CINEMATelugu Cinema

నిజ జీవితంలో తుదివరకు నోచుకోని కొందరి సినీ తారల జీవితాలు…

సినిమా తారల జీవితాలు వడ్డించిన విస్తర్లు కావు. తారాపథం చేరుకోవడానికి నటీమణులు ఎన్ని తంటాలు పడతారో, ఆ తరువాత వారి జీవితాలు ఏవిధంగా సాగుతాయో వివరిస్తూ వచ్చిన పలు కథలు, కథనాలు ఆంధ్రదేశాన్ని ఒక ఊపు ఊపాయి. దాంతో సినిమాలలో రాణించాలంటే కేవలం నటన మీద అభిలాష, ప్రతిభ ఉంటే సరిపోదు. దానికి సంబంధించి చాలా అర్పించుకోవాల్సిన అంశాలు ఉంటాయి అని సినీరంగ ప్రవేశానికి వెనుకంజ వేసిన ఎందరో నటీమణులు ఉన్నారు. ఇకపోతే సాంప్రదాయ కుటుంబాలలోని అమ్మాయిలకు సినిమా రంగంలో రాణించాలనే అభిలాష ఉన్నా కూడా సినిమా రంగంలో ఉన్న పరిస్థితులను భూతద్దంలో చూపించడం ద్వారా భయపడిపోయేవారు.

1970 వ దశకం ఆరంభంలో ఇలాంటి కథలు అధికంగా కనిపిస్తున్న తరుణంలోనే నటి లీలారాణి ఆత్మహత్య అప్పట్లో సంచలనం సృష్టించింది. “స్నేహబంధం”, “బడిపంతులు”  వంటి చిత్రాలలో నటించిన లీలారాణికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉందని పత్రికలు కూడా భావించాయి. ఈ తరుణంలోనే ఆమె ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అందుకు గల కారణాలు రకరకాలుగా వినిపించినా ఆమె ఆత్మహత్యకు కారణంగా ఇప్పటివరకు సినిమా తారల కథల్లో మాత్రమే వినిపిస్తున్న అంశాలు నిజమే కాబోలు అని సామాన్యులు భావించసాగారు.

ఇలా తారల అర్థాంతర మరణాలు హాలీవుడ్ చిత్ర పరిశ్రమ మొదలుకొని బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు విస్తరిస్తూ వచ్చింది. డయానా బారీమోర్, బార్బరా బేట్స్, మైఖేల్ గిల్డెన్, డేవిడ్ స్టీఫెన్ రాప్పపోర్ట్, మార్లిన్ మన్రో, జాన్ బెర్గ్, లూసీ ఇమోజెన్ గోర్డాన్, మైఖేల్ అలాన్ గోథార్డ్, లోరీ బస్ మెటల్, కాపసైన్ లాంటి తదితర హాలీవుడ్ నటులు వివిధ రకాల కారణాలతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. అలాగే ప్రపంచంలో హాలీవుడ్ తరువాత అంతటి పెద్ద చిత్ర పరిశ్రమ అయిన బాలీవుడ్ లో సైతం లెక్కలేనన్ని విషాద సంఘటనలు చోటుచేసుకున్నాయి.  నిన్నటి తరం నటులయిన గురుదత్, మధుబాల, గీతాబాలి, మీనకుమారి, పర్వీన్ బాబి మొదలుకొని నఫీసా జోసెఫ్, మహేష్ ఆనంద్, కవి కుమార్ ఆజాద్, ఓంపురి, ఇంద్ర కుమార్, తరుణి, కునాల్ సింగ్, సందీప్ ఆచార్య, దివ్యభారతి, జియా ఖాన్  ప్రత్యూష బెనర్జీ, ప్రియా రాజ్‌వంశ్, శ్రీదేవి, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వరకు ఎన్నో ఆత్మహత్యలు, మరిన్నో అనుమానాస్పద మరణాలు, వీటన్నింటికి సవాలక్ష కారణాలు. 

అలాగే టాలీవుడ్ విషయానికొస్తే  ఒకప్పటి హీరోయిన్ లీల రాణి హత్య చిత్ర పరిశ్రమలో సంచలనం అయ్యింది. దాంతో బాటు టాలీవుడ్ కు చెందిన మీనన్, తమిళంలో బాలు మహేంద్ర తీసిన చాలా సినిమాల్లో కథానాయక శోభ లాంటి వారు ఆత్మహత్య చేసుకున్నారు. ఫటాఫట్ జయలక్ష్మి, కాంచనమాల, మహానటి సావిత్రి, జగదేక సుందరి దివ్యభారతి, వేశ్య పాత్రలో పేరు పొందిన సిల్క్ స్మిత, కలుసుకోవాలనితో మంచి నటిగా పేరు తెచ్చుకుంటున్న తరుణంలో అర్ధాంతరంగా రాలిపోయిన భువనగిరికి చెందిన తార ప్రత్యూష, తెలుగులో ఇష్టం సినిమాలో నటించిన మోనాల్ (సిమ్రాన్ చెల్లెలు), బుల్లితెర నటులు అచ్యుత్, ఐశ్వర్య రాజేష్ తండ్రి రాజేష్, నిన్నటి తరం నటులు రాజా, నటులు రఘువరన్, తెలుగు వారికి అత్యంత ఇష్టమైన నటి సౌందర్య, అష్టా చెమ్మా సినిమాలో నటించిన నటి భార్గవి, అమ్మాయిలు అబ్బాయిలు సినిమాలో నటించిన విజయ్ సాయి, ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమా హీరో యశో సాగర్, హీరో శ్రీహరికి, నటుడు ఉదయ్ కిరణ్, నటి ఆర్తి అగర్వాల్,  ప్రేమికుల రోజు కథానాయకుడు కునాల్ సింగ్, సీనియర్ నటులు రంగనాథ్, ఇష్టం సినిమా హీరో చరణ్ రెడ్డి, గమ్యం సినిమా సంగీత దర్శకులు అనిల్ రెడ్డి, బ్యాండ్ బాలు చిత్ర కథానాయకుడు బూచేపల్లి కమలాకర్ రెడ్డి, నృత్య దర్శకులు విజయ్, ప్రశాంత్ లు వివిధ కారణాలతో మరణించారు.

