
పూలనే దేవతగా కొలిచే అపురూపమైన పండుగ బతుకమ్మ రానే వచ్చింది. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి.. ఆడపడుచులంతా ఒక్కచోట చేరి తమ అనుభవాలను పాటలుగా మలిచి.. చప్పట్లతో గౌరమ్మను కొలిచే గొప్ప వేడుక ఇది. తెలంగాణ అస్తిత్వానికి.. సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా భావించే బతుకమ్మ పండుగ తొమ్మిది రోజులపాటు పూలపర్వంగా జరుగుతుంది. బతుకమ్మ సంబరాలు ప్రతీ ఏటా పెత్తర అమావాస్య రోజున ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై.. సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. ఈ సందర్భంగా పండుగ నేపథ్యం విశేషాలు తెలుసుకుందాం…
బతుకమ్మ మన సంస్కృతి. ఇదొక వారసత్వ పండుగ. చరిత్రకు సాక్ష్యమైన పూల జాతర. ‘బతుకమ్మ సంబురం’లో ఆడబిడ్డ అనురాగం, ఆత్మీయ పలకరింపు కనిపిస్తాయి.
పితృ దేవతలను తలుచుకునే పెత్తర అమావాస్యను పురస్కరించుకొని బతుకమ్మ ప్రతి ఇంటికీ నవ్వులను పంచుతుంది.
ప్రకృతిలో సహజసిద్ధంగా లభించే పూలతో కూడిన అమరికే బతుకమ్మ. సాధారణంగా గునుగు, గుమ్మడి, తంగేడు, కట్ల పూలు, గోరంట్ల పూలు పట్టుకుచ్చులు(సీతజడ పూలు) గుండ్రంగా వరుసలుగా పేర్చి.. పైభాగం మధ్యలో ‘గౌరమ్మ’ను పెడతారు. గుమ్మడి పువ్వు మధ్య భాగాన్ని గౌరమ్మగా పిలుస్తారు. పువ్వులతో పాటు.. పసుపుతో చేసిన గౌరమ్మను ఉంచుతారు. దుర్గరూపంగా.. బొడ్డెమ్మగా అమ్మవారిని కొలుస్తారు. ఇక పండుగ రోజున ఊరంతా ఒక్కచోట చేరి బతుకమ్మా(జీవించు అని అర్థం).. మాకు బతుకునీయవమ్మా(మమ్మల్ని చల్లగా చూడు తల్లీ) అని పాటలతో అమ్మను వేడుకుంటారు.
బతుకునిచ్చే దేవత…
బోనాలు, బొడ్రాయి, సమ్మక్క పండుగ ఇవన్నీ గ్రామ దేవతల శక్తి స్వరూపాలకు చెందిన ప్రసిద్ధ పండుగలు. వ్యాధులు, కరవు, వరదలు, ప్రకృతి ప్రళయాల నుంచి కాపాడమని గ్రామదేవతలను గ్రామస్తులు కోరుకుంటారు. ఇందుకు గ్రామదేవతల శాంతి కోసం జంతువులను బలిగా ఇస్తాం. కానీ బతుకమ్మకు అలా చెయ్యం. వ్యాధులు, విలయాల నుంచి కాపాడమని కాకుండా మాకు చల్లటి బతుకునీయమ్మా అని కోరుకుంటాం. సద్దులనే నైవేద్యంగా సమర్పిస్తాం.
స్త్రీ జీవితంలోని మాతృత్వానికున్న విలువలను బతుకమ్మ పండుగలో ప్రతీకగా భావిస్తారు. అందుకే ఒంటి బతుకమ్మను ఎప్పుడు కూడా పేర్చరు. పెద్ద బతుకమ్మ పక్కన చిన్న బతుకమ్మను పెట్టి తల్లీబిడ్డల అనుబంధానికి చిహ్నంగా బతుకమ్మను అలంకరిస్తారు. నేటితరానికి తెలియని విషయం ఏంటంటే బతుకమ్మ, బొడ్డెమ్మ వేర్వేరు పండుగలు. ఒకరకంగా జంట పండుగలు. బొడ్డెమ్మ పెండ్లికాని యువతులకు సంబంధించినది, పూల మధ్యలో గౌరమ్మను పెట్టి పూజించేది బతుకమ్మ పండుగ.
బతుకమ్మ.. తొమ్మిది రోజులు..
తొమ్మిది రకాల నైవేద్యాలు…
ముఖ్యంగా పల్లెల్లో అయితే పోటాపోటీగా భిన్న రుచులను తయారు చేసి మరీ వడ్డిస్తారు. ఇంట్లో చేసుకున్న ఏ వంటకమైనా.. మరో నలుగురికి పంచి వారితో తినిపించడం బతుకమ్మ పండుగలో కనిపించే సంతోషకరమైన విషయం. తొమ్మిది రోజుల బతుకమ్మ సంబరంలో కనిపించే ముఖ్యమైన ప్రసాదాలు ఏవంటే…
మొదటి రోజు- ఎంగిలిపూల బతుకమ్మ..
