Telugu Cinema

వైవిధ్య నటుడు, టాలీవుడ్ బాబాయ్ చలపాయ్… తమ్మారెడ్డి చలపతిరావు

తమ్మారెడ్డి చలపతిరావు (8 మే 1944 – 25 డిసెంబరు 2022)

వైవిధ్య నటుడు టాలీవుడ బాబాయ్అతడిని చూస్తే కథానాయికకు భయం. మానభంగం సన్నివేశాలను అంతలా రక్తి కట్టిస్తాడు గనుక… తనను చూస్తే  సహా పాత్రదారులకు భయం. తన విలనిజంతో ఆద్యంతం భయకంపితులను చేస్తాడు కాబట్టి. అతడు విలనీ చేస్తే హీరోకే కాదు ప్రేక్షకులకు కూడా కొట్టాలని అనిపిస్తుంది. ప్రేక్షకులకు క్రూరమైన విలన్ గా పరిచయమై సున్నిత మనస్కులు, మృధుస్వభావి అయిన నటులు చలపతి రావు గారు.. అదృష్టం ఎప్పుడు ఎలా వరిస్తుందో తెలియదు. కానీ ప్రతిభ ఉన్న వారిని మాత్రం ఖచ్చితంగా వరిస్తుంది. చలపతిరావు గారికి ఇది అచ్చుగుద్దినట్టుగా సరిపోతుంది.

సినిమాలలో అవకాశాలు రావడం మామూలు మాటలు కాదు. వచ్చినా నిలుస్తాయన్న ఖచ్చితత్వం లేదు. కొన్ని సార్లు ఎన్నో ఒడిదుడుకులు, కష్టాలు, ఆటుపోట్లు, ఆకలి, నైరాశ్యం అన్నీ చుట్టుముడతాయి. మనం ఎక్కి వచ్చిన రైలునే తిరిగి ఎక్కి వెళ్ళిపోదామని అనిపిస్తుంది. సినిమాలలో స్టార్లుగా వెలుగొందిన వారు, క్రింది స్థాయి కళాకారులూ ఎందరో ఇలాంటి స్థితిని ఎదుర్కొన్నవారే. దానికి చలపతి రావు గారు తక్కువేమి కారు. తాను కూడా సినిమాలలో నిలబడడానికి ఎన్నో ప్రయాసలు పడ్డవారే. కానీ అవకాశాలు వెల్లువలా వచ్చి పడ్డాక వెనుదిరిగి చూసుకోలేదు. సినిమాలలోకి వచ్చిన కొన్నాళ్ళకే భార్య మరణం. అయినా తట్టుకున్నారు. సినిమాలలో నటించడమే కాదు, నిజ జీవితంలో జీవించడమూ తెలియాలి. తాను కూడా జీవించడం నేర్చుకున్నారు. ఎందుకంటే అప్పటికే తనకు ముగ్గురు పిల్లలు. వైవిధ్య నటుడు టాలీవుడ్ బాబాయ్

పుత్రోత్సాహము తండ్రికి

పుత్రుడు జన్మించినపుడు పుట్టదు, జనులా

పుత్రుని గనుకొని పొగడగ

పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ…!!

ఈ పద్యం, పద్యం యొక్క భావం చలపతి రావు గారికి అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. చిన్నతనంలో పిల్లలకు తల్లి దూరమైతే, కేవలం తండ్రి మాత్రమే ఆ పిల్లలను పెంచాల్సి వస్తే, తన కెరీర్ కు ఆటంకం కలుగకుండా, తన పిల్లల భవిష్యత్తుకు భంగం కలుగకుండా, ఒకవైపు తల్లిలా లాలిస్తూ, తండ్రిలా ఆడిస్తూ దుఃఖాన్ని దిగమింగుతూ, సంతోషాన్ని పంచుతూ సినిమా లో నటిస్తూ, నిజ జీవితంలో జీవించడం ఎంతో కష్టమైన పని. కానీ చలపతిరావు గారు ఇట్టి సమస్యలు తనకు ఏనాడూ బరువు అనుకోలేదు. కష్టాలనే తన ఇష్టాలుగా మలుచుకున్నారు. వైవిధ్య నటుడు టాలీవుడ్ బాబాయ్

జీవిత విశేషాలు…

  • జన్మ నామం :    తమ్మారెడ్డి చలపతిరావు
  • జననం    :    8  మే 1944 
  • స్వస్థలం   :   బల్లిపర్రు, పామర్రు మండలం, కృష్ణా జిల్లా
  • తండ్రి   :   మణియ్య
  • తల్లి     :   వియ్యమ్మ
  • భార్య    :   ఇందుమతి
  • పిల్లలు   :   ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి రవిబాబు..
  • వృత్తి      :    నటుడు , నిర్మాత
  • మరణ కారణం   :   గుండెపోటు..
  • మరణం   :   25 డిసెంబరు 2022, హైదరాబాదు..

