
తెలుగుమాసాల్లో నాలుగో మాసం ఆషాఢం. పూర్ణిమనాడు పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాలకు దగ్గరగా చంద్రుడు సంచరించే కాలాన్నే ఆషాఢంగా భావిస్తాం. హిందూ సంప్రదాయం ప్రకారం, ఈ మాసంలో వివాహ శుభకార్యాలేవీ తలపెట్టరు.. పుణ్యకార్యాలకు అనుకూలం కాకపోవడంతో నిషిద్ధ మాసంగా, శూన్యమాసంగా పిలుస్తారు. కానీ ఆధ్యాత్మికంగా మంచి మాసమనే అంటారు. అటువంటి ఆషాఢమాసం ఈ నెల 26 నుంచి ప్రారంభమవుతుంది. వచ్చే నెల 24కు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఆషాఢం విశిష్టత గురుంచి తెలుసుకుందాం:
*ఆషాఢ శుద్ధ షష్ఠిని స్కంద వ్రతంగా,
శుద్ధసప్తమిని భానుసప్తమిగా భావిస్తాం.
*ఆషాఢ శుద్ధ ఏకాదశినే తొలి ఏకాదశిగా చేసుకుంటాం. శ్రీమహావిష్ణువు శయనించే దివ్యమైన రోజు. అందువల్లే దీన్ని ‘శయన ఏకాదశి’ అంటారు. మఠాధిపతులు, పీఠాధిపతులు, సాధువులంతా కూడా చాతుర్మాస్య దీక్షను చేపట్టి కార్తీకశుద్ధ ఏకాదశి నిర్వహిస్తారు. అంటే నాలుగు నెలలపాటు ఈ దీక్షను పాటిస్తారు. ఆఖరిరోజున ఆలయాలకు వెళ్లి, దైవదర్శనం చేసుకోవడంతో ఈ దీక్ష అనేది పూర్తవుతుంది.
*ఆషాఢ చతుర్దశి.. ఈరోజున భూలక్ష్మి అంశతో గోదాదేవి ఆవిర్భవించిన రోజు. కావున శ్రీ వైష్ణవులందరూ గోదామాతను ఆండాళ్గా పూజించి, ఆ జగన్మాత రచించిన పాశురాలను పారాయణ చేసి, విశిష్టంగా ఆరాధిస్తారు.
*ఆషాఢ పూర్ణిమనే వ్యాస పూర్ణిమ లేదా గురు పూర్ణిమగా పిలుస్తాం. ఈరోజున శ్రీమన్నారాయణుడి అవతారమైన వ్యాసమహర్షిని విశేషంగా అర్చిస్తారు. విద్యార్థులు గురుపూజ చేసి, చదువులో రాణించాలని కోరుకుంటారు. విద్యతో పాటు.. గురుస్థానంలో నిలిచే దత్తాత్రేయ స్వామి, రాఘవేంద్రస్వామి, సాయి భగవానుడు, ఆదిశంకరులు, బృహస్పతిలను విశేషంగా పూజించి, జ్ఞానాన్ని ప్రసాదించమని వేడుకుంటారు.
*ఆషాఢ బహుళ సప్తమినే భోగ సప్తమిగా పిలుస్తారు. చెట్టుచేమలకు పూజలు చేయడం, పంట పొలాల వద్ద జాతరలు నిర్వహించడం చేస్తుంటారు.
*బహుళ ఏకాదశి కామదా ఏకాదశి. కోరికలను తీర్చి, మోక్షాన్ని కలిగిస్తుందని విశ్వసిస్తూ జరిపే ఈ పర్వదినాన అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు.
ఈ మాసంలో నెలంతా తెలంగాణవ్యాప్తంగా బోనాలు ఘనంగా చేయడం చూస్తుంటాం. ఆది పరాశక్తికి బోనాలు సమర్పించి, ప్రతి ఇంటి ఆడపిల్ల ఆశీస్సులు పొందడం ఏళ్లుగా వస్తున్న ఆచారం.
