
విదేశాల్లో స్థిరపడటం, మంచి జీవితం గడపడం అనేది చాలామందికి కల. ముఖ్యంగా అమెరికా వంటి అగ్రరాజ్యంలో జీవించాలనేది లక్షల మంది భారతీయుల ఆశయంగా మారింది. కానీ, సరైన వీసా లేదా చట్టబద్ధ పత్రాలు లేకపోవడంతో వారు అక్రమ మార్గాలను ఆశ్రయిస్తున్నారు. ప్రమాదకరమైన మార్గాల్లో ప్రయాణిస్తూ జీవితాన్ని ప్రమాదంలో పడేస్తున్నారు. ఇటీవలి కాలంలో అమెరికా సరిహద్దుల్లో భద్రతా చర్యలు మరింత కఠినంగా మారడంతో, అక్రమంగా ప్రవేశించే వారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. అయినా సరే, ఈ సాహసాల్లో పాలుపంచుకుంటున్న వారి విషాదగాథలు వెలుగు చూస్తున్నాయి.
గుజరాత్ వారే ఎక్కువ..
అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ విడుదల చేసిన నివేదిక ప్రకారం, 2024 జనవరి నుంచి మే మధ్య వరకు 10,382 మంది భారతీయులు అమెరికా సరిహద్దుల్లో అక్రమంగా ప్రవేశించే ప్రయత్నంలో పట్టుబడ్డారు. వీరిలో 30 మంది చిన్నారులు పెద్దల సహాయం లేకుండా ప్రయాణించినవారే. గతేడాది ఇదే కాలంలో 34,535 మంది భారతీయులు అరెస్ట్ కావడంతో పోలిస్తే ఈ ఏడాది 70 శాతం తగ్గుదల కనిపిస్తోంది. వీరిలో ఎక్కువమంది గుజరాత్ రాష్ట్రానికి చెందినవారు కావడం గమనార్హం. అక్రమ వలస దారుల సంఖ్య తగ్గడానికి ట్రంప్ పాలనలో తీసుకున్న గట్టి చర్యలే ప్రధాన కారణం అని అధికారులు చెబుతున్నారు.
తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం వారిని ఒంటరిగా పంపడం పెరుగుతోంది. 2024 ఆర్థిక సంవత్సరంలో 500 మంది మైనర్లను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో చాలా మంది వయస్సు 12-17 సంవత్సరాల మధ్యలో ఉంది. మే 9న డెల్‌మార్ వద్ద పడవ బోల్తా పడటంతో 14 ఏళ్ల బాలుడు, 10 ఏళ్ల బాలిక మృతి చెందారు. వీరిద్దరూ అన్నా-చెల్లెళ్లు కావడం దురదృష్టకరం. ఈ తరహా పడవలు తరచూ మెక్సికో తీరం నుంచి బయల్దేరి, అమెరికా తీరం వరకు అక్రమంగా ప్రయాణిస్తుంటాయి. ఏప్రిల్ 2024 నాటికి అమెరికాలో 2.2 లక్షల మంది భారతీయులు ఎలాంటి చట్టబద్ధ పత్రాలు లేకుండా జీవిస్తున్నారని హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ వెల్లడించింది. ఈ ఏడాది 332 మందిని స్వదేశానికి పంపారు.