జననం..

తమ్మారెడ్డి చలపతిరావు గారి స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణాజిల్లాలో గల పామర్రు మండలంలో ఉన్న బల్లిపర్రు. వీరు 8 మే 1944 నాడు జన్మించారు. వీరి నాన్న గారి పేరు మణియ్య, అమ్మ పేరు వియ్యమ్మ. వీరి అమ్మ గారిది బల్లిపర్రు ప్రక్కనే ఉన్న మామిళ్ళపల్లి. బాల్యంలో తనకు చదువు అంతగా అబ్బలేదు. నాటకాలు అంటే విపరీతంగా ఇష్టపడే చలపతి రావు గారికి చదువు మీద ధ్యాస తగ్గి నాటకాల మీద మోజు పెరిగింది. దాంతో ఊళ్ళో వాళ్లు తనను సినిమాలలో ప్రయత్నించమని సలహా ఇచ్చారు. తన 19 యేటనే ఇందుమతి తో వివాహం జరిగింది. తాను సినిమాలలో నటించడమే తన అభిలాషగా తన భార్యకు చెప్పారు చలపతిరావు గారు. దాంతో అభ్యంతరం తెలుపని తన భార్య ఇందుమతి మద్యం, సిగరెట్, అమ్మాయిల జోలికి వెళ్ళకూడదు అని చెప్పి తనను సినిమా ప్రయత్నాలకు మద్రాసు పంపించింది.

సినీ ప్రస్థానం…

ప్రస్తుతం సినిమాలలో స్థిరపడ్డాక నటీ, నటులు పెళ్లి చేసుకుంటున్నారు. కానీ ఆ రోజులలో ఎన్టీఆర్, కృష్ణ, శోభన్ బాబు, షావుకారు జానకి తదితర నటీ, నటులు పెళ్లి తరువాత సినిమాలలోకి వచ్చారు. అలాగే నటులు చలపతిరావు గారు కూడా పెళ్ళి తర్వాత సినిమాల్లోకి వచ్చారు. వైవిధ్య నటుడు టాలీవుడ్ బాబాయ్

చలపతి రావు గారికి 19 సంవత్సరాలకు వివాహమైంది. తనకు మొదటి నుండే చదువు సరిగ్గా అబ్బేది కాదు. తాను కొంచెం అందంగా ఉండి, పొడుగ్గా ఉండేవారు. చదువును ప్రక్కన బెట్టి నాటకాల పిచ్చితో తిరిగేవారు. చదువు కంటే నాటకాల మీద ఎక్కువ దృష్టి పెట్టి బాగా నటిస్తుండే చలపతిరావు గారిని చూసి అందరూ ‘నువ్వు మద్రాసు వెళితే హీరో అవుతావు’ అని చెప్పేసరికి తనకు సినిమాల మీద ధ్యాస మళ్ళింది.

పెళ్ళైన మూడేళ్ళ తర్వాత సినీ ప్రయత్నాలు ప్రారంభించారు. తాను ఇంట్లో లక్ష రూపాయలు తీసుకుని మద్రాసు రైలు ఎక్కారు. కానీ మద్రాసు వచ్చిన తర్వాత తనకు పరిస్థితి అర్థమైంది. లగ్జరీ లుక్ ఇస్తేనే కథనాయకుడిగా అవకాశాలు వస్తాయని కారు కొన్నారు. ఒక డబ్బింగ్ సినిమా కొని విడుదల చేశారు. ఆ సినిమా ఆశించినంత విజయం సాధించలేదు. తాను కొన్న కారుకు ప్రమాదం అయ్యి కారు పాడయిపోయింది. ఇంటి నుంచి తెచ్చుకున్న డబ్బులు అయిపోయాయి. అప్పటికే శోభన్ బాబు, కృష్ణ లు హీరోలుగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రాజనాల, కైకాల సత్యనారాయణ, ప్రభాకర్ రెడ్డి విలన్లుగా తీరికలేకుండా ఉన్నారు. ఎటు చూసినా తనకు అవకాశాలు రావడం కష్టమని భావించిన చలపతిరావు గారు చివరికి నందమూరి తారకరామారావు గారిని సంప్రదించారు.

