Telugu News

దక్షిణ భారత మెడపై డీలిమిటేషన్‌ కత్తి !

ప్రస్తుతం తమిళనాడు సిఎం స్టాలిన్‌ జాతీయ హిందీ భాషను బలవంతంగా దక్షిణ భారత రాష్ట్రాలపై రుద్దడం వల్ల స్థానిక భాషలు అంతరిస్తాయని, హిందీని తప్పనిసరి చేయడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తుండడం చూస్తున్నాం. దీనికి తోడుగా 2026లో చేపట్టనున్న డీలిమిటేషన్‌ ప్రయోగం పూర్తి అయితే దక్షిణ భారతంతో పోల్చితే ఉత్తర భారతంలో పార్లమెంట్/అసెంబ్లీ‌ స్థానాలు భారీగా పెరుగుతాయనే ఆందోళనలో దక్షిణ భారత పార్టీలు, పౌర సమాజం మునిగి పోతున్నది. ఎక్కడ చూసినా డీలిమిటేషన్‌ చర్చ జరుగుతున్నది. డీలిమిటేషన్‌ అమలు చేస్తే జనాభా ప్రాతిపదిక కుటుంబ నియంత్రణ పాటించని ఉత్తర భారతంలో ఎంపీ సీట్లు అతిగా పెరగడం, కుటుంబ నియంత్రణతో జనాభా పెరుగుదలను అదుపులో పెట్టుకున్న దక్షిణ భారత రాష్ట్రాల్లో ఎంపీ/ఎంఎల్ఏ సీట్లు తగ్గడం జరగవచ్చనే అనుమానాలను కేంద్ర ప్రభుత్వం తాజాగా కొట్టిపారేసినప్పటికీ దక్షిణ భారతం దీని పట్ల పలు అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. 

 డీలిమిటేషన్‌ అంటే ఏమిటి ?

ప్రతి పదేళ్లకు ఒకసారి జనగనణ తర్వాత జనాభా ప్రాతిపదికన రాష్ట్రాల పార్లమెంట్‌, అసెంబ్లీ స్థానాలు, నియోజకవర్గ ప్రాంతాలను పునర్విభజన చేసే ప్రక్రియను డీలిమిటేషన్‌ అని పిలుస్తున్నాం. అధిక జనాభా కలిగిన రాష్ట్రాలకు అధిక నియోజక వర్గాలు, తక్కువ జనాభా కలిగిన రాష్ట్రాలకు తక్కువ స్థానాలు కేటాయించడం జరుగుతూ వస్తున్నది. డీలిమిటేషన్‌ ద్వారా ఎస్సీ, ఎస్టీ స్థానాలు కూడా పునర్ నిర్వచించబడతాయని తెలుసుకోవాలి. రాజ్యాంగంలోకి ఆర్టికిల్‌ 82, 170 ప్రకారం, పార్లమెంట్‌లో చట్టం చేసి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే స్వయం ప్రతిపత్తిగల “డీలిమిటేషన్‌ కమీషన్” ద్వారా ప్రతి జనగణన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు 1951, 1961, 1971లలో జనగణన వరుసగా 36.1 కోట్లు, 43.9 కోట్లు, 54.8 కోట్ల జనాభా ఆధారంగా డీలిమిటేషన్‌ చేయడంతో పార్లమెంట్‌ స్థానాలు 494, 522, మరియు 543 వరకు పెంచడం జరిగింది. 

2026 వరకు పొడిగించిన డీలిమిటేషన్‌ ప్రక్రియ:

1976లో కుటుంబ నియంత్రణ అమలును పెద్ద ఎత్తున చేపట్టిన నేపథ్యంలో డీలిమిటేషన్‌ ప్రక్రియను 25 ఏండ్ల వరకు పొడిగించడం జరిగింది. జనాభా నియంత్రించని రాష్ట్రాలకు అధిక నియోజకవర్గాలు కేటాయించాల్సి వస్తుందనే కారణంగా 1976లో 42వ రాజ్యాంగ సవరణతో డీలిమిటేషన్‌ ప్రక్రియను 25 ఏండ్ల వరకు, అనగా 2000 వరకు పొడిగించడం జరగడం చూసాం. 2001 సంవత్సరంలో 84వ, 2003లో 87వ రాజ్యాంగ సవరణతో తిరిగి మరో సారి డీలిమిటేషన్‌ ఎక్సర్‌సైజ్‌ను మరో 25 ఏండ్ల వరకు, అనగా 2026 వరకు పొడిగించారు. అనగా 1971 తర్వాత డీలిమిటేషన్‌ ప్రక్రియను 50 ఏండ్ల వరకు పొడిగించడం జరిగిందని తెలుసుకోవాలి.

