CINEMATelugu Cinema

భారతీయ సినీరంగంలో అపూర్వం.. తెలుగు సినీచరిత్రలో అద్భుతం..  పాతాళభైరవి…

పాతాళభైరవి (విడుదల.. 15 మార్చి 1951)

అమ్మ చేతి ముద్ద ఎప్పుడూ కమ్మగానే ఉంటుంది. పున్నమి రేయిన వెన్నెల ఎప్పుడూ హాయినిస్తూనే ఉంటుంది. వసంత కోకిల గానం మనసుకు ఇంపుగానే తోస్తుంది. సూర్యోదయాన్ని చూస్తున్న ఆనందం, ఆకాశం ముంగిట్లో వర్షం వేసిన రంగు ముగ్గులాంటి హరివిల్లును ఆస్వాదించడం.. కొన్ని అనుభూతుల్ని ఎన్నిసార్లు ఆస్వాదించినా మనసెప్పుడూ మళ్ళీ మళ్ళీ కావాలని కోరుతూనే ఉంటుంది. కొన్ని సినిమాలు కూడా అంతే..

ఆ చిత్ర కథేంటో తెలుసు. ఆ కథ యొక్క ముగింపు కూడా తెలుసు. ఏ పాట ఎప్పుడు వస్తుందో తెలుసు. ఏ పాత్ర ఎప్పుడెలా ప్రవర్తిస్తుందో తెలుసు. అందులోని ప్రతీ మాట మనకు పరిచయమే. అయినా సరే. తొలిసారి ఓ విచిత్రం చూస్తున్నట్లు తెరమీద నుండి దృష్టిని ప్రక్కకు మరల్చలేము. తన్మయత్వంతో ప్రతీ సన్నివేశాన్ని ఆస్వాదిస్తాం. అందుకే ఆ చిత్రాలన్నీ చరిత్రలో అజరామరంగా మిగిలిపోయాయి. “పాతాళభైరవి” సినిమా కూడా అదే కోవకు చెందింది.

తెలుగు చలనచిత్ర రంగంలోనే కాదు. భారత చలనచిత్ర రంగంలో ఒక ప్రత్యేక స్థానం ఉన్న చిత్రం పాతాళభైరవి. అసాధ్యాలను సుసాధ్యం చేయగల ఒక సామాన్యుడు. తలకు మించిన సాహసాలను విజయవంతంగా నిర్వహించగల కథానాయకుడు. కథనాయకుడికి మాస్ హీరోజాన్ని ఆపాదించడం ఈ సినిమాతోనే మొదలైంది. ఇప్పటికీ ఇదే సూత్రం ప్రస్తుత సినిమాల్లో నడుస్తూ ఉంది.

ఈ చిత్ర రాజం వెండితెర పైకి వచ్చి నేటికి సరిగ్గా 72 వసంతాలు పూర్తయ్యాయి.

పాతాళభైరవి కథ సంక్షిప్తంగా..

ఉజ్జయిని రాజ్యానికి యువరాణిగా (మాలతి) వున్న ఇందుమతిని మానసికంగా ఎదగని మనస్తత్వం గల తన మేనమామ వివాహం చేసుకోవాలని ఆశపడతాడు. కానీ తోటమాలి కొడుకు అయిన తోటరాముడు (ఎన్టీఆర్ ), యువరాణిని ప్రేమించి తన ప్రేమను ధైర్యంగా యువరాణికి తెలియజేస్తాడు. అది తెలుసుకున్న రాజు గారూ తన కూతురును వివాహం చేసుకోవాలంటే ధనవంతుడై ఉండాలని రాజు షరతు పెడతాడు. ధనం సంపాదించాలని నేపాలి మాంత్రికుడితో వెళతాడు తోటరాముడు. అప్పటికే పాతాళభైరవి అమ్మని ప్రసన్నం చేసుకుని శక్తులు పొందుదామని ఆలోచనలో ఉంటాడు మాంత్రికుడు.

