CINEMATelugu Cinema

దక్షిణ భారతీయ చలనచిత్ర టాకీల పితామహుడు… హెచ్.యం.రెడ్డి.

కొంతమంది కొన్ని కొన్ని రంగాలలో సృష్టించిన రికార్డులని ఎవ్వరూ, ఎప్పటికీ అధిగమించలేరు, చెరిపేయలేరు కూడా. కదిలే కాలం కూడా కరిగించలేదు. మొట్టమొదటి తెలుగు టాకీ రూపొందిన రికార్డు అలాంటిది. ఆ తరువాత ఎవ్వరు సినిమా తీసినా కూడా మొట్టమొదటి టాకీ కాలేదు కదా. ఇదొక్కటే కాదు, ఇలాంటివెన్నో అరుదైన రికార్డులను సొంతం చేసుకున్న వ్యక్తి హెచ్.ఎం.రెడ్డి (హనుమప్ప మునియప్ప రెడ్డి). ఈయనను టైగర్ అని, తెలుగు టాకీ పులి అని కూడా పిలుస్తుంటారు. హెచ్.ఎం.రెడ్డి తన 30 సంవత్సరాల సినీ జీవితంలో దర్శకత్వం చేసింది కేవలం 6 తెలుగు సినిమాలు మాత్రమే.

నిర్మాతగా కూడా కలుపుకుంటే ఆయన పనిచేసిన సినిమాలు 9 మాత్రమే. ఆయన ద్వారా పరిచయం అయ్యి ఆ తరువాత తెలుగు సినిమా రంగాలలో ప్రముఖ స్థానాలకు ఎదిగిన వారి సంఖ్య చాలా ఎక్కువ. ఆ కాలంలో మిగతా ఏ దర్శకుడు తో పోల్చినా హెచ్.ఎం.రెడ్డి ద్వారా పరిచయమై ఆ తరువాత ప్రముఖులైన వారి సంఖ్య అత్యధికం. సురభి కమలాభాయి, గూడవల్లి రామబ్రహ్మం, చిత్తూరు వి.నాగయ్య, బి.ఎన్.రెడ్డి, కె.వి.రెడ్డి, కమలాకర కామేశ్వరరావు, ఎల్వి ప్రసాద్, సదాశివ బ్రహ్మం, రాజనాల, కాంతారావు వీళ్లంతా కూడా ఆ జాబితాలోని వారే.

ఆయన మీసాలు, గొంతు, దేహ దారుడ్యం, వ్యవహార శైలి, బెబ్బులి పులి రాజసానికి ఏమాత్రం తీసిపోయేది కాదు అని ఆనాటి ప్రముఖుల అభిప్రాయం. ఆయన ఆ దేహ దారుడ్యంతో నడిచొస్తుంటే అచ్చం పులి నడిచొస్తుంది అనుకునేవారు. ఆయన పనిలో పులే, కానీ వ్యక్తిగతంగా ఏమాత్రం బేషజం లేకుండా మాట్లాడుతూ ఉండేవారు. తొలి తెలుగు టాకీ “భక్త ప్రహ్లాద” పొందిన రికార్డులతో పాటు, దక్షిణ భారతదేశపు తొలి టాకీ కాళిదాసన్ దర్శకుడుగా, కూడా హెచ్.ఎం.రెడ్డి పేరుంది. భక్త ప్రహ్లాద కంటే ముందే విడుదలైన కాళిదాసన్ పేరుకే కన్నడ టాకీ కానీ, అందులో ఒక పాత్ర తెలుగులో, ఇంకొక పాత్ర హిందీలో, మరొక పాత్ర తమిళంలో మాట్లాడేసరికే బహుభాషా తెలుగు టాకీ హెచ్.ఎం.రెడ్డి అయ్యారు.  

