Telugu Cinema

తెలుగు చిత్రసీమలో తొలి పాట సృష్టికర్త.. చందాల కేశవదాసు

తెలుగు చిత్రసీమలో తొలి పాట సృష్టికర్త.. చందాల కేశవదాసు.

సినిమాలో పాట కు ఉన్న ప్రత్యేకతయే వేరు. సాహిత్యానికి సంగీతాన్ని మేళవించి, మధురమైన గానంతో మనోల్లాసాన్ని కలిగించే ఒక మహత్తర శక్తి కలిగి ఉన్నదే “పాట”.

తొలి రోజుల్లో బాగా ప్రాచుర్యం పొందిన పౌరాణికాలను, ఆ నాటక ఫక్కీ చెడకుండా అలాగే యధాతథంగా చలనచిత్రాలుగా మలచేవారు.

అందువలన రంగస్థలం మీద చక్కగా పాడగలిగిన వాళ్ళే నటీనటులుగా తెరమీద కూడా కనిపించి, తమ పద్యాల్నీ పాటల్నీ తామే పాడుకొనేవారు.

ఆ కారణం చేతనే తొలినాటి సినిమా పాటలో శబ్దాడంబరం, సంగీత, స్వర ప్రాధాన్యతా మెండు. రాను రానూ ఆ ధోరణి తగ్గి భావ ప్రాధాన్యత పెరగడం ప్రారంభమయ్యింది.

ఈ పెంపు పరిపక్వమైంది. బహుశా వాహినీ సంస్థ వారి “వందేమాతరం ” తోనో సారథీవారి “మాలపిల్ల ” తోనో.

ఏది ఏమైనప్పటికీ ఆనాటి పాటల్లో నాటకాల బాణీ మాత్రం బాగా ఉండేది.

రంగస్థలంతో సంబంధమున్న కవులే సినిమాలకూ పాటలు వ్రాసేవాళ్ళు.

భారతదేశంలో 110 సంవత్సరాల క్రిందట 1913 లో తొలి మూకీ చలనచిత్రం “రాజా హరిశ్చంద్ర” నిర్మించి, దర్శకత్వం వహించారు దాదాసాహెబ్ ఫాల్కే గారు.

మూకీ చిత్రంలో సంభాషణలు ఉండవు గనుక సంగీతం, పాటలు ఉండే అవకాశమే లేదు.

14 మార్చి 1931 లో తొలి టాకీ చిత్రం “ఆలం అరా” విడుదల అయ్యింది. అర్దేషిర్‌ ఇరానీ తీసిన ఈ చిత్రంతోనే సంభాషణలు పలకడం మొదలయ్యాయి.

అలాగే తెలుగులో హెచ్.యం.రెడ్డి గారు దర్శకత్వం వహించిన తొలి టాకీ “భక్త ప్రహ్లాద” చిత్రం  సెప్టెంబర్ 15, 1931న విడుదల అయింది.

ఈ సినిమా నుండే తొలిసారిగా సినిమాలో “పాట” లు మొదలయ్యాయి.

ఈ పాటలకు గేయ రచయితగా చందాల కేశవదాసు గారికి అవకాశమిచ్చారు హెచ్.యం.రెడ్డి గారు.

ఒరిజినల్ ‘భక్త ప్రహ్లాద’ నాటకంలోని పద్యాలు, పాటలు ఉపయోగించు కోవడమే కాకుండా “చందాల కేశవదాసు” గారిచే ఈ చిత్రం కోసం పాటలను, దర్శకులు హెచ్.ఎం. రెడ్డి గారు ప్రత్యేకంగా వ్రాయించారు.

అలా తెలుగు సినిమా తొలి పాట రచయితగా చందాల కేశవదాసు గారు ప్రసిద్ధికెక్కారు.

“భలే మంచి చౌక బేరం” పాట వినగానే మనసు ఆనందంతో, పరవశంతో గంతులు వేయడం ప్రతి తెలుగు వాడికి అనుభవంలో ఉన్నది. “పరాబ్రహ్మ పరమేశ్వర” అని వినపడగానే రంగస్థలం స్వరూపం, భగవంతుని త్రిమూర్త్యాత్మికత, నటరాజ తాండవ భంగిమ చప్పున గుర్తుకు వచ్చి మేను పులకరించడం తెలుగువారు చేసుకున్న అదృష్టం.

పై రెండు పాటలను రచించిన వారు ఖమ్మం జిల్లా వాస్తవ్యులైన మహాకవి, అష్టావధాని, హరికథా భాగవతార్, నాటక కర్త అయిన “శ్రీ చందాల కేశవదాసు” గారు.