అదేవిధంగా పలు చిత్రాలలో నటించిన సుగంధిని, విజయలక్ష్మి, సునయని, లక్ష్మీ శ్రీ, ఆంచల్, మధుమాలిని, మయూరి, నివేదిత జైన్, ఆల్ఫాన్సా మొదలగు సినీ పరిశ్రమకు చెందిన నటీనటులు అకాల మరణం చెందారు. ఇటీవలే మరణించిన శ్రీదేవి, సుశాంత్ సింగ్ మరణాలు కూడా పలు అనుమానాలను రేకెత్తించాయి. వీరితో బాటు కమెడియన్ వేణుమాధవ్ కూడా మరణించిన సంగతి తెలిసిందే.  ఇలా మన తెలుగు చిత్రరంగంలో తమ నటనతో ప్రేక్షకులను అలరించిన పలువురు తారలు అర్థాంతరంగా తమ జీవిత చిత్రాలకు ముగింపు పలికేశారు.

నటిగా ఎలాంటి సమస్యలు లేకుండా తారగా వెలిగినన్ని నాళ్ళు వెలిగి, తన అందమైన అభినయంతో అనేకమంది ప్రేక్షకాభిమానులను సంపాదించుకున్న నటి సౌందర్య హఠాన్మరణం చెందారు. ఆమె ఏ సమస్యతో బాధపడకుండానే తనువు చాలించుకున్నా అర్థాంతరంగా ఎంతోమంది అభిమానులను శోకసముద్రంలో ముంచేసి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది. వివాహం తరువాత చాలామంది తారలు తమ ప్రాభవాన్ని కోల్పోయారు. కానీ వివాహానంతరం కూడా సౌందర్య సినిమాలు చేసుకుంటూ వస్తున్న తరుణంలో అసువులు బాపడం తెలుగు సినిమాకు తీరని ఆవేదన కలిగింది. తారలుగా రాణిస్తూనే అర్ధాంతరంగా జీవితాన్ని చాలించిన వారిని ఓ మారు స్మృతి చేసుకుంటే…

నటి లీలా రాణి ఆత్మ “హత్య”… 

ఒకప్పటి కథానాయిక లీలా రాణి ఆత్మహత్య తెలుగు చిత్రపరిశ్రమను కలిచివేసింది. 1955 లో జన్మించిన ఆమె విజయనగరానికి చెందిన నాటక కాంట్రాక్టరు బాపు నాయుడు కుమార్తె. శ్రీకాకుళం, విశాఖ జిల్లాలో రంగస్థల నటిగా ఎంతో పేరు తెచ్చుకున్న ఆమె మద్రాసు వెళ్లి సినిమాలలో అదృష్టాన్ని పరీక్షించుకుంది. “శ్రీకృష్ణ మాయ”, “బడిపంతులు”, “ఇల్లు ఇల్లాలు”, “స్నేహబంధం”, “కలిసొచ్చిన కాలం”, “జీవితాశయం” మొదలగు చిత్రాలలో నటించి అగ్ర కథానాయికగా ఎదుగుతున్న రోజులలో అనూహ్య సంఘటన జరిగి ఆమె ఆత్మహత్యకు గురైంది. దర్శకుడు, నిర్మాతకు మధ్య ప్రేమ వివాహానికి నలిగిపోయి 1974లో ఆమె ఆత్మహత్య చేసుకుంది అనేది పత్రికా ప్రకటన. కానీ నిజానికి ఆమెది హత్య అనేది న్యాయస్థానం కథనం.

ఒకరోజు రాత్రి ఆలస్యంగా చిత్రీకరణ ముగించుకొని హాబీబుల్లా రోడ్డులోని తన ఇంటికి చేరింది. లైట్ వేయగానే ఆ గదిలో రహస్యంగా దాగి ఉన్న వ్యక్తి ఒకరు తన వెనుకనుండి ఆమె మీద దాడిచేసి కసిదీరా పొడిచాడు. పదుల సంఖ్యలో కత్తిపోట్లు. రక్తం వరద. నిముషాల్లో ప్రాణం పోయింది. హంతకుడు పారిపోయాడు. ఈ హత్య ప్రేమ సంబంధంగా ఉన్నదా అనే కోణంలో విచారణ జరిగినా చివరికి నేర నిరూపణ కాలేదు. ఆమెకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉందని పత్రికలు కూడా భావించాయి. ఈ తరుణంలోనే ఆమె ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అందుకు కారణాలు రకరకాలుగా వినిపించాయి అని పత్రికలు కథనాలు వెలువరించాయి. అలా సంభవించిన ఆమె మరణం వెనుక గల కారణం, ఇప్పటి సినిమా తారల కథలలో వినిపిస్తున్న మరణ కారణాలు, వాటి అంశాలు నిజమే అని ప్రేక్షకులకు అనిపిస్తుంటాయి.

