CINEMATelugu Cinema

అలనాటి సినీ ప్రముఖుడు, మొట్టమొదటి తమిళ సూపర్ స్టార్.. యం.కె. త్యాగరాజన్ భాగవతార్

ఏమాత్రం సంగీత నేపథ్యం లేని ఒక దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పదహారు సంవత్సరాల వయస్సులోనే అంటే 1926లో శాస్త్రీయ సంగీత కచేరీలు చేయడం ప్రారంభించి తమిళనాడు అంతటా సంచలనం సృష్టించారు తొలి తమిళ సూపర్ స్టార్ యం.కె. త్యాగరాజ భాగవతార్. వంద సంవత్సరాల క్రిందట తన శాస్త్రీయ సంగీత కచేరీలు రాత్రి తొమ్మిది గంటలకు మొదలైతే తెల్లవారుజామున మూడు గంటలకు పూర్తయిపోయేవి. అదే సమయంలో రంగస్థలం మీద వేషం కట్టే తన నాటక ప్రదర్శన కూడా అత్యధిక ప్రజాదరణ పొందారు. ఆ రోజులలో ఎవరైనా నాటకం వేయాలంటే ఏదేని ఒక నాటక సంఘానికి అనుబంధమై ఉండాలి. అలాంటిదేమీ లేకుండా స్వతంత్ర నటుడుగా కొనసాగుతూ వంద సంవత్సరాల క్రిందట రోజుకు యాభై రూపాయలు పారితోషికం తీసుకునే నటుడుగా ఎదిగారు త్యాగరాజ భగవతార్ గారు. ఆయన వేసిన నాటకాలకు ఆ రోజులలో తమిళనాడులోనే కాకుండా సిలోన్, బర్మా, మలేషియా వంటి ఇతర దేశాలలో కూడా విపరీతమైన ప్రజాదరణ ఉండేది.

తన జీవితంలో అత్యున్నత స్థాయిలో నిలిచి కోట్లాదిమంది చేత జేజేలు కొట్టించుకునేవారు. తాను సినీ నటుడు కావడానికి ముందే కర్ణాటక సంగీత విద్వాంసుడు. తాను శాస్త్రీయ సంగీత కచేరీలు చేసేవారు, రంగస్థలం నటులు కూడా. ఆ రెండు రంగాలలో విశేషమైన ఖ్యాతి సంపాదించుకున్న తర్వాతే సినిమా రంగంలో ప్రవేశించారు. 1934లో సినీ రంగ ప్రవేశం చేసిన త్యాగరాజ భాగవతార్ 1934 నుండి 1944 వరకు పది సంవత్సరాలలో తాను నటించినవి తొమ్మిది సినిమాలే అయినా మొట్టమొదటి తమిళ సినిమాతోనే తమిళ సూపర్ స్టార్ గా నీరాజనాలు అందుకున్నారు. చాలా మంది కథానాయకులు వంద సినిమాలు నటిస్తే గాని రాని పేరు, ప్రఖ్యాతులు త్యాగరాజ భాగవతార్ గారికి కేవలం తొమ్మిది సినిమాలకే లభించింది. సినిమాలలో తాను సాహసాలు చేసినందుకో లేక సంభాషణలు చెప్పినందుకో లేక వైవిధ్యమైన నటన ప్రదర్శించినందుకో కాదు, కేవలం ఆయన పాటలతో శ్రోతలను, ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసి తన సంగీత పరిజ్ఞానంతో తాను సూపర్ స్టార్ అయ్యాడు.

