Telugu Featured News

ఏప్రిల్‌ 1 నుంచి కొత్త పన్ను విధానాలు.. యూపీఐ, క్రెడిట్‌ కార్డు రూల్స్‌లో మార్పులు..

ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. కొత్త ఏడాది 2025లో ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి అనేక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. వాటిపై ఓ లుక్కేయండి..

కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన ఆదాయపు పన్ను మార్పులు, కొత్త శ్లాబులు వంటివి ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతోపాటు క్రెడిట్‌ కార్డు రివార్డులు, యూపీఐ సేవలకు సంబంధించిన నిబంధనలు కూడా మారనున్నాయి. అవెంటంటే.. 

1.రూ.12 లక్షల వరకు నో ట్యాక్స్‌..

ఆదాయపు పన్నుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్‌లో కీలక మార్పులు ప్రతిపాదించింది. కొత్త పన్ను విధానాన్ని సరికొత్తగా తీర్చిదిద్దింది. ఇందులో భాగంగా రూ.12 లక్షల వరకు ఎలాంటి పన్నూ చెల్లించాల్సినవసరం లేదు.. స్టాండర్డ్‌ డిడక్షన్‌ రూ.75 వేలు కలుపుకొంటే రూ.12.75 లక్షల వరకు ఎలాంటి పన్నూ చెల్లించాల్సినవసరం లేకుండా శాలరీడ్ ఉద్యోగులకు ఊరట కల్పించారు. అలాగే రూ.25 వేలుగా ఉన్న రిబేట్‌ను కాస్త రూ.60 వేలకు పెంచారు.

2.టీడీఎస్‌, టీసీఎస్‌ లలో మార్పులు..

సీనియర్‌ సిటిజన్లకు (60 ఏళ్లకు పైన) సంబంధించి ప్రస్తుత నిబంధనల ప్రకారం బ్యాంకుల్లోని వారి డిపాజిట్లపై జమయ్యే అన్యువల్ ఇంట్రెస్ట్ రూ.50,000 దాటితే.. దానిపై విధించే టీడీఎస్‌ ట్యాక్స్ (మూలం వద్ద పన్ను) వసూలు చేస్తారు. అయితే ఇప్పుడు ఈ మొత్తాన్ని కాస్త రూ.లక్షకు పెంచుతున్నట్లు బడ్జెట్‌లో ప్రతిపాదించారు. అదే 60ఏళ్లలోపు వ్యక్తులకు ఈ మొత్తాన్ని రూ.40,000 నుంచి రూ.50,000కు పెంచారు.

3. విదేశీ చెల్లింపులు.. అనేవి (ఎల్‌ఆర్‌ఎస్‌- లిబరలైజ్డ్‌ రెమిటెన్స్‌ స్కీమ్‌) ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.7 లక్షలు దాటితే టీసీఎస్‌ (మూలం వద్ద పన్ను)ను వసూలు చేస్తారు. ఇప్పుడు ఈ పరిమితి రూ. 7 నుంచి రూ.10 లక్షలకు పెరిగింది. కాకపోతే బ్యాంకుల నుంచి విద్యా రుణం తీసుకుని, ఆ మొత్తాన్ని విద్యార్థి ఫీజు కోసం విదేశాలకు పంపితే ఇకపై ఎలాంటి టీసీఎస్‌ ఉండదు.

క్రెడిట్‌ కార్డు రూల్స్‌..

క్రెడిట్‌ కార్డులపై లభించే రివార్డుల్లో ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ యూజర్లకు కోత పెట్టిందని చెప్పాలి. స్విగ్గీ, ఎయిరిండియా టికెట్‌ బుకింగ్‌లపై లభించే రివార్డులను మరింతగా కుదించింది. ఎస్‌బీఐ సింప్లీ క్లిక్‌ క్రెడిట్‌ కార్డు, ఎయిరిండియా ఎస్‌బీఐ ప్లాటినమ్‌ కార్డు, ఎయిరిండియా ఎస్‌బీఐ సిగ్నేచర్‌ కార్డు హోల్డర్లకు ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి వచ్చే బెనిఫిట్స్ లో కోత పడనుంది. 

*ఎయిరిండియాలో విస్తారా విలీనం కావడంతో యాక్సిస్‌ బ్యాంక్‌ కూడా విస్తారా క్రెడిట్‌ కార్డు రివార్డులను ఏప్రిల్ 18 నుంచి సవరించనుంది. ఆ తేదీన లేదా ఆ తర్వాత ఎవరైతే కార్డును రెన్యువల్‌ చేస్తారో వారికి ఎలాంటి అన్యువల్ ఛార్జీలూ వర్తించవు. అలానే ఇతర ప్రయోజనాలు రాకపోవచ్చు.  

*ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ కూడా మార్చి 31 తర్వాత రెన్యువల్‌ అయ్యే విస్తారా కార్డులకు వార్షిక రుసుమును తీసేసింది.

*వీటితోపాటు ఇన్‌యాక్టివ్‌ లేదా ఇతరులకు కేటాయించిన మొబైల్‌ నంబర్లకు ఏప్రిల్‌ 1 నుంచి యూపీఐ సేవలనేవి నిలిచిపోనున్నాయి. ఇందుకు సంబంధించి బ్యాంకులు, పేమెంట్‌ సేవలందించే ప్రొవైడర్లకు.. నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా తదనుగుణంగా ఆదేశాలను జారీ చేసింది. పైగా అనధికారిక వాడకాన్ని, మోసాలను అరికట్టేందుకు ఇటువంటి నంబర్లను డీయాక్టివేట్‌ చేయాలని సూచించింది. 

*యూపీఐ లైట్‌ వ్యాలెట్‌లో లోడ్‌ చేసిన పేమెంట్ మొత్తాలను మళ్లీ బ్యాంక్‌ అకౌంట్‌కు పంపించుకునే ఫెసిలిటీ కూడా ఏప్రిల్‌ నుంచి అందుబాటులోకి రానుంది. ఈ మేరకు పేమెంట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లకు ఎన్‌పీసీఐ గతంలోనే సూచించగా.. మార్చి 31లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది. అలాగే, యూపీఐ లైట్‌ ను ఇకపై వినియోగించాలంటే యాప్‌ పిన్‌, పాస్‌కోడ్‌, బయోమెట్రిక్‌ వంటివి వినియోగించాల్సి ఉంటుంది.

*యులిప్స్‌కు ట్యాక్స్‌: యులిప్స్‌లో పెట్టుబడులు పెడుతున్నప్పుడు ప్రీమియం మొత్తం రూ.2.5 లక్షలు దాటితే ఉపసంహరణ సమయంలో క్యాపిటల్‌ గెయిన్స్‌ ట్యాక్స్‌ అనేది చెల్లించాల్సి ఉంటుంది. కాగా 2025 బడ్జెట్‌లో యులిప్స్‌ ట్యాక్స్ ను ప్రతిపాదించడం జరిగింది.

*పిల్లల భవిష్యత్‌ కోసం దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టాలనుకునేవారి కోసం తీసుకొచ్చిన ‘ఎన్‌పీఎస్‌ వాత్సల్య పథకం’ కింద కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి పన్ను మినహాయింపును పొందవచ్చు. 

సెక్షన్‌ 80సీసీడీ (1బి) కింద పన్ను ప్రయోజనాలను కల్పించారు. అయితే ఇది పాత పన్ను చెల్లింపుదారులకు మాత్రమే వర్తిస్తుందని తెలుసుకోండి!

Show More
Back to top button