ప్రేమ విఫలమై…

నిజానికి సినిమా తారల ఆత్మహత్యల వెనుక వారి భగ్న ప్రేమలే కారణమని చెప్పే కొన్ని కథలు, వాటిని నిజం చేస్తూ ఆ తరువాత తనువు చాలించిన తారలు ఆ కథలు నిజమే అని నిరూపించారు. దక్షిణ భారతదేశ సినిమా ప్రముఖ దర్శకులు కె.బాలచందర్ రూపొందించిన “అంతులేని కథ” చిత్రం అనేకమంది నటీనటులకు గుర్తింపు సంపాదించి పెట్టింది. ఈ చిత్ర కథానాయిక జయప్రద, అందులో ఆమెకు అన్నగా నటించిన రజినీకాంత్, వికటకవిగా నటించిన నారాయణరావు, ప్రతీ మాటకు ముందు “ఫటాఫట్” అనే పాత్రను పోషించిన జయలక్ష్మి ఈ సినిమా ద్వారా గుర్తింపు సంపాదించుకుంది. “ఫటాఫట్” అనడం వలన ఆ పదమే జయలక్ష్మి  ఇంటిపేరు అయిపోయింది.

జయలక్ష్మి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో 66 చిత్రాలలో నటించింది. సినిమా రంగంలో సత్సంబంధాలు ఉన్న కోదండ రెడ్డి అనే నెల్లూరు వాసి కూతురు జయలక్ష్మి. ఆమె తమిళనాడులో తిరుగులేని నాయకుడు అనిపించుకున్న ఎం.జి.రామచంద్రన్ తమ్ముడు చక్రపాణి కొడుకు సుకుమార్‌ను ప్రేమించింది. ఆ ప్రేమ కొన్నాళ్లు నిరాటంకంగానే సాగింది. మరి ఎందుకని వికటించిందో ఎవ్వరికీ తెలియదు. ఆ ప్రేమ పెళ్ళిగా కార్యరూపం దాల్చలేదు. 1980 వ సంవత్సరంలో నటిగా ఉన్నత స్థాయిలో ఉన్న దశలో తన 22 యేళ్ల పిన్న వయస్సులోనే ఈమె నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంది.

అంతకుముందే ఆమె నటించిన స్వర్గ నరకం (1975) చిత్రం వాణిజ్య పరంగా ఘనవిజయం సాధించడంతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. ఆ తరువాత యుగపురుషుడు (1978), కోరికలే గుర్రాలైతే (1979), తిరుగు లేని మనిషి (1981) వంటి చిత్రాలలో ఆమె నటించింది. విచిత్రం ఏమిటంటే “తిరుగులేని మనిషి” చిత్రంలో నందమూరి తారకరామారావుకు చెల్లెలుగా జయలక్ష్మి నటించింది. అందులో తన ప్రేమను అన్న కాదనడంతో ఆమె నిద్ర మాత్రలు మ్రింగి ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటుంది. ఆ తరువాత అన్న ప్రమేయంతో బ్రతికి బట్టకడుతుంది. కోరుకున్న వాడితోనే కొంగుముడి వేయించుకుంటుంది. ఇది సినిమా. కానీ నిజ జీవితంలో ఆమె కోరుకున్న వాడిని చేరుకోలేదని భావించి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుని జీవితాన్ని చాలించింది. అప్పుడప్పుడే ఆమె వర్ధమాన నాయికగా రాణిస్తూ ఉండేది. కథానాయికగా సరైన విజయాలు చూడకముందే ఆమె ఆయువు తీరింది.

మరో ప్రేమ..

ఫటాఫట్ జయలక్ష్మి మరణానికి ముందే మరో ప్రేమ కథ విఫలం అవ్వడం వలన శోభ (మహాలక్ష్మి మీనన్) అనే తార నేల రాలిపోయింది. తెలుగు అమ్మాయి అయిన శోభ దర్శకులు “బాపు” రూపొందించిన మనవూరి పాండవులు (1978) చిత్రంలో ముఖ్యపాత్ర పోషించారు. ఆమె ఎక్కువగా తమిళ చిత్రాలలో నటించారు. కళాత్మక చిత్రాలను తీయడంలో పేరుగాంచిన దక్షిణ భారతీయ సుప్రసిద్ధ ఛాయాగ్రహకులు, దర్శకులు బాలు మహేంద్ర రూపొందించిన పలు చిత్రాల్లో ఆమె ముఖ్యభూమిక పోషించింది. భారతీయ చలనచిత్రసీమలో ఉద్భవించిన అత్యుత్తమ ప్రతిభావంతులలో ఒకరిగా పరిగణించబడింది నటి శోభ.