డెబ్భై ఏళ్ల క్రిందట తాను నటించిన సినిమాలలో ఆయన పాడిన పాటలు ఈరోజుకి తమిళనాడులో సినీ సంగీత విభావరులలో ప్రముఖ సంగీత విద్వాంసులు పాడుతున్నారంటే ఆయన సంగీతానికి ఉన్న ప్రత్యేకతను అర్థం చేసుకోవచ్చు. శాస్త్రీయ సంగీత విద్వాంసుడిగా, రంగస్థలం నటుడిగా తాను వెలుగుతున్న రోజులలో ఆయన పట్ల ప్రేక్షకులకు, శ్రోతలకు ఎంత క్రేజ్ ఉండేది అంటే ఆయన నడిచి వెళుతుంటే ఆయన కాళ్ళ క్రింద మట్టిని సేకరించి వెండి భరణిలలో దాచుకునే అభిమానులు ఉండేవారు. ఆయన కారు వెళుతుంటే వెనకాల లేచిన ధూళిని విభూతిగా పెట్టుకునే అభిమానులు ఉండేవారు. ఆయన భోజనం చేయడానికి ఇంట్లో రెండు మూడు బంగారు పళ్లెములు ఉండేవి. ఆయన చెవులకి వజ్రపు పోగులు పెట్టుకునేవారు. మద్రాసులో మూడు బంగళాలు, తిరుచ్చిలో పెద్ద జమీందారు కోట లాంటి భవనం ఉండేవి. మార్కెట్ లోకి వచ్చిన ఏ కొత్త కారు అయినా తన సొంతం కావాల్సిందే. త్యాగరాజ భాగవతార్ గారికి పాలరంగులో మెరిసిపోయే ఒక మేలు జాతి అశ్వం ఉండేది.

ఆయన నటించిన సినిమాలు రోజులు వారాలు కాదు, నెలలు తరబడి థియేటర్లలో ప్రదర్శితం అవుతుండేవి. ఇంత వైభవం, వైభోగం, ఐశ్వర్యం, పేరు ప్రఖ్యాతలు ఇవేవీ కూడా వారసత్వంతో వచ్చినవి కాదు. అన్నీ కూడా ఆయన స్వయంకృషితో, స్వయం ప్రతిపత్తితో సంపాదించుకున్నవి. ఆ రోజులలో ఒక స్థాయిని మించిన సంగీత విద్వాంసుల్ని భాగవతార్ అని గౌరవ సూచకంగా పిలుస్తుండేవారు. భాగవతార్ అని పిలిపించుకోవడం, ఆ స్థాయిని చేరుకోవడం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తుండేవారు. తన సమకాళీనులలో భాగవతార్ అనే అర్హత ఉన్నవారు చాలామందే ఉన్నారు. భాగవతార్ అంటే ఆయన జీవించి ఉన్న రోజులలో కూడా .కె. త్యాగరాజ భాగవతార్ అనేంతగా ఆయన ప్రాముఖ్యత విస్తరించి ఉండేది. ఆయన అసలు పేరు మాయవరం కృష్ణమూర్తి త్యాగరాజన్. పేరు ప్రతిష్టలు వచ్చిన తర్వాత మాయవరం కృష్ణమూర్తి త్యాగరాజన్ భాగవతార్ అయ్యారు. తాను సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి అసాధారణ గౌరవాలు అందుకునే స్థాయికి ఎదిగినప్పటికీ కూడా బయలుదేరిన చోటును మర్చిపోకుండా అందరికీ అందుబాటులో ఉంటూ, ఎంత సూపర్ స్టార్ అయినా కూడా అందరినీ గౌరవిస్తూ డౌన్ టు ఎర్త్ అన్నట్టు ఉండేవారు. అందువలన తమిళ ప్రజలకు తాను అంటే ఎంతో గౌరవం ఉండేది.

జీవిత విశేషాలు…

జన్మ నామం :  మాయవరం కృష్ణసామి త్యాగరాజ భాగవతార్

ఇతర పేర్లు   :    యం.కె. త్యాగరాజ భాగవతార్

జననం    :    01 మార్చి 1910

స్వస్థలం   :    మాయవరం , తంజోర్ జిల్లా , మద్రాసు ప్రెసిడెన్సీ , బ్రిటిష్ ఇండియా

తండ్రి  :     కృష్ణసామి ఆచారి

తల్లి  :     మాణిక్కమ్మాళ్

జీవిత భాగస్వామి :    కమలం, రాజం

పిల్లలు   :   సుశీల, సరోజ, రవీంద్రన్

వృత్తి      :   నటుడు, గాయకుడు

బిరుదు  :   భాగవతార్

మరణం     :     01 నవంబర్ 1959 (వయస్సు 49), మద్రాసు , తమిళనాడు రాష్ట్రం , భారతదేశం

