Telugu News

వేంకటేశునిఏకాంతసేవలో.‘వెంగమాంబ’ ముత్యాలహారతి!

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీనివాసుడు. భక్తులపాలిట కల్పతరు అయిన శ్రీ వేంకటేశ్వరుని పాదసేవకే జీవితాన్ని అంకితం చేసుకున్న గొప్ప భక్తురాలు.. తరిగొండ వెంగమాంబ. అన్నమయ్య మార్గాన్ని అనుసరించి ఆపదమొక్కులవాడిని అద్భుత సంకీర్తనలతో అర్చించిన ఆమె..

అన్నమయ్య, ఆల్వార్లు, హాతీరామ్‌ బాబా.. ఇలా ఎందరో భక్తులు శ్రీ వేంటేషుని స్వామి సేవలో తరించి కైవల్యాన్ని పొందారు. అలాంటి వారిలో ఒకరు శ్రీ తరిగొండ వేంగమాంబ జయంతి ఈ నెల 11న కావడంతో ఆమె జీవిత విశేషాలను తెలుసుకుందాం:

చిత్తూరు జిల్లా వాయల్పాడు దగ్గరలో తరిగొండలో జన్మించింది. చిన్నతనంలోనే భక్తి భావం అలవడి.. నరసింహస్వామి భక్తురాలైంది. బాలవితంతువుగానూ జీవితం గడిపింది. స్వీయ ఆధ్యాత్మిక సాధనలతో యోగిని అయ్యింది. వైధవ్యం వల్ల ఉన్న ఊర్లో అవమానాలు ఎక్కువై.. తట్టుకోలేక తరిగొండ నుంచి అరణ్యమార్గంలో తిరుమలకు చేరుకుంది.  ఆ వేంకటేశుని చూసి.. దర్శించి పులకించిపోయింది. 

ఆ తన్మయంతో ‘వేంకటాచల మాహాత్మ్యం’ను రచించింది. స్వామి సేవ, భక్తిరచనలతో ఆమె తెలియకుండా కాలం గడపసాగింది. శ్రీనివాసుని భక్తుడైన హాథీరామా బాబాశిష్యులు తిరుమల కొండపై ఆలయానికి సమీపంలోనే విడిగా నివాస స్థలం ఏర్పాటు చేశారు. అక్కడ వెంగమాంబ పూల మొక్కలను పెంచి.. నిత్యం పూలమాలలు, తులసిదండలు తీసుకెళ్లి.. స్వయంగా స్వామికి సమర్పించేది. ఒకరోజు వెంగమాంబ తులసికోట తిన్నెపై ఒంటికాలిపై నిలబడి, ఆనందనిలయ శిఖరాన్ని చూస్తూ తన్మయురాలైంది. 

ఈమె పూరిల్లు ఉన్న స్థానంలోనే ప్రస్తుతం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నప్రసాద కేంద్రాన్ని తితిదే నిర్మించింది. వెంగమాంబ చాలాకాలం ఎవ్వరికీ కనిపించకుండా శేషాచల అభయారణ్యంలోని తుంబురుకోనకు వెళ్లిపోయారు. అక్కడ వెంగమాంబ గవి అనే ప్రాంతంలో ఐదేళ్లు తపస్సు చేశారు. తిరుమలలో వెంగమాంబ కనిపించకపోవడంతో అందరూ ఈ ప్రాంతం వదిలి వెళ్లిపోయిందని భావించారు. అనంతరం జరిగిన పరిణామాల తరువాత వెంగమాంబ తిరిగి వచ్చేశారు. శ్రీనివాసుణ్ణి శ్రీకృష్ణ పరమాత్ముడిగా భావిస్తూ ‘శ్రీవేంకటేశ్వర కృష్ణమంజరి’ అనే స్తోత్రాన్ని గానం చేసింది. అలాగే విష్ణుపారిజాతం తదితర యక్షగానాలు, అష్టాంగయోగం, వాశిష్ఠ రామాయణ ద్విపదకావ్యం, తత్త్వకీర్తనలు మొదలైనవి రచించింది. గానం, రచనలు, యోగధ్యాన సాధనలతో ఆధ్యాత్మిక ఉన్నతి కోసం ఆమె ఎంతో ప్రయత్నించింది. అప్పటికే ఆమె యోగినిగా, భక్త కవయిత్రిగా ప్రసిద్ధి చెందింది. కొన్ని గ్రంథాలను కూడా రచించింది.

