Telugu Cinema

ఐపీఎస్‌ అవ్వాలనుకుని.. అనుకోకుండా సినిమాల్లోకి… ‘శరత్ బాబు’!

  • ఐపీఎస్‌ అవ్వాల ఆశ ఉన్నా.. ఎటువంటి శిక్షణ తీసుకోకుండా.. నేరుగా సినిమాల్లో అడుగుపెట్టిన నటుడు..
  • తొలి చిత్రంతోనే హీరోగా హిట్ అందుకున్నాడు.
  • దక్షిణాదిన దాదాపు అన్ని భాషల్లో నటించారాయన. ఐపీఎస్‌ అవ్వాల ప్రతికూల పాత్రల్లోనూ ఏమాత్రం తగ్గని నటనను కనబర్చి, మెప్పించారు.
  • ఐపీఎస్‌ అవ్వాల మొత్తంగా సినిమా రంగంలో శరత్ బాబు హీరోగా సక్సెస్ కాలేకపోయినా.. 
  • క్యారెక్టర్ ఆర్టిస్టుగా, తండ్రిగా, తమ్ముడిగా, అన్నగా..  పలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు పోషించడంతో ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.
  • గతకొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో భాదపడుతన్న శరత్‌బాబు మే 22న, తన 71ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా ఆయన జీవిత, సినిమా విశేషాల గురుంచి ఈరోజు మనం తెలుసుకుందాం:

నేపథ్యం

1951 జూలై 31న శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాల వలసలో జన్మించారు శరత్ బాబు. తండ్రి విజయశంకర దీక్షితులు, తల్లి సుశీలాదేవి. శరత్ బాబు అసలు పేరు సత్యంబాబు దీక్షితులు. ఇది చాలామందికి తెలియని పేరు.. తండ్రికి హోటల్ బిజినెస్ ఉంది. శరత్ బాబుకు తొమ్మిది మంది అన్నదమ్ములు. తనలాగే కొడుకు కూడా బిజినెస్ చేసుకుంటాడని భావించారు తండ్రి. కానీ చిన్ననాటి నుంచి శరత్ బాబుకు పోలీస్ అవ్వాలనే ఆశ ఎక్కువగా ఉండేదట. అలా శ్రీకాకుళం ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీలో బీఎస్సీ చేశారు. ఆ సమయంలోనే అడపాదడపా నాటకాలు వేశారు. అలా మొదటిసారి ‘దొంగాటకం’ అనే నాటిక చేశారు. ఆ నాటికకు అప్పట్లో మంచి ఆదరణ లభించింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు మెచ్చుకోవడంతోపాటు కాలేజీ మ్యాగజైన్‌లో సైతం తాను వేసిన నాటకాల గురుంచి రాయడంతో సినిమాల మీద ఆసక్తి పెంచుకున్నారు. 

తొలి అవకాశం

వీరి నాన్నగారు చూసుకుంటున్న‘గౌరీశంకర్‌’ హోటల్‌ కు చుట్టుపక్కల ప్రాంతాల్లో మంచి పేరుంది. శరత్ బాబు గారి అన్నయ్యా, తను దీని నిర్వహణ చూసుకునేవారు. కాలేజీ చదువు పూర్తయ్యాక.. అన్నయ్యకు హోటల్‌ పనుల్లో సాయంగా ఉండాలని అనుకున్నారట. కానీ స్నేహితుల బలవంతం మీద సినిమాల్లో ప్రయత్నించాలనుకున్నారు. ఆ క్రమంలోనే శరత్ బాబు తన అభిమాన దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుగారికి కొన్ని ఫొటోలు పంపారు. ప్రతిగా ఆయన ఇంటర్వ్యూకు రమ్మని ఉత్తరం పంపారు. మద్రాసుకు వెళ్లిన శరత్ బాబును ‘మళ్లీ కబురు పంపిస్తాన’ని చెప్పడంతో, అదే మాటగా భావించి అక్కడే ఉండిపోయారు.

అదే సమయంలో రామవిజేత అనే సంస్థ.. తాము నిర్మించబోయే నూతన సినిమా కోసం నటీనటులు కావాలంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. 