నేపథ్యం…

త్యాగరాజన్ భాగవతార్ అసలు పేరు మాయవరం కృష్ణమూర్తి త్యాగరాజన్ (యం.కె.టి). ఆయన 01 మార్చి 1910 నాడు తమిళనాడు లోని తంజావూరు జిల్లా మైలాడుతురై (అప్పట్లో దీనిని మాయవరం అని పిలిచేవారు)లో జన్మించారు.  వాళ్ల నాన్న కృష్ణమూర్తిగారు వృత్తిరీత్యా స్వర్ణకారులు. తాను బంగారు ఆభరణాలు తయారుచేస్తూ ఉండేవారు. అమ్మగారి పేరు మాణిక్కమ్మాళ్. ఆమె తంజావూరు నుంచి వచ్చారు. భాగవతార్ గారు పుట్టినప్పుడు వాళ్ళ కుటుంబం అంతా మాయవరంలో ఉండేవారు. అతను పుట్టిన కొన్ని సంవత్సరాల తరువాత కుటుంబం తిరుచిరాపల్లిలో (అప్పట్లో దీనిని ట్రిచినోపోలీగా పిలిచేవారు) స్థిరపడ్డారు.

తిరుచిరాపల్లిలో త్యాగరాజన్ భాగవతార్ గారిని స్థానిక పాఠశాలలో చేర్చారు. 1916 – 17 సంవత్సరాలలో షెంకోట గంగాధర కిట్టప్ప (యస్.జి.కిట్టప్ప) అనే ఒక తమిళ శాస్త్రీయ గాయకుడు మరియు రంగస్థల నటుడు ఉండేవారు. ఆ రోజుల్లో తన పాటలు ప్రజలలో ఎక్కువగా ప్రాచుర్యంలో ఉండేవి. దాంతో భాగవతార్ స్కూలుకు వెళ్లకుండా ఎక్కువగా కిట్టప్ప పాటలు విని తిరిగి అవే నేర్చుకుని పాడుతూ ఉండేవారు. 20వ శతాబ్దం ప్రారంభంలో సంప్రదాయవాద భారతీయ సమాజంలో సంగీతం, పాటలు పాడటం గౌరవప్రదమైన వృత్తిగా పరిగణించబడినందున, గాయకుడిగా మారాలని నిర్ణయించుకున్నారు త్యాగరాజ భాగవతార్ గారు.

కానీ త్యాగరాజన్ భాగవతార్ తన చదువును నిర్లక్ష్యం చేస్తున్నందున తన తండ్రిచే మందలించబడడంతో తాను తన ఇంటి నుండి పారిపోయారు. ఆ తరువాత కొన్ని రోజులకు తాను కడప వెళ్లి పాటలు పాడుతున్న విషయం వాళ్ళ నాన్నగారికి ఎవరో చెప్పారు. వాళ్ళ నాన్నగారు కడప వెళ్లి చూసేసరికి బజార్లో తాను పాడే అద్భుతమైన పాటలు జనాలను విపరీతంగా ఆకట్టుకుని అంతా గుమిగూడి చూస్తున్నారు. ఆ సన్నివేశం చుసిన వాళ్ళ నాన్నగారు అక్కడి నుంచి తీసుకువచ్చి బడికి పంపించకుండా పాటల కచ్చేరిలో చేర్పించాలని నిర్ణయించుకున్నారు.

పదేళ్ళ వయస్సులో తొలిసారి నాటకంలో..

