కొన్ని గ్రంథాలకు పుట్టుక మాత్రమే ఉంటుంది, తప్ప మరణం ఉండదు. ఆ క్రమంలో తొలివరుసలో నిలబడుతుంది గురజాడ రచించిన “కన్యాశుల్కం నాటకం”. విశాఖపట్నం జిల్లా బ్రాహ్మణ కుటుంబాలలో కన్యాశుల్కం పద్ధతులలో జరిగే బాల్య వివాహాల గురించి విజయనగరం మహారాజ వారు సేకరించిన బోగట్టా చూసి చలించిపోయిన ఆయన మిత్రుడు గురజాడ అప్పారావు “కన్యాశుల్కం” నాటక రచనకు పూనుకున్నారు. కథా వస్తువులలోనూ, భాషలలోనూ నాటకం తెచ్చిన పెను మార్పు అధిక సంఖ్యాకుల ఆమోదం పొందింది. సంఘాన్ని పట్టిపీడిస్తున్న అనేక దురాచారాలను రచ్చకెక్కించి, ప్రేక్షక న్యాయస్థానం ముందు రంగస్థలం అనే బోనులో నిలబెట్టి రక్షణ న్యాయవాదిగా తనే వకాల్తపుచ్చుకొని లలిత హాస్య భరితమైన వాదనను తనే ఈ నాటకంలో వినిపించారు గురజాడ వారు.
కన్యాశుల్కం నాటకం చదవని వాడు తెలుగువాడు కాదు అన్నారట ప్రసిద్ధ నాటక కర్త భమిడిపాటి కామేశ్వరరావు ఒక సందర్భంలో. అంత గొప్ప నాటకాన్ని సినిమాగా చూపించే సాహసం చేశారు దర్శకుడు పి.పుల్లయ్య. మధురవాణి, గిరీశం, బుచ్చమ్మ, లుబ్దావధానులు, రామప్ప పంతులు, అగ్నిహోత్రావధానులు, కరకట శాస్త్రి, లబ్దప్రతిష్టులైన నటులంతా ఆయా పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. విజయనగరానికి చెందిన “జగన్నాథ విలాస సభ” వారు తొలిసారిగా ఈ నాటకం ప్రదర్శించారు.
అప్పటినుండి కొన్ని వందల నాటక సమాజాలు, కొన్ని వేల సార్లు ఈ నాటకాన్ని అనేక చోట్ల ప్రదర్శించారు. ప్రదర్శించిన ప్రతీసారి ప్రేక్షకాదరణ పొందుతూనే ఉన్నది. ఈ నాటకాన్ని తన వినోద పిక్చర్స్ పతాకం పై 1955లో పి.పుల్లయ్య దర్శకత్వంలో “కన్యాశుల్కం” సినిమాగా తీశారు డి.ఎల్.నారాయణ. అయితే నాటకానికి చేసిన అనేకానేక మార్పుల కారణంగా మొదటిసారి ప్రేక్షకుకాదరణకు నోచుకోని ఈ సినిమా ఆ తరువాత కాలంలో ఎప్పుడు విడుదలైనా ప్రజలను అమితంగా ఆకట్టుకోవడం విశేషం. 69 ఏళ్ల నాటి సినిమా విశేషాలు మీకోసం.
“దేవదాసు” ఇరవయ్యవ శతాబ్దపు ప్రముఖ బెంగాలీ నవలా రచయిత, కథా రచయిత శరత్ చంద్ర చట్టోపాధ్యాయ్ వ్రాయగా, “కన్యాశుల్కం” ను తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో ఒకరు అయిన గురజాడ అప్పారావు వ్రాయగా, “ఏకవీర” ను 20వ శతాబ్దపు తెలుగు రచయిత “కవి సమ్రాట్” బిరుదాంకితుడు విశ్వనాథ సత్యనారాయణ వ్రాశారు. ఇవన్నీ ప్రసిద్ధ రచయితలు వ్రాసిన ప్రసిద్ధ రచనలు. పుస్తక రూపంలో ఉండగానే లక్షలాది పాఠకుల హృదయాలలో తనదైన ముద్ర వేసిన ఈ సాహిత్య రత్నాలు సినిమాలుగా నిర్మించాలంటే ముందడుగు వేయాల్సింది ధైర్యం, తెగింపుతో ఉన్న నిర్మాత.
తెలుగులో అలాంటి సాహాసాన్ని చేసి మూడు పుస్తకాలను “దేవదాసు”, “కన్యాశుల్కం”, “ఏకవీర” కథలను తెలుగు సినిమాలుగా నిర్మించిన నిర్మాతగా ద్రోణావఝ్ఝుల లక్ష్మీనారాయణ (డి.ఎల్.నారాయణ). డి.ఎల్. ఒకవేళ డి.ఎల్.నారాయణ పూనుకోక పోయి ఉంటే ఈ సాహితీ రత్నాలు తెలుగు తెరపై కనిపించేవో లేదో చెప్పడం కొంచెం కష్టంగానే ఉంటుంది. దేవదాసు (1953) లో విడుదల అయితే కన్యాశుల్కం (1955) లోను ఏకవీర (1969) లోను విడుదలయ్యాయి.
కన్యాశుల్కం నాటకం ప్రదర్శన మొట్టమొదటిసారి 1892లో విజయనగరంలో జరిగింది. అప్పటికే కొద్ది సంవత్సరాల ముందే గురజాడ ఈ నాటకాన్ని వ్రాశారు. మొట్టమొదట నాటక ప్రదర్శన జరిగిన తరువాత ఐదేళ్లకు పుస్తక రూపంలో అచ్చు అయ్యింది. గురజాడ కన్యాశుల్కానికి రెండో వర్షన్ 1909 లో వ్రాశారు. ఇది మనకు ఇప్పటికీ లభ్యమవుతున్న వర్షన్, ఇదే ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న కన్యాశుల్కం సినిమాకు మూలం. నిజానికి సినిమా నిడివి మూడు గంటలే అయినప్పటికీ దీని నాటకం నిడివి ఆరు గంటల పైచిలుకే.
నిజానికి నాటక నిడివి పెంపుదల రెండవ వర్షన్ లో జరిగింది. నిడివి ఎక్కువ ఉన్న రెండో వర్షన్ అధిక నిడివి కారణంగానే నాటక రూపం దాల్చడానికి సుమారు 15 సంవత్సరాలు పట్టింది. ఒకసారి ఆ నాటకం ప్రదర్శించడం మొదలు శతాబ్ద కాలంగా ఈనాటి వరకు ఆ నాటకం ప్రదర్శింపబడుతూనే ఉంది. ఈ నాటకం ప్రజా బహుళ్యంలోనికి చొచ్చుకొని పోవడానికి ఆ నాటకంలో గురజాడ ఎత్తి చూపిన సమస్య ఒక్కటే కాదు, ఆ నాటకంలోని పాత్రల సన్నివేశాల సార్వజనీనత.