తెలుగు టాకీలు ప్రారంభమైన 1932 తరువాత సంవత్సరమే ఒక కథాంశం తో రెండు చిత్రాల ప్రారంభం అనే పోటీ తత్వం ప్రారంభమైంది. అది 1933లో విడుదలైన సతీసావిత్రి. ఈ పోటీలలో నిలిచిన పోటీదారులు టైగర్ హెచ్.ఎం.రెడ్డి. తెరకు కొత్తవారిని పరిచయం చేయడం అనేది ఒక సాంప్రదాయం లాగా, ఒక ఉద్యమం లాగా హెచ్.ఎం.రెడ్డి చిట్టచివరి వరకు కొనసాగించారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన “గృహలక్ష్మి” తో చిత్తూరు నాగయ్యను నటుడుగాను, బి.యన్.రెడ్డిని నిర్మాత దర్శకత్వ శాఖలలోనూ, కే.వీ.రెడ్డి ని క్యాషియర్ గాను, కమలాకర కామేశ్వరరావు దర్శకత్వ శాఖలలో పరిచయం చేసింది హెచ్.ఎం.రెడ్డినే. రచయిత సముద్రాల సాంఘిక చిత్రాలకు రచన చేయడం కూడా గృహలక్ష్మి చిత్రంతోనే ఆరంభమైంది. 

హెచ్.ఎం.రెడ్డి దర్శకత్వం చేసిన నాలుగో చిత్రం తెనాలి రామకృష్ణ. దాని ద్వారా సదాశివ బ్రహ్మం ను రచయితగా పరిచయం చేసింది కూడా హెచ్.ఎం.రెడ్డి నే. అంతవరకు చిన్న చిన్న వేషాలు వేస్తున్న ఎల్.వి.ప్రసాద్ ను ప్రతినాయక ఛాయలు ఉన్న నాయకుడిగా తన “సత్యమేవ జయం” లేదా “ఘరానా దొంగ” అనే సాంఘిక చిత్రం ద్వారా పరిచయం చేసింది కూడా హెచ్.ఎం రెడ్డి గారు ఘరానా దొంగ అనే టైటిల్ పెట్టడానికి కూడా హెచ్ఎం రెడ్డి గారికి సాధ్యమైంది ప్రతినాయక ఛాయలు నా ముక్కామల గారిని తన నిర్దోషి చిత్రం ద్వారా హీరోగా పరిచయం చేసింది కూడా హెచ్.ఎం.రెడ్డి నే. తెలుగువారి అందాల రాకుమారుడు కాంతారావును “నిర్దోషి” చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం చేసింది, ప్రతిజ్ఞ చిత్రం ద్వారా హీరోగా చేసింది హెచ్.ఎం.రెడ్డినే. ఆ ప్రతిజ్ఞ చిత్రం ద్వారా “రాజనాల” ను వెండితెరకు పరిచయం చేసింది హెచ్.ఎం.రెడ్డి నే. ఆ సినిమాతోనే కాంతారావు, రాజనాల కలయికకు శ్రీకారం చుట్టింది హెచ్.ఎం.రెడ్డినే.

జీవిత విశేషాలు…

జన్మ నామం :    హనుమప్ప మునియప్ప రెడ్డి

ఇతర పేర్లు  :  హెచ్.యమ్.రెడ్డి 

జననం    :     12 జూన్ 1892    

స్వస్థలం   :    యెలహంక, బెంగుళూరు 

వృత్తి      :     దర్శకుడు, నిర్మాత, పోలీసు

మరణం కారణం  :   వృద్దాప్యం 

బిరుదులు   :  తెలుగు టాకీ పులి 

మరణం   :  14 జనవరి 1964

నేపథ్యం…

హనుమప్ప మునియప్ప రెడ్డి (హెచ్.ఎం.రెడ్డి) గారు తెలుగు వారు. వారి పూర్వీకులు కన్నడ ప్రాంతానికి వెళ్లి స్థిరపడ్డారు. ఆయన స్వస్థలం బెంగళూరు పక్కన ఉన్న యెలహంక. ఆయన 12 జూన్ 1892 నాడు జన్మించారు. ఆయన యెలహంక లోనే చదువుకున్నారు. ఆయన విద్యాధికులే అన్న వాస్తవం కనిపిస్తుంది. కొన్ని రోజులు అక్కడే పోలీసు శాఖలో పనిచేశారని కొన్ని పత్రికలు వ్రాశాయి. మరి కొంతమంది హైదరాబాదులోని జాగిర్దార్ కళాశాలలో లెక్చరర్ గా పని చేశారని కొందరంటారు. ఈ రెండింటిలో ఏది నిజమనేది తెలియదు. పోలీసు శాఖలో పనిచేస్తున్నప్పుడు బ్రిటిషు వారి జూలూం నచ్చక అప్పుడప్పుడే పుంజుకుంటున్న మూకీ సినిమాల మీద మోజుతో బొంబాయి వెళ్లారు అనేది ఒక కథనం. హైదరాబాదు కళాశాలలో పనిచేస్తుండగా ప్లేగు వ్యాధి వ్యాపించడంతో హైదరాబాదు వదిలేసి బొంబాయి సినీ రంగానికి వెళ్లారు అనేది ఇంకొక కథనం.