దక్షిణ భారత రైల్వేలో పనిచేసే ఎఫ్‌.జి నటేష్ అయ్యర్ గారు తిరుచ్చిలో రైల్వే అధికారిగా పనిచేస్తూండేవారు. తాను రసిక రంజన సభ అనే ఔత్సాహిక నాటక బృందం వ్యవస్థాపకులు. ఆయన నడిపించే “రసిక రంజని నాటక సభ” లో వేసే హరిశ్చంద్ర నాటకంలో లోహితాసురుడు వేషం కోసం ఓ కుర్రాడి కోసం వెతుకుతున్నారు. అతను త్యాగరాజన్ భాగవతార్ గారు భజనలో పాటలు పాడటం విన్నాడు. త్యాగరాజన్ భాగవతార్ గారి ప్రతిభతో ఆకట్టుకున్న ఎఫ్‌.జి నటేష్ అయ్యర్ గారు త్యాగరాజన్ భాగవతార్ గారి తండ్రి గారి అనుమతితో అతనిని హరిశ్చంద్ర నాటకంలో లోహితాసుని పాత్రకు తీసుకున్నారు. అప్పటికి పదేళ్ల వయసున్న త్యాగరాజన్ భాగవతార్ గారు అంగీకరించడంతో ఆ నాటకం విజయవంతమైంది. త్యాగరాజన్ భాగవతార్ గారు ఆ నాటకంలో పాటలు కూడా బ్రహ్మాండంగా పాడేశారు.

పొన్ను అయ్యంగార్ శిక్షణలో శాస్త్రీయ సంగీతం…

ఆ హరిశ్చంద్ర నాటకం తిలకించడానికి “మధురై పొన్ను అయ్యంగార్” గారు అనే శాస్త్రీయ సంగీతం విద్వాంసులు వచ్చారు. ఆయన శాస్త్రీయ సంగీతం నేర్పిస్తుండేవారు. భాగవతార్ గారి నాన్నగారి దగ్గరికి వెళ్లి మీ కుర్రవాణ్ణి నా దగ్గరికి పంపించండి శాస్త్రీయ సంగీతం నేర్పిస్తానన్నారు. అప్పుడు భాగవతార్ గారి నాన్నగారు నేను అంత ఫీజు నేను ఇచ్చుకోలేని అన్నారు. దానికి మధురై పొన్ను అయ్యంగార్ గారు భాగవతార్ గారి స్వరం మామూలు స్వరం కాదు, దైవం ఇచ్చిన స్వరం అని, తనకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉందని తనకు సంగీతం ఉచితంగా నేర్పిస్తాను అని తన వెంట తీసుకెళ్లారు.

మధురై పొన్ను అయ్యంగార్ గారు త్యాగరాజన్ భాగవతార్ గారికి ఆరు సంవత్సరాల పాటు శాస్త్రీయ సంగీత నేర్పించారు. మధురై పొన్ను అయ్యంగార్ గారి వద్ద శాస్త్రీయ సంగీతమే కాకుండా అదే రోజుల్లో నటరాజ వడియార్, సుబ్బయ్య పిళ్ళై, నరసింహ అయ్యర్ గార్ల వద్ద రంగస్థలం శిక్షణ కూడా తీసుకున్నారు. పది నుండి పదహారు సంవత్సరాల వయస్సు వచ్చేవరకు ఈ శిక్షణ తీసుకున్నారు. అంత కఠోరమైన శిక్షణ తీసుకున్న తరువాత తన పదహారు సంవత్సరాల వయస్సులో మొట్టమొదటిసారిగా తిరుచ్చిలో తన గురువుగారు త్యాగరాజన్ భాగవతార్ గారితో శాస్త్రీయ సంగీత కచేరి చేయించారు.

