Telugu News

పరమేశ్వరుడి రుద్ర అవతారమే భక్త హనుమయ్య

హిందువుల హృదయాంతరంగాల్లో వానర దేవుడుగా, సంకట మోచనుడుగా వీర భక్త హనుమ సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. చైత్రమాసంలో శుక్లపక్షం పూర్ణిమ తిథి రోజున, అనగా 12 ఏప్రిల్‌ 2025న “హనుమాన్‌ జయంతి”ని భక్తకోటి అత్యంత ఉత్సాహం, ఉల్లాసం, భక్తిశ్రద్ధలతో జరుపుకోవడం అనాదిగా ఆధ్యాత్మిక సాంప్రదాయంగా మారింది. రామ నవమి రోజున శ్రీరాముడు జన్మించిన కొద్ది రోజులకు హనుమాన్ జన్మించడం ఓ అద్భుత సందర్భం. శివుడి రుద్ర అవతారంగా మారుతిని పరిగణిస్తారు. మాతా అంజని, వనరాజు కేసరి దంపతులకు సూర్యోదయ సమయాన జన్మించిన సంకట మోచనుడికి అనేక ప్రియమైన పేర్లు ఉన్నాయి. అంజని పుత్రుడు, మారుతి నందనుడు, భజరంగ్‌బలి, సంకట మోచనుడు, ఆంజనేయుడు, పవన సుతుడు, హనుమంతుడు లాంటి పలు నామాలతో భక్తులు నోరారా పిలుచుకుంటూ పుణీతులు కావడం చూస్తున్నాం.

రెండు పర్యాయాలు హనుమాన్‌ జయంతి వేడుకలు:

హిందూ శాస్త్రాల ప్రకారం హనుమంతుడు నేటికీ మన మధ్య ఉంటూ భక్తుల కోర్కెలను తీర్చుతూ, సర్వాంతర్యామిగా సంచరిస్తూనే ఉన్నాడని పేర్కొనబడింది. ఏడాదికి రెండు పర్యాయాలు చిన్న, పెద్ద హనుమాన్‌ జయంతులను నిర్వహించుకోవడం చూస్తున్నాం. హనుమ జన్మదినాన్ని పురస్కరించుకొని చైత్రమాస శుక్లపక్షంలో పూర్ణిమ రోజున (12 ఏప్రిల్‌ 2025) ఒక హనుమాన్‌ జయంతిని, మార్గశిర అమావాస్య రోజున (25 డిసెంబర్‌ 2025) “హనుమ్ విజయం” పేరుతో రావణుడిపై శ్రీరాముడి విజయాన్ని పురస్కరించుకొని రెండవ హనుమ జయంతిని నిర్వహించుకుంటున్నాం. హనుమాన్‌ జయంతిని వేరు వేరు రాష్ట్రాలు వేరు వేరు తేదీల్లో జరుపుకోవడం జరుగుతున్నదని తెలుసుకోవాలి.

హనుమాన్‌ జయంతి వేడుకలు:

హనుమాన్‌ జయంతి రోజున వేకువ జామున నిద్రలేసి స్నానాలు చేసి, నూతన ఎరుపు రంగు వస్త్రాలు ధరించి హనుమాన్‌ లేదా సీతారాముల దేవాలయాలకు వెళ్లి దైవ దర్శనం చేసుకొని పూజలు నిర్వహించడం తరుచుగా కనిపిస్తుంది. హనుమాన్‌ కీర్తిని ప్రస్తుచించడానికి మనసారా కీర్తనలు, ఉపవాస దీక్షలు, రామాయణ పఠనాలు, దాతృత్వ సేవలు, భజనలు, హనుమ విగ్రహ ర్యాలీలు, సుందరకాండ పఠనాలు, లడ్డు/బోధది/అప్పాల ప్రసాద వితరణలు, వ్రతాలు చేయడం, హనుమ విగ్రహాలకు చందన అలంకరణలు, పేదలకు/భక్తులకు అన్న ప్రసాద వితరణలు, ధ్యానాలు, ధూపదీప నైవేద్యాల సమర్పణలు, అభిషేకాలు, ఆరతి ఇవ్వడం, పూలు/పండ్ల/తాంబూల సమర్పణలు, మంత్రోచ్ఛరణలు, దానధర్మాలు లాంటి పూజలను భక్తకోటి భక్తిప్రపత్తులతో నిర్వహిస్తారు.

41-రోజుల హనుమత్‌ దీక్షలు:

తెలుగు రాష్ట్రాల్లో 41 – రోజుల పాటు చైత్ర పూర్ణిమ నుంచి వైశాఖ శుక్లపక్ష 10వ రోజు వరకు లేదా చైత్ర పూర్ణిమ నుంచి 41వ రోజు హనుమాన్‌ జయంతి వరకు అత్యంత భక్తి శ్రద్ధలతో బ్రహ్మచర్యం పాటిస్తూ, కఠోర నియమనిబంధనలు, దురలవాట్లకు నిషేధం విధించుకొని భక్తిభావంతో నిర్వహిస్తారు. హనుమాన్‌ చాలీసా పారాయణంతో దుష్టశక్తులు తొలగి శాంతి, శ్రేయస్సులు లభిస్తాయనా ప్రగాఢంగా విశ్వసిస్తారు. సీతారాముల అత్యంత ప్రియమైన భక్తుడిగా హనుమకు పేరు ఉంది.

హనుమత్‌ భక్తి ఫలితాలు:

భక్తి, దైవిక శక్తి స్వరూపుడైన హనుమంతుడిని నిజాయితీగా సేవించడం ద్వారా భక్తులు ఇవి క్రిందివి పొందుతారు.

* మనో బలం

* సంపూర్ణ ఆరోగ్యం

* శత్రువుల నుంచి రక్షణ

* అడ్డంకుల నుంచి విముక్తి

జీవితాల్లో కష్టనష్టాల దుఃఖాలను తొలగించే హనుమాన్‌ జయంతి శుభ గడియల్లో మనసారా చిరంజీవి పవనపుత్రుడిని మనసారా ఆరాధిద్దాం, వారి ఆశీస్సుల దీవెనలను పొందే అర్హత సాధిద్దాం.

Show More
Back to top button