తనను చంపే ఆలోచనలో నేపాలి మాంత్రికుడు ఉన్నాడని తెలుసుకొని నేపాలి మాంత్రికుడిని తోటరాముడు చంపేస్తాడు. తోటరాముడు రాజ్యానికి వచ్చి యువరాణి ఇందుమతిని వివాహం చేసుకుందామని అనుకుంటాడు. నేపాలి మాంత్రికుని శిష్యుడు సంజీవన ఆకుతో నేపాలి మాంత్రికుడిని బ్రతికిస్తాడు. నేపాలి మాంత్రికుడు యువరాణి ఇందుమతిని మేనమామ సాయంతో తీసుకొని వెళతాడు. తోటరాముడు మాంత్రికుని వద్దకు వెళ్లి మాంత్రికుడిని చంపి యువరాణిని తెచ్చి వివాహం చేసుకోవడంతో కథ సుఖాంతం అవుతుంది.

నటీ నటుల ఎంపిక..

“బాలరాజు”, “కీలుగుర్రం” లాంటి చిత్రాలతో జానపద కథానాయకుడిగా పేరుగాంచి ఉన్నారు అక్కినేని గారు. కె.వి.రెడ్డి గారు “పాతాళభైరవి” లో నాగేశ్వరావు గారిని కథానాయకుడిగా తీసుకోవాలనుకున్నారు. కానీ చక్రపాణి, నాగిరెడ్డి గార్లకు ఎన్టీఆర్ ని కథానాయకుడుగా ఎంచుకోవాలని అనుకున్నారు. ఎందుకంటే వీరి మొట్టమొదటి చిత్రం “షావుకారు” లో కూడా ఎన్టీఆర్ గారే హీరో. కె.వి.రెడ్డి గారికి ఎన్టీఆర్ గారిని తీసుకోవడం ఇష్టం లేదు. అంజలీదేవి గారు నిర్మించిన “మాయలమారి” లో గండరగండడు పాత్రలో నటించిన తుపాకుల రాజారెడ్డి తీసుకుందామని అనుకున్నారు. కానీ వీరికి కొంచెం నత్తి ఉంది. దాంతో విరమించుకున్నారు.

సంసారం అనే సినిమాలో నాగేశ్వరరావు గారూ, ఎన్టీఆర్ గారు నటిస్తున్నారు. ఆ చిత్రీకరణ విరామంలో నాగేశ్వరరావు గారు, ఎన్టీఆర్ గారు టెన్నిస్ ఆడుతున్నారు. వరుసగా నాలుగు బంతులు తప్పిపోయేసరికి ఎన్టీఆర్ గారికి అసహనం ఏర్పడి బ్యాటును రెండు చేతులతో గట్టిగా పట్టుకొని బంతిని బలంగా కసిగా కొట్టారు. ఆ బంతి కోర్టు దాటి దూరంగా పడిపోయింది. ఆ సన్నివేశాన్ని యాదృచ్ఛికంగా తిలకించారు కె.వి.రెడ్డి గారు. ఎన్టీఆర్ గారూ బలంగా కొట్టిన సందర్భంలో ఉన్న కసిని చూసి నాకు ఇలాంటి వ్యక్తే “తోటరాముడు” పాత్రకు కావాల్సింది అని ఎన్టీఆర్ గారిని పిలిచి మోడల్ షూట్ చేశారు కె.వి.రెడ్డి గారూ. బొడ్డు దేవరను పగలగొట్టిన సన్నివేశాన్ని చిత్రీకరించి, ఎన్టీఆర్ గారే సరైన కథానాయకుడిగా భావించి వారినే కొనసాగించారు.