కన్యాశుల్కం లోని పాత్రలు, వ్యక్తిత్వాలు అలాంటి ప్రవర్తన కలిగిన వ్యక్తులు ఇప్పటికీ కూడా మనకు కనిపిస్తూనే ఉంటారు. అలాంటి పాత్రల ద్వారా కథను నడిపించడం వలననే ఇప్పటికీ కూడా కన్యాశుల్కం నాటకం చదివినా, చూసినా, ఒక సినిమాగా చూసినా ఒక గిరీశం, ఒక రామప్ప పంతులు, ఒక మధురవాణి, మన మధ్యన ఎక్కడో ఉన్నట్టే ఉంటారు. కన్యాశుల్కం నాటకాన్ని గురజాడ వారు ఎంపిక చేసుకున్న ఫ్రేమ్ కూడా అత్యంత శక్తివంతమైనది, సార్వజనీనమైనది.
అవే పాత్రల స్వభావంతో, అవే సన్నివేశాలతో అనేక మలుపులతోనే కన్యాశుల్కం సమస్య కాకుండా మరో సమస్య ఏదైనా నిరుద్యోగం, లంచగొండితనం, అవకతవక రాజకీయాలు ఏ అంశాన్నైనా తీసుకుని ఈ నాటకాన్ని అతి సులువుగా తిరగరాయచ్చు. అవే పాత్రలు ఉంటాయి, అవే సన్నివేశాలుంటాయి, అవే మలుపులు ఉంటాయి. సమస్య మాత్రం వేరే ఉంటుంది. అది గురజాడ గారి గొప్పతనం. ఇలాంటి నాటకానికి వెండితెర రూపం ఇవ్వాలి అంటే, నిర్మాత తర్వాత ధైర్యం, నమ్మకం ఉండాల్సింది దర్శకులు పి.పుల్లయ్య గారికే.
చిత్ర విశేషాలు….
- దర్శకత్వం : పి. పుల్లయ్య
- కథ : గురజాడ అప్పారావు రచించిన “కన్యాశుల్కం”
- నిర్మాణం : డి.యల్.నారాయణ
- తారాగణం : గోవిందరాజుల సుబ్బారావు, సి.యస్.ఆర్. ఆంజనేయులు, విన్నకోట రామన్నపంతులు, నందమూరి తారక రామారావు, వంగర వెంకటసుబ్బయ్య, సావిత్రి, షావుకారు జానకి
- సంగీతం : ఘంటసాల
- ఛాయాగ్రహణం : ఎన్. ప్రకాష్
- కూర్పు : ఆర్. హనుమంత రావు
- నిర్మాణ సంస్థ : వినోదా పిక్చర్స్
- నిడివి : 167 నిమిషాలు
- విడుదల తేదీ : 26 ఆగస్టు 1955
- భాష : తెలుగు
కథ సంక్షిప్తంగా…
కన్యాశుల్కం కథ ముఖ్యంగా మూడు ప్రదేశాలలో జరుగుతుంది. విజయనగరం, రామచంద్రపురం అగ్రహారం, కృష్ణరాయపురం అగ్రహారం. విజయనగరంలో గిరీశం అనే కోతల రాయుడు పూటకూల్ల ఇంట్లో తింటూ, ట్యూషన్లు చెబుతూ బ్రతుకుతూ ఉంటాడు. అదే వూరికే చెందిన, అదే ఊరిలోనే ఉంటున్న మధురవాణి అనే వ్యక్తి దగ్గరికి తరచూ వెళ్తూ ఉంటాడు. ఇక రెండో ఊరు రామచంద్రపురం అగ్రహారం ఆ రామచంద్రపురం అగ్రహారంలో రామప్ప పంతులు అనే దళారి, వయస్సు మళ్ళిన బ్రహ్మచారి ఉంటాడు. వ్యవహార శైలిలో ఇతడు గిరీశం లాంటివాడు. ఆ ఊర్లోనే ఉండే లుబ్దావధానులు అనే భార్య చనిపోయిన ముసలాయనకు మళ్ళీ సంబంధం కుదిర్చి తన కమిషన్ కూడా తీసుకోవాలని ప్రణాళిక వేస్తాడు రామప్ప పంతులు.
ఇక మూడో ఊరు కృష్ణరాయపురం అగ్రహారం. ఆ ఊర్లో అగ్నిహోత్రావధానులు అనే పెద్దాయనకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉంటారు. పెద్దమ్మాయి బుచ్చమ్మ. ఆమెకు చిన్నప్పుడే వివాహమై భర్తను కోల్పోయి వితంతువు అయ్యింది. రెండవ అమ్మాయి సుబ్బమ్మ. పది సంవత్సరాలు నిండా నిండని ఆడపిల్ల. రామప్ప పంతులు అగ్నిహోత్రావధానులను ఒప్పించి కన్న కూతురును తీసుకొస్తానని మభ్యపెట్టి చిన్న పిల్ల సుబ్రమ్మను లుబ్దావధానులకు ఇచ్చి పెళ్లి చేయడానికి ప్రణాళిక రచిస్తాడు. ఆ పెళ్లికి ముందే తన కమిషన్ రెండు వందల రూపాయలు తీసుకుని ఆ డబ్బులతో మధురవాణిని విజయనగరం నుండి రామచంద్రపురం అగ్రహారంకు తీసుకువచ్చి ఒక ఇంట్లో పెడతాడు.
విజయనగరంలో ఉన్న గిరీశం అప్పుల బాధ భరించలేక తప్పించుకోవడానికి శిష్యుడు వెంకటేష్ కి ట్యూషన్ చెప్పే నేపంతో కృష్ణరాయపురం అగ్రహారం చేరుకుంటాడు. వెంకటేశం అగ్నిహోత్రావధానుల కొడుకు బుచ్చమ్మ, సుబ్బమ్మలకు తమ్ముడు. గిరీశం బుచ్చమ్మ కు దగ్గర అవ్వాలని చూస్తుంటాడు. చిన్న పిల్లకు కన్యాశుల్కం తీసుకుని పెళ్లి చేయడం అగ్నిహోత్రావధాని భార్యకు ఇష్టం ఉండదు. ఈ పెళ్లిని తప్పించడానికి అగ్నిహోత్రావధానుల బావమరిది కరకట శాస్త్రి దిగుతాడు. ఇక్కడి నుండి కథ అనుకోని మలుపులు తిరుగుతుంది, శరవేగంతో పరుగులు తీస్తుంది.
కన్యాశుల్కం నాటకంలో ముగింపు కంటే, సినిమాలో ముగింపు భిన్నంగా ఉంటుంది. ఆరు గంటల నిడివిగల నాటకాన్ని రెండు మూడు గంటలకు కుదించాలంటే చాలా కష్టం. దానికి చాలా చాలా కసరత్తు చేయాలి. ఈ సినిమా విడుదలైన 1955 వ సంవత్సరం ప్రజలలో విపరీతమైన ఆసక్తి నెలకొంది. అందులో ప్రేక్షకులకు ఒక రకమైన అనుభూతి కలగజేయాలంటే నాటకంలో యథాతధంగా ఉన్న సన్నివేశాలను, సంభాషణలను యథోచితంగా మార్పు చేయవలసి వచ్చింది. రసజ్ఞులు సహృదయంతో స్వీకరించ ప్రార్థన అని వెండితెరపై టైటిల్స్ లో ఒక సైడ్ వేశారు.
