
ప్రతీ సంవత్సరం ఆషాఢమాసంలో వచ్చే బోనాల వేడుకలు మొదటి ఆదివారం(జులై 7).. గోల్కొండ ఎల్లమ్మ ఆలయంలో ప్రారంభమవుతాయి. రెండో ఆదివారం ఆ పరిసర ప్రాంతాల్లో, మూడో ఆదివారం సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో, నాలుగో ఆదివారం లాల్‌దర్వాజ, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ నిర్వహించటం అనాదిగా వస్తున్న ఆచారం. తెలంగాణవాసులు ప్రతి ఏటా సంబురంగా, వైభవంగా జరుపుకునే పండుగ… బోనాలు.. సమస్త జీవకోటికి ఆధారమైన ప్రకృతిని పరాశక్తిగా భావించి ఆరాధించడం మనకు పూర్వీకుల నుంచి అనాతిగా వస్తున్న సంప్రదాయం. అనుకోని వైపరీత్యాలను నిలువరించేలా ప్రకృతి మాతను ప్రసన్నం చేసుకోవడానికి మన పూర్వీకులు ఉద్దేశించి పెట్టినవే ఈ ఉత్సవాలు, జాతరలు.
అలాంటి వేడుక తెలంగాణ ప్రాంతంలో ‘బోనాలు’గా పిలుస్తారు. ఆషాఢమాసంలో తొలి ఆదివారం బోనాల ఉత్సవాలు మొదలై… నెలరోజులపాటు సాగుతాయి. వర్షాకాలంలో వ్యాధుల నుంచి, ఇతర విపత్తుల నుంచి తమను కాపాడాలని గ్రామదేవతలను వేడుకుంటూ… అమ్మకు బోనం సమర్పించడమే ఈ బోనం పరమార్థం.
కొన్ని శతాబ్దాలుగా తెలంగాణలో ఈ వేడుకలు జరుగుతున్నట్టుగా చరిత్ర చెబుతోంది.
ప్రతి గ్రామం మధ్యలో బొడ్రాయిని ప్రతిష్ఠించి, దానికి పసుపు కుంకుమలు అద్ది, పూజలు చేసి, తమ ఇళ్లల్లో చేసిన బెల్లంతో కూడిన నైవేద్యాలను నివేదించిన భోజనమే ‘బోనం’గా పిలుస్తారు.
తొలి బోనం ఎక్కడంటే…
కాకతీయ సామ్రాజ్యంలో కాకతీయ పాలకులు కాకతీని తమ కులదైవంగా ఆరాధించేవారనీ, రాజ్యంలో అందరూ ఆరోగ్యంగా, సుఖ సంతోషాలతో సుభిక్షంగా జీవించేలా అనుగ్రహించాలని ఆ తల్లిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ… ఆషాఢమాసంలో ఉత్సవాలు నిర్వహించేవారనీ తెలుస్తోంది.
కాగా, 1908లో మూసీ నదికి వరదలు వచ్చి.. ప్లేగు లాంటి అంటువ్యాధులు ప్రబలంగా వ్యాపించాయి. ఎక్కువ మొత్తంలో ప్రాణనష్టం కూడా జరిగింది. ఆ సమయంలో గోల్కొండలో వెలసిన జగదాంబిక(ఎల్లమ్మ)కు పూజలు చేస్తే పరిస్థితి అంతా చక్కబడుతుందని సూచించారు.
నాటి గోల్కొండ ప్రభువు మీర్ మహబూబ్ ఆలీఖాన్ సైతం.. అమ్మవారికి పూజలు జరిపించి, బోనాల సమర్పణ చేయించాడు. అనంతరం అంతా ప్రశాంతత నెలకొంది. ఫలితంగా నాటి నుంచి ఆషాఢ మాసంలో తొలి గురువారం లేదా ఆదివారం గోల్కొండ కోటలోని జగదాంబిక ఆలయంలో తొలి బోనాల సమర్పణ చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఆ తరువాతే ఆది, గురువారాల్లో తెలంగాణ ప్రాంతమంతా గ్రామదేవతలకు బోనాలు సమర్పించి, ఉత్సవాలు నిర్వహిస్తారు.
హైదరాబాద్- సికింద్రాబాద్ జంట నగరాల్లో బోనాల సంబరాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతాయి.
