ప్రపంచ పర్యాటక రంగానికి ఊతం ఇవ్వడానికి 27 సెప్టెంబర్ 1970న తీసుకున్న తీర్మానం ప్రకారం అంతర్జాతీయ టూరిజం సమాజం ‘ఐరాస వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్, యుయన్‌డబ్ల్యూటిఓ’ను ఏర్పాటు చేసి చట్టబద్దత కల్పించడంతో ప్రతి ఏట 27 సెప్టెంబర్‌న ప్రపంచ దేశాలు ‘ప్రపంచ పర్యాటక దినం (వరల్డ్ టూరిజం డే)’ పాటించుట 1980 నుంచి ఆనవాయితీగా మారింది. పర్యాటకంతో ప్రపంచ దేశాల, ప్రాంతాల ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ, సామాజిక, ఉద్యోగ ఉపాధుల విలువలు ప్రభావితం అవుతాయనే అవగాహనను కల్పించేందుకు ‘ప్రపంచ పర్యాటక దినం’ వేదికలను వినియోగిస్తారు. 1997 నుంచి ‘వరల్డ్ టూరిజం డే‘ వేడుకలను ఒక్కోదేశంలో నిర్వహిస్తూ, టూరిజం అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 మంది ఉద్యోగుల్లో ఒక్కరు పర్యాటకరంగానికి సంబంధించిన ఉద్యోగాల్లోనే ఉన్నారని అంచనా.
ప్రపంచ పర్యాటక దినం – 2024 థీమ్:
సృజనశీల వినూత్న భావనలు, డిజిటల్ విప్లవ ఫలాలతో టూరిజం పరిశ్రమ రూపు రేఖలు ఆసాంతం మారిపోయాయి. వరుస విపత్తులతో అభివృద్ధి చెందిన, చెందుతున్న ప్రపంచ దేశాల సామాజిక, ఆర్థికరంగాలు కుదేలై చితికి పోయాయి. కరోనా విపత్తు వల్ల ప్రపంచ టూరిజం 4 ట్రిలియన్లు నష్టపోయిందని అంచనా వేశారు. పర్యాటక పరిశ్రమలోని మిలియన్ల ఉద్యోగాలను కరోనా మింగేసింది. విపత్తు మబ్బులు పూర్తి తొలగిన వేళ నేడు ప్రపంచ పర్యాటకం కొత్త పుంతలు తొక్కుతున్నది. ఈ ఏడాది ప్రపంచ పర్యాటక దినం-2024 నినాదంగా “పర్యాటకం – ప్రపంచ శాంతి (టూరిజమ్ అండ్ పీస్)” అనే థీమ్ తీసుకొని అవగాహన కల్పిస్తున్నారు. ‘ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు-2030’లో ప్రముఖమైన పేదరిక నిర్మూలన, ఆకలిని అంతం చేయడం, లింగ సమానత్వం, ఆర్థిక ప్రగతి లాంటివి సాధించడానికి పర్యాటకరంగం కూడా ఎంతగానో దోహదపడుతుందని గమనించాలి.
పర్యాటక పరిశ్రమతో ఆర్థికాభివృద్ధి:
ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగంగా పర్యాటకానికి పేరుంది. గత కొన్ని ఏండ్లుగా ప్రపంచ పర్యాటకం అనేక రేట్లు పెరగడం, ఆధునిక హంగులు తొడగడం చూశాం. 1950లో అంతర్జాతీయ పర్యాటకులు 5 మిలియన్లు (2 బిలియన్ల డాలర్ల రెవెన్యూ) నమోదు కాగా, 2019లో 1.3 బిలియన్ల (1,260 ట్రిలియన్ డాలర్ల రెవెన్యూ) వరకు పెరగడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. గ్లోబల్ డిజిపీలో పర్యాటక పరిశ్రమ 10 శాతంగా ఉందని అంటున్నారు. ప్రతి ఏట ప్రపంచ పర్యాటకాభివృద్ధి 3 శాతం పెరగాలని లక్ష్యం చేసుకున్నారు.
పర్యాటక పరిశ్రమ ఊపులో ఉన్న భారత్‌లో దేశ జిడిపీలో 9.2 శాతంగా ఉంటూ అతి వేగంగా విస్తరిస్తోంది. దేశ పర్యాటక పరిశ్రమలో 43 మిలియన్ల ఉద్యోగులు పని చేస్తూ, ప్రతి ఏట 10 మిలియన్లకు పైగా విదేశీ పర్యాటకులతో దినదినాభివృద్ధి చెందుతోంది. దేశవ్యాప్తంగా ఉత్తర భారతం నుంచి దక్షిణం వరకు వెలసిన విలక్షణ జన జాతులు, విభిన్న సంస్కృతులు, వారసత్వ సంపదలు, ప్రకృతి పరిచిన అందాల విందులు, పుణ్య తీర్థయాత్రలు, అద్భుత కట్టడాల రమణీయతలు, పర్యాటకంతో ప్రపంచ శాంతి, సోదర భావం, సాంస్కృతిక వినిమయం, పరమత సహనం లాంటి ముఖ్య అంశాలు సిద్ధిస్తాయి.
దేశీయ పర్యాటకం:
ఇండియాలోని యూపీ (అయోధ్య), కేరళ, ఉత్తరాఖండ్, హిమాచల్ లాంటి రాష్ట్రాలు పర్యాటకం మీదనే అధికంగా ఆధారపడి ఉన్నాయి. అంతర్జాతీయ విమానాయాన రంగంతో మెుదలు అతి చిన్న గ్రామీణ బడుగు కుటుంబాల వరకు అందరినీ అక్కున చేర్చుకొని పర్యాటకులకు ఆహ్లాదాన్ని, స్థానికులను ఉపాధులను ప్రసాదిస్తున్న పర్యాటక పరిశ్రమ మళ్ళీ తేరుకొని, పుంజుకొని మిలియన్ల కుటుంబాల్లో నవ్వుల పువ్వులు పూయించాలని కోరుకుందాం. ప్రతి ఒక్కరం జీవితంలో తరుచుగా పర్యాటక ప్రణాళికలు వేసుకొని, పర్యాటకుడిగా ఆనందానుభూతులు పొందుతూ, పలువురికి ఉద్యోగ ఉపాధుల కల్పనలో పరోక్షంగా దోహదపడదాం.
విశ్వ రహస్యాలు, దర్శనీయ స్థలాలు, ప్రకృతి అందాలు తెలుసుకునేందుకు ప్రయాణాలకు సిద్ధం అవుదాం.