ఆడిషన్‌కు శరత్ బాబు వెళ్ళారు. ఆయనతో కలిపి దాదాపు 3000మంది రాగా.. చివరకు శరత్ బాబునే సెలెక్ట్‌ చేసింది ఆ మూవీ బృందం. 

జగ్గయ్య, ఎస్‌.వి.రంగారావు, చంద్రకళ, సావిత్రి.. వంటి దిగ్గజ తారలతో కలిసి పని చేసే అవకాశం తొలి ప్రయత్నంలోనే వరించింది శరత్ బాబుకు. అలా పనిచేసిన మొదటి సినిమా.. ‘రామరాజ్యం’. 1973లో ఇది విడుదలైంది. హిట్ పేరు తెచ్చుకోవడంతో, అతి తక్కువ కాలంలోనే సినిమావకాశాలు వరుస కట్టాయి. 

బంగారు మనిషి, అమెరికా అమ్మాయి, దొరలు- దొంగలు, లాంటి చిత్రాల్లో నటించే ఛాన్స్ దక్కింది. అలా మొదలైన సినీ ప్రస్తానం.. ఒక్క తెలుగులోనే ఆగిపోకుండా, తమిళ, మళయాళ, కన్నడ, హిందీ భాషల్లో కలిపి దాదాపు 220కి పైగా సినిమాలు చేయగలిగారు.

వివాహ జీవితం

ఆయన సినిమారంగ ప్రవేశం చేసిన కొన్నాళ్ల తరువాత తనకన్నా వయసులో పెద్ద అయిన నటి రమాప్రభతో కొన్నేళ్లు సహజీవనం చేశారు. 

కామెడీ యాక్టర్ రమాప్రభ సినీఇండస్ట్రీలో అడుగు పెట్టి అప్పటికే పదేళ్లు ఆ తర్వాత శరత్ బాబు సినీ నటుడిగా ఎంట్రీ ఇచ్చారు వీళ్లిద్దరు జంటగా కొన్ని సినిమాల్లో నటించారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి, 1974లో రెండు కుటుంబాల అంగీకారంతో పెళ్లి వరకు వెళ్లింది. కొన్నాళ్లు సాఫీగా సాగిన సంసారం.. తర్వాత మనస్పర్ధల కారణంగా విడిపోయారు. విడాకుల తర్వాత శరత్ బాబు కొన్నాళ్లకు తమిళనాడులో ప్రముఖ నటుడైన నంబియార్ కూతురు స్నేహలతని 1990లో రెండవ వివాహం చేసుకున్నారు. వీళ్ళిద్దరూ 20 ఏళ్ళు కలిసున్నాక, 2011లో విడిపోయారు. రమాప్రభ మాత్రం ఒంటరిగా ఉండిపోయింది. వీరికి పిల్లలు లేరు. దీంతో రమాప్రభ ఓ అమ్మాయిని దత్తత తీసుకున్నారు. పేరు విజయ చాముండేశ్వరి. ఈమె ప్రముఖ నటుడు, హీరో రాజేంద్ర ప్రసాద్‌ భార్య.

వెండితెరపై

హీరోగానే కాదు విలన్‌గానూ శరత్‌బాబు నటించి మెప్పించారు. కె బాల చందర్‌ దర్శకత్వంలో వచ్చిన తమిళ చిత్రం ‘నిజల్‌ నిజమగిరదు’(1978) ద్వారా పాపులర్ అయ్యారు. తెలుగులో ‘మరో చరిత్ర, ఇది కథకాదు, తాయరమ్మ బంగారయ్య, మూడు మూళ్ళ బంధం, అయ్యప్ప మహాత్యం, శరణం అయ్యప్ప, సీతాకోక చిలుక, అభినందన, సాగర సంగమం, సితార, అన్వేషణ, స్వాతిముత్యం, సంసారం ఒక చదరంగం, కోకిల, అపద్భాందవుడు, అన్నయ్య, క్రిమినల్‌, సంకీర్తన, శ్రీరామదాసు, మగధీర’ వంటి హిట్ చిత్రాల్లో… కీలక పాత్రల్లో నటించారు. చివరిగా పవన్‌ కల్యాణ్‌ ‘వకీల్‌ సాబ్‌’ చిత్రంలో కన్పించారు. తాజాగా నరేష్‌, పవిత్రా లొకేష్‌ జంటగా నటించిన ‘మళ్లీ పెళ్లి’ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించారు. అది ఈ నెలలో విడుదలకు సిద్దంగా ఉంది.