వెంగమాంబ ప్రాభవం ఎంతలా పెరిగిందంటే.. అన్నమయ్య వంశీకులే దగ్గరుండి.. వెంగమాంబను ఆహ్వానించి తిరుమలలో వరాహస్వామి ఆలయం వెనుక తమ నివాసంలో కొంతభాగాన్ని కేటాయించారంటే అతిశయోక్తి కాదు. వెంగమాంబ తిరుమల వచ్చినప్పటి నుంచి.. రోజూ సాయంకాలం స్వామి ఏకాంతసేవ సమయానికి ఆనంద నిలయానికి చేరుకునేది. శ్రీనివాసుడికి స్వయంగా కర్పూర హారతి ఇచ్చేది. దీన్నే ముత్యాలహారతి, తరిగొండవారి హారతిగా పిలుస్తారు. తిరుమలలో నేటికీ రాత్రి ఏకాంతసేవలో తాళ్లపాక అన్నమయ్య వంశీయులు జోలపాటలు పాడుతుండగా.. తరిగొండ వెంగమాంబ ఆరంభించిన ముత్యాల హారతిని స్వామివారికి సమర్పిస్తారు. శ్రీవారి ఆలయంలో మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ తదితర అవతారాలను పళ్లెంలో వెండి ముత్యాలతో తీర్చిదిద్ది హారతి ఇచ్చేవారు. అనంతరం ‘‘తాళ్లపాకవారి లాలిపాట.. వెంగమాంబ ముత్యాలహారతి’’ అని ప్రసిద్ధి చెందింది. తర్వాత ఆనందనిలయ బంగారు వాకిళ్లు మూసేస్తారు. అందుకే ‘తాళ్లపాకవారి లాలి, తరిగొండవారి హారతి’ అనే నానుడి ఏర్పడింది.

వెంగమాంబ తన రచనలన్నింటినీ బృందావనంలో చేసేవారు. శిష్యులు కూడా అక్కడే ఉండి ఆమె వద్ద యోగం, సాహిత్యం తదితర విషయాలను అభ్యసించేవారు. అప్పటికే శ్రీవారి వైభవాన్ని వ్యాప్తి చేసేందుకు పలు రచనలు చేసిన వెంగమాంబ వద్ద ‘‘అష్టఘంటములు’’ అనే 8 మంది ఉండేవారు. వీరు ఈమె రచనలను కాపీలుగా రాసి పండితులు, భాగవతులు లాంటివారు అడిగినపుడు ఇచ్చేవారు. 

1730వ సంవత్సరంలో జన్మించిన వెంగమాంబ రాఘవేంద్రస్వామి, వీరబ్రహ్మేంద్ర స్వామి వారి లాగా తన బృందావనంలోనే 1817లో సజీవ సమాధి చెందారు. యోగినిగా, భక్త కవయిత్రిగా వెంగమాంబ చరిత్రలో సాహితీ చరిత్రలో సుస్థిరస్థానం సంపాదించుకుంది.

ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో నృసింహ జయంతిని పురస్కరించుకుని పదిరోజుల పాటు తిరుమలకు వచ్చే భక్తులకు వెంగమాంబ అన్నదానం చేసేవారు. అప్పటి గోల్కొండ నుంచి తమిళనాడులోని దిండిగల్‌ వరకు ఉన్న ఆంధ్రులు తిరుమల సందర్శనకు వచ్చినపుడు అన్నదానం నిమిత్తం వెంగమాంబకు దానపత్రాలు రాసిచ్చారు. ఇప్పటికీ 30 నుంచి 40 వరకు దానపత్రాలున్నాయి. అంతేకాదు అప్పటి సంస్థానాధీశులు, జమిందార్లు, పాళెగాళ్లు, సామాన్య ముస్లిం సోదరులు అన్నదానానికి విరాళాలు ఇచ్చేవారు. ఈ విధంగా నిరంతరం శ్రీవారి భక్తులకు అన్నదానం చేయడం వల్ల వెంగమాంబ ‘మాతృశ్రీ’ అయ్యారు.

Show More
Back to top button