పదహారేళ్ళకే నాటకరంగంలో సూపర్ స్టార్…

త్యాగరాజన్ భాగవతార్ గారు తిరుచ్చిలో చేసిన తన మొదటి కచ్చేరీతోనే శ్రోతల ఆదరణ, ప్రేక్షకుల ఆదరణ విపరీతంగా చూరగొన్నారు. అక్కడికి వచ్చిన సంగీత విద్వాంసులు త్యాగరాజన్ భాగవతార్ గారి ప్రతిభకు మెచ్చి మొట్టమొదటి సంగీత కచ్చేరిలోనే ఎంతో బాగా పాడారు, ఇతనికి భాగవతార్ అని పిలిపించుకునే అర్హత ఉందని చెప్పారు. 1926లో తనకు మహాభారతం ఆధారంగా వచ్చిన పావలా కోడి అనే ఒక నాటకంలో వేషం వేసే అవకాశం వచ్చింది. అందులో కూడా త్యాగరాజన్ భాగవతార్ గారు అద్భుతంగా నటించారు. అలా పదహారు సంవత్సరాల వయస్సులో వచ్చిన అవకాశం ఎనిమిది సంవత్సరాలు వెనక్కి తిరిగి చూసుకోకుండా చేసింది. అలా తాను రంగస్థలం మీద సూపర్ స్టార్ అయిపోయాడు. తనతో పాటుగా ఎస్.వి.సుబ్బలక్ష్మి గారు కూడా నటిస్తుండేవారు. అలా నాటకాలు వేసే సమయంలో రోజుకు 50 రూపాయలు పారితోషికం తీసుకునే స్థాయికి ఎదిగారు.  

తమిళ చిత్రసీమలో తొలి సూపర్ స్టార్ గా..

అలా నాటక రంగంలో ఎదుగుతున్న క్రమంలో ఎనిమిది సంవత్సరాల తరువాత సుబ్రహ్మణ్యం గారు “పావలకోడి” అనే హిందూ పౌరాణిక నాటకాన్ని వీక్షించారు. ఇందులో భాగవతార్ గారు అర్జునుడి ప్రధాన పాత్రను పోషించారు. నటనతో పూర్తిగా ఆకట్టుకున్న లక్ష్మణ చెట్టియార్, భాగవతార్ ప్రధాన పాత్రతో అదే కథ ఆధారంగా సినిమాను నిర్మించాలని ప్లాన్ చేశారు. 1934లో వ్యాపారవేత్తలు లక్ష్మణ చెట్టియార్, అలగప్ప చెట్టియార్ మరియు చలనచిత్ర దర్శకులు కె. సుబ్రమణ్యం గారు (ప్రముఖ సంగీత దర్శకులు అనిరుద్ గారి ముత్తాత) “పావలా కోడి” ని సినిమాగా తీయాలనుకున్నారు. ఆ సుబ్రహ్మణ్యం గారు చిత్రీకరించిన “పావలా కోడి” సినిమాకు నాలుగు వేల రూపాయల పారితోషం తీసుకున్నారు త్యాగరాజన్ భాగవతార్ గారు. ఆ సినిమాలో 50 పాటలు ఉంటే అందులో 22 పాటలు త్యాగరాజన్ భాగవతార్ గారు పాడినయే కావడం విశేషం. అడయార్‌లో చిత్రీకరణ జరిపిన ఆ సినిమా పూర్తయ్యి, విడుదలై తొమ్మిది నెలలు నిరాటంకంగా నడిచింది. తన మొట్టమొదటి సినిమాకే సూపర్ స్టార్ అనే పేరు వచ్చింది. అలా త్యాగరాజన్ భాగవతార్ గారు తమిళ చిత్రసీమలో మొట్టమొదటి సూపర్ స్టార్ అయ్యారు.

సొంత నిర్మాణంలో “సత్యశీలన్” సినిమా…

త్యాగరాజన్ భాగవతార్ గారు పావలాకోడీ సినిమా తీసిన మరుసటి సంవత్సరమే తాను “నవీన సారంగధర” చిత్రంలో నటించారు. సారంగధర అనే నాటకం ఆధారంగా రూపొందించబడింది. భాగవతార్ గారి యొక్క రెండవ చిత్రం అయిన ఈ “నవీన సారంగధర” (1935) చిత్రాన్ని కూడా కె. సుబ్రమణ్యం గారే దర్శకత్వం వహించారు. ఆ సినిమా కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించింది. త్యాగరాజన్ భాగవతార్ గారి తదుపరి చిత్రం “సత్యశీలన్” (1936) తిరుచ్చి త్యాగరాజ ఫిలింస్ బ్యానర్‌పై అతని స్వంత నిర్మాణంలో చిత్రీకరించబడింది. త్యాగరాజన్ భాగవతార్ గారు ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేయనప్పటికీ ఈ చిత్రంలో ఇద్దరు బాగవతార్‌లు ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం అనే నవల లక్షణం ఉంది. భాగవతార్ గారు సత్యశీలన్‌గా నటించడమే కాకుండా, ఈ చిత్రంలో కొంతకాలం ఆస్థాన గాయకుడిగా కూడా కనిపిస్తారు. ఇరవై ఆరు సంవత్సరాల వయస్సులో యాభై వేల రూపాయలు ఖర్చు చేసి “సత్యశీలన్” అనే సినిమా తీశారు.