సినీ రంగ ప్రవేశం…

ఆయనకు చిన్నప్పటి నుండి ధైర్యం ఎక్కువ. ఆ క్రమంలో గుర్రపు స్వారి నేర్చుకోవాలని అనిపించింది. జమీందారీ పిల్లలు ఆ రోజులలో బెంగళూరు, మైసూరు వచ్చి గుర్రపు స్వారి నేర్చుకునే వారు. అలా వచ్చిన వాళ్లలో కొంతమందికి హెచ్.ఎం.రెడ్డితో పరిచయం ఏర్పడింది. ఆ జమీందారులకు కొల్హాపూర్ లో స్టూడియోలు ఉండేవి. వాళ్ళతో ఉన్న స్నేహం వల్ల హెచ్.ఎం.రెడ్డి కొల్హాపూర్ లో సినిమా నిర్మాణంలో తొలి పాఠాలు నేర్చుకొని ఆ తరువాత బొంబాయికి వెళ్లారు. 1927 ప్రాంతంలో ఆయన తన 35 సంవత్సరాల వయస్సులో బొంబాయిలో అడుగు పెట్టారు. హెచ్.ఎం.రెడ్డి, ఆయన సోదరుడి కొడుకు హెచ్.పి.బాబు కలిసి బొంబాయి వెళ్లారు.

శారద ఫిలిమ్స్ కంపెనీ అనేది అక్కడ ప్రసిద్ధి చెందిన నిర్మాణ సంస్థల్లో ఒక్కటి. దాని భాగస్వాములు కే.ఎం.థానే, నానాబాయ్ దేశాయ్ కలిసి 1925 లోనే స్థాపించిన శారదా ఫిలిమ్స్ తరపున “సువర్ణ కమల్”, “వసంత బాల” అనే మూకీ సినిమాలు తీశారు. వారు 1927లో ఏకంగా బడే త్రిశాల్, గుల్జార్, కాలపహాడ్ అను మూడు సినిమాలు తీశారు. సరిగ్గా ఆ సమయంలోనే శారద ఫిలిం కంపెనీలో హెచ్.ఎమ్.రెడ్డి రిఫ్లెక్టర్ బాయ్ గా చేశారు. ఆయన అలా పనిచేస్తూనే కొన్ని రోజుల తరువాత బొంబాయిలోనే ఇంపీరియల్ ఫిలిం కంపెనీలో చేరారు. దాని అధిపతి ఆర్దేశిర్ ఇరానీ దగ్గర సహాయకుడిగా చేరి నమ్మకంగా పనిచేశారు. దాంతో ఆయనకు ఆర్దేశిర్ ఇరానీ దర్శకత్వ శాఖలో పాఠాలు నేర్పించారు. తనపై పూర్తిగా నమ్మకం వచ్చిన తరువాత ఆర్దేశిర్ ఇరానీ తన నిర్మాణంలో రెండు మూకీ సినిమాలకు దర్శకత్వం చేసే అవకాశం హెచ్.ఎమ్.రెడ్డి కి ఇచ్చారు. ఇందులో ఒక సినిమాలో పృథ్వీరాజ్ కపూర్ కూడా నటించారు. పృథ్వీరాజ్ కపూర్ నటించిన మూకీ సినిమాకి కూడా దర్శకత్వం వహించిన ఘనత కూడా హెచ్.ఎమ్.రెడ్డి దే అని చెప్పాలి. ఆ విధంగా హెచ్.ఎమ్.రెడ్డి దర్శకత్వ ప్రస్థానం 1930 నుండి ప్రారంభమైంది.