వాటిని స్వరపరిచిన వారు కేశవదాసు గారి గురువు గారైన “శ్రీ పాపట్ల లక్ష్మీకాంతయ్య” గారు.

వీరిద్దరూ కలిసి యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలలో ధార్మిక సంగీత సాహిత్య కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

జీవిత విశేషాలు…

జన్మ నామం :    చందాల కేశవదాసు

జననం    :    20 జూన్ 1876

స్వస్థలం   :   ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని జక్కేపల్లి

తండ్రి   :   చందాల లక్ష్మీనారాయణ

తల్లి     :   పాపమ్మ

పిల్లలు   :   చందాల కృష్ణమూర్తి, చందాల సీతారామయ్య, గంధం ఆండాళ్ళు

వృత్తి      :    గీత రచయిత, నటుడు, గాయకుడు, హరికథా కళాకారుడు, నాటకకర్త

పదవి పేరు  :    తొలి తెలుగు సినిమాపాటల రచయిత, తెలంగాణ హరికథా పితామహుడు

మరణ కారణం : ధ్యానస్థితిలో సహజ మరణం

మరణం   :   14 మే 1956, (ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని నాయకన్ గూడెం)

జననం…

తొలి తెలుగు నాటక కర్త, తొలి సినీ గీత రచయిత, కవి, నటుడు, గాయకుడు, హరికథా కళాకారుడు, అష్టావధాని, శతావధాని అయిన చందాల కేశవదాసు గారు ఖమ్మం జిల్లా, కూసుమంచి మండలంలోని జక్కేపల్లి గ్రామంలో 20 జూన్ 1876 నాడు చందాల లక్ష్మీనారాయణ, పాపమ్మ దంపతులకు రెండవ కుమారుడిగా జన్మించారు. కేశవదాసు గారి తాత గారు చందాల శ్రీనివాసులు ఖమ్మం జిల్లా గంగిదేవిపాడుకు చెందిన వారు.

తాను అక్కడే వైద్య వృత్తిని చేసేవారు. తన ఏకైక కుమారుడు లక్ష్మీనారాయణ కూడా వైద్య వృత్తితో పాటు వ్యవసాయం కూడా చేసేవారు.

వారు కొంతకాలం తరువాత తమ నివాసాన్ని జక్కేపల్లికి మార్చారు. చందాల లక్ష్మీనారాయణ, పాపమ్మ దంపతులకు ఇద్దరు మగ సంతానం జన్మించారు.

మొదట వెంకటరామయ్య గారు తర్వాత కేశవదాసు గారు జన్మించారు. వెంకటరామయ్య గారు వివాహం చేసుకోకుండా బ్రహ్మచర్య జీవనం ఆచరిస్తూ యోగమార్గంలో గడిపారు.

కేశవదాసు గారి తండ్రి చిన్నతనంలోనే మరణించడంతో అన్న వెంకటరమణ యోగి గారి నిర్వహణలోని వీధి బడిలోనే కేశవదాసు గారు విద్యను అభ్యసించారు. ఛందస్సు, అవధానాధి ప్రక్రియలు నేర్చుకున్నారు.

విద్యాభ్యాసానంతరం తను చదువుకున్న వీధి బడి నడుపుతూ అవధానాది ప్రక్రియలలో నేర్పు సాధించారు కేశవదాసు గారు.

వివాహం…

చందాల కేశవదాసు గారు వైవాహిక జీవితంలో అనేక ఇబ్బందులను, ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు.

మొదటి భార్యకు సంతానం లేదని కేశవదాసు గారు రెండవ వివాహం చేసుకున్నారు.

కానీ దురదృష్టవశాత్తు కొద్ది కాలంలోనే తన ఇద్దరు భార్యలు మరణించారు.

దాంతో ఏమి చేయాలో తెలియక అయోమయ స్థితిలో ఉన్న తనను తన శిష్యులు మరియు అభిమానుల వత్తిడితో మరో రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు.

కానీ దురదృష్ణం మరీ దారుణంగా వెంటాడి వారిద్దరు కూడా మరణించారు. దాంతో తనకు వైరాగ్యం అనిపించి తనకు ఇక వివాహం వద్దు అనుకుంటున్న దశలో చివరకు పలువురు తనను ఒప్పించి ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లా తిరువూరు పట్టణానికి చెందిన కాబోలు రామయ్య గారి కుమార్తె కాబోలు చిట్టెమ్మతో వివాహం జరిపించారు.

