ఇంటిముందు ముగ్గులు, హరిదాసు కీర్తనలు, గొబ్బిళ్లు, బొమ్మలు, ఆటపాటలతో పాటు…
మరోవైపు గోదాదేవి తెల్లవారుజామునే నిద్ర లేవడం, తన స్నేహితులను కూడా మేల్కొలిపి… భక్తిగా శ్రీకృష్ణుడ్ని ధ్యానించే పవిత్ర మాసం ఇది.
ఎన్నో ఏళ్లుగా సంప్రదాయంగా వస్తున్న ఆచారమిది.
‘ధనుర్మాసం’ ప్రారంభంలో చలిగాలులు అంతగా వీచవు. వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంటుంది. అందులోనూ ఇది హేమంత రుతువు. పైన వేసిన తటాకాలతో సహా మానససరోవరం వేకువజామున ఎంతో నిర్మలంగా అచెంచలంగా ఉంటుంది. ఈ సమయంలో భక్తితో దేవదేవుడ్ని గానం చేస్తూ, జ్ఞాన తటాకంలో స్నానం చేయడం వల్ల భగవత్ ప్రాప్తి కలుగుతుందనీ పెద్దలు చెబుతారు. ధనుర్మాసం ప్రత్యేకత కూడా ఇదే!
‘తిరుప్పావై’ అంటే ‘శ్రీవ్రతం’. ఈ వ్రతాన్నే సిరినోముగా కూడా పిలుస్తారు. మార్గశిర మాసంలో సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించి అనంతరం మకరరాశిలోకి సాగే కాలాన్ని ‘ధనుర్మాసం’ అంటారు. మృగశిర నక్షత్రంతో కూడిన పూర్ణిమ ఉన్న ఈ మాసాన్ని మార్గ శీర్షంగా పిలుస్తారు. మార్గశిర మాసంలోనే శ్రీవ్రతం చేయాలంటారు ఎందుకంటే..
మార్గం అంటే దారి/ తోవ లేదా ఉపాయం. శీర్షం అంటే మానవుడికి శిరస్సు ఎంత ప్రధానమో అంత ప్రధానమైందని అర్ధం. మార్గశీర్షం అంటే భగవంతుడి నుంచి ప్రాప్తి కలిగించే శ్రేష్ఠమైన మార్గమని. ఉపనిషత్తుల సిద్ధాంతం ప్రకారం- ప్రాప్తి అనేది భగవంతుడే, అది ప్రాప్తింపజేసేది కూడా భగవంతుడే! అటువంటి విశ్వాసాన్ని మరింత పెంపొందించే వ్రతానుసారమే ధనుర్మాస వ్రతం.
ఉపనిషత్ భాషలో ధనస్సు అంటే ప్రణవమనే అర్ధం కూడా వస్తుంది. అది పరమాత్ముడి ఉనికిని తెలియజేసే నాదం. సంగీతం(నాదం)తో ధనుర్మాసంలో గోదాదేవి తన పాశురాలను గానం చేసి దైవాన్ని చేరుకుంది.
ఇకపోతే ధనుర్మాసంలో సాధారణంగా వివాహాలు జరిపించరు. ఎందుకంటే రవి ధనస్సురాశిలోకి ప్రవేశించి, మకరంలోకి వెళ్ళే సమయమే ధనుర్మాసం. ధనస్సు, మీనంలో రవి ఉన్నప్పుడు, సూర్యుడి రాశి అయిన బృహస్పతిలో ఉన్నప్పుడు ఏ శుభకార్యాన్ని నిర్వహించకూడదు అంటారు. అలాగే ఈ మాసంలో ఎక్కువగా సూర్య నమస్కారాలు చేస్తారు. ఇంకా విష్ణుముర్తిని నిత్యం వేకువనే పూజిస్తారు. ఇలా చేయటం శుభప్రదం.
అటువంటి దివ్యమైన మాసం విశిష్టత మనం ఇప్పుడు తెలుసుకుందాం:
వృత్తాంతం..
కలియుగంలో గోదాదేవి శ్రీ విల్లిపుత్తూరులోని ఆలయ అర్చామూర్తి వటపత్రశాయినిని శ్రీకృష్ణుడిగా భావించి, పూజించింది. తరువాత ఆలయాన్ని నందగోపాలుడి వనంగా అలాగే తోటి నేస్తాలను గోపికలుగా భావించి ధనుర్మాస వ్రతం చేసింది.
