
తెలంగాణ రాష్ట్రం 2014లో ఆంధ్రప్రదేశ్ నుండి విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. ఆ సమయంలో ఆర్థిక పరిస్థితులు స్థిరంగా ఉండేవి. కానీ, గత దశాబ్దంలో పరిస్థితులు మెల్లగా మారుతూ, ఇప్పుడు రాష్ట్రం భారీ అప్పుల భారాన్ని మోస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదేపదే ఈ అంశాన్ని పబ్లిక్‌గా ప్రస్తావిస్తూ, గత ప్రభుత్వ పాలన వల్లనే ఇది జరిగిందని చెబుతున్నారు. 2014-15లో రాష్ట్ర అప్పు రూ.72,658 కోట్లుగా ఉండగా, 2023-24 నాటికి అది రూ.6.71 లక్షల కోట్లకు చేరింది. అంటే, దాదాపు 10 రెట్లు పెరిగింది. దీనికి ప్రధాన కారణం “ఆఫ్-బడ్జెట్ బారోయింగ్స్” ద్వారా ప్రభుత్వం నేరుగా బడ్జెట్లో చూపకుండా రుణాలు తీసుకోవడమే.
ప్రత్యేక సంస్థల ద్వారా తీసుకున్న ఈ రుణాలపై ప్రభుత్వమే గ్యారెంటీ ఇచ్చింది. ఉదాహరణకు, కాళేశ్వరం ప్రాజెక్టు కోసం మాత్రమే రూ.74,590 కోట్ల అప్పు తీసుకున్నారు. ఈ విధానాలు, సరైన ఆర్థిక నిర్వహణ లేకపోవడం వల్ల రాష్ట్రం పెద్ద మొత్తంలో వడ్డీ ఖర్చును భరించాల్సి వస్తోంది. 2023-24లో ఈ ఖర్చు రూ.32,939 కోట్లు. ఈ పరిస్థితుల మధ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్’ బృందం జపాన్ పర్యటనకు వెళ్లింది. ఆర్థికంగా ఒత్తిడిలో ఉన్న రాష్ట్రానికి పెట్టుబడులు అవసరమైన సమయంలో, జపాన్ నుండి రెండు దిగ్గజ కంపెనీలు ముందుకొచ్చినట్లు ప్రకటించడం ఆశాజనకమైంది.
రూ.10,500 కోట్లు పెట్టుబడులు
ఏప్రిల్ 18న, ఎన్టీటీ డేటా, నెయిసా నెట్వర్క్స్, ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఇండియా (టీటీడీఐ) సంస్థలు కలిపి రూ.11,062 కోట్ల పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. హైదరాబాద్‌లో 400 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు ఎన్టీటీ డేటా, నెయిసా కలిసి రూ.10,500 కోట్లు వెచ్చించనున్నాయి. ఇది దేశంలోనే అత్యంత శక్తిమంతమైన సూపర్ కంప్యూటింగ్ మౌలిక వసతిగా మారనుంది. ఇందులో 25,000 జీపీయూలను వినియోగిస్తారు. ఈ సెంటర్‌ను 500 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్తుతో నడపనున్నారు. ఇందులో లిక్విడ్ ఇమర్షన్ వంటి ఆధునిక కూలింగ్ టెక్నాలజీలు కూడా వినియోగించనున్నారు.
అలాగే, విద్యుత్తు సరఫరా పంపిణీ రంగంలో ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఇండియా సంస్థ రూ.562 కోట్ల పెట్టుబడిని ప్రతిపాదించింది. ఈ ఒప్పందాలన్నీ టోక్యోలో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ సమక్షంలో కుదిరాయి. ఇటువంటి పెట్టుబడులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి కొంత ఊపిరి పెట్టగలవు. కానీ, అప్పుల వలయం నుండి బయటపడాలంటే దీర్ఘకాలిక ఆర్థిక వ్యూహాలు, బాధ్యతాయుతమైన పాలన, పారదర్శకత, ప్రజల భాగస్వామ్యం అవసరం. అవసరంలేని ఖర్చులను తగ్గిస్తూ, ప్రాధాన్యతలతో కూడిన ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలి. అప్పు అనేది చివరి శరణ్యం కావాలి కానీ మొదటి ఎంపిక కాకూడదు.
తర్వాత వడ్డీలు కట్టడానికే సరిపోతుంది..!
ఇప్పటి పెట్టుబడులు ఒక మంచి సూచనే అయినా, తెలంగాణ ప్రభుత్వానికి ముందున్న ఆర్థిక ప్రయాణం ముమ్మాటికీ క్లిష్టమైనదే. ఎందుకంటే భవిష్యత్‌లో విపరీతంగా పెరిగే అప్పులు వల్ల వాటి వడ్డీలే కోట్ల రూపాయల్లో ఖర్చు అయ్యే అవకాశం ఉంది. కానీ సుదీర్ఘ దృష్టితో, స్మార్ట్ పాలనతో, పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పిస్తే రాష్ట్రం తిరిగి స్థిరతవైపు సాగవచ్చు. ఇప్పుడు తీసుకున్న ఓ మంచి అడుగు భవిష్యత్తు బలోపేతానికి మార్గం కావాలి. కాబట్టి రాబోయోగాలంలో ఏ ఫ్రభుత్వాలైనా సరైన నిర్ణయాలను తీసుకుని ముందికి వెళ్తే మనం అనుకున్న జీవనాభివద్ధి సాధ్యం అవుతుంది.