హైదరాబాద్ లో డిసెంబర్ 19 నుంచి 29 వరకు బుక్ ఫెయిర్ నిర్వహించగా.. హైదరాబాద్ పుస్తక ప్రదర్శనల విషయంలోనూ గొప్ప సాంస్కృతిక ప్రాభవం దాగి ఉంది. 1985లో అశోక్ నగర్ లోని సిటీ సెంట్రల్ లైబ్రరీలో మొదటిసారిగా బుక్ ఫెయిర్ ను ప్రారంభించారు. నాడు పబ్లిషర్స్, పుస్తక విక్రయదారులు ఒకే వేదికపై పుస్తకాల ప్రాధాన్యతను చాటిచెప్పారు. ఆ తర్వాత నల్గొండ, నిజాం కాలేజ్ గ్రౌండ్, పబ్లిక్ గార్డెన్స్, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వంటి చోట్ల కూడా పుస్తక ప్రదర్శనలు కొనసాగాయి. దాదాపు పన్నెండేళ్లుగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో బుక్ ఫెయిర్ నిర్వహిస్తూ వస్తున్నారు.
ఈ పుస్తకాల పండుగను ఎన్టీఆర్ స్టేడియంలో 300కు పైగా స్టాళ్లలో కేవలం పుస్తకాలు మాత్రమే కాకుండా వాటి రచయితలను కూడా కలుసుకునే గొప్ప అవకాశంగా చెప్పవచ్చు.
సుమారు 350 స్టాళ్లలో, దేశవ్యాప్తంగా ఉన్న 210 మందికిపైగా ప్రచురణకర్తలు, డిస్ట్రిబ్యూటర్లు పుస్తకాలను ప్రదర్శించనున్నారు.
ఈ ఫెయిర్ లో తెలంగాణ రుచులతో ఫుడ్ స్టాళ్లు, పిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, వైద్య శిబిరాలు సైతం ఏర్పాటు చేశారు.
ఈ నేపథ్యంలో పుస్తకాల చరిత్రను పరిశీలిస్తే జర్మనీలోని ఫ్రాంక్ ఫర్ట్ బుక్ ఫెయిర్ మొదలుకొని కోల్ కత్తా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ వరకు పుస్తక ప్రదర్శనలు ప్రపంచవ్యాప్తంగా గొప్ప సాంస్కృతి వైభవానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి.
17వ శతాబ్దంనాటి యూరప్ పుస్తక దినోత్సవాన్ని సెయింట్ జార్జ్ డేగా పాటించేవారట. స్పెయిన్ లో కూడా పుస్తక దినోత్సవం వేళ ప్రతి పుస్తక కొనుగోలుపై ఒక గులాబీని బహుమతిగా ఇస్తారట. సేవాంతెస్, షేక్స్పియర్, ఇన్కా గర్సిలాసో, వేగా అనే ప్రఖ్యాత రచయితలు 1616లో ఏప్రిల్ 23న మరణించినందున ఆరోజు పలు దేశాల్లో పుస్తక దినోత్సవాలను ఘనంగా జరుపుకుంటారు. ఏటా ఏప్రిల్ 23న ప్రపంచ పుస్తక దినోత్సవం జరుపుకోవాలని యునెస్కో సైతం 1955లో ప్రకటించింది.
2017లో రిపబ్లిక్ ఆఫ్ గినీలోని ‘కొనాక్రీ’ సిటీని, 2018లో గ్రీస్ లోని ‘ఏథెన్స్’ నగరాన్ని ప్రపంచ పుస్తక రాజధానిగా ప్రకటించింది.
దీంతోపాటు యునెస్కో, మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్రపంచంలో అన్ని దేశాలకంటే ఎక్కువగా పుస్తక ప్రియులు ఉన్నదేశం మన ఇండియానే అని తేల్చింది.
భారతీయులు వారానికి సగటున 10.2 గంటలపాటు బుక్ రీడింగ్ చేస్తారని దశాబ్దం క్రితమే ఓ అధ్యయనంలో తేలింది.
2013 నాటి సర్వేలో ఈ సమయం 10.4 గంటలకు పెరగగా.. 2024లో అది మరింత రెట్టింపై ఉండొచ్చు.
టెక్నాలజీకి తగ్గట్టుగానే నేడు పుస్తకాలు సైతం డిజిటలైజేషన్ రూపు సంతరించుకున్నాయి.
ఆన్లైన్ లో పుస్తకాలు పీడీఎఫ్ ల రూపంలో దొరుకుతున్నాయి. వీటినే ఈ బుక్స్ గా పిలుస్తాం. అయితే ప్రపంచంలో ఈ బుక్స్ విధానం 20ఏళ్ల నాటి నుంచి అందుబాటులో ఉందని చెప్పడానికి ఉదాహరణ 1991లో తయారుచేసిన ఈ బుక్ బైబిలేనట. ప్రస్తుతం మనం వాడే మొబైల్ ఫోన్ లో కూడా ఈ-బుక్ ఈజీగా చదువుకోవచ్చు.
డిజిటల్ యుగం పెరిగిన నాటినుంచి అందరూ మొబైల్, టాబ్స్, కంప్యూటర్లలో తమకు కావాల్సిన పుస్తకాలు చదివేస్తున్నారు. సమాచారం సైతం సేకరించుకుంటున్నారు. కానీ ఎంత డిజిటలైజేషన్ పెరిగినా అచ్చు పుస్తకానికి మాత్రం ఆదరణ తగ్గడం లేదు. దీనికి ఈ హైదరాబాద్ బుక్ ఫెయిర్ ప్రదర్శనే నిదర్శనంగా నిలుస్తోంది. గతంలోకంటే ఈసారి నిర్వాహకులు ఎక్కువ స్థాయిలో స్టాళ్లు ఏర్పాటు చేయడం, పబ్లిషర్స్ సంఖ్య కూడా పెరగడంతో పుస్తక ప్రియులు, విద్యార్థులు, సాహితీవేత్తలు బుక్ ఫెయిర్‌కు భారీగా క్యూ కడుతున్నారు. సాధారణ రోజుల్లో రోజుకు సుమారు 50 వేల నుంచి 80 వేల మంది, సెలవు దినాల్లో లక్షకు పైగా మంది సందర్శిస్తున్నారంటే పుస్తకానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
‘చిరిగినా చొక్కా అయినా తొడుక్కో.. ఓ మంచి పుస్తకం కొనుక్కో..’ అన్నారు కందుకూరి వీరేశలింగం!