లెక్క ప్రకారం కేశవదాసు చిట్టెమ్మ గారికి ఐదవ భార్య అన్నమాట. అత్తవారిల్లు అవ్వడం మూలాననే కాకుండా సప్తహ కార్యక్రమ నిర్వహణకు కూడా కేశవదాసు పలుమార్లు తిరువూరు గ్రామాన్ని సందర్శించారు. తిరువూరుతో విడదీయలేని సంబంధం కేశవదాసు గారికి ఉంది. ఈ ప్రాంత ఆడపడుచును వివాహమాడిన కేశవదాసు గారు తన సొంత ఖర్చులతో తిరువూరు పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు నిర్మించిన బావి, దాసు పేరుతో ఈరోజుకి కూడా పిలవబడుతుండటం విశేషం. ఆ రోజులలో భద్రాచలంలో కొలువై ఉన్న శ్రీరాముడ్ని దర్శించుకునేందుకు తిరువూరు మీదుగా వేళ్లే భక్తులకు తిరువూరులో సత్రాలు ఏర్పాటుచేశారు. వీటిల్లో భక్తులకు ఉచిత అన్న దానం ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ఖర్చులను కూడా చందాల కేశవదాసు గారే భరించేవారు.

సంతానం…

చందాల కేశవదాసు గారి మూడవ భార్య సంతానంగా రామకవి అనే అతను జన్మించారు. రామకవి గారికి ఛక్రధరరావు, చిట్టెమ్మ, సీతమ్మ కేదారి అనే నలుగురు పిల్లలు..

కేశవదాసు, చిట్టెమ్మ దంపతులకు ఇద్దరు మగపిల్లలు, ఒక ఆడపిల్ల జన్మించారు. వారి పేర్లు కృష్ణమూర్తి, సీతారామయ్య, ఆండాళ్ళు…

పెద్దవాడైన కృష్ణమూర్తి తన ముత్తాత శ్రీనివాసరావుగారి లాగా వైద్య వృత్తిని మార్గంగా ఎంచుకున్నారు. వైద్య విద్యను అభ్యసించి ఆర్ ఎం పి డాక్టరుగా స్థిరపడ్డారు. ఈయన తన తండ్రి రచనలు, సేవా కార్యక్రమాల పట్ల పెద్దగా ఆసక్తి చూపలేదు. వృత్తి కీర్తి సంపాదనలో మునిగిపోయారు…

“కృష్ణమూర్తి”కి వారి దగ్గరి బంధువుల అమ్మాయి వెంకటనర్సమ్మ గారితో వివాహం అయినది. వీరికి శ్రీనివాసరావు, కేశవదాసు, ఉష, శ్రీదేవి అనే నలుగురు పిల్లలు…

రెండవ కొడుకు సీతారామయ్య భద్రాచలంలో ఉపాధ్యాయునిగా పనిచేసేవారు. వీరికి సక్కుబాయి అనే ఆవిడతో వివాహం అయినది. వీరికి వెంకట కేశవరావు, సత్యనారాయణ, రామ మోహన్, పద్మ అనే నలుగురు పిల్లలు…

మూడవ వారు ఆడపిల్ల పేరు ఆండాళ్ళు. కేశవదాసు గారు మునగాల వెళ్ళినప్పుడు గంధం నర్సయ్య అనే కుర్రవాడి బుర్రకథా గానాన్ని ముగ్ధులై 1955లో తన కూతురైన ఆండాళును గంధం నర్సయ్య గారికి ఇచ్చి సాలంకృత కన్యాదానం చేసారట.

ఈ గంధం దంపతులకు పద్మజ, సత్యనారాయణ, నీరజ, శ్రీనివాస్, శైలజ, శేషగిరిధర్ అనే ఆరుగురు సంతానం కలిగారు…

కళారంగంలో అష్టావధానం చేస్తూ….

నల్గగొండ జిల్లాలోని కోదాడకు దగ్గరగా ఉన్న తమ్మర గ్రామంలోని “శ్రీ సీతా రామచంద్ర స్వామి” దేవాలయం మీద ఆ దేవుని మీద కేశవదాసు గారికి విపరీతమైన భక్తి కుదిరింది. తన సంగీత సాహిత్య కార్యక్రమాల ద్వారా సంపాదించుకున్న ఆస్తినంతా కూడా ఈ దేవాలయ నిర్మాణానికి, సేవలకు సప్తాహాలకు వినియోగించారు. కేశవదాసు గారు కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలకే పరిమితం కాలేదు. అలనాటి స్వాతంత్ర్య ఉద్యమాన్ని ప్రశంసిస్తూ “జయతు జై” అనే పాటను వ్రాసి ఎస్.రాజేశ్వరరావు, ఆకుల నరసింహారావు గార్ల చేత పాడించి రికార్డు చేయించారు.