నటుడు జె.పి. చంద్రబాబు దర్శకత్వం వహించిన తమిళ థ్రిల్లర్ చిత్రం తట్టుంగల్ తిరక్కప్పడుమ్‌ (1966) లో శోభ వెండితెరపై బాలనటిగా అరంగేట్రం చేసింది. దర్శకులు బాలు మహేంద్ర దర్శకత్వం వహించిన ఉత్రాద రాత్రి (1978) చిత్రంలో కథానాయికగా మొదలుపెట్టిన ఆమె 1978లో “బంధనం”, “ఎంత నీలాకాశం” చిత్రాలకు కేరళ ప్రభుత్వ ఉత్తమ నటి పురస్కారాలను అందుకుంది. అదే సంవత్సరం కన్నడ సినిమా అపరిచిత చిత్రానికి గానూ ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారాన్ని దక్కించుకుంది. 1979లో ట్రావెన్‌కోర్ సోదరీమణులలో ఒకరైన లలిత నిర్మించిన తమిళ చిత్రం పసికి ఉత్తమ నటిగా జాతీయ అవార్డును అందుకుంది. పసికి ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటి అవార్డును కూడా ఆమె అందుకుంది. ఓర్మకల్ మరిక్కుమో (1977) చిత్రానికి కేరళ ప్రభుత్వం నుండి రెండవ ఉత్తమ నటి అవార్డును కూడా అందుకుంది. 

పలు మలయాళ, తమిళ, కన్నడ చిత్రాలలో నటించి మెప్పించిన ఆమె తెలుగులో తరం మారింది (1977), మనవూరి పాండవులు (1978) చిత్రాలలో నటించింది. దర్శకులు బాలు మహేంద్ర దర్శకత్వం వహించిన అనేక చిత్రాలలో నటి శోభ నటించడం వలన వారిద్దరి మధ్య ప్రేమ అనుకూలించింది. అది ప్రణయంగా మారి పరిణయానికి దారి తీసింది. మనసుకు నచ్చిన వారితోనే వివాహం జరిగినందుకు శోభ ఎంతగానో సంతోషించింది. అయితే ఆమె జీవితంలో ఎలాంటి దుర్భరమైన సంఘటనలు చోటుచేసుకున్నాయో తెలియదు. కానీ శోభ కూడా తన 17వ ఏట ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

ఆత్మహత్యా? లేక హత్యా? 

భారతదేశంలో అత్యధిక పారితోషికం పొందిన నటీమణులలో ఒకరయిన జగదేక సుందరి నటి దివ్య భారతి.  నిర్మాత దగ్గుబాటి రామానాయుడు తన కుమారుడు దగ్గుబాటి వెంకటేష్ కథానాయకుడిగా నిర్మించిన బొబ్బిలి రాజా చిత్రంతో తెరంగేట్రం చేసి, ఇళయరాజా స్వరపరిచిన “బలపం పట్టి భామ ఒళ్ళో” అంటూ  ఆంధ్రదేశాన్ని ఒక ఊపు ఊపేసిన ఈ సినిమా ద్వారా తెలుగులో తెరకు పరిచయమైన దివ్యభారతి తొలిచిత్ర విజయంతోనే అగ్ర కథానాయిక స్థాయిని సంపాదించుకుంది. తెలుగు నాట వెంకటేష్, మోహన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ మొదలైన వారితో నటించిన శ్రీదేవి లాంటి అందగత్తె అని పేరు సంపాదించుకుంది. బొబ్బిలి రాజా, అసెంబ్లీ రౌడీ, రౌడీ అల్లుడు, నా ఇల్లే నా స్వర్గం, ధర్మక్షేత్రం, చిట్టెమ్మ మొగుడు, తొలిముద్దు లాంటి విజయవంతమైన చిత్రాలలో ఆమె నటించింది.

ఆమె తెలుగు నాట మంచి డిమాండ్ ఉన్న సమయంలోనే ఉత్తరాది చిత్రాలపై దృష్టి సారించింది. ఆ సమయంలో దర్శక, నిర్మాత సాజిద్ నడియాడ్‌ వాలాను పెళ్లి చేసుకుంది. అందుకోసం ఆమె ఇస్లాం మతంలోకి మారి తన పేరును సనాగా మార్చుకుంది. ఆ తరువాత ఓ రోజున ఆమె కూడా ఆ హఠాన్మరణానికి గురయ్యింది. 05 ఏప్రిల్ 1993 సాయంత్రం వేళ, ముంబైలోని అంధేరి వెస్ట్‌లోని వెర్సోవాలోని తులసి బిల్డింగ్స్‌లోని తన ఐదవ అంతస్తులోని అపార్ట్‌మెంట్ బాల్కనీ కిటికీ నుండి దివ్యభారతి పడిపోయింది. ఆమె అతిథులు నీతా లుల్లా , నీతా భర్త శ్యామ్ లుల్లా, దివ్యభారతి పనిమనిషి అమృత కుమారి మరియు పొరుగువారు ఏమి జరిగిందో తెలుసుకునే లోపు ఆమెను అంబులెన్స్‌లో కూపర్ హాస్పిటల్‌లోని అత్యవసర విభాగానికి తరలించారు. అక్కడ ఆమె మరణించింది.