ద్వాపర యుగంలో రేపల్లెలో నివసించే గోపికలు శ్రీకృష్ణుడ్ని పొందడానికంటూ ఈ వ్రతం చేశారని విష్ణువు చెప్పగా అది విని ఆండాళ్ సైతం ఈ వ్రతాన్ని చేస్తుంది. ఆమెను ‘శూడికొడుత్త నాచ్చియార్’ అని కూడా భక్తితో సంబోధిస్తారు.
ఆమె విడిచిన మాలలనే వటపత్రశాయి ఇష్టంగా స్వీకరించాడు మరీ అందువల్లే ఆమెను కొందరు అలా పిలుచుకొంటారు.
ఆండాళ్ అంటే ‘రక్షకురాల’ని అర్థం. ఆమె ప్రసన్నురాలు. అందుచేత ప్రసన్నులు భగవంతుడి ప్రేమ పొందుతారు. అలాంటి వారిని అనుసరించేవారే పరమ భక్తులు. అజ్ఞానాన్ని తొలగించి, నిద్ర మేల్కొనేలా చేసి, దైవాన్ని పొందేందుకు వారికి యోగ్యతను కలిగించే ప్రేమమూర్తియే ఈ గోదాదేవి.
గోదాదేవి పాశురాలు ఆత్మార్పణకు ప్రేరణ ఆమె. ప్రారంభ పాశురమైన మార్గళిత్తింగళ్‌లో ఆమె స్నేహితులను నిద్రలేపుతూ ఈ విధంగా అంది.. ‘చెబుతారా! మంచి వెన్నెల రోజు ఏదో…
వేకువ జామున స్నానమాచరించడానికి తగిన సమయమిదే..
రమణులారా… సిరులు పొంగే రేపల్లె పడుచులారా… మేల్కొనండి. నందనందనుడైన యశోదకిశోర సింహం మనకు వరమిస్తాడు’ అని శ్రీ వ్రతాన్ని ప్రారంభిస్తుంది. గోదాతల్లి గానం చేసిన ఇటువంటి తరహా ముప్పై పాశురాలు కూడా మూలమంత్రాలే!
తిరుప్పావైలో వేకువజామున ఆచరించే స్నానానికి గోదాదేవి ఎక్కువ ప్రాముఖ్యమిచ్చేది. మనం రోజూ చేసే బాహ్యస్నానం కాక అంతరస్నానం కూడా చేయాలని తిరుప్పావైలో సూచించింది. అంతర స్నానం వల్ల అంతఃకరణం శుద్ధి అవుతుంది.
బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేసి తిరుప్పావైని నిత్యవ్రతంగా కొలుచుకుంటే భగవత్ అనుభవం కలుగుతుంది. భగవత్ గుణానుభవ స్నానానికి జ్ఞానం, భక్తి, వైరాగ్యం ప్రధానం. అందుకే
ఈ పాశురంలో తన చెలులను ఆమె ‘సేరిళైఈర్’ అని సంబోధిస్తుంది. ‘జ్ఞానభక్తి వైరాగ్యాలనే ఆభరణాలను ధరించిన చెలులారా’ అని దీనర్థం.
ఇలా ఆమె పాశురాలన్నీ దైవత్వంతో కూడినవే. ఇందులో పదహారో పాశురం ‘సాయగనాయ్’ ఇరవై ఏడో పాశురం ‘కుడారై’ అంటే, ఈ రోజుల్లో వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
మాసం విశిష్టత..
ధనుర్మాసంలో ఆచరించే పూజలు, ఉపవాసాలు, వ్రతాలు సకల శుభాలను కలుగజేస్తాయంటారు. వసంత, హేమంతాలతో ప్రకృతి పరవశిస్తూ పరమాత్మకు నివేదించే దివ్యమైన మాసం.
ధనుర్మాసాన్ని కోదండమాసం, చాపమాసం అని కూడా పిలుస్తారు. పురాణాలను అనుసరించి పార్వతీదేవి శివుడి కోసం చేసిన తపస్సు ఫలించి, వారి వివాహం జరిగింది ధనుర్మాసంలోనే.