గుర్తింపు

1981లో వచ్చిన సీతాకోక చిలుక, 

1988లో వచ్చిన ఓ భార్య కథ, 

1989లో వచ్చిన నీరాజనం.. సినిమాలకుగానూ ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాలను అందుకున్నారు శరత్ బాబు.

2023లో ‘వసంత ముల్లై’ తమిళంలో ఆయన నటించిన చివరి చిత్రం. 

అంతరంగాలు ధారావాహికతో బుల్లితెరకు సుపరిచితులయ్యారు. ఆ తర్వాత ‘జనని’, ‘అగ్నిగుండాలు’ సీరియల్స్‌ కూడా శరత్‌బాబుకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ‘గాంధర్వ మాలతీయం’ అనే మరో సీరియల్‌తో నిర్మాతగానూ నిరూపించుకున్నారు.  2009 వరకు వరస సినిమాల్లో నటించిన శరత్‌బాబు కెరీర్‌పరంగా ఆ తర్వాత కాస్త నెమ్మదించారనీ చెప్పుకోవాలి. ఓవైపు సీరియల్స్‌లో కీలకపాత్రలు పోషిస్తూనే వీలునప్పుడల్లా పలు సినిమాల్లోనూ సహాయనటుడిగా కనిపించేవారు. 

‘‘1974లో విడుదలైన ‘నోము’లో ప్రతికూల పాత్రలో కనిపించారు. ఆ తర్వాత ఏడాదిలో వచ్చిన ‘అభిమానవతి’లోనూ ప్రతినాయకుడిగా కనిపించారు. దీంతో విలన్‌ పాత్రల కోసం ఆఫర్స్‌ ఎక్కువగా రావడం వల్ల కాస్త అసౌకర్యానికి గురైనట్లు ఆయన గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 

కెరీర్‌ తొలినాళ్లలో ఏడాదికి పది, పదిహేను సినిమాలు చేస్తూ బిజీగా ఉండేవారాయన. వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా శరత్‌బాబు చెదిరిపోని ముద్ర వేసుకున్నాడు. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ఇలా ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించిన ఆయన సహజ నటనతో ప్రేక్షకుల మన్ననలను అందుకున్నారు.

మరణం

కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న శరత్ బాబు హైదరాబాద్ లోని ఏఐజీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మే 22(నిన్న)వ తేదీ సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో.. 71 ఏళ్ల వయసులో మృతి చెందారు. తొలుత చెన్నై, బెంగళూరులో చికిత్స తీసుకున్నప్పటికీ, మెరుగైన వైద్యం కోసం నెల రోజుల క్రితమే హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీలో జాయిన్ అయ్యారు. అప్పటినుంచి శరత్ బాబు వెంటిలేటర్ పైనే చికిత్స పొందుతున్నారు. సోమవారం ఉదయం ఆయన ఆరోగ్యం మరింత విషమించడంతో మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు. 

శరత్ బాబు మృతితో టాలీవుడ్ లో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతిపట్ల పలువురు సినిమా ప్రముఖులు  సంతాపం తెలుపుతున్నారు. ప్రజలు, అభిమానుల సందర్శనార్థం శరత్ బాబు భౌతిక కాయాన్ని ఈరోజు చెన్నైకి తరలించి, అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 

ఇండస్ట్రీలో అందరితో స్నేహంగా మెలుగుతూ.. అందరి ప్రేమాభిమానాల్ని చూరగొన్న గొప్ప వ్యక్తి.. తన సహజ నటనతో ప్రేక్షకుల హృదయంలో మంచి స్థానాన్ని దక్కించుకున్నారనే చెప్పాలి. అటువంటి శరత్ బాబు అకాల మరణంతో.. ఆయనతో ముడిపడిన సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ నివాళి అర్పిద్దాం.

Show More
Back to top button