నిర్మాత నేపథ్యం…
నిర్మాత డి.యల్.నారాయణ పూర్తి పేరు ద్రోణంవఝల లక్ష్మీనారాయణ. ఆయన తొలినాళ్ళలో నటి భానుమతి సొంత సంస్థ అయిన “భరణి నిర్మాణ సంస్థ” లో ప్రొడక్షన్ ఇంచార్జ్ గా ఉండేవారు. భరణి లో నిర్మాణ వ్యవహర్తగా మంచి పేరు సంపాదించుకున్న డి.యల్.నారాయణ 1951 వ సంవత్సరంలో తాను కవి సముద్రాల రాఘవాచార్య, నాట్య దర్శకులు వేదాంతం రాఘవయ్య, సంగీత దర్శకులు సుబ్బరామన్ ల భాగస్వామ్యంతో నిర్మాతగా మారి “వినోద పిక్చర్స్” పతాకంపై “స్త్రీ సాహసం” అనే సినిమా తీశారు. ఈ సినిమా ఓ మోస్తరుగా ఆడింది. ఆ తరువాత వారు తీసిన “శాంతి” (1952) సినిమా పరాజయం మూటగట్టుకుంది. 1953 వ సంవత్సరంలో “వినోద పిక్చర్స్” పతాకంపై దేవదాసు తీశారు.
దేవదాసు చిత్ర నిర్మాణ సమయంలో అనేకమంది ఈ నలుగురిని అనేక రకాలుగా భయపెట్టడంతో ముందే నష్టాల భయంతో ముగ్గురు (సముద్రాల రాఘవాచార్య, వేదాంతం రాఘవయ్య, సి.వి. సుబ్బరామన్ లు) నిర్మాణ సంస్థ నుండి తప్పుకున్నారు. కానీ మొదటినుంచి డి.యల్.నారాయణ పట్టు వదలని విక్రమార్కుడు. మంకుపట్టు పట్టితే అనుకున్నది సాధించేదాకా విశ్రమించేవారు కాదు. అలా శరత్ చంద్ర నవలను సినిమాగా మలిచి నిర్మించిన దేవదాసు (1953) ఆయన నమ్మకాన్ని నిలబెట్టింది. తెలుగు చిత్ర పరిశ్రమలోనే అనూహ్యంగా అద్భుతమైన విజయం సాధించింది. దాంతో డి.యల్.నారాయణ తన తదుపరి చిత్రంగా గురజాడ “కన్యాశుల్కం నాటకం” ను సినిమాగా తీయాలని నిర్ణయించుకున్నారు. నిజానికి “వినోదా పిక్చర్స్” వారి మొదటి మూడు సినిమాలకు వేదాంతం రాఘవయ్య దర్శకులు. దేవదాసు చిత్రం తరువాత ఆయన “వినోదా పిక్చర్స్” సంస్థ నుంచి విడిపోవడంతో ఆ చిత్రానికి దర్శకులుగా పి.పుల్లయ్యను ఎన్నుకున్నారు.
నిడివి తగ్గింపు…
“కన్యాశుల్కం” నాటకంలో మొత్తం 42 పాత్రలు ఉన్నాయి. ఆ నాటకాన్ని గనుక ఏమాత్రం మార్పులు చేర్పులు లేకుండా యథాతధంగా తీస్తే 6 గంటల సినిమా అవుతుంది. అది సినిమాకు వీలుపడదు. అందువలన ఆ నాటకంలోని కొన్ని సన్నివేశాలను, సంభాషణను కొంత మార్పులు చేశారు. ఇట్టి విషయాన్ని సినిమా ప్రారంభంలో టైటిల్స్ కు ముందే “రసజ్ఞులైన ప్రేక్షకులు ఈ మార్పులను సహృదయంతో స్వీకరించాలని విన్నవించుకున్నాము” అని తెరపై చెప్పేశారు. ఈ సినిమా రచనకు సంబంధించిన సమీకరణ బాధ్యతలను “వెంపట సదా శివ బ్రహ్మం” కు అప్పగించారు. పి. చెంగయ్య స్క్రిప్టు తయారీని పర్యవేక్షించారు. నాటకాలకు కాపీ రైట్ హక్కులు ఉంటాయి. కానీ రచయిత మరణించి అప్పటికే నలభై యేండ్లు దాటింది. కాబట్టి ఆ రచన ప్రజలదే అవుతుంది. అదేవిధంగా ఆనాటి సమాజంలో “కన్యాశుల్కం” అనే దురాచారం కనుమరుగై అప్పటికీ సుమారు మూడు దశాబ్దాలు అవుతుంది.
నాటకంలో మాదిరిగా బయట ప్రవర్తించే మనుషులు కూడా అప్పటికే కనుమరుగైపోయారు. దాంతో రచయితలకు కొంచెం స్వేచ్ఛ లభించినట్లు అయ్యింది. అందువలన సినిమా కోసం ఆ నాటకాన్ని కాసిన్ని మార్పులు చేర్పులు చేశారు. ఆ చిత్రానికి సంగీతాన్ని అందించడానికి ఘంటసాల మాస్టారును తీసుకున్నారు (దేవదాసు సినిమా సమయంలో సి.ఆర్. సుబ్బరామన్ కన్నుమూశారు). చాయాగ్రహణ బాధ్యతులను ఎన్.ప్రకాష్ కు అప్పగించారు. కన్యాశుల్కం సినిమా నిర్మాణం మొత్తం కూడా ఆనాటి “రేవతి”, “నరసు”, “వీనస్”, “శోభనాచల స్టూడియో” లో జరిగింది. ఈ సినిమాకు సహాయ దర్శకుడిగా యు.విశ్వేశ్వరరావు (ఆ తరువాత కాలంలో “విశ్వశాంతి సంస్థ” ను స్థాపించి అనేక వాణిజ్య చిత్రాలతో పాటు సమాంతర సినిమాలు కూడా తీశారు) సినిమా పరిశ్రమలో కాలుమోపారు. ఎడిటర్ ఆర్.హనుమంతరావు, దయాసాగర్ సహాకారంతో దర్శకులు పి.పుల్లయ్య “కన్యాశుల్కం” చిత్ర నిర్మాణాన్ని స్టూడియోలలో వేసిన సెట్టింగులలోనే చిత్రీకరించారు. ఈ సినిమాకు కళాదర్శకులుగా వాలి, గోడ్ గాంకర్ లు పనిచేశారు.