2026లో డీలిమిటేషన్‌ ప్రక్రియ పూర్తి అయితే 141 కోట్ల జనాభాకు పార్లమెంట్‌ స్థానాలు 753 వరకు పెరగవచ్చని అర్థం అవుతున్నది. ఇప్పుడు ఉన్న ఎంపీ స్థానాల కన్న 210 స్థానాలు పెరగుతాయని, ఇవి కుటుంబ నియంత్రణ పాటించని అధిక జనాభా కలిగిన యూపీ, బీహార్‌ లాంటి రాష్ట్రాల్లో ఎంపీ స్థానాలు అధికంగా పెరగవచ్చని దక్షిణ భారతం భయపడుతున్నది. కుటుంబ నియంత్రణను పాటించి జనాభాను నియంత్రించిన దక్షిణ భారత రాష్ట్రాలను డీలిమిటేషన్‌ వల్ల అన్యాయం జరుగుతుందని సౌథ్ ఇండియా గళం పెంచడం సముచితంగా, సమర్థనీయంగా కనిపిస్తున్నది. 2026లో జనగణన చేపడితే 2031 వరకు పూర్తి కావడం, ఆ తర్వాత డీలిమిటేషన్‌ ప్రక్రియ అమలు చేయడం జరగవచ్చు. దీనితో పాటు మహిళలకు 33 శాతం ఎంపీ స్థానాలు కేటాయించడం కూడా డీలిమిటేషన్‌తో పూర్తి అవుతుంది. 

డీలిమిటేషన్‌పై దక్షిణ భారత అభ్యంతరాలు ఏమిటి ?

ప్రస్తుతం దక్షిణ భారతంలో 24 శాతం అనగా 129 ఎంపీ స్థానాలు (543 మొత్తం స్థానాలు) ఉన్నాయి. తెలంగాణలో 17, ఏపీలో 25, కేరళలో 20, తమిళనాడులో 39, కర్నాటకలో 28 ఏంపీ స్థానాలు ఉన్నాయి. ప్రతి ఎంపీ స్థానానికి 20 లక్షల జనాభాను నిర్ణయించి 2026లో డీలిమిటేషన్‌ చేసిన యెడల తెలంగాణలో 20, ఏపికి 28, కేరళలో 19, తమిళనాడులో 41, కర్నాటకలో 36 సీట్లు మాత్రమే కేటాయించడం జరుగుతుంది. అనగా దక్షిణ భారతంలో ఎంపీ స్థానాలు 129 నుంచి 144 వరకు, అనగా 15 సీట్లు మాత్రమే పెరుగుతాయని దక్షిణ భారతం ఆవేశపడుతున్నది. 2026 డీలిమిటేషన్‌ అమలుతో తెలంగాణలో 03, ఏపీలో 03, తమిళనాడులో 02, కర్నాటకలో 08 ఏంపీ స్థానాలు పెరగడం, కేరళలో మాత్రం 01 ఏంపీ స్థానం తగ్గవచ్చని తెలుస్తున్నది.

దేశవ్యాప్త 753 ఎంపీ స్థానాల్లో 19 శాతం (24 శాతం నుంచి 19 శాతానికి 5 శాతం పడిపోవడం) నియోజకవర్గాలు మాత్రమే దక్షిణాది రాష్ట్రాల్లో పెరగడం జరగవచ్చు. 2026 జనగణన ఆధారంగా డీలిముటేషన్‌ ప్రక్రియ అమలు అయితే యూపీలో ఎంపీ స్థానాలు ప్రస్తుత 80 నుంచి 128 వరకు(పెరుగుదల 48), బీహార్‌లో 40 నుంచి 70 వరకు(పెరుగుదల 30), మధ్యప్రదేశ్‌లో 29 నుంచి 47 వరకు(పెరుగుదల 18), మహారాష్ట్రంలో 48 నుంచి 68 వరకు(పెరుగుదల 20), రాజస్థాన్‌లో 25 నుంచి 44 వరకు(పెరుగుదల 19) నియోజకవర్గాలు పెరుగుతాయి. 

 జనాభాను నియంత్రించిన పుణ్యానికి బహుమతిగా దక్షిణాదికి ఎంపీ సీట్లు తగ్గడం, జనాభాను అదుపు చేయని ఉత్తర భారతానికి అధిక ఎంపీ సీట్లు కేటాయించడం జరిగితే దక్షిణ – ఉత్తర భారతాల మధ్య విభేదాలు పెరిగడం, దక్షిణ భారతాన్ని ఒక దేశంగా విభజించాలని ప్రతిపాదనలు కూడా బలపడవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశాభివృద్ధిలో ప్రధాన భూమికను నిర్వహిస్తున్న దక్షిణాది మెడపై డీలిమిటేషన్‌ కత్తి చూపితే రెండు ప్రాంతాల మధ్య ఘర్షణ వాతావరణం మొలకెత్తడం తప్పనిసరి కావచ్చు. దేశ హితం కోరే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు ప్రకటించడానికి బదులు డీలిముటేషన్‌ వేదికగా అన్యాయం చేయడం విచారకరం, అభ్యంతరకరం కూడా. 

Show More
Back to top button