తొలి టాకీలు “కాళిదాసన్”, “భక్త ప్రహ్లాద”…

14 మార్చి 1931 నాడు విడుదలైన “ఆలం ఆరా” రూపొందించిన ఆర్దేశిర్ ఇరానీ కి దర్శకత్వ శాఖలో సహాయ దర్శకుడిగా సేవలు అందించిన ఘనత హెచ్.ఎం.రెడ్డి సొంతం. ఆ రోజులలో తెరమీద బొమ్మలు మాట్లాడమనేది హిందీ ప్రజలకు ఎనిమిదో వింత. ఆ సినిమా ఆర్దేశిర్ ఇరానీకి అంతులేని విజయాన్ని ఇచ్చింది. దాంతో ఈ సినిమా నిర్మాణానికి భారతదేశంలోని అన్ని భాషలకు విస్తరిస్తే బాగుంటుందని ఆలోచన వచ్చింది. దాంతో తనకు మొట్టమొదట గుర్తొచ్చింది హెచ్.ఎం.రెడ్డి నే. తన అభిప్రాయం హెచ్.ఎం.రెడ్డి కి చెప్పగానే దానికి ఆయన సరే అన్నారు. దాంతో హెచ్.ఎం.రెడ్డి దర్శకత్వం వహించిన దక్షిణాది తొలి చిత్రం “కాళిదాసన్” అయ్యింది. అదే మొట్టమొదటి దక్షిణాది టాకీ చిత్రం. ఆలం ఆరా సమయంలో హెచ్.ఎం.రెడ్డి కి ఒక కుర్రాడు పరిచయమయ్యారు. ఆ కుర్రాడు హెచ్.ఎం.రెడ్డి తో పాటు పది సంవత్సరాల పనిచేశారు.

అలా పనిచేసిన ఆ కుర్రాడు ఆ తరువాత తానే ఒక వ్యవస్థగా ఎదిగాడు. ఆ కుర్రాడే ఎల్వీ ప్రసాద్. తాను కాళిదాసన్ సినిమాకి సహాయం చేయడమే కాకుండా దాంట్లో ఒక పాత్ర కూడా ధరించారు. మొట్టమొదటి దక్షిణ టాకీ చిత్రం కాళిదాసన్ 06 ఫిబ్రవరి 1932 నాడు విడుదల అయ్యింది. తెరమీద బొమ్మలు మన భాషలో మాట్లాడుతున్నాయి అనే గొప్ప వింత. కాళిదాసన్ సినిమాకి ఆ రోజుల్లోనే 8000 రూపాయలు ఖర్చు పెడితే, సుమారు 75 వేల రూపాయలు వసూలు చేసింది. కన్నడంలో టాకీ చేస్తున్నప్పుడే, తెలుగులో టాకీ సినిమా చేసే బాధ్యతను హెచ్.ఎం.రెడ్డి కే అప్పచెప్పారు ఆర్దేశిర్ ఇరానీ. అదే తొలి తెలుగు టాకీ చిత్రం భక్త ప్రహ్లాద. తెలుగువారికి హెచ్.ఎం.రెడ్డి ఇచ్చిన కానుక. ఆవిధంగా దక్షిణాదిన తొలి రెండు టాకీ చిత్రాల దర్శకుడు హెచ్.ఎం.రెడ్డి అయ్యారు. ఈ రెండు సినిమాలకు విపరీతమైన లాభాలను కూడా తెచ్చిపెట్టారు.