ఆమె మరణించే నాటికి ఆమె వయస్సు 19 సంవత్సరాలు మాత్రమే. ఆమె మరణానికి అధికారిక కారణాలు తలకు గాయాలు మరియు అంతర్గత రక్తస్రావం. ముంబైలోని విలే పార్లే శ్మశానవాటికలో 7 ఏప్రిల్ 1993న ఆమె అంత్యక్రియలు జరిగాయి. నిజానికి ఆమె మరణం కుట్ర సిద్ధాంతాలకు లోబడి ఉన్నప్పటికీ, ఆమె తండ్రి అలాంటివి ఏమీ లేవని ఖండించారు. ఆమెది ఆత్మహత్య అని కొందరు, హత్య అని మరికొందరు, రెండు కాదు అధికంగా మద్యం సేవించడం వలన అదుపుతప్పి పడిపోయి మరణించింది అని ఇంకొందరు ఇలా చెప్పుకోసాగారు. ఏది ఏమైనా ఉజ్వల భవిష్యత్తు ఉందని అందరూ భావించిన దివ్యభారతి మృతి ఆమెను కలల రాణిగా చేసుకున్న అభిమానులను శోకసాగరంలో ముంచివెళ్ళింది.

నటి సిల్క్ స్మిత మరణం…

నటి దివ్యభారతి లాగానే అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయిన మరొక నటి సిల్క్ స్మిత. ఆమె అసలు పేరు విజయలక్ష్మి. ఆమె పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించింది. సినీనటి కావాలనే ఆకాంక్షతో మద్రాసులోని తన అత్త ఇంటికి చేరింది. సిల్క్ స్మిత మొదటి చిత్రము తమిళంలో వండి చక్రం (బండి చక్రం). 1979లో విడుదలైన ఈ చిత్రంలో ఆమె పాత్ర పేరు సిల్క్, బహుళ ప్రజాదరణ పోందడంతో ఆమె తన పేరును సిల్క్ స్మిత గా మార్చుకుంది. తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ భాషలలో 200 లకు పైగాచిత్రాలలో నటించింది.

తాను నటించిన తొలి సినిమాలలో అభినయమున్న పాత్రలు ధరించినా కూడా సిల్క్ స్మిత డాన్సర్ గానే ఎక్కువగా రాణించింది. డాన్స్ కూడా అంతగా రాకపోయినా తన కవ్వించే కళ్ళతో, నువ్వుతో రసికుల హృదయాలను కొల్లగొట్టింది. అనేక సినిమాలలో ఆమె చేసిన ప్రత్యేక గీతాలు, శృంగార నృత్యాలు అమెకు అత్యంత జనాదరణను తెచ్చి పెట్టాయి. తెలుగులో “బావలు సయ్యా, మరదలు సయ్యా”, “అటు అమలాపురం, ఇటు పెద్దాపురం”,  “జానవులే నెఱ జానవులే”, “తప్పించుకోలేవు నా చేతిలో” లాంటి ప్రత్యేక గీతాలతో అత్యధిక ప్రాచుర్యం పొందింది. ఆమె ప్రత్యేక గీతం (ఐటెం సాంగ్) ఉంటే తమ సినిమా నిజంగానే విజయం సాధిస్తుందని నిర్మాతలు విశ్వసించి ఆమె చుట్టు ప్రదక్షిణ చేసిన రోజులను ఆమె చూశారు.

అగ్ర దర్శకులను ఎదిరించి సినిమా రంగంలో రాణించే స్థాయికి చేరుకున్నారామె. ఆ తరుణంలో ఓ తమిళ డాక్టరుకు మనసిచ్చి అతనితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుండేది. హఠాత్తుగా ఓ రోజు 23 సెప్టెంబరు 1996 నాడు మద్రాసులోని తన నివాస గృహంలో ఆమె ఆత్మహత్య చేసుకుంది. సిల్క్ స్మిత తన జీవితాంతం అవివాహిత గానే ఉంది. అంతకు ముందు ఆమె ప్రేమ వ్యవహారాలు విఫలమైనట్లూ, చిత్ర నిర్మాణ ప్రయత్నంలో పెద్దయెత్తున నష్టాల పాలైనట్లు వార్తలు వచ్చాయి. వాటికి తోడు మద్యపానం కూడా ఆమెను నిసృహలోకి నెట్టివేసి ఉండవచ్చునని అందువల్లనే ఆమె ఆత్మహత్య చేసుకొన్నదని భావించారు. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు పలువురు పలు విధాలుగా ప్రచారం చేశారు. ఏది ఏమైనా శృంగార నాయకగా తనదైన బాణీ పలికిస్తున్న తరుణంలోనే ఆమె అభిమానులకు దుఃఖ సాగరం మిగులుస్తూ దూరమైంది.