మలుపు తిప్పిన “దాన వీర సూర కర్ణ” చిత్రం..

సినిమాలలో అవకాశాలు సరిగ్గా రాకపోవడంతో ఎన్టీఆర్ గారిని కలిశారు చలపతిరావు గారు. దాంతో ఎన్టీఆర్ గారి చొరువతో తన “కథానాయకుడు” (1969) చిత్రంలో చలపతి రావు గారికి నటించే అవకాశం దక్కింది. ఆ తర్వాత నుంచి ఎన్టీఆర్ గారి దగ్గరే ఎక్కువ ఉండటంతో చలపతిరావు గారికి ఎన్టీఆర్ మనిషిగా ముద్ర పడింది. అందువలన ఇతరులు తనకు అవకాశాలు ఇవ్వలేదు. ఎన్టీఆర్ గారు కథానాయకుడిగా నటించడంతో పాటు స్వీయ రచన, దర్శక నిర్మాణంలో రూపొందిన “దాన వీర సూర కర్ణ”తో చలపతి రావు గారికి బ్రేక్ వచ్చింది. ఆ చిత్రంలో ఎన్టీఆర్ గారు మూడు వేషాలు వేస్తే, చలపతి రావు గారు ఐదు పాత్రలు ధరించారు. అప్పటినుండి ఇతర హీరోల సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చాయి.

యుగ పురుషుడు, డ్రైవర్ రాముడు, వేటగాడు, అక్బర్ సలీం అనార్కలి, రౌడీ రాముడు కొంటె కృష్ణుడు, త్రిశూలం, బొబ్బిలి పులి, ఖైదీ, అడవి దొంగ, కిరాతకుడు, కలియుగ పాండవులు, అపూర్వ సహోదరుడు, భారతంలో అర్జునుడు, భార్గవ రాముడు, ప్రేమ, విజయ్, కొండవీటి దొంగ 

ఆదిత్య 369, పెద్దరికం, ఘరానా మొగుడు, కుంతీపుత్రుడు, చిన్న అల్లుడు, అల్లరి అల్లుడు, ఆమె, సూపర్ పోలీస్, గాండీవం, బొబ్బిలి సింహం, ఘటోత్కచుడు, అల్లుడా మజాకా, పోకిరి రాజా, సిసింద్రీ, పెదరాయుడు, సంకల్పం, వజ్రం, సంప్రదాయం, నిన్నే పెళ్లాడతా, వంశానికొక్కడు, గులాబీ, రాముడొచ్చాడు, జాబిలమ్మ పెళ్లి, మృగం, మా నాన్నకి పెళ్ళి, శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి మొదలగు చిత్రాలలో నటించారు.

ఎన్టీఆర్, కృష్ణ, శోభన్ బాబు, అక్కినేని నాగేశ్వరావు, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, మోహన్ బాబు, జె.డి. చక్రవర్తి, ఆలీ, శ్రీకాంత్, వెంకట్, నితిన్, అల్లరి నరేష్, సునీల్, సుమంత్, ప్రభాస్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రవితేజ, శర్వానంద్ తదితర హీరోలందరితోనూ కలిపి సుమారు 1200 చిత్రాలలో నటించారు. విలన్ గా, తండ్రిగా, బాబాయిగా, తాతగా అనేక పాత్రలను వైవిధ్యభరితంగా పోషిస్తూ, విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు చలపతిరావు గారు.

నిన్నే పెళ్లాడతా” కు ముందు, తరువాత…

చలపతి రావు గారి సినీ ప్రస్థానాన్ని రెండు భాగాలుగా విభజించి చూస్తే “నిన్నే పెళ్లాడతా” సినిమాకు ముందు, తరువాత అని చెప్పుకోవచ్చు. కరుడు గట్టిన విలనిజం ఉన్న పాత్రలను ఎక్కువగా పోషించిన చలపతిరావు గారిని ఆ మూస ధోరణి నుండి తనను తప్పించారు కృష్ణవంశీ గారు. ఉమ్మడి కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిన “నిన్నే పెళ్లాడతా” చిత్రంలో కథనాయకుడు నాగార్జునకు తండ్రిగా అద్భుతంగా నటించారు. తండ్రీ, కొడుకుల మధ్య ఇంత చక్కటి అనుబంధం ఉండాలని ప్రతీ కొడుకు కోరుకునే విధంగా వైవిధ్యభరితంగా తెరకెక్కించారు దర్శకులు కృష్ణవంశీ గారు.