సతీ సావిత్రి…

“భక్త ప్రహ్లాద” సినిమా తరువాత హెచ్.ఎం.రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం “సతీ సావిత్రి”. దీని నిర్మాణ సంస్థ “భారతీ సినీ టోన్”. ఇందులో యమధర్మరాజు పాత్రను మునిపల్లె సుబ్బయ్య పోషించారు. ఎల్వీ ప్రసాద్ సత్యవంతుడి స్నేహితుడుగా, కాంత మణికన్య సావిత్రిగా నటించారు. ఒకవైపు బొంబాయిలో “సతీ సావిత్రి” సినిమా నిర్మాణం కొనసాగుతుండగా కలకత్తాలో ఇదే కథనంపై చిత్తజల్లు పుల్లయ్య పోటీగా చిత్రం తీశారు.  దర్శకుడిగా పుల్లయ్యకు అది మొట్టమొదటి చిత్రం. ఆ రెండు సతీసావిత్రి సినిమాలలో 04 ఫిబ్రవరి 1953 నాడు హెచ్.ఎం.రెడ్డి సతీసావిత్రి విడుదలయితే, ఆ మరునాడు పుల్లయ్య తీసిన చిత్రం విడుదలైంది. పుల్లయ్య తీసిన సతీసావిత్రి మాత్రమే విజయవంతమైంది. హెచ్.ఎం.రెడ్డి రెండవ తెలుగు టాకీ చిత్రం పరాజయం పాలైంది.

“ద్రౌపదీ వస్త్రాపహరణం”…

పారుపల్లి శేషయ్య, కురుకూరి సుబ్బారావు లాంటి ఔత్సాహిక నిర్మాతలు కొల్లాపూర్ లో హెచ్.ఎం.రెడ్డిని కలిసి తమ నిర్మాణంలో సినిమా తీసి పెట్టమన్నారు. దాంతో హనుమప్ప విశ్వనాథ్ బాబు (హెచ్.ఎం.రెడ్డి సోదరుడి కుమారుడు) దర్శకుడుగా, హెచ్.ఎమ్.రెడ్డి పర్యవేక్షణలో కొల్లాపూర్ లో “ద్రౌపదీ వస్త్రాపహరణం” తీశారు. దీనికి పోటీగా “ద్రౌపది మానసంరక్షణ” తీశారు. 29 ఫిబ్రవరి 1936 హెచ్.ఎం.రెడ్డి గారి పర్యవేక్షణలో ఉన్న “ద్రౌపది వస్త్రాపహరణం” విడుదలయితే, 24 మార్చి 1936 నాడు ద్రౌపతి మాన సంరక్షణం విడుదలైంది. కానీ వాణిజ్యపరమైన అంశాలు ఉన్న “ద్రౌపది వస్త్రాపహరణం” సినిమా  మాత్రమే విజయవంతమైంది. ఈ సినిమా నిర్మాణ వ్యవహారాలను “గూఢవల్లి రామబ్రహ్మం” పర్యవేక్షణ చేశారు. ఈ సినిమాకు “సముద్రాల రాఘవాచార్య” రచన చేశారు. ఈ సినిమాపై ప్రతికూల సమీక్షలు వ్రాసిన విశ్లేషకులు “కమలాకర కామేశ్వరరావు” ను తన “గృహలక్ష్మి” సినిమాలో దర్శకత్వ శాఖలో అప్రెంటీస్ గా పెట్టుకున్నారు.

అద్భుతమైన విజయం “గృహలక్ష్మి”…

“ద్రౌపదీ వస్త్రాపహరణం” సినిమా తరువాత హెచ్.ఎం.రెడ్డి “గృహలక్ష్మి” సినిమా తీసారు. “గృహలక్ష్మి” సినిమా నిర్మాణంలో ప్రెస్ యజమాని ఉన్న బి.యన్.రెడ్డి ని, సారా వ్యాపారి మూల నారాయణస్వామి ని భాగస్వామిగా చేర్చుకున్నారు. ద్రౌపది వస్త్రాపహరణం లో నటించిన కన్నాంబ కూడా ఈ సినిమాలో భాగస్వామిగా కలిశారు. అలా హెచ్.ఎం.రెడ్డి భాగస్వాములతో కలిసి 1937 లో స్థాపించిన నిర్మాణ సంస్థ పేరు “రోహిణి పిక్చర్స్”. ఈ నిర్మాణ సంస్థను ప్రారంభించిన హెచ్.ఎం.రెడ్డి తాను మరణించే వరకు సినిమాలు తీశారు. రోహిణి పిక్చర్స్ లో మొట్టమొదటి సినిమా “గృహలక్ష్మి”. ఇందులో ఇన్సూరెన్స్ ఏజెంట్ రామానుజా చారి కథానాయకుడు, కన్నాంబ కథానాయిక. కన్నాంబ అన్నపాత్రలో చిత్తూరు నాగయ్య నటించారు.