బతుకమ్మ మొదటి రోజును పెత్తర అమావాస్య నాడు జరుపుకొంటారు. ఈరోజు నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు. పండుగకు ముందు ఆయా పూలను వివిధ పురుగుల పరాగ సంపర్కం కారణంగా ఎంగిలి పడ్డాయని తలచి, మొదటి రోజు బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మగా వ్యవహరిస్తారు. ఆరోజు నువ్వుల సద్దిని అందరితో పంచుకుంటారు.
రెండో రోజు- అటుకుల బతుకమ్మ..
రెండో రోజు అటుకుల ప్రసాదం. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులు కలిపి అమ్మవారికి ఇష్టంగా వడ్డించే నైవేద్యం ఇది.
మూడో రోజు- ముద్దపప్పు బతుకమ్మ..
మూడోరోజు ముద్దపప్పు బతుకమ్మ. ముద్దపప్పు, పాలు, బెల్లంతో వేడివేడిగా నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.
నాలుగోరోజు- నానబియ్యం బతుకమ్మ..
నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ. నానబెట్టిన బియ్యాన్ని పాలు, బెల్లంతో కలిపి ఉడికించి, ప్రసాదంగా తయారు చేస్తారు.
ఐదోరోజు- అట్ల బతుకమ్మ..
ఐదోరోజు అట్ల బతుకమ్మ. అట్లు లేదా దోశలను అమ్మవారికి నైవేద్యంగా వడ్డిస్తారు.
ఆరోరోజు- అలిగిన బతుకమ్మ
ఆరోరోజున అలిగిన బతుకమ్మగా జరుపుకొంటారు. ఆరోజు అమ్మవారి అలకగా చెప్పుకుంటారు. ఆమెను సంకల్పిస్తూ ఉపవాసం పాటిస్తారు. ఎటువంటి నైవేద్యం చేయరు.
ఏడో రోజు- వేపకాయల బతుకమ్మ..
ఏడోరోజున వేపకాయల బతుకమ్మ. బియ్యంపిండిని బాగా వేయించి, వేపపండ్లుగా తయారుచేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు.
ఎనిమిదో రోజు- వెన్నెముద్దల బతుకమ్మ..
ఎనిమిదో రోజు వెన్నెముద్దల బతుకమ్మ. నువ్వులు, వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి వెన్నముద్దలను నైవేద్యంగా వడ్డిస్తారు.
తొమ్మిదో రోజు- సద్దుల బతుకమ్మ..
ఆశ్వయుజ అష్టమినాడు, ఆదేరోజు దుర్గాష్టమిని జరుపుకుంటారు. తొమ్మిదోరోజు పెరుగన్నం, చింతపండు పులిహోర, కొబ్బరన్నం, నువ్వులన్నం అనే ఐదురకాల నైవేద్యాలను తయారు చేసి అమ్మవారికి నివేదిస్తారు.
ఆంతర్యం..
‘రామరామ రామ ఉయ్యాలో.. రామనే శ్రీరామ ఉయ్యాల.. పెద్దలకు వచ్చింది ఉయ్యాలో పెత్తరామాస ఉయ్యాల.. బాలలకు వచ్చిందీ ఉయ్యాలో బతుకమ్మ పండుగ ఉయ్యాల’ అంటూ సాగే పాట బాగా ప్రాచుర్యంలో ఉంది.
అబ్బాయిలంతా పువ్వులు సేకరించడం బాధ్యతగా తీసుకుంటే, చీరకట్టులో అందంగా ముస్తాబైన అమ్మాయిలు బతుకమ్మలను పేర్చి చూడముచ్చటగా ఆడిపాడతారు.
‘ఒక్కడే మాయన్న ఉయ్యాలో వచ్చన్న పోడాయె ఉయ్యాల’ అంటూ అన్నయ్యలను కీర్తిస్తూ పాటలు పాడుతారు. అన్ననో, తమ్ముడో తమకు తోడుగా ఉంటే బాధలు చెప్పుకొని మనసు బరువు దింపుకోవచ్చనే ఆకాంక్ష బతుకమ్మలో ఉంటుంది. అందుకే బతుకమ్మ అందరి హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. ప్రతీ సంవత్సరం అందరికి కొత్త అనుబంధాలను కలిగిస్తుంది.
కాకతీయుల కాలంలోనూ బతుకమ్మ పండుగ వైభవంగా జరిగేదని తెలుస్తోంది. తెలంగాణలో ప్రసిద్ధమైన బతుకమ్మ పండుగను పోలిన వేడుకలు.. ఓనం, అట్లతద్దె, కోలాటం, దాండియా,గొబ్బెమ్మ- ఇలా నామ, రూప భేదాలతో దేశమంతా కనిపిస్తాయి. భక్తి సామ్రాజ్యానికి బతుకమ్మ పండుగ పెట్టని కోట లాంటిది అని చరిత్ర చెప్పకనే చెప్తోంది.