గిరీశం పాత్రకు ముందుగా అక్కినేని…
కన్యాశుల్కం సినిమాలో కథానాయకుడిగా నందమూరి తారక రామారావును తీసుకున్నారు. ఆయన అప్పటికే పూర్తిస్థాయి అగ్రతార హోదాకు వెళ్లిపోయారు. అందువలన సినిమాలో “గిరీశం” పాత్రను నాయకుని పాత్రగానే మలిచారు. నిజానికి కన్యాశుల్కం నాటకంలో కీలకమైన పాత్ర “గిరీశం”. ఆ పాత్ర కోసం దర్శక, నిర్మాతలు మొదటగా అక్కినేని నాగేశ్వరావు సంప్రదించారు. కానీ అప్పటికే ఆయన “దేవదాసు” చిత్రంతో ఒక స్థాయికి ఎదిగారు. దాంతో ఆయన వెంటనే ఇలాంటి పాత్ర ధరించడం తన సినీ ప్రస్థానానికి దెబ్బ అని ఆలోచించారు. అదే సమయంలో అక్కినేని “మిస్సమ్మ” సినిమాలో డిటెక్టివ్ పాత్ర పోషించారు. ఆ పాత్ర పోషించినందుకే “మీరు ఆ వేషం వేయడం ఏమిటి”? అని విమర్శిస్తూ అక్కినేనికి ఎన్నో ఉత్తరాలు వచ్చాయి. ఇదే విషయమై “మల్లాది రామకృష్ణ శాస్త్రి” ని అక్కినేని సలహా అడిగారు.
దానికి సమాధానంగా ఆయన “నీ మనసుకు ఏది తోస్తే అది చేయి నాయనా” అన్నారు. దాంతో అక్కినేని కన్యాశుల్కం సినిమాలో నటించేది లేదని డి.ఎల్. నారాయణ తో కరాఖండిగా చెప్పేశారు. దాంతో డి.ఎల్. నారాయణ కొంతకాలం అక్కినేనితో మాట్లాడలేదని అంటారు. ఆ తరువాత ఎన్టీఆర్ ను గిరీశం పాత్రకు తీసుకున్నారు. అప్పుడు ఎన్టీఆర్ కూడా నటుడిగా మంచి స్థాయిలో ఉన్నారు. ఆ సమయంలో ఎన్టీఆర్ సినిమాలు “రేచుక్క”, “మిస్సమ్మ” థియేటర్లలో నడుస్తున్నాయి. ఆ తరువాత వెంటనే “జయసింహ” కూడా వచ్చేసింది. “గిరీశం” పాత్ర ఎన్టీఆర్ ఇమేజ్ చట్టంలో ఇరుక్కుపోయింది. ఆ రోజులలో ఎన్టీఆర్ అభిమానులను “గిరీశం” పాత్ర నిరాశపరిచిందేమో? కానీ అదే చిత్రం పాతికేళ్ల తర్వాత రెండోసారి విడుదలైనప్పుడు ఆ పాత్రకు ఎన్టీఆర్ సరిపోయారు అనుకున్నారు. నిజానికి అప్పట్లో ఆ పాత్ర వేయడానికి మరో అగ్ర నటులు లేరు. ఉన్నదల్లా ఒక్క అక్కినేని నాగేశ్వరావు మాత్రమే.
నటీనటులు…
గిరీశంగా నందమూరి తారకరామారావు, మధురవాణిగా సావిత్రిని తీసుకున్నారు. ఈ సినిమాలో మధురవాణికి ఒక జావలితో సహా రెండు పాటలు కూడా పెట్టారు. కన్యాశుల్కం నాటకంలో రామప్ప పంతులు మధురవాణి చేత మేజువాణి పెట్టిస్తానని అంటాడే తప్ప ఆ పని చేయడు. కానీ సినిమాలో మేజువాణి పెట్టి దానిని పూరించారు. బుచ్చమ్మ పాత్రకు షావుకారు జానకిని తీసుకున్నారు. చిలకలపూడి సీతా రామాంజనేయులు రామప్ప పంతులుగా అసమాన రీతిలో నటించారు. ఆయన అధునాతనమైన ప్రతినాయక పాత్రకి పెట్టింది పేరు. వయస్సులో ఉన్నప్పుడు రంగస్థలం మీద గిరిశం పాత్రను గోవిందరాజుల సుబ్బారావు పలుమార్లు పోషించి ప్రేక్షకులను మెప్పించారు. ఆయనకు గిరీశం పాత్ర అన్నా, కన్యాశుల్కం నాటకం అన్నా మహా ప్రీతి. లుబ్దావధాన్లుగా ఆయన మాట, కూర్చొనే తీరు, నడక నభూతో నభవిష్యతి.
నిజానికి ఈ పాత్రకు గోవిందరాజుల సుబ్బారావు పారితోషికం తీసుకోలేదట. అంతకుముందు “దేవదాసు” సినిమాలో పార్వతి తండ్రి పాత్రకి దొరస్వామి కంటే ముందు ఈయననే తీసుకున్నారు. కానీ కొన్ని కారణాంతరాల వల్ల అది కుదరలేదు. తీసుకున్న పారితోషికం తిరిగి ఇవ్వబోతే డి.ఎల్.నారాయణ వద్దన్నారట. అందుకే కన్యాశుల్కం సినిమాకి పారితోషికం తీసుకోలేదట. విన్నకోట రామన్న పంతులు అగ్రిహోత్రావధాన్లు పాత్ర కోసమే పుట్టారని అనిపించక మానదు. అతని భార్య వెంకమ్మగా హేమలత, కొడుకు వెంకటేశంగా మాస్టర్ కుందు, కూతురు సుబ్బిగా బేబీ సుభద్ర, కరటక శాస్త్రిగా వంగర ప్రదర్శించిన నటనా చాతుర్యానికి కరటక శాస్త్రి అనే వాడు ఇలాగే ఉంటాడేమోనని, వెంకట సుబ్బయ్య, ఆయన శిష్యుడు మహేశం గా మాస్టర్ సుధాకర్, పూటకూళ్ళమ్మగా ఛాయాదేవి, లుబ్దావదాన్ల కూతురు మీనాక్షిగా సూర్యకాంతం, పొలిశెట్టిగా చదలవాడ కుటుంబరావు, సౌజన్యా రావు పంతులుగా గుమ్మడి, హెడ్ కానిస్టేబుల్ గా పేకెటి శివరాం నటించారు.