ఈ చిత్రం ద్వారానే చిత్తూరు నాగయ్య సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు. మచిలీపట్నం నుండి వచ్చిన కమలాకర కామేశ్వరరావు ను ఈ సినిమాకు అప్రెంటిస్ గా తీసుకున్నారు. హెచ్.ఎమ్.రెడ్డి బామ్మర్ది డి.ఎల్.రామచందర్ సహాయ దర్శకులుగా, హెచ్.ఎమ్.రెడ్డి అన్న కుమారుడు హెచ్.పీ.బాబు గృహలక్ష్మి చిత్రానికి సహచర దర్శకులుగా, కన్నాంబ భర్త కడారు నాగభూషణం ప్రొడక్షన్ మేనేజరుగా, మూల నారాయణ స్వామి సిఫారసు మేరకు క్యాషియర్ గా కె.వి.రెడ్డిని తీసుకున్నారు. వేశ్య పాత్రధారిగా కన్నాంబ నటించిన ఈ సినిమా 12 మార్చి 1938 నాడు గృహలక్ష్మి విడుదలైంది. ఈ సినిమాకి వసూళ్ల వరదలు, పెట్టుబడికి మూడు రెట్లు లాభాలు వచ్చాయి. ఈ సినిమాలో ఉన్న భావ వైరుధ్యాల వలన, ఈ సినిమా విడుదలైన తరువాత బి.ఎన్.రెడ్డి బృందం రోహిణి పిక్చర్స్ నుంచి విడిపోయి వాహనీ సంస్థను స్థాపించి తన సినీ ప్రయాణం కొనసాగించారు.

తెనాలి రామకృష్ణ…

గృహలక్ష్మి సినిమా తరువాత హెచ్.ఎం.రెడ్డి 22 మార్చి 1941లో విడుదలైన “తెనాలి రామకృష్ణ” సినిమా తీశారు. ఈ సినిమాలో ఎల్వీ ప్రసాద్ రెండు పాత్రలు పోషించారు. ఒకటి కరటక శాస్త్రి, మరొకటి మహామంత్రి తిమ్మరసు. ఈ సినిమా ద్వారా “వెంపటి సదాశివ బ్రహ్మం” రచయితగా పరిచయం చేశారు హెచ్.ఎం.రెడ్డి. ఈ సినిమాలో తెనాలి రామకృష్ణ పాత్రలో యస్.పి లక్ష్మణస్వామి, శ్రీకృష్ణదేవరాయలు పాత్రను పారుపల్లి సుబ్బారావు పోషించారు. తెనాలి రామకృష్ణ సినిమా తరువాత 03 అక్టోబర్ 1943 నాడు “సత్యమేవ జయం” లేదా “ఘరానా దొంగ” లేదా “హానెస్ట్ రోగ్” అనే సినిమాను విడుదల చేశారు. ఇది జానపద ఛాయలున్న కథ. ఇందులో స్వామీజీ, రాజు గారు, కొత్వాలు, దొంగ ఇలాంటి పాత్రలలో సినిమా సాగుతుంది. ఇందులో దొంగ పాత్రలో ఎల్వీ ప్రసాద్, స్వామీజీగా ఎస్పీ లక్ష్మణ స్వామి నటించారు. కానీ ఈ సినిమా పెద్దగా విజయవంతం కాలేదు.

