Telugu News

వ్లాగర్ జ్యోతి మల్హోత్రా: ఇంతకీ ఎవరీమె? గూఢచారిగా ఎందుకు అనుమానిస్తున్నారు?

హర్యానాకు చెందిన ట్రావెల్ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా (33) పాకిస్తాన్ గూఢచర్య ఆరోపణలపై హిసార్‌లో అరెస్ట్ అయ్యారు. “Travel with Jo” అనే యూట్యూబ్ ఛానెల్ నడుపుతూ, 3.85 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు, 1.3 లక్షల ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్న ఆమె పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ISI కోసం దేశ రహస్యాలు అందించిందని పోలీసులు వెల్లడించారు. విచారణలో జ్యోతి పాకిస్థాన్ హైకమిషన్‌లో పని చేసిన దానిష్ అనే అధికారితో సంబంధం కలిగి ఉండటం, అలాగే పాక్ ISI ఏజెంట్లైన అలీ అహ్వాన్, షకీర్, రానా షాహ్‌బాజ్‌లతో వ్యక్తిగతంగా భేటీ కావడం, విలాసవంతమైన హోటళ్లలో బస చేయడం, హై ప్రొఫైల్ పార్టీలకు హాజరుకావడం వంటి అంశాలు బయటపడ్డాయి.

అదనంగా ఆమె పాకిస్థాన్, చైనా వంటి దేశాల్లో పర్యటనలు చేయడం, పహల్గాం ఉగ్రదాడికి ముందు ఆ ప్రాంతంలో ఉండటం వంటి వివరాలు గూఢచర్య అనుమానాలకు బలం చేకూర్చాయి. ప్రస్తుతం జ్యోతి ఐదు రోజుల పోలీస్ కస్టడీలో ఉండగా, ఆమెపై అధికారిక రహస్యాల చట్టం మరియు భారతీయ న్యాయసంహిత ప్రకారం కేసులు నమోదు చేశారు. ఈ కేసు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను విదేశీ గూఢచర్యానికి ఎలా టార్గెట్ చేస్తున్నారన్న విషయాన్ని దేశ వ్యాప్తంగా చర్చకు తెచ్చింది.

ఇక విచారణలో పోలీసులకు లభించిన సమాచారం ప్రకారం జ్యోతి పాక్ ఇంటెలిజెన్స్ సంబంధాలు ఉన్న వ్యక్తులతో తరచూ టచ్‌లో ఉండేది. ఆమె వాట్సాప్ మెసేజ్‌లు, వీడియోలు, చాట్‌లు డిలీట్ చేసినా, డేటా రికవరీలో కొన్ని క్లూస్ లభించాయి. కొన్ని ఛాట్‌లు ఆఫీసియల్ సీక్రెట్స్ యాక్ట్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్టు అధికారులు భావిస్తున్నారు.

ముఖ్యంగా పాక్ మిలటరీకి చెందిన వ్యక్తులతో ఉన్న అనుబంధాలపై అధికారులు దృష్టి పెట్టారు. ఈమె పాక్ వీసా సులభంగా రావడం, సరిహద్దు ప్రాంతాల ఫోటోలు, వీడియోలు తీసిన డేటా ఆమెపై తీవ్రమైన అనుమానాలను కలిగించాయి. దీంతో ఆమెపై ఆఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ కింద కేసు నమోదైంది. ప్రస్తుతం జ్యోతి 5 రోజుల పోలీసు కస్టడీలో ఉంది.

పోలీసుల ప్రకారం ఆమెతో పాటు మరో వ్యక్తి కూడా ఈ వ్యవహారంలో భాగస్వామిగా ఉన్నట్టు అనుమానం వ్యక్తమవుతోంది. పాక్ ఐఎస్‌ఐకి సమాచారం పంపినట్టు భావిస్తున్నారు. అయితే పూర్తి నిజం విచారణ పూర్తయ్యేవరకు తెలుస్తుందేమో చూడాలి. యూట్యూబ్ వ్లాగర్‌గా ప్రాచుర్యం పొందిన జ్యోతి ఇంతటి వివాదంలో ఇరుక్కోవడం ఆందోళనకరం. సోషల్ మీడియా వేదికగా అంతర్జాతీయ పరిచయాలు పెంచుకోవడం ఎంతవరకు భద్రతకు ముప్పుగా మారొచ్చో ఈ కేసు ఉదాహరణగా నిలుస్తోంది.

Show More
Back to top button