సహాపంక్తి భోజనాలు…
కన్యాశుల్కం సినిమాలో గిరీశం, బుచ్చమ్మ, మధురవాణి పాత్రలు మామూలు సగటు సినిమాలలో కనిపించే మూస వేషాలు కావు. అప్పటికే తారలుగా విశేషమైన ఖ్యాతి సంపాదించుకున్న నందమూరి తారకరామారావు, షావుకారు జానకి, సావిత్రి ఈ పాత్రలు పోషించడానికి నిజానికి వారు ఎంతగానో ఆలోచించాలి. దేవదాసు వంటి ఉదాత్తమైన చిత్రం తీసిన డి.ఎల్.నారాయణ సారథ్యంలో పి.పుల్లయ్య వంటి సీనియర్ దర్శకుల పర్యవేక్షణలో నటిస్తున్నాము అనే బేషజాలకు పోకుండా, ఆ ముగ్గురు ఎలాంటి సంశయాలకు పోకుండా తమ పాత్రలను అద్భుతంగా పోషించారు. నిజానికి ఎక్కువ మంది తారలు అప్పట్లో ఏ తరహా పాత్రనైనా వేసి మెప్పించాలనే తపన పెద్దపెద్ద తారలలో కూడా పుష్కలంగా ఉండేది. “వినోదా పిక్చర్స్” సంస్థలో తారలను చాలా గౌరవంగా చూసుకునేవారు. భోజన వసతి ఏర్పాట్లు చాలా విశిష్టంగా ఉండేవి. పెద్ద చిన్న అనే తారతమ్యం లేకుండా అందరికీ సహపంక్తి భోజనాలు ఉండేవి. భోజనం తరువాత ప్రతీ ఒక్కరికి యాపిల్ పండు ఇచ్చేవారు. సూర్యకాంతం, జానకి, సావిత్రి లాంటి తారలు ఇంటి నుండి తెచ్చిన కమ్మటి వంటకాలను అందరికీ పంచేసేవారు.
గౌరవ మర్యాదలు…
ఈ చిత్రానికి సహాయ దర్శకులు విశ్వేశ్వర రావు మొదటి నుంచి జయప్రకాశ్ నారాయణ్ అభిమాని. బీ.ఎస్సీ ఫస్ట్ క్లాస్ లో ఉత్తీర్ణుడైన విశ్వేశ్వర రావు ఉపాధ్యాయుడుగా క్రమశిక్షణాయుతమైన జీవితం గడుపుతున్నారు. ఆయన తన బావ రామచంద్రరావు బంధువు రామినేని బుచ్చిబాబు ప్రోత్సాహంతో చిత్ర పరిశ్రమలోకి వచ్చారు. డి.ఎల్. నారాయణ గౌరవ మర్యాదలు, పుల్లయ్య ఆదరాభిమానాలు విశ్వేశ్వర రావును అమితంగా ఆకట్టుకున్నాయి. కానీ కొందరు అగ్రనటులలో అగుపించే అహంకార ధోరణి ఆయనను విపరీతంగా బాధించేది. ముఖ్యంగా గోవిందరాజుల సుబ్బారావు తీరు ఆయనను ఎక్కువగా బాధించేది.
సహాయ దర్శకులను సుబ్బారావు “ఏ” అంటూ పిలవడం విశ్వేశ్వర రావు కు చిన్నతనంగా అనిపించేది. దాంతో ఒకరోజు గోవిందరాజుల సుబ్బారావుతో వాదన పెట్టుకున్నారు. తమను ఆవిధంగా పిలవడం మర్యాద కాదని, పేరుతో పిలవాలి అని గట్టిగా చెప్పేసరికి గోవిందరాజులతో పాటు ఇతర అగ్రనటులు అవాక్కయ్యారు. విశ్వేశ్వర రావు ధైర్యానికి వారు విస్తుపోయారు. ఆ తరువాత నుండి చిత్ర యూనిట్ లో విశ్వేశ్వర రావు నాయకుడు అయిపోయారు. ఆయనను అందరూ పెద్దబ్బాయి అంటూ ఆప్యాయంగా పిలవడం మొదలుపెట్టారు.
సంగీతం…
కన్యాశుల్కం సినిమా విడుదలయ్యి 69 సంవత్సరాలు దాటింది. ఈనాటికి కూడా ఈ సినిమాలోని పాటలు శ్రోతల పెదాల మీద తారాడుతూనే ఉన్నాయంటే ఈ ఘనత ఘంటసాల మాస్టారుదే అని చెప్పుకోవాలి. మహాకవులు వ్రాసిన పాటలకు ఘంటసాల వెంకటేశ్వరరావు మధురంగా స్వర కల్పన చేసి తన ప్రతిభను చక్కగా చాటుకున్నారు. నాటకంలో సందర్భాలకు అనుగుణంగా సంగీతం, సాహిత్యం, పోటీపడేలా పాటల రచన జరిగింది. ఇందులో మొదటగా అందరికీ గుర్తుకు వచ్చే పాట “చిటారు కొమ్మన మిఠాయి పొట్లం”. మల్లాది రామకృష్ణ శాస్త్రి ఈ పాటను వ్రాశారు. ఆయన గిరీశం పాత్రను క్షుణ్ణంగా అర్థం చేసుకొని ఆ పాత్ర సౌందర్య లాలిత్యాన్ని, ముగ్థ ప్రియత్వాన్ని ఆలంబనగా చేసుకొని ఈ పాటను వ్రాశారు. సున్నితమైన శృంగారం, చిద్విలాసం చోటు చేసుకున్న ఈ పాటకు ఘంటసాల సమకూర్చిన బాణి, వినిపించిన వాణి కూడా అద్వితీయం.
అలాగే శ్రీశ్రీ తన మహాప్రస్థానంలో వ్రాసుకున్న ఆనందం అర్ణవమైతే అనే గేయాన్ని కన్యాశుల్కం సినిమాలో పాటగా మలుచుకున్నారు. నిజానికి గేయాన్ని గీతంగా మలచాలంటే చాలా కష్టం. అందులో అనేక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అందులో ఇంకా ప్రసిద్ధి చెందిన గేయమంటే ఇక చెప్పనవసరం లేదు. అయినా ఘంటసాల అందించిన బాణీ, కంగుమంటూ మోగే సుశీల కంఠం, సావిత్రి ముగ్ధ మనోహర అభినయం ఈ పాటను ఎన్నెల్లైనా మర్చిపోకుండా చేస్తున్నాయి. బసవరాజు అప్పారావు వ్రాసిన నాగుల చవితి పాట “నాగేంద్ర నీ పొట్టనిండా” పాటకు కు, తత్వానికి జన సామాన్య వ్యవహారంలో ఉన్న బాణీలను ఉపయోగించుకోవడం బాగుంది. రత్నం అనే గాయని ఈ పాటను పాడింది. అలాగే గురజాడ వారు వ్రాసిన “పుత్తడి బొమ్మ పూర్ణమ్మ” గేయ నాటకాన్ని సినిమాలో సందర్భానుసారం ఉపయోగించుకున్నారు. అక్కడ పూర్ణమ్మగా మనోహరంగా కనిపించిన బేబీ “ప్రేమీల”. ముసలి భర్తగా కనిపించినది కంచి నరసింహారావు. ఘంటసాల గళంలో ఆ పాట ఎప్పుడు విన్నా కూడా కళ్ళు చెమర్చుతాయి.
ఊర్వశి శారద “తొలి సినిమా”..