నిర్దోషి…

సత్యమేవ జయం సినిమా తరువాత 8 సంవత్సరాలు రోహిణీ పిక్చర్స్ నుండి ఒక్క సినిమా కూడా రాలేదు. 1950లో రోహిణీ పిక్చర్స్ పతాకం పై హెచ్.యం.రెడ్డి “నిర్దోషి” అనే సినిమాను ప్రారంభించారు. ఫిబ్రవరి 1951 లో ఈ సినిమా విడుదలైంది. అప్పటివరకు చిన్నచిన్న విలన్ వేశాలు వేస్తూ, దర్శకత్వ శాఖలలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న “ముక్కామల” గారిని నిర్దోషి చిత్రం ద్వారా అనుకోకుండా హఠాత్తుగా కథానాయకుడిని చేశారు హెచ్.ఎం.రెడ్డి. ఇందులో విలన్ పాత్రను పోషించిన కోన ప్రభాకర్ రావు ఆ తరువాత రోజులలో మహారాష్ట్ర గవర్నర్ అయ్యారు. ఇందులో అంజలి ద్విపాత్రాభినయం చేశారు.

హెచ్.ఎం.రెడ్డి మనవడు “మధు” ను ఈ చిత్రం ద్వారా బాల నటుడిగా పరిచయం చేశారు. ఈ సినిమా కథ, మాటలు నలుగురు వ్రాశారు. సదాశివ బ్రహ్మం, కే.జీ.శర్మ, శ్రీ శ్రీ, ఆత్రేయ. ఈ సినిమాకు ఇద్దరు సంగీత దర్శకులున్నారు. వాళ్లలో ఒకరు ఘంటశాల. 24 ఫిబ్రవరి 1951 విడుదలైన నిర్దోషి కూడా పెద్దగా విజయం సాధించలేదు. దీనిని తమిళంలో కూడా విడుదల చేశారు. అక్కడ కూడా విజయం సాధించలేదు. ఈ సినిమాలో కథానాయిక తండ్రి పాత్రను దొరైస్వామి పోషించారు. ప్రముఖ జానపద కథనాయకులు కాంతారావు ఈ సినిమాలో ఒక రైతు పాత్రలో నటించారు . ఆ రూపం చూసి ముగ్దుడై, స్క్రీన్ టెస్ట్ లేకుండా తన తరువాత చిత్రానికి కాంతారావును హీరోగా ఎంపిక చేశారు హెచ్.ఎం.రెడ్డి. ఆ సినిమా పేరు ప్రతిజ్ఞ. ఈ సినిమా ప్రారంభం అవ్వడానికి ఒక సంవత్సరం పట్టింది.

మరణం…

నిర్దోషి చిత్రం తెచ్చిపెట్టిన నష్టాలను సవరించుకుంటుండగా పూర్ణా పిక్చర్స్ మంగరాజు హెచ్.ఎం.రెడ్డికి పెట్టుబడి పెట్టారు.  అంతా కొత్తవారితో తీసిన ఈ చిత్రం చిత్రీకరణ జనవరి 1952లో  ప్రారంభమైంది. ఇందులో రాజనాల గారికి ప్రతినాయక పాత్ర ఇచ్చారు. ఈ సినిమాలో కథనాయికగా సావిత్రిని ఎంపిక చేశారు. మధు అనే కుర్రాడికి గుర్తింపు ఉన్న పాత్రను ఇచ్చారు. ప్రతిజ్ఞ సినిమాను కూడా తెలుగు, తమిళ భాషలలో విడుదల చేశారు. తెలుగులో థియేటర్లు మారుతూ విజయవాడలోని “రామ టాకీస్” లో వంద రోజులు ఆడింది. ఈ సినిమా నిర్మాణంలో ఉండగానే రోహిణి స్టూడియోను ప్రారంభించారు హెచ్.ఎమ్.రెడ్డి. ప్రతిజ్ఞ సినిమా అంతా సొంతం స్టూడియోలోనే జరిగింది.