చిత్తూరు నాగయ్య, కన్నాంబ లతో..

త్యాగరాజన్ భాగవతార్ గారు 1937లో అంబికాపతి , చింతామణి లాంటి బయటి వాళ్ళ చిత్రాలలో నటించాక 1939 లో తిరునీలకందర్  అనే సినిమాని త్యాగరాజన్ భాగవతార్ గారే సొంతంగా తీశారు. 1941లో అశోక్ కుమార్ అనే సినిమాలో ఆయన నటించినప్పుడు అందులో తెలుగు నటులు చిత్తూరు వి.నాగయ్య, కన్నాంబ గార్లు కూడా నటించారు. 1943లో శివకవి అనే సినిమా తీశారు. త్యాగరాజన్ భాగవతార్ గారు ఎక్కువగా దైవభక్తి ఉన్న సినిమాలలో నటించేవారు. తమిళ ప్రేక్షకులు తనను భగవంతుడి స్వరూపుడిగా భావిస్తుండేవారు. త్యాగరాజన్ భాగవతార్ గారు రైలు ప్రయాణం చేసిన ప్రతీసారి రైలు నాలుగు గంటల ఆలస్యంగా గమ్యానికి చేరేది. ఆయన ప్రయాణించే రైలు వస్తుంది అని తెలిసి ప్రతీ స్టేషన్ లో ఫ్లాట్ ఫామ్ టికెట్లు అన్నీ అమ్ముడయ్యేవి. ప్రతీ ఫ్లాట్ ఫామ్ లో రైలు ఆగాలి. అభిమానులు భాగవతార్ గారిని చూడాలి, ఆ తరువాతనే రైలు బయలుదేరాలి. అందువలన భాగవతార్ గారిని రైల్లో కాకుండా కారులో తీసుకెళ్లడానికి ప్రయత్నించేవారు.  

అనూహ్య సంఘటనతో జైలుపాలు…

సంగీత కచ్చేరీలు చేయడానికి వేదిలు కట్టే వారికి త్యాగరాజన్ భాగవతార్ గారి కచ్చేరీని చిట్టచివరిలో పెట్టండి అని చెప్పేవారు. ఎందుకంటే త్యాగరాజన్ భాగవతార్ గారిని చూడడానికి వచ్చే ప్రేక్షకుల ధాటికి వేదిక కూలిపోయేది. దానిని మళ్లీ నిర్మించాల్సి వచ్చేది అని తన కార్యక్రమం చివరలో ఉండేలా చూసుకునేవారు. త్యాగరాజన్ భాగవతార్ గారికి ఎంత పేరు ప్రతిష్టలు ఉన్నా కూడా అందరితో కలిసిపోయి ఉండేవారు. అలా 1944 వచ్చేసరికి త్యాగరాజన్ భాగవతార్ గారి “హరిదాసు” అనే సినిమా విడుదలైంది. అక్టోబర్ 1944లో విడుదలైన “హరిదాసు” సినిమా (తెలుగులో పాండురంగ మహత్యం) చెన్నై బ్రాడ్‌వే థియేటర్‌లో మూడు సంవత్సరాలు నిరంతరాయంగా నడిచింది. అలా ఆ సినిమా ఘనవిజయం సాధిస్తున్న తరుణంలో, సినిమా విడుదలైన రెండు నెలలకు తన జీవితం పూర్తిగా మలుపు తిప్పిన ఒక సంఘటన జరిగింది. తనకు ఆ సంఘటనతో సంబంధం ఉన్నదో లేదో తెలియదు కానీ త్యాగరాజన్ భాగవతార్ గారు జైలు పాలు కావాల్సి వచ్చింది.


Show More
Back to top button