ఈ నాటకంలో మధురవాణి తనకు కంటె తేలేదని రామప్ప పంతులును ఇంట్లోకి రానివ్వదు. దాంతో నిరాశతో రామప్ప పంతులు వెళ్లిపోయే సందర్భంలో గురజాడ వ్రాసిన మరో కొత్త గేయం “ఇల్లు ఇల్లనేవు, ఇల్లు నాదనేవు” ని వాడుకున్నారు. ఈ సినిమాలో మహేశం (మాస్టర్ సుధాకర్) మీద చిత్రీకరించిన ఈ పాటను కోరస్ గాయనిగా ఉన్న పద్మప్రియ అనే గాయని చేత పాడించారు. డి.ఎల్.నారాయణ ఆమెతో “బొమ్మలు పెళ్లి” పాట కూడా పాడించారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి “చేదాము రారే కళ్యాణమే” అనే పాటను వ్రాశారు. న్యాయపతి కామేశ్వరరావు బాలనంద సంఘం సభ్యులుగా ఉన్న ఆడపిల్లలు ఈ పాటలో అభినయించారు. చరణాలలో అభినయించిన ఇద్దరు పాపలలో ఒకరు నటి శారద.
భారతీయ సినిమా చరిత్రలో మూడు సార్లు ఊర్వశి పురస్కారాన్ని పొందిన ఏకైక తార శారద. మన తెలుగింటి శారద. బహుశా శారద కెమెరా ముందు నిలబడ్డ మొదటి సినిమా కన్యాశుల్కమే. అప్పటికి ఆమె శారద కాదు, బేబీ సరస్వతి. సినిమా ప్రారంభంలో మధురవాణి మీద చిత్రీకరించిన “సరసుడ దరిజేరరా ఔరా” అనే జావలి వ్రాసింది సదా శివ బ్రహ్మం. ఎన్.ఎల్. గాన సరస్వతి ఆ పాటను పాడారు. ఆమె కర్ణాటక సంగీతంలో నిష్ణాతురాలు. గాన సరస్వతి సినిమాలో పాడింది చాలా తక్కువ. పతాక సన్నివేశాలలో వచ్చే “కీచక వద” వీధి భాగవతం వ్రాసింది సముద్రాల రాఘవచార్య. ఈ వీధి భాగవతానికి గొంతు కలిపిన వారు మాధవపెద్ది సత్యంతో మరియు పద్మప్రియ. ఈ సినిమాకు నృత్య దర్శకత్వం వహించింది పసుమర్తి కృష్ణమూర్తి.
“తార” లైనా క్రమశిక్షణ తప్పదు…
సహాయ దర్శకులు విశ్వేశ్వర రావుకు చిత్రలేఖనంలో కూడా ప్రవేశం ఉంది. దర్శకులు పి.పుల్లయ్య ఆయనకు దుస్తులు, అలంకరణ, సన్నివేశాల కొనసాగింపు వంటి సాంకేతికమైన అంశాల గురించి వివరంగా చెప్పడమే కాకుండా జాగ్రత్తగా గమనించవలసిందిగా ఆదేశించారు. విశ్వేశ్వర రావుకు చిత్రలేఖనంలో ప్రవేశం ఉండడంతో సన్నివేశాల కొనసాగింపుకు సంబంధించిన అంశాలన్నీ బొమ్మలు వేసుకొని వాటి ఆధారంగా సన్నివేశాల చిత్రీకరణను జాగ్రత్తగా గమనించేవారు. ఆ చిత్రీకరణ సందర్భంగా ఒక సంఘటన జరిగింది. మధురవాణి పాత్రధారిగా అభినయిస్తున్న సావిత్రి తన చేతులకు మూడు రంగుల్లో ఉన్న గాజులు వేసుకునేవారు. ఆ గాజుల రంగులు ఏ వరుసలో ఉండేవో విశ్వేశ్వర రావు బొమ్మలు వేసుకుని వాటిని గుర్తుపెట్టుకున్నారు. చిత్రీకరణలో మొదటి షెడ్యూల్ అయిపోయింది.
రెండో షెడ్యూల్ ఆరంభమయ్యాక మొదటి రోజు సావిత్రి మీద సన్నివేశం చిత్రీకరిస్తున్నారు. మేకప్ చేయించుకుని బయటకు వచ్చిన సావిత్రి చేతులను గమనించి విశ్వేశ్వర రావు గాజులు మొదటి షెడ్యూల్ లో వేసుకున్న క్రమంలో లేకపోవడం గుర్తించారు. నిజానికి సినిమా వర్ణ చిత్రం కాదు. కానీ నలుపు, తెలుపు లో కూడా వర్ణ క్రమం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇట్టి విషయాన్ని వెంటనే విశ్వేశ్వర రావుకు నటి సావిత్రి దృష్టికి తీసుకెళ్లారు. గాజుల వర్ణ క్రమం ఎలా ఉండాలో కూడా వివరించారు. సావిత్రి అప్పట్లో చాలా చికాకులలో ఉండేవారు. జెమినీ గణేషణ్ ను గుడిలో రహస్య వివాహం చేసుకుని సావిత్రి ఇంట్లో వాళ్లకు ఆ విషయం తెలియకుండా దాచిపెట్టడానికి నానా అవస్థలు పడుతున్న రోజులు అవి. విశ్వేశ్వర రావు ఆవిడకు గాజుల కొనసాగింపు గురించి చెప్పారు.
ఇదంతా ముఖ్యమైన విషయమా అన్నట్టుగా ఆయన వైపు సావిత్రి చూశారు. ఇది రంగుల సినిమా కాదు కదా అని అడిగారు. విశ్వేశ్వరరావుకు సావిత్రికి ఓపికగా రంగుల సినిమా కాకపోయినా కొనసాగింపులో ఇది చాలా ముఖ్యమైన విషయం అని విశదీకరించారు. చికాకుగా ఉన్న సావిత్రి చిత్రీకరణ చేయడానికి ముందు మార్చుకుంటానులే అన్నారు, కానీ మార్చుకోలేదు. రిహార్సల్స్ అయ్యాయి. స్టార్ట్ అన్నారు పుల్లయ్య చిత్రీకరణ మొదలుయ్యింది. విశ్వేశ్వరరావు మళ్ళీ సావిత్రి చేతుల వైపు చూశారు. ఆవిడ గాజుల వరుసక్రమం మారలేదు. అంటే కొనసాగింపు తప్పుతుందని వెంటనే హడావుడిగా కట్ అంటూ పెద్దగా అరిశారు. దాంతో సెట్లో వాళ్లంతా హడలిపోయారు. నిజానికి కట్ చెప్పాల్సింది దర్శకులు పుల్లయ్య. మరి ఈ కుర్రాడు ఎందుకు కట్ చెప్పినట్టు.
