Telugu News

AP అంగన్వాడీల సమ్మె.. ఎందుకు ఇంత ఉధృతం?

ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ కార్యకర్తలు 2023 డిసెంబర్ 12 నుంచి నిరవధిక సమ్మె ప్రారంభించారు. ఇప్పుడు అది తీవ్ర రూపం దాల్చింది. ఎందుకు సమ్మె చేస్తున్నారు. ఏపీలో అంగన్వాడీల సమ్మె ఎందుకు అతి పెద్ద సమస్యగా మారింది. వాళ్ల డిమాండ్లేంటి? ప్రభుత్వం ఏం చెప్తోంది? 1975లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం (ఐసీడీఎస్) చిన్నారులకు ప్రీ ప్రైమరీ విద్యను అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఇద్దరు అగన్‌వాడీ కార్మికులు చొప్పున పనిచేస్తారు. అయితే వీరికి 2019 ఎలక్షన్స్ ముందు సీఎం జగన్ తెలంగాణలో ఇచ్చిన వేతనాల కన్నా అదనంగా వెయ్యి రూపాయలు ఇస్తామని ప్రకటించారు.

అన్నట్టుగానే వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే వేతనానికి వెయ్యి రూపాయలను జత చేసి రూ.11,500 జీతం ఇస్తున్నారు. అయితే అనూహ్యంగా 2021 నుంచి తెలంగాణ ప్రభుత్వం అంగన్‌వాడీ కార్మికుల వేతనాలు పెంచింది. అక్కడ ఒక్కో వర్కర్‌కి రూ.13 వేలు చొప్పున నెల వేతనం అందిస్తున్నారు. దీనికి అనుగుణంగానే తమకు కనీస వేతనం రూ.26 వేలకు పెంచాలనే ప్రధాన డిమాండ్‌తో అంగన్‌వాడీలు సమ్మె బాట పట్టారు. అంతేకాదు అంగన్వాడీలను ప్రభుత్వమే నియమిస్తోంది. కాబట్టి వారి సేవలకు తగ్గట్టుగా DA, పి.ఎఫ్, ఇఎస్ఐ, పెన్షన్ తదితర సౌకర్యాలు అమలు చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

 *
చర్చలు విఫలం

రాష్ట్రమంతా ఇలా లక్షకుపైగా కార్మికులు సమ్మె చేపట్టడంతో అది ఉధృతంగా మారింది. దీంతో ప్రభుత్వం సమ్మెను అణచివేయడానికి ఎక్కడికక్కడ అరెస్టులు చేపట్టింది. విజయవాడ ధర్నా చౌక్‌లో నిరసనకు పూనుకోగానే వేల మంది అంగన్‌వాడీలను అధికారులు అడ్డుకున్నారు. దీంతో సమ్మె మరింత ఉధృతం అవ్వడంతో.. ప్రభుత్వం కార్మికులను చర్చలకు ఆహ్వానించింది. ఈ చర్చల్లో.. “రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంచేందుకు అంగీకరించాం. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద వర్కర్‌కి రూ.1లక్ష, హెల్పర్‌కి రూ.40వేలు చొప్పున చెల్లించేందుకు సిద్ధమయ్యాం. గ్రాట్యుటీ అమలు చేస్తున్న రాష్ట్రాల్లో వారు అనుసరించిన విధానం పరిశీలిస్తామని కూడా తెలిపాం. సమ్మెని రెండు రోజుల పాటు వాయిదా వేయాలని కోరాం.

కేబినెట్ భేటీ ఉన్నందున 14వ తేదీ తర్వాత చర్చలకు కూర్చుందామని చెప్పాం” అంటూ ప్రభుత్వం తరపున అధికారులు ప్రకటన విడుదల చేశారు. కానీ, కార్మిక సంఘాలు కనీస వేతనం రూ.26 వేలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.5లక్షల వరకు డిమాండ్ చేశాయి. దీనిపై ప్రభుత్వం అంగీకారం తెలపలేదు. దీంతో కార్మికులు అంగన్వాడీ కేంద్రాలను మూసివేసి సమ్మెను మరింత తీవ్రం చేశారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి సమ్మెను విరమించి అంగన్వాడీ కేంద్రాలను తెరవాలని, అలా చేయకపోతే ఎస్మాను తీసుకొస్తామని హెచ్చరించింది.
 
అసలు ఎస్మా అంటే ఏంటి? దానిని అతిక్రమిస్తే..?

ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ (ఎస్మా). అత్యవసర సేవలు అందించే ఉద్యోగులు సమ్మె చేస్తూ ఆయా సేవల నిర్వహణకు ఆటంకం కలిగిస్తే దీనిని ప్రయోగిస్తారు. 1980లో కార్మిక సంఘాల నిరసనలతో దేశం అట్టుడికింది. ఉద్యమం తీవ్రరూపం దాలుస్తోందని భావించిన కేంద్రం.. 12 పరిశ్రమల్లో సమ్మెను నిషేధిస్తూ ఆర్డినెన్స్ తెచ్చింది. తర్వాత ఈ ఆర్డినెన్స్ స్థానంలో ఎస్మా చట్టం తీసుకొచ్చింది.

ఎస్మా నిబంధనలను అతిక్రమించి సమ్మెకు పూనుకుంటే  నేర శిక్షాస్మృతితో సంబంధం లేకుండా, వారెంట్‌ లేకుండానే పోలీసులు అరెస్టు చేయవచ్చు. సమ్మె ప్రారంభించే, పాటించే ఉద్యోగులను డిస్మిస్‌ చేయడంతోపాటు క్రమశిక్షణ చర్యలు చేపట్టవచ్చు. సమ్మెలో పాల్గొంటున్న వారికి, వారిని ప్రోత్సహిస్తున్న వారికి జైలు, జరిమానా లేదా రెండూ విధించవచ్చు. సమ్మెకు ఆర్థిక సహకారం అందించేవారూ శిక్షలకు అర్హులవుతారు.

ఏది ఏమైనప్పటికీ.. నిత్యం అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలను, గర్భిణీలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం, అంగన్వాడీ కార్మిక సంఘాలు సరైన నిర్ణయం తీసుకుని సేవలను వీలైనంత త్వరగా ప్రారంభించాలి.

Show More
Back to top button