ఆషాడంలో గోరింటాకు:
గోరింటాకు ఇష్టపడని అమ్మాయిలుంటారా.. మానవ మాత్రులకే కాదు.. తల్లి గౌరీదేవికి కూడా గోరింటాకు అంటే ప్రీతి. ఈ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే అమ్మవారి అనుగ్రహం కలుగుతుందనేది విశ్వాసం.
శాస్త్రీయంగా చూస్తే ఆషాఢంలో వచ్చే వర్షాల వల్ల జలుబు, జ్వరాలు, అంటువ్యాధులు సోకే అవకాశం ఎక్కువ కాబట్టి.. గోరింటాకు వాటిని నివారించి, సహజసిద్ధంగా రోగనిరోధకశక్తిని పెంచుతుందని అంటారు. ఇకపోతే చర్మరోగాలు, గాయాలు సైతం తగ్గుతాయి. పారాణిగా పెట్టుకోవడం వల్ల పాదాలు పగలవు. ఇలా అనేక ప్రయోజనాలున్నందువల్లే ఈ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం ఆనవాయితీ అయ్యింది.
కొత్త కోడలు.. పుట్టింటికి వెళ్ళడం..
ఈ మాసంలో కొత్తకోడల్ని కచ్చితంగా పుట్టింటికి పంపించాలి. ఆషాఢమాసంలో కొత్త కోడలు పుట్టింటికి వెళ్లకపోతే అత్తాకోడళ్ళ మధ్య మనస్పర్ధలు వచ్చి గొడవలు జరుగుతాయని పెద్దలు చెబుతారు. ఎందుకంటే ఆషాఢమాసంలో మహిళలు గర్భం ధరించటానికి సరైన మాసం కాకపోవడం వల్ల కొత్తగా పెళ్లయిన భార్యాభర్తలు దూరంగా ఉండాలని అందువల్ల పుట్టింటికి వెళ్ళడమనేది ఆనవాయితీగా మారింది.
చేయకూడనివి.. చేయాల్సినవి..
*రుతువు ప్రకారం.. వర్షరుతువు ఆసన్నమయ్యే కాలమిది. వాతావరణ మార్పుల వల్ల క్రిమికీటకాలు, పురుగులు ఎక్కడికక్కడే పుట్టుకొస్తాయి. వాటివల్ల మనుషులకే కాక పశుపక్ష్యాదులకీ కూడా అనారోగ్యం వాటిల్లే అవకాశముంది.
*ఈ మాసంలో తరచూ అభ్యంగనస్నానం చేయకూడదంటారు.
*అలాగే గర్భిణులు సైతం ఆషాఢంలో మరింత అప్రమత్తంగా ఉండాలని చెబుతారు.
*ఆషాఢమాసంలో ఆలస్యంగా నిద్రపోకూడదు. *ఆహారం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. చద్ది అన్నాన్ని తినడం మానేయాలి. ఆకుకూరలు, మాంసం, చేపలు, మద్యం, బెండకాయలు, వెల్లుల్లి, ఉల్లిపాయలు తీసుకోకూడదు.
*ఆషాఢం సముద్ర, నదీ స్నానాలకు ప్రసిద్ధం.
*ఈ నెలలో ఇల్లు కడితే/ గృహ ప్రవేశం చేస్తే, ఆ గృహస్థుకు ధనధాన్యాలు, పశువులు, రత్నాలు ప్రాప్తిస్తాయని మత్స్యపురాణం చెబుతోంది. నిజానికి ఈ నెలలో ఎటువంటి శుభకార్యాలను నిర్వహించరు.
*ఆషాఢంలో ఇత్తడి, కంచు, బంగారు, వెండిలాంటి లోహ వస్తువులను శుభ్రం చేయడం ఆచారం.