నిజానికి పి.పుల్లయ్య దుర్వాసుడే. విశ్వేశ్వర రావు పనైపోయింది అనుకున్నారంతా. పి.పుల్లయ్య తన సీట్లోంచి లేచి విశ్వేశ్వరరావు దగ్గరికి వెళ్లారు. ఈ సినిమాకి దర్శకుడుని నేనా, నువ్వా అని హఠాత్తుగా అడిగారు. కానీ విశ్వేశ్వరరావు రావు కంగారు పడలేదు. తను ఎందుకు కట్ చెప్పవలసింది వచ్చిందనేది ఆయనకు వివరించారు. తనకు అప్పచెపిన బాధ్యత సక్రమంగా నిర్వహించినందుకు విశ్వేశ్వర రావును పుల్లయ్య కౌగిలించుకున్నారు. వెంటనే సావిత్రి వైపు తిరిగి గాజులు ఎందుకు మార్చుకోలేదని అడిగారు. సావిత్రి మాట్లాడలేదు నేరుగా మేకప్ రూమ్ కి వెళ్లి నడిచి గాజుల వరుస క్రమం మార్చుకొని వచ్చింది. చిత్రీకరణ కొనసాగింది. ఎంత పెద్ద నటీమణి అయినా సరే క్రమశిక్షణ పాటించాల్సిందేనని పి.పుల్లయ్య పరోక్షంగా హెచ్చరించారు.
విడుదల…
అతిరథ మహారథుల లాంటి ప్రముఖ నటీనటులందరూ పాల్గొన్న ఉత్సాహపూరితమైన వాతావరణంలో కన్యాశుల్కం చిత్రీకరణ పూర్తయిపోయింది. విజయనగరం పురవీధులను బొమ్మలుగా గీయించి వాటి మీద నటీనటులు, సాంకేతిక నిపుణుల పేర్లు వేశారు. ఈ చిత్రాన్ని కన్యాశుల్కం నాటక రచయిత గురజాడ గారికి అంకితం ఇచ్చారు. ఈ చిత్ర దర్శకులు పుల్లయ్య ఈ సినిమాకు ఎంతో శ్రద్ధగా పనిచేశారు. కానీ ఆయనకు మొదటి నుండి కూడా ఈ చిత్ర విజయం మీద పెద్దగా నమ్మకం లేదు. ఇది జనానికి నచ్చదేమో అని అంటుండేవారు. డీ.ఎల్. నారాయణ మాత్రం పుల్లయ్యతో ఏకీభవించేవారు కాదు. కన్యాశుల్కం సినిమా తప్పక విజయం సాధిస్తుందని అనేవారు. 26 ఆగస్టు 1955వ తేదీ నాడు కన్యాశుల్కం సినిమా విడుదలైంది.
ఈ సినిమా గురించి ఎంతో ఊహించుకుని వచ్చిన ప్రేక్షకుల అంచనాలను ఈ చిత్రం అందుకోలేకపోయింది. కన్యాశుల్కం నాటకాన్ని సినిమాగా మలచడానికి దర్శక, నిర్మాతలు చేసిన మార్పులు వారికి ఏమాత్రం నచ్చలేదు. రంగస్థలం మీద విరివిగా ప్రదర్శిస్తున్న ఈ నాటకాన్ని కుదించడాన్ని ప్రేక్షకులు భరించలేకపోయారు. అతిరథ మహారథ నటులున్నా ఈ సినిమాను బతికించలేకపోయారు. నాటకం పరువును, గురజాడ పరువును తీసేసారని కొందరు ఘాటుగా విమర్శించారు. అప్పట్లో సినిమా సమీక్షలను ప్రజలు బాగా చదివేవారు. శ్రీశ్రీ, ఆరుద్ర వంటి సుప్రసిద్ధ కవులు కొంత వ్యతిరేక భావము, మరింత తేలిక భావము వ్యక్తీకరించడంతో సినిమా జనాలకు దూరమైంది.
మొదట పరాజయం…
అప్పట్లో సహాయ దర్శకులు సినిమా విడుదలైన తరువాత ఆంధ్రదేశమంతటా పర్యటించి సినిమా మీద ప్రజల అభిప్రాయ సేకరణ చేసే సంప్రదాయం ఉండేది. విశ్వేశ్వర రావు కూడా అలాగే విజయనగరం ప్రాంతానికి వెళ్లారు. చిత్ర ప్రదర్శన శాలలో కొందరు ఇదేదో బ్రాహ్మణ కుల కథలా ఉందే అని వ్యాఖ్యానించారట. ఇది మన ఊరి కథే కదా. ఇందులో విశేషమేముంది అని మరికొందరు వ్యాఖ్యానించారట. ప్రధానంగా వచ్చిన విమర్శ ఏమిటంటే “సారా కొట్టు సన్నివేశం లేని కన్యాశుల్కం పప్పులేని పులగంతో సమానం”. అలాగే గిరీశం వంటి వాడిని బుచ్చమ్మకు ఇచ్చి పెళ్లి చేయడం చిత్రం సుఖాంతం కావడానికి ఉపకరిస్తే ఉపకరించవచ్చు. కానీ అలా పెళ్లి జరిపించడం క్షంతవ్యం కాని నేరం. నందమూరి తారకరామారావు వంటి గొప్ప నటుడు “పోకిరి” గిరిశం పాత్ర వేయడం ఏంటి అని యువత ఈ సినిమాకి రాలేదు. ఈ సినిమా వ్యవహారిక భాష పట్ల అభ్యంతరంతో కొందరు రాలేదు. కారణాలు ఏవైనా సరే సినిమా బాక్సాఫీసు వద్ద పరాజయంగా మిగిలిపోయింది.
మలి విడుదలలో అద్భుతమైన విజయం…
కథానాయకుడు నందమూరి తారకరామారావు, దర్శకులు పుల్లయ్యలు ఎంపిక చేసిన పొరపాటు వల్లే సినిమా ఆడలేదని నిర్మాత డి.యల్. నారాయణ సన్నిహితులైన పేకటి శివరామ్ చాలా సంవత్సరాల తరువాత ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. వేదాంతం రాఘవయ్యకు దర్శకత్వం అప్పగించి ఉంటే ఈ చిత్రం ఇంకా బాగా వచ్చి ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. కానీ నిర్మాత డి.యల్. నారాయణ కన్యాశుల్కం మీద పెట్టుకున్న నమ్మకం చాలా సంవత్సరాల తరువాత నిజమైంది. కన్యాశుల్కం పాతికేళ్ల తరువాత ఎప్పుడు విడుదలైనా కూడా రాష్ట్రంలో మంచి వసూళ్లు సాధించింది. 1983లో హైదరాబాద్ లోని సంధ్య 70 యమ్. యమ్. లో మధ్యాహ్నం ఆటలతో విడుదలై ఏకబిగిన 19 వారాలు ఆడింది.