నెలకు 250 రూపాయల పారితోషికంగా ఇచ్చేలా ఒప్పంద కుదుర్చుకున్నారు. విలన్ గా కూడా కొత్తవారు ఉండాలని ఎస్వీఆర్ ను ఎంపిక చేశారు. నేపాలీ మంత్రికుడి పాత్రకు ఎస్వీఆర్ ని ఎంపికచేశారు. వారు కాకినాడలో ఉద్యోగం చేసేటప్పుడు రంగస్థలం పైన “షైలాక్” పాత్ర వేసేవారు. కె.వి. రెడ్డి గారికి ఆ పాత్ర చేసి చూపించారు. అది నచ్చిన కె.వి.రెడ్డి గారూ ప్రతినాయకుడి పాత్రకు తగ్గ ఆహార్యం, వేషధారణ,  వస్త్రధారణ ఎంచుకున్నారు. రాజకుమార్తె పాత్రకు “భక్త పోతన” చిత్రంలో శ్రీనాథుని కుమార్తె పాత్ర పోషించిన మాలతిని తీసుకున్నారు. తోటరాముడు తల్లి పాత్రకు మొట్టమొదటి టాకీ చిత్రం “భక్త ప్రహ్లాద” చిత్రంలో కథానాయక పాత్ర పోషించిన “సురభి కమలా బాయి”ని తీసుకున్నారు. ఇక హాస్య పాత్రకి వల్లూరి బాలకృష్ణ పద్మనాభం లను తీసుకున్నారు. మాయమహాల్లో డాన్సర్ గా నటి సావిత్రి గారిని తీసుకున్నారు.

తారాగణం…

నందమూరి తారకరామారావు ల..  తోటరాముడు..

ఎస్.వి. రంగారావు… నేపాళ మాంత్రికుడు..

కె.మాలతి…  ఇందుమతి..

చిలకలపూడి సీతారామాంజనేయులు… రాజు..

గిరిజ..    పాతాళ భైరవి

బాలకృష్ణ…   అంజి..

సురభి కమలాబాయి..  తోటరాముని తల్లి..

లక్ష్మీకాంతం.

బి. పద్మనాభం … డింగిరి

హేమలతమ్మ…

రేలంగి …. రాజుగారి బావమరది

సావిత్రి… నర్తకి (రానంటే రానే పాటలో)

సినిమా నిర్మాణం..

విజయా ప్రొడక్షన్స్ నిర్మాణంలో “మాయాబజార్”, “జగదేకవీరుని కథ”, లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు కె.వి.రెడ్డి గారూ.  నాగిరెడ్డి గారూ, చక్రపాణి గారూ నిర్మాతలు. “పాతాళభైరవి” తో కె.వి.రెడ్డి గారు విజయ ప్రొడక్షన్లో అడుగుపెట్టారు. 1949లో నాగిరెడ్డి గారూ వాహిని స్టూడియోను కొనుగోలు చేశారు. అంతకుముందు నాగిరెడ్డి, చక్రపాణి గార్లు బి..యన్.ప్రెస్ నడిపేవారు. బి.ఎన్.రెడ్డి గారి వాహిని ఫిలిమ్స్ చిత్రాలయిన గుణసుందరి కథ, భక్త పోతన లాంటి కే.వి.రెడ్డి గారు దర్శకత్వం వహించారు. నాగిరెడ్డి గారు వాహినీ స్టూడియోను కొన్న తర్వాత విజయా ప్రొడక్షన్స్ పేరు పెట్టి “షావుకారు” లాంటి సాంఘిక చిత్రం తీశారు.

సినిమా బాగుందని అందరూ మెచ్చుకున్నారు. సినిమా బాగుంది కానీ లాభాలు రాలేదు. గుణసుందరి తీసి మంచి పేరు తెచ్చుకున్న కె.వి.రెడ్డి గారు, నాగిరెడ్డి గారితో కలిసి సినిమా తీయాలనే ఒప్పందం కుదుర్చుకున్నారు. గుణసుందరి కథకు పింగళి నాగేంద్ర రావు గారు మాటలు వ్రాశారు. “అల్లావుద్దీన్ అద్భుతదీపం” ప్రేరణతో కథను సిద్ధం చేసుకుని పాటలు, మాటలు పింగళి నాగేంద్ర రావు గారు వ్రాశారు. కమలాకర కామేశ్వరరావు, కే.వీ.రెడ్డి గారు స్క్రీన్ ప్లే వ్రాసుకున్నారు. తెలుగుతో బాటు తమిళంలో కూడా నాగిరెడ్డి, చక్రపాణి గార్లు ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రం 1951 మే 15న విడుదలైంది.

సంగీతం..

