
మాఘ శుద్ధ ఏకాదశి గొప్ప ఏకాదశీ పర్వదినాల్లో ఒకటి. ఈ ఏకాదశికి ముందు వచ్చే అష్టమినాడు భీష్మాచార్యులవారు కైవల్యం పొందారు. ఆ భీష్ముని చరిత్ర దివ్యాతిదివ్యం. ఆ మహాత్ముని వల్ల అనేక ధర్మాలను తెలుసుకున్నాడు ధర్మరాజు. విష్ణు సహస్రనామం, భీష్మస్తవరాజం వంటి స్తోత్రాలు మనకు అనుగ్రహింపజేసింది కూడా ఈయనే. ఈ ఏకాదశి రోజున విష్ణుపూజ మొదలుకొని ఉపవాసం, విష్ణుసహస్రనామ పారాయణ చేయడం విశేష ఫలప్రదాన్ని ఇస్తుంది.
వ్యాసుడు భారతాన్ని ప్రజలకు అందించినప్పటికీ, భీష్ముడే కనుక లేకపోతే భారతమే లేదని మీకు తెలుసా.. తండ్రి సౌఖ్యం కోసం తన సింహాసనాన్నే త్యాగం చేసిన ధీరుడు భీష్ముడు. తన ద్వారా కలిగే సంతానం వల్ల ఆ త్యాగం ఎక్కడ పొల్లు పోతుందో అన్న సంశయంతో, ఆజన్మాంతం పెళ్లి చేసుకోనంటూ ‘భీషణ’ ప్రతిజ్ఞ చేసిన ధీరుడు ఈయన.
భీష్మునికి తను కోరుకున్న సమయంలో తనువు చాలించగలిగే వరం సైతం ఉంది. అందుకే ఆయన మార్గశిర మాసంలో అంపశయ్య మీదకి చేరుకున్నప్పటికీ.. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేవరకూ వేచి ఉన్నాడు. ఉత్తరాయణం ప్రవేశించిన తరువాత అష్టమి రోజున, తనని ఐక్యం చేసుకోమని ఆ కృష్ణ పరమాత్ముడ్ని వేడుకున్నాడు.
భీష్ముడు తన మరణ సమయంలోనూ, కురువృద్ధుడైనప్పటికీ తన విశిష్టతను చాటుకున్నాడు. తనను చూసేందుకు అంపశయ్య వద్దకు వచ్చిన ధర్మరాజుకు.. రాజనీతిలోని సారాంశానంతా బోధించాడు. పాండవులతో పాటుగా ఉన్న కృష్ణుడి వేనోళ్ల స్తుతిస్తూ విష్ణు సహస్ర నామాన్ని పలికాడు. అలాంటి బీష్ముడ్ని కొలిచేందుకు ఆయన నిర్యాణం చెందిన తరువాత వచ్చే ఏకాదశియే ఈ భీష్మ ఏకాదశీ!
ప్రతి ఏకాదశికి ఉండే నియమాలే భీష్మ ఏకాదశికీ వర్తిస్తాయి. దశమినాటి రాత్రి నుంచి ద్వాదశి ఉదయం వరకూ ఉపవాసం ఉండి, ఏకాదశి రాత్రివేళ జాగరణ చేయమనీ పెద్దలు సూచిస్తారు. దీంతోపాటుగా విష్ణు పూజకు ఈ వేళ విశేష ప్రాధాన్యం ఉంటుంది. భీష్ముడు అందించిన విష్ణుసహస్రనామాలను ఈరోజున జపిస్తే, విశేష ఫలితం దక్కుతుంది. అందుకనే ఈ రోజుని శ్రీ విష్ణుసహస్ర నామ జయంతిగా కూడా భావిస్తారు. భగవద్గీతను పఠించేందుకు కూడా ఇది అనువైన రోజు.
భీష్మ ఏకాదశిని జయ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజున మొదలుపెట్టిన ఏ కార్యమైనా విజయవంతం అవుతుందని ఒక నమ్మకం. అందుకనే ఆ పేరు మరీ! ఆచార్యునిగా, భరతవంశంలోని ఆదిపురుషునిగా ఆయన మనకు స్మరణీయుడు. అందుకే ఈ రోజున ఆయనకు తర్పణాలను విడవాలని పండితులు సూచిస్తారు. ఈ రోజున భీష్ముని తమ పూర్వజునిగా భావిస్తూ ఎవరైతే ఆయనకు తర్పణం విడుస్తారో వారి పాపాలన్నీ దహించుకుపోతాయంటారు.
మనకు వీలైతే ఈరోజున బ్రాహ్మణులకు గొడుగు, చెప్పులు, జలపాత్ర, వస్త్రాలు దానం చేయమని సూచిస్తున్నారు. ఇకపోతే రథసప్తమి నుంచి సూర్యుడి తీక్షణత పెరుగుతూ వస్తుంది కాబట్టి, బహుశా ఈ సూచన ముందుగానే చేసి ఉంటారనీ అనిపిస్తుంది.
గంగాదేవి, శంతన మహారాజుల పుత్రుడే ఈ భీష్ముడు. వశిష్టుని శాపంవల్ల భూమి మీద పుట్టి బ్రహ్మచారిగా, దీర్ఘాయువుగా, సత్యవ్రతుడిగా జీవించాడు. వీరి రాజ్యకలహంలో తన ప్రతిజ్ఞకు కట్టుబడి.. అధర్మపరులైన కౌరవుల పక్షాన నిలబడ్డాడు. శిఖండిని ఎదురుగా నిలబెట్టి చేసిన యుద్ధంలో పడిపోయి, అంపశయ్య పాలయ్యాడు.
నేడు ఇంటింటా పారాయణం చేసే విష్ణుసహస్ర నామం మొదటిసారి పారాయణం చేసింది అంపశయ్య మీదే, ధర్మజునికి రాజనీతి అంశాలు బోధించిందీ కూడా భీష్ముడే.
ఉత్తరాయణ పుణ్యకాలంలో మాఘశుద్ధ అష్టమినాడు భీష్మాచార్యుని ఆత్మ పరమాత్మలో లీనమైన రోజు ‘భీష్మాష్టమి’గా ప్రసిద్ధి చెందింది. మోక్షం పొందిన తర్వాత వచ్చిన మాఘశుద్ధ ఏకాదశిని ‘భీష్మ ఏకాదశి’, ‘మహాఫల ఏకాదశి’, ‘జయఏకాదశి’గా పిలుస్తారు.
భీష్మాష్టమి మొదలుకొని భీష్మద్వాదశి వరకూ ఉన్న ఐదు రోజులనూ భీష్మ పంచకంగా పిలుస్తారు. ఈ అయిదు రోజులూ భీష్ముని వ్యక్తిత్వాన్ని తలుచుకుంటారు. భీష్ముని జీవితం నుంచి ప్రేరణ పొందేందుకు ఈ 5 రోజులనూ కేటాయిస్తారు. మనం తరచూ వినే వ్యక్తిత్వ వికాస తరగతులకు ఏమాత్రం తీసిపోని ఆచారంగా ఇది ప్రతీతి.