ఆ తరువాత కల్పన, దీపక్ మహల్ థియేటర్ లలో రెగ్యులర్ షోలతో సిల్వర్ జూబ్లీ చేసుకుంది. మళ్ళీ 1996లో హైదరాబాదులోనే “సప్తగిరి” థియేటర్ లో విడుదలై 51 రోజులు ఆడింది. దరిమిలా కన్యాశుల్కం షిప్టింగ్ మీద వంద రోజులు ఆడింది. 1986లో విజయవాడ లోని “విజయ టాకీస్” లోనూ, గుంటూరు రాధాకృష్ణ లోనూ విడుదలై కన్యాశుల్కం 100 రోజులు ఆడింది. అయితే దర్శకులు పి.పుల్లయ్య ఉపయోగించిన శిష్టా వ్యవహారికం సినిమా విజయానికి ఎంత ఉపకరించిందో పాతికేళ్ల తరువాత ఈ చిత్ర ఘనవిజయం నిరూపించింది. పాత చిత్రాలు తిరిగి విడుదల అయ్యి భారీ విజయం సాధించి, ఎక్కువ డబ్బులు సంపాదించిన చిత్రంగా కన్యాశుల్కం చరిత్రలో నిలిచిపోయింది.
బుచ్చమ్మ పాత్రలో “జానకి”
కన్యాశుల్కం సినిమా లో బుచ్చమ్మ పాత్రను మొదట్లో జమునకు ఇవ్వాలని నిర్మాత డి.ఎల్. నారాయణ భావించారట. అయితే వితంతు పాత్ర ధరించేందుకు జమున తల్లిదండ్రులు అంగీకరించలేదు. చివరికి ఆ పాత్ర షావుకారు జానకిని వరించింది. అంతకుముందు డి.ఎల్. నారాయణ తన “దేవదాసు” లో పార్వతి పాత్రకు షావుకారు జానకిని తీసుకున్నారు. దుస్తులు కూడా కుట్టించారు. కానీ భాగస్వామ్యపు బేదాభిప్రాయాలతో హఠాత్తుగా జానకిని తప్పించి ఆ పాత్రను సావిత్రితో వేయించారు.
ఏదేమైనా కన్యాశుల్కంలో ఎన్టీఆర్ కు జోడిగా పాత్రను ఇచ్చి గతంలో చేసిన పొరపాటున సరిదిద్దుకున్నారు. ఈ సువర్ణ అవకాశాన్ని షావుకారు జానకి బాగా వినియోగించుకున్నారు. బుచ్చమ్మలో దాగిన వైవిధ్యాన్ని ఆమె ఎంతో బాగా తన నటనలో ప్రదర్శించారు. ఓ సందర్భంలో “గిరీశం గారు నేను తల చెడిన దాన్నే గానీ, మతి చెడిన దాన్ని కాదు” అంటారు. ఆ సన్నివేశంలో ఆమె అభినయం అద్భుతం. నగలు, ఖరీదైన చీరలు ధరించే అవకాశం లేని “బుచ్చమ్మ” పాత్రలో జానకి తన సహజ సౌందర్యంతో కన్నుల పండుగ చేశారు. దర్శక, నిర్మాతలు, ప్రేక్షకులు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయలేదు.
సావిత్రి…
కన్యాశుల్కం సినిమాలో లుబ్దావధానులు మాడుకు మధురవాణి నూనె అంటి పిలక చుట్టి సుతారంగా పాయలు తీసే సన్నివేశంలో సావిత్రి నటన మర్చిపోలేనిది. అప్పటికి ఆమె సినిమాలకు వచ్చి కేవలం అయిదు సంవత్సరాలు మాత్రమే అయ్యింది. పట్టుమని పాతిక సినిమాల అనుభవం కూడా లేదు. కానీ ఒక నటిగా ఆ సినిమాలో తాను చూపించిన పరిణీతి మాత్రం అద్భుతం అనిపిస్తుంది. సావిత్రి వ్యక్తిగత జీవితంలో 1954 – 55 సంవత్సరాలు చాలా కష్టమైన రోజులు. ఆమె అప్పటికే ఇంట్లో వాళ్లకు చెప్పకుండా జెమినీ గణేషణ్ ను పెళ్లి చేసుకుంది.
పుల్లయ్య తమిళంలో తీసిన “మనం పోల్ మాంగల్యం” (1952) నిర్మాణ కాలంలో సావిత్రి, జెమినీ గణేశన్ ఇద్దరూ గుళ్లో రహస్య వివాహం చేసుకున్నారు. జెమినీ గణేశన్ అప్పటికే వివాహితుడు. పిల్లలు కూడా ఉన్నారు. అయినా సావిత్రి అతని మొహంలో తడిసి ముద్దయిపోయింది. సావిత్రి ఇంట్లో వాళ్లకు ఈ విషయం తెలియదు. ఆమె వ్యవహారాలన్నీ వాళ్ళ పెద్దనాన్న వెంకట్రామయ్య చౌదరి చూసేవారు. ఆయన అప్పటికే ఆమె మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. ఆమె సంపాదనతో తోటలు, పొలాలు కొని ఇంకా పెద్ద మొత్తంలో సంపాదించి కాలు మీద కాలేసుకుని కూర్చోవాలని తహతహలాడేవారు.
కన్యాశుల్కం సినిమా నిర్మాణం ఆరంభించే నాటికి ఆయనకు సావిత్రి మీద అనుమానం వచ్చేసింది. ఒక ఫోటో ప్రకటన కోసం సావిత్రి దిగిన ఫోటో వెనక సావిత్రి గణేషణ్ అని వ్రాసుకోవడమే అందుకు కారణం. అది ఇంట్లో వారి కంట పడింది. పెదనాన్న అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. సావిత్రి తన చెప్పు చేతుల్లోంచి ఇంకా పూర్తిగా జారిపోలేదని నిర్ధారించుకోవడానికి చౌదరి ఆమె పేరు ఈ సినిమాలోకి కె.సావిత్రి అని వేయించమన్నారు. పెళ్లి విషయం బయట పెట్టేందుకు ఇంకా పూర్తిగా ధైర్యం చాలని సావిత్రి ఆయన చెప్పినట్టే చేసింది. కన్యాశుల్కం సినిమాలో గమనించి చూస్తే మరే సినిమాలో లేనివిధంగా సావిత్రి పేరు టైటిల్స్ లో కే.సావిత్రి అని వస్తుంది.
చౌదరిని ఆశ్రయించిన కొందరు పాత్రికేయులు సావిత్రి తన పారితోషికం పెంచేయడం గురించి తమ పత్రికల్లో తీవ్ర విమర్శలు చేశారు. నిజానికి ఇందులో సావిత్రి తప్పేం లేదు. నెలకు 500 చొప్పున అప్పట్లో తన పారితోషికం ఉండేది. నెల జీతం పద్ధతిని తీసేసి సినిమాకు 20,000 రూపాయలు ఏక మొత్తంగా ఇవ్వాలని చౌదరి షరత్తు పెట్టారు. ఇదే విషయాన్ని పెద్దది చేస్తూ కొన్ని పత్రికలు ఆమె మీద బురద చల్లే ఈ శ్రీకాకుళం ప్రయత్నం చేశారు. అన్నిటికి నడుమ ఆమె కన్యాశుల్కంలో నటించింది. కానీ ఆ సినిమాలో ఎక్కడ కూడా ఈ బాధల తాలూకు నీడలు కూడా మనకు ఏమాత్రం కనిపించవు.