విజయా వారు తీసిన మొట్టమొదటి చిత్రం “షావుకారు” కి ఘంటసాల గారే సంగీత దర్శకులు. “పాతాళ భైరవి” కూడా ఘంటసాల గారే సంగీత దర్శకులు. పింగళి నాగేంద్రరావు గారు మాటలు, పాటలు. ఆ రోజుల్లో సంగీతం కోసం హేమండ్ ఆర్గాన్ ని పదహారు వేల రూపాయలు పెట్టి కొనుగోలు చేసి, టీచర్ ని పెట్టి మాస్టర్ వేణు గారికి నేర్పించి పాటలు ట్యూన్ చేయడానికి వినియోగించారు. పింగళి గారు వ్రాసిన పాటలు, ఘంటసాల గారి సంగీతం బాగా అలరించాయి. మంత్రపుష్పం లోని వేదమంత్రాలను తిరిగి వ్రాసి వాటినే చొప్పించారు. మార్కస్ బార్ట్ లే ఛాయాగ్రహణం అద్భుతంగా నిలిచింది. పింగళి గారు సృష్టించిన మాటలు, పాటలు కళా దర్శకత్వం, జానపద కళా చిత్రాల్లో ప్రామాణికంగా నిలిచిపోయాయి. ఈ చిత్రం తెలుగు తెరమీద “నభూతో నభవిష్యత్”. అన్నీ సమపాళ్ళలో కుదిరాయి.

చక్కటి కథనం, మాటల గారడీలు, సజీవంగా నిలిచిపోయిన సంగీతం, చక్కటి గీత మాలికలు, కన్నుల పండగ అయిన “ఛాయాగ్రహణం”, మనసు మీద గాఢంగా ముద్ర వేసిన నటీనటుల అభినయం, భారీ నిర్మాణ సాహసం, కళాత్మక దర్శకుని పాఠవం. ఇవన్నీ కలిసి ఒక చక్కని సినిమాగా తీర్చిదిద్దబడింది. 1950లో మొదలై 1951 మార్చి 15 విడుదలైంది “పాతాళభైరవి”. జెమిని వాసన్ గారు ఈ చిత్రాన్ని పాటలతో సహా “పారా డబ్బింగ్” చేసి హిందీలో విడుదల చేశారు. అక్కడ కూడా హిట్ అయింది. హిందీలో ఎస్వీఆర్, మాలతి గార్లు వాళ్ళ స్వరానికి వాళ్లే డబ్బింగ్ చెప్పుకున్నారు. తెలుగు, తమిళం, హిందీలో కూడా అద్భుత విజయం సాధించింది ఈ సినిమా. ఈ సినిమా విడుదలైన 30 సంవత్సరాల తర్వాత 1981లో పద్మాలయ వాళ్లు జితేంద్ర, జయప్రద గార్లతో హిందీలో పునర్నిర్మించారు.

పాటలు…

“తియ్యని ఊహలు హాయిని గొలిపే”..

“ఎంత ఘాటు ప్రేమయో, ఎంత తీవ్ర వీక్షణమో”…

“కనుగొనగలనో లేనో ప్రాణముతో సఖినీ”            …

“కలవరమాయే మదిలో నా మదిలో కన్నులలోన కలలే ఆయే మనసే ప్రేమ మందిరమాయే”…             

“ప్రణయ జీవులకు దేవి వరాలే కానుకలివియే ప్రియురాల హాయిగా మనకింక స్వేచ్ఛగా”…

“ఇతిహాసం విన్నారా”..

“ప్రేమకోసమై వలలో పడెనే పాపం పసివాడు”…

“వగలోయ్ వగలు తళుకు బెళుకు వగలు”..

“తాళలేనే నే తాళలేనే”…

“హాయిగా మనమింకా స్వేచ్ఛగా”…

“రానంటే రానే రాను”…

“వినవే బాలా నా ప్రేమ గోలా”…

ముఖ్యమైన సంభాషణలు..

నిజం చెప్పమంటారా..?? అబద్దం చెప్పమంటారా..??