హుజూర్ నగర్, జగ్గయ్యపేట, తమ్మర, తిరువూరు, కందిబండ మొదలైన చోట్లలో అష్టావధానాలు చేసి ప్రశంసలందుకున్నారు. పోలంపల్లి, దబ్బాకులపల్లి, జక్కేపల్లి, ఖమ్మం, కోదాడ మొదలైన ప్రాంతాలలో హరికథా గానం చేసి బాగా పేరు డబ్బు గడించారు కేశవదాసు గారు. తన పేరును సమాజానికి, డబ్బును సప్తహాలకు సమర్పించుకున్నారు. కేశవదాసు గారి హరికథ విన్న “శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి” గారు జగ్గయ్యపేటలో కేశవదాసు గారికి “అభినవసూత” అనే బిరుదును ఇచ్చి సన్మానించారు. ఆనాటి దాసు గారి కథాగణానికి “శ్రీ ద్వారం వెంకట స్వామి నాయుడు” గారు వయోలిన్ వాయించడం గొప్ప విశేషం.

మైలవరం రాజావారి బాల భారతి నాటక సమాజంలోకి ప్రాంప్టర్ గా ప్రవేశించిన కేశవదాసు క్రమంగా రచయితగా, నటుడిగా, దర్శకుడుగా ఎదిగారు. “కనకతార”, “బలిబంధనం”, “నాగదాసు చరిత్ర”, “విరాటపర్వం”, “కేశవ శతకం” మొదలైన రచనలను 40 పైగా చేశారు. కేశవదాసు గారికి బాగా పేరు తెచ్చిన నాటకం “కనకతార”. ఇది మన రాష్ట్రంలోనే కాక ఇతర రాష్ట్రాల్లోనూ, ఇతర దేశాలలోనూ వెయ్యికి పైగా ప్రదర్శనలు ఇవ్వబడింది. నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు, పుట్టపర్తి సత్యసాయిబాబా వారు తమ చిన్నతనంలో ఈ నాటకాలలోని తార పాత్రను పోషించడం చెప్పుకోదగ్గ విషయం.

చిత్ర రంగంలోకి ప్రవేశం…

నాటక రంగంలో చందాల కేశవదాసు గారు మంచి పేరుతో ఒక వెలుగు వెలిగిపోతున్న సమయంలో తనను సినిమా రంగం ఆహ్వానం పలికింది. అప్పటి వరకు భారతదేశమంతటా మూగ (మూకీ) సినిమాలు ఆడేవి. 1931 మార్చి 15న దేశంలో తొలిసారిగా ‘ఆలం ఆరా’ అనే మాటలతో (టాకీ) కూడిన సినిమా వచ్చింది. ఇదే మొట్టమొదటి భారతీయ టాకీ. అదే సంవత్సరం తెలుగులో కూడా టాకీ చిత్రం తీయాలనుకుని హెచ్.యం.రెడ్డి గారు “భక్త ప్రహ్లాద” చిత్రం ప్రారంభించారు. ఆ చిత్రంలో పాటలు వ్రాయడానికి చందాల కేశవదాసు గారిని ఆహ్వానించడంతో తన సినీ ప్రస్థానం మొదలైంది.

1931లో దాసుగారు మద్రాసుకు వెళ్లి హెచ్.ఎం.రెడ్డి గారి దర్శకత్వంలో తయారైన మొట్టమొదటి తెలుగు టాకీ “భక్త ప్రహ్లాద” కోసం “పరితాపభారంబు”, “తనయా ఇటులన్”, “భీకరంబగునా” అనే మూడు పాటలు వ్రాశారు.

మొదటి పాట…

చందాల కేశవదాసు గారు “భక్తప్రహ్లాద” సినిమా కోసం మూడు పాటలు వ్రాశారు. మరి వీటిలో ఏది తొలి గీతం అనేది కూడా ప్రధానంగా ఎదురయ్యే ప్రశ్న. అయితే సినిమాలో కథ ప్రకారం కాకుండా పాట రాసిన చరిత్ర ప్రకారం చూస్తే మొదటి పాట ‘‘ పరితాప భారంబు భరియింప తరమా’’ అనే పాట.

