషించిన లక్ష్మణుడి పాత్ర చిరస్మరణీయమైందని, ఆ సినిమా నాటికే ఆనాటి రాష్ట్రపతి “సర్వేపల్లి రాధాకృష్ణ” చేతుల మీదుగా జాతీయ అవార్డు అందుకున్నానని గర్వంగా చెప్పేవారు కాంతరావు గారూ. కాంతారావు గారి పూర్తి పేరు “లక్ష్మి కాంతారావు”. అయినా కాంతారావు గానే చిత్ర పరిశ్రమలో కొనసాగారు. బహుశా అందుకేనేమో “లక్ష్మి” ఆయనకు ఎప్పుడూ అందనంత దూరంలో ఉంటూ దోబూచులాడేది.

Show More
Back to top button