Telugu News

మే 22న హనుమజ్జయంతి..!

మహాబ‌లుడు, బుద్ధిశాలి, కపిశ్రేష్టుడు, సర్వశాస్త్ర పారంగతుడు, వ్యాకరణకోవిదుడు, రాజనీతిజ్ఞుడు, వినయమూర్తి, రామభక్తాగ్రేసరుడు, వీరాంజనేయుడు…

ఇలా ఎన్నో విధాలుగా స్తుతింపబడిన హనుమా.. తల్లి అంజనాదేవి కావడంతో, ఆంజనేయుడయ్యాడు. చూసి రమ్మంటే లంకను కాల్చి వచ్చినందున పవనసుతుడయ్యాడు. శోకసంద్రానున్న సీతమ్మను ఓదార్చిన ఆ అంజనీపుత్రుడు.. మహా బలశాలి అయ్యుండీ కూడా రామబంటుగా ఒదిగాడు..

భక్తుల భయాలన్నీ పారదోలి ప్రసన్నాంజనేయుడయ్యాడు.

ఒక్కో మాసంలో ఒక్కో దేవతకు విశిష్టత ఉన్నట్లు, హనుమంతుడికి వైశాఖ మాసం ప్రత్యేకమైంది.

వైశాఖ శుక్ల ఏకాదశి హనుమ తల్లిదండ్రులైన కేసరి అంజనల వివాహం జరిగింది, వైశాఖ కృష్ణ దశమి (మే 22న) స్వయంగా హనుమ జన్మించారు. హనుమద్వైభవాన్ని దధిముఖుడు వానరులకు బోధించింది ఈ వైశాఖమాసంలోనే. విశాఖకు సంబంధించినది వైశాఖం. శాఖ అంటే కొమ్మ. కొమ్మలపై విశిష్టంగా సంచరించేది వానరం. ఆ రకంగా వైశాఖ మాసానికీ, వానరావతారానికీ సంబంధం ఉన్నట్లు కూడా చెప్పవచ్చు. ఇంతటి ప్రత్యేకతలను కలిగిన మాసంలో హనుమ జన్మించడం విశేషం! 

సుందర హనుమా..

రామాయణంలో హనుమ తన గురించి ఎక్కడా చెప్పుకోలేదు. రాముడు విడిచిన బాణాన్ని అంటూ తన ఘనతంతా రాముడికే చెల్లించాడు. అంతటి హృదయాన్ని మించిన సుందర హృదయం మరొకటి ఉండదు. అందువల్లే ఈ కాండ సుందరకాండ అయింది.

రాజు పూజలందుకున్న రాముడి బంటుగా హనుమయ్య అందరికీ సుపరిచితమే. శ్రీరాముడే స్వయంగా హనుమంతుడిని పూజించిన వివరణ పరాశర సంహితలో ఉంది. దీనిప్రకారం చూస్తే, 

పుట్టిన పది రోజుల్లోనే ఉదయిస్తున్న సూర్యుణ్ణి పండుగా భ్రమించి మింగబోయిన అహల్య మనవడైన అంజనీసుతుణ్ణి ఇంద్రుడు తన వజ్రాయుధంతో హనుమల (దవడల) మీద కొట్టడంతో ‘హనుమ’ పేరు స్థిరపడింది. వజ్రాయుధం దెబ్బకు సొమ్మసిల్లిన హనుమ పరిస్థితి చూసి కోపగించాడు వాయుదేవుడు. అతడ్ని ప్రసన్నం చేసుకునే క్రమంలో త్రిమూర్తులతో సహా దేవతలంతా హనుమంతుడికి అనేక వరాలు ప్రసాదించి దీవించారు. అలా సకల దేవతలూ, రుషుల వరప్రభావంతో మరింత శక్తిమంతుడయ్యాడు. 

వీర హనుమా..  

ఆ పేరే కొండంత ధైర్యాన్నిస్తుంది. భయాన్ని పారదోలే శక్తిమంతమైన స్వరూపం ఆయన సొంతం. పైకి ఎంతటి గంభీరమైన తేజస్సుతో కనిపిస్తాడో, అంతేస్థాయిలో మృదుమధురమైన వాక్కు, చిత్త సంస్కారాన్ని కలిగి ఉంటాడు. బుద్ధిబలం కలవాడు. అనేక గుణగణాలను కలిగినవాడు అందువల్లే హనుమ రామాయణంలో అనేకచోట్ల మనకు దర్శనమిస్తాడు.

హనుమాన్‌ అంటే ‘జ్ఞానవాన్‌’ అని అర్థం. ‘హను’ అంటే ‘జ్ఞానం’ అని, ‘హనువు’ అంటే ‘దవడలు’ అని అర్థం.. అయితే, శబ్దార్థపరంగా చూస్తే, ‘హనుమ’ అనే పదంలోని ‘అ, ఉ, మ’ అనే మూడు అచ్చుల శబ్దం..  మనకు నిగూఢంగా ‘ఓం’కారం అనే శబ్దం ధ్వనిస్తుందని చెప్పకనే చెబుతోంది. దీని ద్వారా హనుమంతుడు ఓంకార స్వరూపుడనే విషయం అంతరార్థంగా స్పష్టమవుతుంది. అపరిమితమైన భుజశక్తితోపాటు గొప్ప విద్యావేత్త కూడా. నిత్య ప్రకాశవంతుండైన సూర్యభగవానుడి దగ్గర సకల విద్యలూ నేర్చుకున్నాడు. ఒకరోజు హనుమ, సూర్యుడి దగ్గరకు వెళ్లి తనను శిష్యుడిగా స్వీకరించమని అడిగాడట.