ఈ పూర్తి పాట ఇలా వుంటుంది కానడ రాగం ఆదితాళం లో సాగుతుంది ఈ పాట

“   పరితాప భారంబు భరియింప తరమా

కటకట నే విధి గడువంగ జాలుడు

పతి ఆజ్ఞను దాట గలనా

పుత్రుని కాపాడ గలనా …..పరి

1. ఈ విషము నేనెటులను

తనయుని ద్రావింపగలను?

ధర్మమును కాపాడుదునా?

తనయుని కావగగలనా? …. పరి!

సోమరాజు రామానుజ రావు గారి “సతీసక్కుబాయి” నాటకం కోసం ఆయన వ్రాసిన “గజ్జలందియలు”, “రాదేలా కరుణ” వంటి ఐదు పాటలను “సతీసక్కుబాయి” సినిమాలో ఉపయోగించుకున్నారు. అదేవిధంగా శ్రీ ముత్తరాజు సుబ్బారావు గారి “శ్రీకృష్ణతులాభారం” నాటకం కోసం ఆయన వ్రాసిన పాటలు “భలే మంచి చౌక బేరము”, “కొట్టు కొట్టండి” అనే పాటను సినిమాలో వాడుకున్నారు. దాసరి కోటి రత్నం గారు నటించిన “సతీ అనసూయ” (1935)  సినిమాకు కేశవదాసు గారు మాటలు, పాటలతో సహా పూర్తి స్క్రిప్టును రచించారు.

1936లో కాళ్ళకూరి సదాశివరావు గారి దర్శకత్వంలో విడుదలైన “లంకా దహనం” సినిమాకు కూడా కేశవదాసు గారు స్క్రిప్ట్ వ్రాశారు. ఆయన గారి “కనకతార” నాటకంలోని రెండు పద్యాలు, రెండు పాటలు ఉపయోగించుకుంటూ ఆయన కథని అనుసరిస్తూ 1937లో “కనకతార” సినిమాను సరస్వతి టాకీసు వారు తీశారు. పానుగంటి వారి “రాధాకృష్ణ” నాటకం కోసం కేశవదాసు గారు వ్రాసిన పాటలను కొన్నిటిని 1939లో లక్ష్మీ సినీ టోన్ వారు తీసిన “రాధాకృష్ణ” చిత్రంలో ఉపయోగించుకున్నారు. ఇందులో స్థానం నరసింహారావు గారు “రాధ”గా అభినయించారు. ఇవేగాక కేశవ దాసు గారు సామాన్య ప్రజల కోసం మేలు కొలుపు పాటలు, మంగళ హారతులు, జోల పాటలు, హెచ్చరికలు మొదలైనవి ఎన్నో రచించారు.

గుప్త దానంలో దాన కర్ణుడు..

నల్గగొండ జిల్లా హుజూ‌ర్‌ న‌గర్‌ దగ్గర్లో వున్న సీతా‌ రా‌మ‌చం‌ద్రస్వామి ఆల‌యా‌నికి గాలి‌గో‌పురం నిర్మిం‌చారు చందాల కేశవదాసు గారు.‌

కేశవదాసు గారు తన ఇంటి నిర్మాణం కోసం దాచుకున్న కలపను “సీతా రామ చంద్రస్వామి” రథగోపుర నిర్మాణానికి వాడారు..

ఒంటి‌మి‌ట్ట‌లోని “కోదం‌డ‌ రా‌మ‌స్వామి” ఆల‌యాన్ని జీర్ణో‌ద్ద‌రణ గావిం‌చారు..

జగ్గయ్య పేటలో సప్తాహం పూర్తయిన తర్వాత పండిత సత్కారాలకు డబ్బు సరిపోకపోతే తన చేతికి ఉన్న బంగారు కంకణాన్ని అమ్మి వారికి డబ్బు చెల్లించారు..

తమ్మరలో గాలిగోపురం, ధ్వజస్తంభం పనులు డబ్బులేక ఆగిపోతే ఇంటికి మనిషిని పంపించి తన భార్య చేతి బంగారు గాజులు తెప్పించి అమ్మి గాలిగోపురం పనులకు ఇచ్చేశారు..

పోలంపల్లిలో “కనక్తార” నాటకం ప్రదర్శించగా వచ్చిన పదివేల రూపాయలను అక్కడి గ్రంథాలయానికి పుస్తకాలు బీరువాలు కోసం వినియోగించారు..