“సాహసము సేయరా ఢింభకా.. రాజ కుమారి లభించునురా”..

“జనం అడిగింది మనం సేయవలెనా? మనం చేసింది జనం చూడవలెనా?”

“జై పాతాళ భైరవి”..

“సాష్టాంగ నమస్కారం సేయరా”…

విడుదల..

చిత్ర పంపిణీ సంస్థలకు విజయవాడ ప్రధాన కేంద్రంగా ఉండేది. విజయవాడ దుర్గా కళామందిర్ లో రామారావు గారి సినిమాలు విడుదలయ్యేవి. అలంకార్ థియేటర్లో నాగేశ్వరరావు గారి సినిమాలు విడుదలయ్యేవి. “పాతాళ భైరవి” సినిమా విడుదలకు ముందు విజయవాడలో ప్రీమియర్ షో వేశారు. సినిమా చూసిన వారంతా ఏముంది ఈ సినిమాలో?  మహా అయితే నాలుగైదు వారాలు ఆడుతుంది అన్నారట. మద్రాసులో ఉన్న నాగిరెడ్డి, చక్రపాణి గార్లకు ఈ విషయం తెలియజేశారు పంపిణీ దారులు. నాగిరెడ్డి, చక్రపాణి గార్లు ఒక్కసారి ఉలిక్కిపడ్డారు.

“షావుకారు” సినిమా పోయింది. పాతాళభైరవి కూడా పోతే నిర్మాతలుగా మన పని అయిపోయినట్టే అనుకున్నారట. ఈ విషయం తెలిసిన దర్శకులు కే.వీ.రెడ్డి గారూ పంపిణీదారుల మీద కోప్పడ్డారట. సినిమా భవిష్యత్తును నిర్ణయించేది ప్రీమియర్ షో చూసిన 30 మంది కాదు కదా. ప్రేక్షకులు కదా సినిమా భవిష్యత్తు నిర్ణయించేది. మీరు ఇలాంటి మాటలు ప్రచారం చేయొద్దని చెప్పారట. మరుసటి రోజే సినిమా విడుదలైంది. అప్పటికే అక్కినేని గారు నటించిన జానపద చిత్రం “తిలోత్తమ” పరాజయం పాలైంది. గౌరీనాథ శాస్త్రి గారు సొంతంగా నిర్మించిన చిత్రం “ఆకాశరాజు” కూడా ఆడలేదు. దాంతో ప్రజలు జానపద చిత్రాలను చూడడం మానేశారనే ఒక వాతావరం నెలకొని ఉన్న సమయంలో ఈ చిత్రం విడుదల అయ్యింది.

మాంత్రికుడు చనిపోవడం, మళ్లీ బ్రతకడం, మళ్ళీ చనిపోవడం లాంటి కథనం జనాలకు రుచించలేదనే ఒక వార్త ప్రచారంలోకి వచ్చింది. మొదటి మూడు వారాలు కలెక్షన్ లేవు. మూడు వారాల తర్వాత నుండి ఉపందుకున్న కలెక్షన్లతో అద్భుతమైన విజయం సాధించింది. ఆ సినిమా విజయం ఎటువంటిదంటే 13 ప్రింట్లతో విడుదల చేస్తే 10 కేంద్రాల్లో శత దినోత్సవ జరుపుకుంది. 4 కేంద్రాల్లో రజతోత్సవం జరుపుకుంది  200 రోజులు ఆడిన మొట్టమొదటి చిత్రంగా రికార్డును సొంతం చేసుకుంది పాతాళ భైరవి. 72 సంవత్సరాలలో 500 ప్రింట్లు వేశారు. ఒరిజినల్ నెగిటివ్ లు పాడయితే, రెండుసార్లు నెగటివ్ లు తీశారు. తెలుగులో బ్లాక్ అండ్ వైట్ సినిమాకు రెండుసార్లు నెగిటివ్ లు తీయడం ఒక “పాతాళభైరవి” సినిమాకే సాధ్యమైంది.

రికార్డులు..