చలపతిరావు గారి 56 ఏళ్ళ సినీ ప్రస్థానంలో 30 ఏళ్ళ తరువాత నటించిన నిన్నేపెళ్లాడతా చిత్రంతో కరుడుగట్టిన విలన్ అనే ముద్ర చెరిగిపోయింది. దీని ప్రభావం ఎలా ఉండేదంటే షూటింగ్ కు ప్యాకప్ చెప్పినాక, హీరోయిన్లు చలపతిరావు గారు ఉండే హోటల్ లో బసచేయడానికి సైతం భయపడేవారట. అంతలా తన పాత్రలు తనను ప్రభావితం చేసేవి. నిజ జీవితంలో సౌమ్యులు అయిన చలపతిరావు గారికి ఇవి ఇబ్బంది కలిగించే అంశాలు. నిన్నేపెళ్లాడతా చిత్రం తరువాత తండ్రి, బాబాయి పాత్రలు ఎక్కువగా చేశారు. దాంతో టాలీవుడ్ బాబాయిగా, చలపాయ్ గా తాను ప్రసిద్ధి చెందారు.

భార్యకు మాటకు విలువనిచ్చిన చలపతిరావు..

చలపతి రావు గారు నిజ జీవితంలో మందు త్రాగరు. తన సినీ తొలి ప్రస్థానంలో చలపతి రావు గారికి ఎక్కువగా విలన్ వేషాలు వచ్చాయి. మానభంగం సన్నివేశాలు అంటే చాలు తోటి నటీనటులకు, ప్రేక్షకులకు గుర్తొచ్చే పేరు చలపతి రావు. కథానాయికలు అవుట్ డోర్ షూటింగ్ ఉన్నప్పుడు చలపతి రావు గారు బస చేసే హోటల్‌లో ఉండటానికి భయపడేవారు. కానీ నిజ జీవితంలో చలపతి రావు గారు మందు, సిగరెట్ వంటి వాటికి దూరంగా ఉంటూ వచ్చారు. తాను సినిమాల్లోకి వెళతానని తన భార్యతో అన్నప్పుడు “మందు, సిగరెట్ ముట్టకూడదు. మహిళల జోలికి వెళ్ళకూడదని చలపతి రావు గారికి వాళ్ళ ఆవిడ చెప్పింది. దాంతో తాను తన భార్యకు ఇచ్చిన మాట మీద నిలబడ్డారు. నందమూరి తారకరామారావు గారూ దగ్గర ఉండటంతో తనకు చెడు అలవాట్లు దరిచేరలేదని పలు సందర్భాలలో చెప్పుకొచ్చారు.

తన భార్య అంటే వల్లమాలిన ప్రేమ, ఆప్యాయతలు గల చలపతి రావు గారు సినిమాల్లోకి వచ్చిన ఐదారేళ్ళకు తన భార్య మరణించారు. అప్పటికి చలపతి రావు గారి వయస్సు 28 సంవత్సరాలు. ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు. పిల్లలను పెంచడం కోసం తొలుత మరొకరిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. డబ్బులు ఇవ్వడానికి సిద్ధపడినా ఎవరూ కూడా ముందుకు రాలేదు. దాంతో తన తల్లి సాయంతో పిల్లల్ని పెంచారు. సినిమాల్లో చలపతి రావు గారూ బిజీ అయ్యాక అనేక మంది నుండి పెళ్ళి చేసుకుంటామని ప్రతిపాదనలు అందాయి. అయినా సరే ఆయన ఎవరినీ పెళ్లి చేసుకోలేదు. ప్రస్తుతం ఆయన కుమారుడు రవిబాబు నటుడిగా, దర్శకుడిగా చిత్రసీమలో రాణిస్తున్నారు.

పిల్లల కోసమే జీవితాన్ని త్యాగం చేసిన తండ్రి…

చలపతి రావు గారు ఇందుమతి ని వివాహం చేసుకున్నాక తనకు ముగ్గురు పిల్లలు జన్మించారు. చదువు సరిగ్గా అబ్బని తాను సినిమాల్లో చేరుదామని, హీరో అవ్వాలని రైలెక్కి మద్రాసు చేరుకున్నారు. ఆ తరువాత తెలిసింది. సినిమాలలో హీరో అవ్వడం అంత సులువైన విషయం కాదని. క్యారెక్టర్ నటుడిగా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ నటుడిగా నిలదొక్కుకునే సమయంలో హఠాత్తుగా ఒక విషాద సంఘటన చోటుచేసుకుంది. చలపతిరావు గారు చెన్నైలో ఉన్న సమయంలో తన భార్య ఇందుమతికి అగ్నిప్రమాదం జరిగింది.  వారి కోసం ఆయన ఆ తర్వాత పెళ్లి చేసుకోకుండా తన జీవితాన్ని అంకితం చేశారు.

