Telugu News

ఆపరేషన్ సింధూర్: పాక్ ఆగడాలకు అడ్డుకట్ట వేస్తున్న భారత ఏటీజీఎం

భారత సరిహద్దుల్లో పాకిస్తాన్ సైన్యం ఆగకుండా పెద్ద మొత్తంలో శతఘ్నులు, భారీ మెషిన్ గన్లతో కాల్పులు జరుపుతోంది. ఆ దేశ సైనికులు దాక్కోవడానికి అక్కడ ప్రత్యేకంగా బంకర్లు కట్టుకున్నారు. ఇప్పుడు భారత సైన్యం వాటిని పేల్చేస్తోంది. దీనికోసం ఒక ప్రత్యేకమైన ఆయుధాన్ని వాడుతోంది. దానిని ఏటీజీఎం (యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్) అని పిలుస్తారు.

ఈ మిసైల్ ఏంటి?

దీనిని భారీగా ఆయుధాలు అమర్చిన వాహనాలను, ట్యాంకులను నాశనం చేయడానికి ఉపయోగిస్తారు. ఒకసారి దీనిలో ట్యాంక్ లేదా ఏదైనా లక్ష్యాన్ని లాక్ చేస్తే, అది దానంతట అదే ఆ లక్ష్యాన్ని వెంబడించి పేల్చేస్తుంది. దీనిని భుజం మీద నుంచి కానీ, ట్రైపాడ్ మీద కానీ లేదా వాహనాల మీద అమర్చి కానీ ప్రయోగించవచ్చు. సురక్షితమైన దూరం నుంచి శత్రువు బలగాలను ఎదుర్కోవడానికి ఇది చాలా మంచి ఆయుధం.

ఇది ఎలా పనిచేస్తుంది?

చాలా ఏటీజీఎంలలో షేప్డ్ ఛార్జ్ అనే ఒక ప్రత్యేకమైన పేలుడు పదార్థాన్ని ఉపయోగిస్తారు. ఈ పేలుడు పదార్థంలోని శక్తి అంతా ఒకే దిశలో కేంద్రీకృతమై ప్రయాణిస్తుంది. దీనివల్ల చాలా మందపాటి కవచాన్ని కూడా పేల్చేసే శక్తి దీనికి వస్తుంది. కొన్ని కొత్త ఏటీజీఎంలలో రెండుసార్లు పేలుడు జరిగేలా ప్రత్యేకమైన వార్‌హెడ్‌లను ఉపయోగిస్తారు. మొదటి పేలుడు ట్యాంక్‌కు బయట ఉండే కవచాన్ని పగలగొడుతుంది. ఈ కవచాన్ని ఎక్స్‌ప్లోజివ్ రియాక్టివ్ ఆర్మర్ అంటారు. శత్రువులు ప్రయోగించే క్షిపణుల వార్‌హెడ్ దీనికి తగిలి మొదట్లోనే పేలిపోవాలనే ఉద్దేశ్యంతో దీన్ని తయారు చేస్తారు. ఇలాంటి వాటిని తట్టుకొని ట్యాంక్‌ను నాశనం చేయడానికి రెండో పేలుడు జరిగేలా తయారుచేస్తారు. మొదటి పేలుడు కవచాన్ని, రెండో పేలుడు ట్యాంక్‌ను పేల్చడమే వీటి ముఖ్య లక్ష్యం.

ఇంకా, ఈ మిసైల్‌ను అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో, పగలు మరియు రాత్రి కూడా పనిచేసేలా తయారుచేశారు. కొన్నింటికి టాప్ అటాక్ మోడ్ కూడా ఉంటుంది. వీటిని ప్రయోగించిన తర్వాత గాల్లోకి ఎత్తుగా ఎగిరి ట్యాంక్ పైభాగంపై పడుతుంది. దీనిలో డ్యూయల్ మోడ్ సీకర్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఇది లక్ష్యాన్ని గుర్తించి దానిని అనుసరించేలా చేస్తుంది.

ఏటీజీఎంను ఆపగలరా?

కొన్ని ట్యాంకులు రియాక్టివ్ ఆర్మర్ అనే కవచాన్ని ఉపయోగిస్తాయి. వీటిపై కొన్ని ప్రత్యేకమైన ప్లేట్లు ఉంటాయి. ఏటీజీఎం వాటిని తాకగానే బయటవైపునకు పేలుడు జరుగుతుంది. మరికొన్ని దేశాలు ట్యాంకులపై లోహపు పంజరం లాంటి వాటిని అమరుస్తున్నాయి. ఏటీజీఎం వాటిని తాకి ముందే పేలిపోతాయి. ఇక క్షిపణుల సిగ్నల్స్‌ను జామ్ చేసే వ్యవస్థలను వాడటం లేదా డికాయ్‌లను ప్రయోగించి క్షిపణిని గందరగోళానికి గురిచేయడం కూడా చేయవచ్చు. ఇజ్రాయెల్ వద్ద ట్రోఫీ అనే ప్రత్యేకమైన వ్యవస్థ ఉంది. అది ట్యాంకర్‌పైకి వచ్చే క్షిపణులను ముందే గుర్తించి పేల్చేస్తుంది. ఈ వ్యవస్థలు చాలా తేలిగ్గా, వేగంగా మరియు తెలివిగా పనిచేస్తాయి.

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 130కి పైగా దేశాలు ఏటీజీఎంలను ఉపయోగిస్తున్నాయి. ఇక ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత్ కూడా వీటిని వాడుతోంది. ప్రస్తుతం భారత్ వద్ద నాగ్‌ మరియు ధ్రువాస్త్ర (హెలినా) వంటి ఏటీజీఎంలు ఉన్నాయి.

Show More
Back to top button