ఆ రోజులలో భద్రాచలం శ్రీ రాముడ్ని దర్శించుకునేందుకు తిరువూరు మార్గం గుండా వేళ్లే భక్తులకు తిరువూరులో సత్రాలు ఏర్పాటు చేశారు. వీటిల్లో భక్తులకు ఉచిత అన్న దానం ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ఖర్చులను మొత్తం కేశవదాసు గారే భరించేవారు..

తిరువూరు సత్యనారాయణ స్వామి ఆలయం ఎదురుగా ఉన్న ఆర్.టి.సి. బస్టాండు ప్రహారీ గోడను ఆనుకుని ప్రస్తుతం వున్న “దాసు గారి బావి” అని పిలవబడుతున్న బావిని అప్పట్లో భద్రాచలం వెళ్లే యాత్రికుల సౌకర్యంతో పాటు గ్రామ నీటి అవసరాలకు కూడా ఉపయోగపడాలని కేశవదాసు గారు తవ్వించినదే..

కోదాడ మండలం తమ్మరలో సీతా రామ చంద్రస్వామి ఆలయానికి గాలిగోపురం నిర్మించారు. ఆలయానికి సంబంధించిన వింజామరల వంటి అనేక వస్తువుల, అవసరమైన మరమత్తులు, అదనపు హంగులకు సాయపడ్డారు కేశవదాసు గారు..

“కనక్తార” సినిమా పనులు పూర్తి కాగానే కలకత్తా నుంచి తిరిగి వస్తుండగా నిర్మాత కేశవదాసు గారి చేతిలో 600 రూపాయిలు పెట్టారట. వెంటనే దాసు గారు ఆ డబ్బుతో తమ్మర స్వామికి రెండు చామరాలు (విసనకర్రలు), భూచక్ర గొడుగు కొని తీసుకు వచ్చి స్వామికి సమర్పించినాకనే అప్పటి వారి నివాసం జక్కేపల్లికి వెళ్ళారట..

మరణం…

చందాల కేశవదాసు గారు సినిమాలకు దూరమైన తరువాత కలకత్తా నుండి తిరిగి వచ్చి జక్కేపల్లిలో హరికథలు చెప్పనారంభించారు. ఇంతలో తెలంగాణ ప్రాంతంలో నిజాం వ్యతిరేక ఉద్యమం తీవ్ర రూపు దాల్చుకున్నది. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం రావడంతో హైదరాబాదు సంస్థానాన్ని కూడా ఇండియన్‌ యూనియన్‌లో విలీనం చేయాలనే ప్రతిపాదన వచ్చింది. నిజాం పరిపాలనలో దోపిడీ పీడనలకు వ్యతిరేకం ఉద్యమాలు ఉధృతమయ్యాయి. ఈ పోరాటాల్ని అణచి వేయడానికి రజాకార్లతో ప్రజలపై దాడులు చేయించాడు నిజాం నవాబు. ఆ రజాకార్లు జక్కేపల్లిలో ఉన్న చందాల కేశవదాసు ఇంటిపై దాడి చేసి ధ్వంసం చేశారు.

ఆ దాడిలో అతను ఆస్తిపాస్తులు, ధనమే గాక అంతకన్న విలువైన తన సాహిత్య సంపద కూడా నాశనమైనది. వెంటనే దాసు గారు ఆ ఊరి నుండి ఖమ్మం పట్టణానికి మకాం మార్చారు. శిష్యుల, అభిమానుల కోరిక మేరకు 1950లో నాయకన్ గూడెం చేరారు. ఎక్కువ సమయాన్ని జపతపాలలోనూ, యోగ ధ్యానంలోను గడిపేస్తూ ఉండిపోయారు. అప్పుడు కూడా అడపాదడపా అష్టావధానాలు చేస్తూనే ఉన్నారు. బొర్రా కోటయ్య చౌదరి గారి “భారత కర్మాగారము” అనే నాటకాన్ని, సందడి రామదాసు గారి మాధవ శతకాన్ని పరిష్కరించి వారిద్దరి రచనా వ్యాసంగాన్ని ఎంతగానో ప్రోత్సహించారు. కేశవదాసు గారు క్రమక్రమంగా ఉపాసనా ధ్యానస్థితిలో తదాత్మ్యం చెందుతూ విజయ నామ సంవత్సర వైశాఖి శుద్ధపంచమి అంటే 14 మే 1956 నాడు పరమపదం చేరుకున్నారు.

Show More
Back to top button