స్థిరంగా ఉండలేని నేను నీకెలా విద్య నేర్పగలను అన్నాడట సూర్యుడు. అలా అన్న వెంటనే, అమాంతంగా తన శరీరాన్ని పెంచిన హనుమ.. తూర్పు, పశ్చిమ పర్వతాల మీద చెరొక కాలు పెట్టాడట. అనంతరం సూర్య గమనానికి అభిముఖంగా తన ముఖాన్ని తిప్పుతూ సూర్యుడ్ని విద్య నేర్పించమని కోరాడట. దీంతో హనుమ శక్తి సామర్థ్యాలను మెచ్చి, సూర్యుడు గురువుగా మారాడు. ఆయన దగ్గర వేదాలు, వ్యాకరణం సహా అన్ని శాస్త్రాలు నేర్చి, గొప్ప పండితుడయ్యాడు. అంతటి సకల విద్యలను నేర్చినవాడు కాబట్టే, హనుమ తనకు మంత్రిగా ఉంటే ముల్లోకాల్లోనూ సాధించలేనిది ఏదీ ఉండదంటాడు ఒకానొక సందర్భంలో రాముడు అంటాడు.

*రాముడికి నమ్మిన బంటు. అంతే పరాక్రమానికి, విశ్వాసానికి ప్రతీక అయిన హనుమంతుడు.. భక్తుల కొంగుబంగారం కూడా. అందువల్లే హనుమాన్ భక్తులు ప్రత్యేకంగా దీక్ష తీసుకుంటారు. దీక్ష విరమించేందుకు చాలామంది మన రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో ఉన్న కొండగట్టుకు వెళ్తారు. ఇక్కడికే ఎందుకంటే, ఇక్కడ ఆంజనేయుడు స్వయంభువుగా వెలిశాడని చరిత్రకారులు చెబుతారు. కొండగట్టు అనే కొండమీద కొలువైన ఈ ఆంజనేయుడిని ‘కొండగట్టు అంజన్న’గా పిలుస్తారు.

హనుమత్‌ వ్రతం…

హనుమంతుడి పేరుతో హనుమత్‌ వ్రతం వ్యాప్తిలోకి వస్తుందని, ఈ వ్రతం చేసిన వారి పనులన్నీ ఆంజనేయుడే చేసి పెడతాడని బ్రహ్మదేవుడు హితవు పలికాడు. ఈ కథనంతా కూడా రాముడికి హనుమే స్వయంగా వివరించాడట. సీతాన్వేషణలో ఉన్న రాముడు సైతం పంపానది తీరంలో హనుమంతుడిని వేదిక మీద కూర్చోబెట్టి లక్ష్మణుడితో కలిసి ఈ వ్రతం ఆచరించాడట. ఫలితంగా సీతాన్వేషణ మొదలుకుని సీతారామ పట్టాభిషేకం వరకు మొత్తం కార్యాన్ని తన భుజాల మీద వేసుకుని నడిపిస్తాడు హనుమ. ఇదంతా మనకు విదితమే. కానీ తన యజమాని చేత పూజలందుకున్న ఏకైక బంటుగా ఆ హనుమయ్యకు ఎనలేని కీర్తి లభించింది. ఇంతటి మహిమాన్విత శక్తియుక్తులు కలిగిన స్వామిని మనసారా స్మరిస్తే బుద్ధి, కీర్తి, బలం, నిర్భయత్వం, అనారోగ్యం దూరమవ్వటం, వాక్పటుత్వం మొదలైన లక్షణాలు సంప్రాప్తిస్తాయని భక్తుల విశ్వాసం.

పూజ విధానం..

హనుమాన్ జయంతి రోజు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో హనుమాన్‌ను ఆలయంలో దర్శించుకుని, ఎర్రటి ప్రమిదల్లో జిల్లేడు వత్తులు, నువ్వులనూనెతో దీపం వెలిగించేవారికి ఆయుర్దాయం, సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెబుతారు. ఇంకా ఈరోజున హనుమంతుని ఆలయాల్లో ఆకుపూజ చేయించడం, హనుమాన్ కళ్యాణం జరిపేవారికి ఈతిబాధలు తొలగిపోతాయనేది విశ్వాసం. అలాగే ఇంట్లో పూజచేసే భక్తులు, పూజామందిరాన్ని శుభ్రం చేసుకుని పసుపు, కుంకుమలు, పుష్పాలతో అలంకరించుకోవాలి. ఎర్రటి అక్షతలు, ఎర్రటి పువ్వులను పూజకు సిద్ధం చేసుకోవాలి. పూజకు పంచముఖాంజనేయ ప్రతిమను లేదా ఫోటోను ఎర్రటి సింధూరం, ఎర్రటి పువ్వులతో అలంకరించుకోవాలి. నైవేద్యానికి బూరెలు, అప్పాలు, దానిమ్మ పండ్లు వంటి వాటిని సమర్పించవచ్చు.

Show More
Back to top button