శ్రీకృష్ణుడ్ని వివాహం చేసుకోవాలనుకున్న రుక్మిణీదేవి నారదమునిని ఆశ్రయించి, ఆయన సూచన మేరకు కాత్యాయనీ వ్రతం చేసిందీ కూడా ఈ మాసంలోనే.
విష్ణుమూర్తికి అత్యంత ప్రియమైన ఈ మాసంలో ఆ స్వామిని మధుసూదన నామంతో పూజిస్తూ, వివిధ వ్రతాలు ఆచరిస్తారు.
ఇక వైష్ణవులు నెలరోజుల పాటు ధనుర్మాస వ్రతాన్ని నిష్ఠగా ఆచరిస్తారు. విష్ణుమూర్తి కథలు వినటం, విష్ణుసహస్రనామాలను పారాయణం చేయడం, విష్ణు ఆలయాలను సందర్శించడం, తిరుప్పావై పఠనంతో తరిస్తారు.
పరమశివుడి భక్తులకు కూడా ఈ మాసం పవిత్రమైందే! తిరుప్పావై విష్ణువును కీర్తిస్తే, తిరువెంబావై శివుడ్ని కీర్తిస్తుంది. ఈ మాసంలో శివాలయాల్లో తిరువెంబావై, వైష్ణవాలయాల్లో తిరుప్పావై గానం చేస్తారు. వైష్ణవం, శైవం భిన్నం కాదు.. రెండూ దైవాన్ని చేరుకునే మార్గాలేనని ధనుర్మాసం మనకు గుర్తుచేస్తుంది.
*ధనుర్మాసంలో ప్రత్యేకించి శ్రీ వేంకటేశ్వరుని సన్నిధిలో విశేష పూజలు నిర్వహిస్తారు. ఈ మాసంలో ఏడుకొండలస్వామికి జరిగే ఉపచారాలు నిత్య పూజల కన్నా విభిన్నంగా ఉంటాయి. ధనుర్మాసం ప్రవేశించగానే తిరుమలలో ఆలయ శుద్ధి చేసి ధనుర్మాస పూజ నిర్వహిస్తారు. అర్చన, నివేదన అనంతరం గోదాదేవి రచించిన పాశురాన్ని పారాయణ చేస్తారు. రోజుకోటి చొప్పున ముప్పై పాశురాలు పఠిస్తారు.
*అలాగే ఈ మాసంలో స్వామివారికి సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై పఠనం పెడతారు. వైకుంఠ ఏకాదశి రోజు తెల్లవారుజామున తిరుమల ఆనంద నిలయంలో వైకుంఠద్వారాన్ని తెరుస్తారు. తిరిగి వైకుంఠ ద్వాదశి తెల్లవారుజామున మూసేస్తారు. వైకుంఠ ఏకాదశి రోజు శ్రీదేవి, భూదేవి సమేతుడైన శ్రీ వేంకటేశ్వరుడు తిరువీధుల్లో స్వర్ణరథంలో ఊరేగుతాడు.
ఇతరాలు..
*ధనుర్మాస వ్రతం శరణాగతికి ప్రతీక వంటిది. ఈ మాసంలో ఆండాళ్ బాహ్య, అంతరానుభవంతో ముప్పైరోజులు తాదాత్మ్యం చెందుతూ పాశురాలను (కీర్తనలను) గానం చేసింది. సత్సంగం వల్ల భగవత్సంగం ప్రాప్తిస్తుందని ఈ పాశురాల గీతమాలిక తిరుప్పావై మనకు రుజువు చేస్తోంది.
*ధనుర్మాస కాలంలో శ్రీ విల్లిపుత్తూరులోని వటపత్రశాయి ఆలయం, అలాగే శ్రీరంగంలోని రంగనాథుడి కోవెలను దర్శించడమనేది మంగళరంగా భావిస్తారు.
*గోదాదేవి రంగనాథుడిలో ఐక్యమవడం, కలియుగంలోని మకర సంక్రాంతి ముందు రోజైన భోగినాడు జరిగిందని చరిత్ర చెబుతోంది.
*ధనుర్మాస వ్రతం ఇహపర ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది. వాసుదేవుడి చరణారవిందాల వద్ద స్థానం కలిగిస్తుందని ఎందరో గట్టిగా విశ్వసిస్తారు.
శ్రీ కృష్ణదేవరాయలు రచించిన గోదాదేవి చరిత్రకు ‘ఆముక్త మాల్యద’ అని పేరుంది.