తెలుగు చిత్రాల్లో ‘హీరోయిజం’ అన్న ధోరణిని సృష్టించింది. అంతకు ముందు ఎన్నో జానపద చిత్రాలు వచ్చినా, కథానాయకుడి పాత్రను అంతటి ధీరోదాత్తునిగా తీర్చిదిద్దింది ‘పాతాళభైరవి’లోనే. అందుకు తగ్గట్టుగా ఎన్టీఆర్ గారూ తోటరాముడు పాత్రకు జీవం పోశారు. తొలి సారి విడుదలలో 13 కేంద్రాల్లో విడుదలై విశాఖపట్నం (సరస్వతీ టాకీస్ ), భీమవరం (మారుతీ), కర్నూలు (సాయిబాబా టాకీస్)ల్లో 91 రోజులు ఆడితే, మిగిలిన 10 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకున్నది.

అలాగే, థియేటర్ మారకుండా తెలుగులో ద్విశత దినోత్సవం జరుపుకొన్న తొలి చిత్రము కూడా “పాతాళ భైరవే”. బెజవాడ (శ్రీ దుర్గా కళామందిరం), నెల్లూరు (శేష్ మహల్), గుడివాడ (శరత్), బళ్ళారి (ప్రభాత్ థియేటర్)లలో థియేటర్ మారకుండా 200 రోజులు ఆడిన చిత్రం ఈ “పాతాళ భైరవి”. మరో విశేషం ఏమిటంటే, తెలుగు పాతాళ భైరవి 100 రోజులు పండుగ చేసుకొనే నాటికి, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సీమల్లో కలిపి, ఈ చిత్రం తెలుగు, తమిళ రూపాలు 100 కేంద్రాల్లో, 100 ప్రింట్లతో ఆడుతుండడం. 1951లో దక్షిణాదిన  వేరువేరు సందర్భాలలో మళ్ళీ విడుదలయ్యి, రి రిలీజ్ లో కూడ శతదినోత్సవం జరుపుకొని మొత్తంగా (ఆంధ్రలో 18, నైజాం 3, మైసూర్ 2, తమిళనాడు 4, బొంబాయి 2) 29 కేంద్రాలలో శతదినోత్సవం పూర్తి చేసుకొన్న చిత్రం ఈ “పాతాళభైరవి”.

1952 జనవరి 24న భారతదేశంలో జరిగిన తొలి అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో దక్షిణ భారతదేశం నుంచి ప్రాతినిధ్యం పొందిన ఏకైక చిత్రమూ “పాతాళ భైరవే”. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఒకే కథానాయకుడితో నిర్మాణం జరుపుకొన్న తొలి ద్విభాషా చిత్రం “పాతాళ భైరవే”. తెలుగులో 1951 మార్చి 15న విడుదలైతే, తమిళంలో అదే ఏడాది మే 17న విడుదలైంది. యన్.టి.ఆర్ గారి ప్రతిభ, నేపాళ మాంత్రికునిగా యస్.వి. రంగారావు గారి నటనా చాతుర్యము, కె.వి. రెడ్డి గారి దర్శకత్వం, పింగళి నాగేంద్రరావు గారి సంభాషణలు, ఘంటసాల గారి పాటలు వెరసి “పాతాళభైరవి” చిత్రాన్ని చరిత్రలో చిరస్థాయిగా నిలిపాయి. ఇన్ని విశేషాలున్న ఓ అపురూపమైన చిత్రం “పాతాళభైరవి”.

ఆ చలనచిత్రం 72 ఏళ్ళ తరువాత కూడా ఇప్పటికీ జనాదరణ పొందుతోంది. కొత్త సినిమాలకు సైతం రిపీట్ రన్లు లేని ఈ రోజుల్లో ఏడాదికీ పాత ప్రింట్లతో ఏదో ఒక ఊళ్ళో ఆడుతూనే ఉంది. పండుగలు వచ్చాయంటే, ఈ సినిమాను టీవీ చానళ్ళ వాళ్ళు ప్రధాన ప్రసార సమయంలో ప్రసారం చేసి, వాణిజ్య ప్రకటనలూ, టి.ఆర్.పి.లు సాధించడం విశేషం.

Show More
Back to top button