ప్రేమకు బలైన నటి ప్రత్యూష…

17 ఏళ్ళ వయసులో సినీ పరిశ్రమలో ప్రవేశించి రాయుడు, శ్రీరాములయ్య, సముద్రం, కలుసుకోవాలని మొదలైన సినిమాలలో నటించిన నటి ప్రత్యూష మరణం అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మనసిచ్చిన వాడితో జీవితం పంచుకోవాలనే నిర్ణయానికి వచ్చి ప్రియుడుతో కలిసి తనువు చాలించుకుంది ప్రత్యూష. ప్రియుడు బ్రతికి బట్టకట్టాడు. ఆమె ప్రాణాలు మాత్రం పోయాయి. 23 ఫిబ్రవరి 2002 నాడు ప్రత్యూష తమ వివాహాన్ని పెద్దలు అంగీకరించడం లేదని తన స్నేహితుడు సిద్ధార్థ రెడ్డితో కలిసి ఆత్మహత్యా ప్రయత్నం చేసుకుంది. అదే రోజు హైదరాబాదులోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.

సిద్దార్ధ రెడ్డి మాత్రం చావు నుండి తప్పించుకున్నాడు. ఈ కేసులో అనేక అనుమానాలు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర అసెంబ్లీలో సైతం ప్రత్యూష మరణం చర్చాంశనీయమైంది. ఆమెది హత్యనా, ఆత్మహత్యనా అనేది సరిగ్గా తెలియలేదు. ఈ కేసు చాలా రోజుల వరకు నడుస్తూ వచ్చింది. ప్రేమ కారణంగా ఆత్మహత్యకు గురైన మరో నాయికగా ప్రత్యూష నిలిచిపోయింది. ఆమె మరణించే సమయానికి ఆమె నటించిన “కలుసుకోవాలని” చిత్రం విడుదలైంది. ఆమె మరణంతో ఆ సినిమాకు కలెక్షన్లు పెరిగాయి. ఈ సినిమా విజయం చూసాక ఆమె జీవించి ఉంటే సినిమా రంగంలో అగ్రస్థానం అధిరోహించేదని పలువురు భావించారు.

క్యాట్ వాక్ చేస్తూ భవనంపై నుండి జారి…

ప్రేమ కారణంగా ఇలా కొంతమంది అర్ధాంతరంగా తనువు చాలించగా కొందరు అనుకోని విధంగా అసువులు కోల్పోయారు. హాస్యనటులు ధర్మవరపు సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో రూపొందించిన “తోకలేని పిట్ట” చిత్రంలో కథానాయికగా నటించింది నివేదిత జైన్. 1994లో మిస్ బెంగుళూరు కిరీటాన్ని కైవసం చేసుకున్న ఆమె 1996లో శివరంజిని కన్నడ చిత్రం ద్వారా నటిగా అరంగేట్రం చేసింది. తన అందం, చందంతో ప్రేక్షకులను ఆకట్టుకోగలిగింది. కన్నడ సినిమా రంగంలో నివేదిత ఓ మోస్తారు పేరు సంపాదించుకుంది. అందాల పోటీలో పాల్గొని విశ్వవ్యాప్తంగా పేరు సంపాదించాలన్న ఆమె అభిలాష. అందుకు తగ్గట్టుగానే ఆమె కఠోర సాధన చేసేవారు. ఓ రోజు ఆమె నివసించే భవనం పైన గోడమీద అందాల పోటీలలో భాగమైన క్యాట్ వాక్ సాధన చేస్తూ అదుపుతప్పి క్రింద పడింది. దాంతో తలకు బలమైన గాయం కావడం వలన ఆమె మరణించింది. అలాగే “ఉత్సాహం”, “బ్రహ్మచారులు”   వంటి చిత్రాలలో నటించిన నటి అంచల్ ఓ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకున్నారు.

ప్రేక్షకులకు జీర్ణించుకోలేని సౌందర్య మరణం…

ఇలా అనేక రకాలుగా అర్థాంతరంగా తనువు చాలించిన ఎంతో మంది తారలలో ఆంధ్రదేశంలోని అధిక సంఖ్యాకులను దుఃఖసాగరంలో ముంచింది నటి “సౌందర్య” దుర్మరణం. కేవలం అందంతోనే కాకుండా, తన అభినయంతోను ఆకట్టుకున్న సౌందర్య తెలుగు అమ్మాయి కాకపోయినా, తెలుగు వారి హృదయాలలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఆమెకు ముందు అకాల మరణం చెందిన తారలలో “దివ్యభారతి” అగ్ర కథానాయికగా కొనసాగినా కూడా ఆమె సౌందర్య స్థాయికి చేరుకోలేదు. నటిగా ఆమె తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం భాషలలో మొత్తం కలిపి సుమారు 100 చిత్రాలలో నాయికగా నటించిన సౌందర్య తన మేనమామ, తన బాల్య స్నేహితుడు, సాఫ్ట్‌వేర్ ఇంజనీరు అయిన జి.ఎస్.రఘును 27 ఏప్రిల్ 2003 లో వివాహమాడారు. 