‘బోనం‘…
అమ్మవారికి నివేదించే భోజనం(బోనం)లో… అన్నం వండి, పాలు లేదా పెరుగులో బెల్లం కలిపి… ఈ మిశ్రమాన్ని కొత్త కుండలో నింపుతారు. ఈ కుండ అంచు చుట్టూ వేపాకులు కట్టి, మూత పెట్టి, ఆ మూత మీద ఒక ప్రమిదను వెలిగిస్తారు. ఈ కుండను మహిళలు తమ తలపై పెట్టుకొని, ఊరేగింపుగా తమ ప్రాంతంలోని ఆలయాలకు తీసుకువస్తారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి, అమ్మవారికి బోనం నివేదిస్తారు. ఆ తరువాత ప్రసాదంగా అంతా దాన్ని స్వీకరిస్తారు. అమ్మవారికి బోనం సమర్పించే సమయంలో వేప మండలను పసుపు నీటిలో ముంచి, సంప్రోక్షణ చేశాక… అమ్మవారికి సమర్పిస్తారు. దీన్నే ‘సాక (కొమ్మ… వేప మండతో చేసే సంప్రోక్షణ) పెట్టడం’గా ఆచరిస్తారు.
పోతురాజు వేషం…
మహిళలు ఆదిపరాశక్తిని తమ ఇంటి ఆడపడుచుగా భావించి, పుట్టింటికి స్వాగతించి, నెలరోజులపాటు బోనాల సంబరాలు వేడుకగా చేసుకుంటారు.
ఇంటికి వచ్చిన ఆడపడుచుకు సారె ఇచ్చి సాగనంపడం మన ఆనవాయితీ.
దాన్ని అనుసరించి, ప్రతి ఇంటా అమ్మవారి కోసం వివిధ రకాల పిండివంటలు చేసి, వాటిని ఆలయానికి తీసుకువచ్చి, అమ్మవారికి నివేదిస్తారు. ఈ ఫలహారపు బండ్ల ఊరేగింపు ఎంతో వైభవంగా సాగుతుంది.
ఈ జాతరలో ‘పోతురాజు’ది ప్రధాన పాత్ర. పోతురాజును అమ్మవారి సోదరుడిగా భావిస్తారు. ఒళ్ళంతా పసుపు పూసుకొని, కాళ్ళకు గజ్జెలు కట్టుకొని, నుదుటన పెద్ద కుంకుమబొట్టు పెట్టుకొని, కళ్లకు కాటుక అలంకరించుకొని, చేతిలో కొరడాతో పోతురాజులు చేసే విన్యాసాలు చూడముచ్చటగా ఉంటాయి.
- సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి బోనాల మరుసటి రోజు ఈ రంగం నిర్వహిస్తారు. ఇదే సమయంలో పచ్చి కుండపై అవివాహిత అయిన ఓ మహిళ నిలబడి… అమ్మవారి వాక్కుగా… భవిష్యత్ వాణిని వినిపిస్తుంది.
. ఇది సుమారు 200 ఏళ్ల క్రితం నాటి మాట.. సికింద్రాబాద్‌కు చెందిన కొందరు సైనికులు ఉద్యోగవిధుల్లో భాగంగా ఉజ్జయిని వెళ్లారు. అదే సమయంలో భాగ్యనగరంలో కలరా వ్యాధి ప్రబలి ఎందరో కన్నుమూశారు. ఇది తెలిసి ఉజ్జయినిలో ఉన్న భాగ్యనగర సైనికులు, కలరా మహమ్మారి నుంచి తమ ప్రాంతాన్ని కాపాడమని అక్కడి మహంకాళిని ప్రార్థించారు. ఆ వెంటనే హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో కలరా తగ్గుముఖం పట్టింది. అమ్మవారు తమ మొర ఆలకించిందన్న నమ్మకంతో.. ఉజ్జయిని అమ్మవారిమూర్తిని సికింద్రాబాద్‌లో ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ఉజ్జయినిలోనే కాదు సికింద్రాబాద్‌లోని గుడిలోనూ కరుణాకటాక్షాలను కురిపిస్తోంది మహంకాళీ దేవి. భక్తులు సమర్పించే బోనాలను మనసారా స్వీకరిస్తోంది.
- ఆషాఢమాసం చివరివారంలో గోల్కొండలో జరిగే ఆషాఢ జాతరతో అంటే, తొలి బోనం జరిగిన చోటే ఈ బోనాల ఉత్సవం ముగుస్తుంది.