Telugu Featured NewsTelugu Politics

నవ్యాంధ్ర రథ సారథులు

ఆంధ్రప్రదేశ్‌లో నూతన ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జూన్ 12న ప్రమాణస్వీకారం చేశారు. జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణం చేశారు. వీరిద్దరితో పాటు మరో 23 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిలో టీడీపీ నుంచి 20 మంది ఉండగా.. జనసేన నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ఒకరు చొప్పున ఉన్నారు. కొత్తవారికే అవకాశం దక్కింది. ముగ్గురు మహిళలకు చోటు కల్పించారు. బీసీలు ఎనిమిది మంది, ఎస్సీలు ఇద్దరు, ఎస్టీ ఒకరు, ముస్లిం మైనారిటీల నుంచి ఒకరికి, వైశ్య సామాజికవర్గం నుంచి ఒకరికి అవకాశం ఇచ్చారు. నలుగురు కాపులు, నలుగురు కమ్మ, ముగ్గురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలకు మంత్రి పదవులు దక్కాయి.

రాష్ట్ర కేబినెట్లో అత్యంత పిన్న వయస్కురాలిగా తెలుగుదేశం ఫైర్ బ్రాండ్.. టీడీపీ తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత (40) నిలిచారు. చంద్రబాబు నాయుడు అనితకు కేబినెట్‌లో చోటు కల్పించారు. ఆమె తర్వాత నారా లోకేష్ (41), కొండపల్లి శ్రీనివాస్ (42), మండిపల్లి రామప్రసాద్ రెడ్డి (42) ఉన్నారు. 70 ఏళ్లు దాటిన మంత్రులుగా ఎన్ఎండీ ఫరూక్ (75), చంద్రబాబు (74), ఆనం రామనారాయణరెడ్డి (71) ఉన్నారు. అంతే కాకుండా 50 నుంచి 70 ఏళ్ల మధ్యలో 15 మంది మంత్రులు ఉన్నారు. అయితే కొన్ని కుటుంబాలకు కూడా ప్రాధాన్యం ఇస్తారన్న ముద్ర ఉంది. కానీ, ఈ సారి మాత్రం చంద్రబాబు వీటిని తుడిచి పెట్టేశారు. ఎక్కడా కుటుంబాల ప్రస్తావన రాకుండా.. కేవలం నారా లోకేష్‌కు ఇచ్చారు. ఇక్కడ కూడా.. ఆయన పాదయాత్ర చేయడంతోపాటు.. రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి పార్టీకి మేలు చేశారు.  

ముందున్న సవాళ్లు

ముఖ్యమంత్రి పదవి చేపట్టబోతున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు పాలన అంత సులువుగా సాగేలా కనిపించడం లేదు. ఎన్నో ఆటంకాలు, సమస్యలు  చంద్రబాబు ముందున్నాయి. మొదటిది పాలనాపరమైన సమస్యలైతే.. రెండోది ఆర్థిక సమస్యలు ఇలా పలు రకాలుగా చంద్రబాబు ముందు సవాళ్లున్నాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. ఎన్నో సమస్యలు చంద్రబాబుకు స్వాగతం చెబుతున్నాయి. ఇచ్చిన హామీలు నెరవేర్చడం.. జులై నెల నుంచే మూడు నెలల పింఛను నాలుగు వేలరూపాయల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. మే, జూన్ నెలకు కలిపి జులై నెలలో  పింఛను చెల్లించాలి. ఇక మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఉచిత కరెంట్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటివి రాష్ట్ర ఖజానాకు భారంగా మారనున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

నవ సచీవులు ఎలా పరిష్కరిస్తారో చూడాల్సిందే..!

ఇక విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో తల్లికి వందనం కింద కుటుంబంలో ఎంతమంది ఉన్నా ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలంటే లక్షల కోట్ల నిధులు అవసరం. కేంద్రంలో తమ మీద బీజేపీ ఆధారపడి ఉండటంతో కేంద్ర ప్రభుత్వం ఏ మేరకు సహకరిస్తుందన్నది చూడాల్సి ఉంది. మరి ఈ సమస్యలను నవ సచీవులు ఎలా పరిష్కరిస్తారో..!

అంతేకాకుండా రాజధాని నిర్మాణం, రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టుబడులను ఆకర్షించటంతోపాటు.. అనుమతుల మంజూరు, శాంతి భద్రతల పరిరక్షణ, మౌలిక వసతుల రూపకల్పన, ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన ఏ విధంగా చేస్తారో చూడాలి. వీటితోపాటు ఐటీ పరిశ్రమలు, పర్యాటక రంగ అభివృద్ధి, ఫార్మా ఆక్వా, అగ్రో పరిశ్రమల స్థాపన  విద్య, వైద్యం, రవాణా మెదలగు రంగాలపై త్వరితగతిన కార్యాచరణ రచించి అమలుపరిచి ఆదాయాన్ని సమకూర్చుకోవాలి.

ఇలా చేస్తే భారం ఉండదు..

రాష్ట్ర రాజధాని నిర్మాణానికి ప్రజల దగ్గరనుంచి బాండ్ల రూపంలో సేకరించి నిర్ణీత కాల వ్యవధిలో వారికి వడ్డీతో చెల్లించాలి. దీనివల్ల ఆర్థిక భారం తగ్గుతుంది. ఋణాల వడ్డీలు నియంత్రించబడతాయి. బహుళజాతి సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు విరాళాలు సేకరించే దిశగా ఆలోచించాలి. ప్రభుత్వ ఉద్యోగుల నుంచి కూడా నిధుల సమీకరణ జరగాలి. వారు ఇచ్చే నిధులను పెట్టుబడిగా పెట్టి నిర్ణీత కాల వ్యవధిలో వారికి ప్రభుత్వ వడ్డీతో తిరిగి ఇచ్చే పథకాన్ని రూపొందిస్తే నిధులు సమకూరుతాయి.

సంక్షేమాన్ని కొనసాగిస్తూ అభివృద్ధిని చెయ్యాలి. అందుకు అవసరమైన ఆర్థిక వనరులని, సంపదను సృష్టించాలి. వారివారి మంత్రిత్వ శాఖలో దుబారా ఖర్చు నియంత్రించాలి. సమీక్షలు జరిపి ఆదాయ వనరులు ఎలా సమకూర్చుకోవాలో అన్వేషించాలి. సంక్షేమం, అభివృద్ధి అనే జోడు గుఱ్ఱాల నవ్యాంధ్ర రధానికి మీరే సారథులు కాబట్టి కర్తవ్యదీక్షతో అకింత భావంతో  పారదర్శకంగా పరిపాలనను అందించి ప్రజల మెప్పు పొందాలి.

Show More
Back to top button