వివాహమైన తరువాత ఇక సౌందర్య అధ్యాయం ముగిసింది అనుకున్నారు. కానీ ఆమె మాత్రమే న్యాయం చేయగలదనే నమ్మకంతో కొన్ని పాత్రలు ఆమెను వెతుక్కుంటూ వెళ్ళాయి. పెళ్లయిన తరువాత ఆమె తన వందో చిత్రంగా “శ్వేత నాగు” లో నటించారు. ఆ సినిమా తరువాత బాలకృష్ణ స్వీయ దర్శకత్వం రూపొందుతున్న పౌరాణిక చిత్రం “నర్తనశాల” లో ద్రౌపది పాత్రకు ఎంపికయ్యారు. మహానటి సావిత్రితో సౌందర్యను చాలామంది పోలుస్తూ ఉండేవారు. అయితే సావిత్రి స్థాయి పాత్రను తాను ఇంకా చేయలేదు అని సౌందర్య బదులు ఇచ్చేవారు. ఆమె కోరుకున్నట్టుగానే గతంలో సావిత్రి “నర్తనశాల” లో పోషించిన ద్రౌపది పాత్రను అభినయించే అవకాశం లభించింది. తన పాత్రకు ఆమె సావిత్రి లాగా న్యాయం చేస్తారా లేదా అని కూడా ఆమె భావించారు. ఎలాగైనా పాత్రకు న్యాయం చేయాలని ఆమె భావించి అంగీకరించారు.

అలాగే నటులు మోహన్ బాబుతో నటించిన శివశంకర్ చిత్రంలో ఆమె మాత్రమే న్యాయం చేయగలదు అన్న పాత్ర లభించింది. వీటిలో మోహన్ బాబు చిత్రం సగానికి పైగా పూర్తికాగా, బాలకృష్ణ చిత్రంలో రెండు రోజులు మాత్రమే నటించారు. ఆ తరువాత షెడ్యూల్ ఆరంభం కావాల్సి ఉన్న సమయంలో ఆమె బిజెపి తరఫున ప్రచారం చేస్తూ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆమె మరణించింది అన్న వార్త తెలిసి ఆమెను చివరిసారిగా చూడాలని అనుకున్న అభిమానులకు చాలామంది టీవీలకే అతుక్కుపోయారు. ఆ కారణంగా ఆరోజు ఆంధ్రదేశంలోని పలు థియేటర్లలో జనం సన్నగిల్లారు. అటు అందాన్ని ఇటు అభినయాన్ని వెరసి ఆ సమయంలో అందమైన అభినయాన్ని అందించగల ఏకైకనటిగా గుర్తింపు తెచ్చుకున్న సౌందర్య మరణాన్ని చాలా రోజులు తెలుగు ప్రజలు జీర్ణించుకోలేకపోయారు.

కాంచనమాల, సావిత్రి…

లీలా రాణి, శోభ, ఫటాఫట్ జయలక్ష్మి, దివ్యభారతి, సిల్క్ స్మిత, ప్రత్యుష, నివేదితా జైన్, ఆంచల్, సౌందర్య లాంటి తారలు మాత్రమే కాకుండా అనేక మంది నటీనటులు కూడా ప్రాణాలను కోల్పోయిన వారున్నారు. ఇప్పటివరకు తెలుగు తెరమీద ఇంత అందగత్తెను చూడలేదు అనిపించిన అలనాటి అందాల అభినయ తార కాంచనమాల. 1935 నుండి 1942 వరకు కేవలం ఏడు సంవత్సరాలలో చేసినవి పదకొండు సినిమాలే. కానీ ఆమె అత్యంత ప్రజాదరణ పొందిన నటిగా ఓ వెలుగు వెలిగింది. ఓ తమిళ సినిమా నిర్మాత చేసిన మోసానికి తట్టుకోలేక మతిస్థిమితం కోల్పోయి సుమారు నలభై సంవత్సరాలు మతిస్థిమితం లేకుండానే జీవించి 1981 లో మరణించింది. అలాగే అయిన వాళ్ళు చేసిన మోసాన్ని భరించలేక మహానటి సావిత్రి మానసికంగా కృంగి, కృశించి 1981లో తనువు చాలించింది. తెలుగులో “దాదాగిరి”, “ఇష్టం” సినిమాలలో నటించిన రాధామోనల్ నావల్ (నటి సిమ్రాన్ చెల్లెలు) కూడా ఆత్మహత్య చేసుకుంది. 2000 సంవత్సరం నుండి 2005 వరకు చిత్ర పరిశ్రమలో ఉన్న మోనల్ నావల్ తన 21 ఏళ్ల వయస్సులో చెన్నైలోని తన గదిలో 14 ఏప్రిల్ 2002 నాడు ఉరి వేసుకుని చనిపోయింది. 

రాజేష్, రఘువరన్…

బుల్లితెర నటుడు అచ్యుత్ అతి చిన్న వయస్సులో 2003లో గుండెపోటుతో మరణించాడు. కౌశల్య కృష్ణమూర్తి సినిమాలో నటించిన ఐశ్వర్య రాజేష్ తండ్రి నటుడు రాజేష్. అతను దాదాపు నలభై చిత్రాలలో నటించాడు. నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న సమయంలోనే మద్యానికి బానిసైన  కాలేయం దెబ్బతినడం వలన అతను 38 సంవత్సరాల వయస్సులో మరణించాడు. నిన్నటి తరం నటులు రాజా కూడా అకాల మరణం చెందాడు. తమిళం తో పాటు తెలుగులో అనేక చిత్రాలలో నటించిన ప్రముఖ నటులు రఘువరన్ (నటి రోహిణి భర్త) అకాల మరణం చెందాడు.