1966లో తన 22 యేళ్లకే చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన చలపతిరావు గారు తన తొలి సినిమా సూపర్ కృష్ణ గారి “గూఢచారి 116” అనే చిత్రంతో సినీ ప్రస్థానాన్ని ప్రారంభించి దాదాపు 1200కు పైగా చిత్రాల్లో నటించారు. తమ కుటుంబం చెన్నైలో ఉన్న సమయంలో తన భార్య ఇందుమతి తెల్లవారు జామున మంచి నీళ్ళు పట్టేందుకు వెళ్లినపుడు అనుకోకుండా ఆమె చీరకు నిప్పు అంటుకుంది. ఆమె అరుపులు విన్న చలపతిరావు గారు హుటాహుటిన వెళ్లి మంటలార్పారు. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రిలో చేర్చగా, మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడి తుది శ్వాస విడిచారు. తన జీవిత భాగస్వామిని కోల్పోయిన చలపతి రావు గారు తన ముగ్గురు పిల్లల బాగోగులు చూసుకోవడం కోసమే మరలా వివాహం చేసుకోకుండా తన పిల్లల బాగోగులను చూసుకుంటా కాలం వెళ్లదీశారు.

మరణం…

అనారోగ్య సమస్యలతో కొంత కాలంగా నటనకు దూరంగా ఉన్న చలపతిరావు గారు తన 78 సంవత్సరాల వయస్సులో 25 డిసెంబర్ 2022 నాడు తెల్లవారుజామున గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన భార్య ఇందుమతి గతంలోనే అగ్ని ప్రమాదంలో చనిపోయింది. ఆయనకు కొడుకు రవిబాబు, ఇద్దరు కుమార్తెలు మాలినిదేవి, శ్రీదేవి ఉన్నారు.

సశేషం…

చలపతి రావు గారు కరుడు గట్టిన విలనిజం ఉన్న పాత్రలను పోషించేవారు. కానీ వ్యక్తిగతంగా సహృదయులు. తాను నిజ జీవితంలో ఒక్క భార్య లేని లోటు తప్ప నిండు జీవితాన్ని ఎంతో బాగా అనుభవించాడు. తన పిల్లలను వృద్ధిలోకి తేవాలని మాత్రమే ముఖ్య ధ్యేయం గా పెట్టుకుని చనిపోతున్న తన భార్యకు మరో పెళ్లి చేసుకుంటాను అని మాట ఇచ్చాడు. చలపతి రావు గారి ముగ్గురు పిల్లలో కొడుకు రవి బాబు దర్శకుడిగా, నటుడిగా వెండితెర పైన మనం చూస్తూనే ఉన్నాం. తన ఇద్దరు కూతుళ్లు అమెరికాలో స్థిర పడ్డారు. చలపతి రావు గారి పిల్లలు చదువులో చురుకుగా ముందంజలో ఉండేవారు.

తనయుడు రవిబాబు కొన్ని వివాదాల విషయం అంటుంచితే తాను కూడా చదువులో బాగా ముందుండేవాడు. మూడేళ్ళ పాటు వరసగా చదువులో బంగారు పతకం సాధించాడు. ఎం.ఏ.లిటరేచర్ చదివిన చలపతి రావు గారి పెద్ద అమ్మాయి మాలిని దేవి కూడా బంగారు పతకం అందుకుంది. తాను పెళ్లి చేసుకొని అమెరికా లో ఉంటుంది. చదువులు అమెరికాలో డెట్రాయిట్ యూనివర్సిటీ లో ఎం.ఎస్ పూర్తి చేసిన చిన్న అమ్మాయి శ్రీదేవి అక్కడ టాపర్ గా నిలిచింది. అలా తన నమ్మకాన్ని వమ్ము చేయకుండా చలపతి రావు గారి కలల్ని నిజం చేస్తూ తన ముగ్గురు పిల్లలు తనను ఎప్పుడు నిరాశ పరచలేదని ఎన్నోసార్లు చలపతి రావు గారు చెప్పుకొచ్చారు.

Show More
Back to top button