ఈ సినిమా విడుదలకు ముందే రోహిణీ బ్యానర్ లో రెండు సినిమాలను ప్రకటించేశారు. వాటిలో ఒకటి ఎన్టీఆర్ తో “వద్దంటే డబ్బు”, రెండోది జగ్గయ్య గారు హీరోగా “బీదల ఆస్తి”. ఈ రెండింటిలోనూ షావుకారు జానకి   కథానాయిక. 1954లో “వద్దంటే డబ్బు” విడుదలయితే, బీదల ఆస్తి 1955లో విడుదలైంది. ఈ రెండింటికి నిర్మాత హెచ్.ఏం.రెడ్డి.  “వద్దంటే డబ్బు” సినిమాకు వై.ఆర్.స్వామి దర్శకుడు అయితే, “బీదల ఆస్తికి” డి.ఎల్. రామచందర్ దర్శకులు. వీరిద్దరూ హెచ్.ఎం.రెడ్డి బంధువులే. 1955 సంవత్సరం తరువాత మూడు సంవత్సరాలు విరామం ఇచ్చి తన స్టూడియోలోనే గజదొంగ అనే త్రిభాషా చిత్రాన్ని ప్రారంభించారు హెచ్.యం.రెడ్డి. అప్పటికే ఆయన వయస్సు 65 సంవత్సరాలు దాటింది. ఆ సినిమా నిర్మాణంలో ఉండగానే తెలుగు టాకీ పులి, పాపాజీ, హెచ్.ఎం.రెడ్డి 14 జనవరి 1964 నాడు కన్నుమూశారు. సంక్రాంతి రోజున కన్నుమూసిన అదృష్టవంతులు హెచ్.ఎం.రెడ్డి అని వ్రాశారు. 

ముగింపు…

చూడడానికి గంభీరంగా ఉన్నా కూడా హెచ్.ఎం.రెడ్డి అందరిని గౌరవించేవారు. ఆయన తన కారులో స్టూడియోకి వెళ్తున్నప్పుడు దానిలో ఎవరైనా సినిమా కళాకారులు కనిపిస్తే అడిగిమరీ కారు ఎక్కించుకునేవారు. మద్రాసులోని పాంబ్రో హోటల్ పక్కన హెచ్.ఎం.రెడ్డి గారి బంగ్లా ఉండేది. హెచ్.ఎం.రెడ్డి గారు మరణించాక “గజదొంగ” సినిమా విడుదల కాలేదు. ఆ రోహిణి స్టూడియో గోల్డెన్ స్టూడియోగా మారింది. ఆ తరువాత అది మూతపడి ఫుడ్ కార్పొరేషన్ గా మారిపోయింది. దాంతో హెచ్.ఎం.రెడ్డి గారి జ్ఞాపకాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి.  దక్షిణ భారత టాకీల పితామహుడు, సినీ దర్శకుడు తాను నిర్దేశించుకున్న సూతాల ప్రకారమే సినిమా తీశారు. ఎవ్వరి ఒత్తిళ్లకు తలొగ్గలేదు. లాభమో, నష్టమో ఆయనే భరించారు తప్ప ఎవ్వరికీ తలొంచలేదు.

తన దగ్గర పనిచేసిన బి.ఎన్.రెడ్డి, కె.వి.రెడ్డి, ఎల్వి ప్రసాద్ లు అద్భుతమైన సినిమాలు రూపొందిస్తున్న రోజులలో కూడా హెచ్.ఎం.రెడ్డి మాత్రం ఎవ్వరి ప్రలోభావానికి లోన్ కాకుండా  తాను అనుకున్న పంథాలను కొనసాగించారు. ఎన్టీఆర్ తో రూపొందించిన “వద్దంటే డబ్బు” సినిమాకు తప్ప ఏ సినిమాకు కూడా తారాబలం మీద ఆధారపడలేదు. రోహిణీ పిక్చర్స్ స్థాపించాక ఏ ఇతర బ్యానర్ కు దర్శకత్వం చేయలేదు. నాదైన రాజ్యంలో నేనే రాజు, నేనే మంత్రి. మూడు దశాబ్దాల పాటు సినీ రంగంలో కొనసాగిన హెచ్.ఎం.రెడ్డి బాక్సాఫీసును బద్దలు కొట్టిన సినిమాలు రూపొందించలేకపోవచ్చు. కానీ అలాంటి సినిమాలు రూపొందించిన కళాకారులను, సాంకేతిక నిపుణులను పరిచయం చేసిన ఘనత హెచ్.ఎం.రెడ్డి దే అని కచ్చితంగా చెప్పవచ్చు. తెలుగు సినిమా చరిత్రలో హెచ్.ఎం.రెడ్డిది ఒక ప్రత్యేకమైన అధ్యాయం.

Show More
Back to top button