అష్టాచెమ్మా సినిమాలో నటించిన నటి భార్గవి 16 డిసెంబరు 2008 నాడు బంజారాహిల్స్, హైదరాబాదు లోని తన స్వగృహంలో తన భర్త ప్రవీణ్ చేతిలో హత్యకు గురైంది. అమ్మాయిలు అబ్బాయిలు సినిమాలో నటించిన విజయ్ సాయి 11 డిసెంబరు 2017 సోమవారం నాడు హైదరాబాదులోని యూసఫ్ గూడ లోని తన ఫ్లాట్ లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు విజయ్ సాయి తన సెల్ ఫోనులో సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. అందులో పరువు, మానసిక వేదనతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపాడు. తన చావుకు భార్య వనిత, వరలక్ష్మి, విన్నీ, బృందతోపాటు పారిశ్రామికవేత్త శశిధర్‌, న్యాయవాది శ్రీనివాస్‌ కారణమని ఆరోపించాడు. వీరంతా తనను మానసికంగా హింసించారని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఆర్తి అగర్వాల్, కునాల్ సింగ్…

కన్నడ నిర్మాత కొడుకు “ఉల్లాసంగా ఉత్సాహంగా” సినిమాలో హీరో  యశో సాగర్ కారు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. హీరో శ్రీహరికి కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ముంబైలో మరణించాడు. చిత్రం (2000) సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన నటుడు ఉదయ్ కిరణ్ 2014 లో ఆత్మహత్య చేసుకున్న ఉదంతం పలు అనుమానాలను రేకెత్తించింది. నీ స్నేహం, ఇంద్ర, అందాల రాముడు, నువ్వు నాకు నచ్చావ్ తదితర విజయవంతమైన చిత్రాలలో నటించిన ఆర్తి అగర్వాల్ లైపోసక్షన్ చికిత్స వికటించడంతో గుండెపోటు వచ్చి 2015లో మరణించింది. కాగా ఆర్తి అగర్వాల్ అంతకుముందే 23 మార్చి 2005 నాడు క్లీనింగ్ కెమికల్ త్రాగి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. 1999 లో ప్రేమికుల రోజుతో పేరు ప్రఖ్యాతులు పొందిన కునాల్ సింగ్ 7 ఫిబ్రవరి 2008 నాడు తన ముంబై అపార్ట్‌మెంట్‌లో సీలింగ్‌కు ఉరి వేసుకుని చనిపోయాడు. ఆయన చనిపోక ముందే కొన్ని నెలల క్రితం తన మణికట్టును కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. 

నటులు రంగనాథ్, ఇష్టం హీరో చరణ్ రెడ్డి…

ప్రముఖ సీనియర్ నటులు రంగనాథ్ సైతం తన 66 సంవత్సరాల వయస్సులో హైదరాబాద్‌లోని తన నివాసంలో 19 డిసెంబర్ 2015 సాయంత్రం 5 గంటలకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇష్టం (2001) సినిమాలో హీరోగా నటించిన చరణ్ రెడ్డి, అలాగే గమ్యం, కళావర్ కింగ్ సినిమాలకు సంగీత దర్శకత్వం వహించిన అనిల్ రెడ్డిలు గుండెపోటుతో మరణించారు. అభి, హాసిని, సంచలనం, బ్యాండ్ బాలు చిత్రాలలో హీరోగా నటించిన బూచేపల్లి కమలాకర్ రెడ్డి సైతం నరాలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ మరణించాడు. నృత్య దర్శకులు విజయ్, ప్రశాంత్ లు అతి చిన్న వయస్సులోనే మరణించారు. పలు చిత్రాలలో నటించిన సుగంధిని, విజయలక్ష్మి, సునయని, లక్ష్మీ శ్రీ, మధుమాలిని, మయూరి తదితరులు అకాల మరణం చెందారు. హాస్యనటుడు వేణుమాధవ్ కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతూ సికింద్రాబాదులోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 25 సెప్టెంబరు 2019 నాడు మరణించాడు. ఇటీవలే మరణించిన శ్రీదేవి, సుశాంత్ సింగ్ మరణాలు పలు అనుమానాలు రేకెత్తించాయి.

ముగింపు…

రచయిత రావూరి భరద్వాజ సినిమారంగం లోని ఉన్న వాతావరణాన్ని కళ్ళకు కట్టేలా అప్పట్లో తన “పాకుడురాళ్ల” లో వివరించారు. ఎన్.ఆర్. నంది వ్రాసిన “సినీ జనార్యం” కూడా సినిమా మనుషులు ఎలా ప్రవర్తిస్తారో తెలియజేసింది. ఈ రెండు రచనలలో వాస్తవాలు ఉన్నాయి. అయితే అన్ని రంగాలలోనూ మంచి చెంతనే చెడు కూడా ఉంటుందన్న విషయం గుర్తుంచుకోవాలి. నిజానికి ఈ రెండు రచనలు చెడ్డవారి నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో తెలియజేస్తాయి. అంతేకాని చాలామంది అనుకున్నట్టుగా భరద్వాజ, నంది సినిమా రంగంపై కక్ష్య గట్టి, కత్తిగట్టి మరీ చేసిన రచనలు కావు. కావున ఈ విషయం సినీ పాఠకులకు ఇట్టే తెలిసిపోతుంది. అయితే లీలారాణి మరణం ఈ రెండు రచనలలోని వాస్తవాలు సామాన్యులను మరింతగా  భయపెట్టాయి.

Show More
Back to top button