జర్నలిజం అంటే ఓ గొప్ప బాధ్యత. జర్నలిస్టు అంటే వాస్తవాలను వెలిసి తీసి ప్రజల ముందుంచే దూత. జర్నలిజం అంటే అక్రమాలకు చెక్ పెట్టే వేదిక. అలాంటి పవిత్రమైన జర్నలిజం వృత్తి ప్రమాదకరంగానే కాకుండా ప్రాణాంతకంగా కూడా మారుతున్నది. జర్నలిస్టులపై హత్యాయత్నాలు, ఆన్‌లైన్ వేధింపులు, బెదిరింపులు, హింస, క్రమంగా పెరుగుతున్నాయి. జర్నలిస్టులపై జరిగిన బహిరంగ నేరాలకు సహితం శిక్షలు పడడం లేదు లేదా విచారణలు ఏండ్ల తరబడి కొనసాగుతూనే ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా 2006-24 మధ్య 1,700 జర్నలిస్టులు హత్య చేయబడ్డారు. వీరిలో 10 శాతం కేసులు కూడా శిక్షలు ఖరారు కాలేదు. నవంబర్ 2009లో ఫిలిప్పీన్స్‌కు చెందిన ‘మాగ్విందనావో లేదా అంపటువాన్ ఊచకోత’లో 32 మంది జర్నలిస్టులు/మీడియా కార్యకర్తలు హత్య చేయబడడం ఓ భయంకర రక్త చరిత్ర. 02 నవంబర్ 2013లో ఇద్దరు ఫ్రెంచ్ జర్నలిస్టులు కూడా హత్య చేయబడ్డారు. ఇలాంటి ఘటనలు ప్రపంచవ్యాప్తంగా ప్రతి రోజు జరుగుతూనే ఉన్నాయి.
జర్నలిస్టులు భద్రంగా పని చేస్తున్నారా !
జర్నలిస్టులపై జరిగుతున్న ఇలాంటి పలు భయానక విషయాలన్నింటినీ అధ్యయనం చేసిన ఐరాస 2013లో భావ ప్రకటనా స్వేచ్ఛకు పట్టం కడుతూ 02 నవంబర్‌న ప్రతి ఏటా “జర్నలిస్చులకు వ్యతిరేకంగా నేరాలకు శిక్షార్హతలను అంతం చేసే అంతర్జాతీయ దినం (ఇంటర్నేషనల్ డే టు ఎండ్ ఇంప్యూనిటీ ఫర్ క్రైమ్స్ అగెనెస్ట్ జర్నలిస్ట్స్)” పాటించుట ఆనవాయితీగా మారింది. ఈ ఏడాది 2024 థీమ్‌గా “సంక్షోభాలు, అత్యవసర పరిస్థితుల్లో జర్నలిస్టుల భద్రత” అనే అంశాన్ని తీసుకొని అవగాహన కల్పిస్తున్నారు.
2వ అతి పెద్ద ప్రింట్/ఎలక్ట్రానిక్ మీడియాగా భారతం:
1780లో “బెంగాల్ గెజిట్” అనబడే తొలి పత్రికను కొల్‌కతాలో ప్రారంభించారు. భారత్‌లో 500లకు పైగా శాటలైట్ చానెల్స్, 70,000లకు పైగా వార్తా పత్రికలు, 3 కోట్లకు పైగా కాపీల సర్కులేషన్లతో రెండవ అతి పెద్ద (చైనా తర్వాత) న్యూస్ పేపర్ మార్కెట్‌తో అనునిత్యం సమాచారాన్ని వితరణ చేసేతున్నారు. 2014 నుంచి నేటి వరకు భారత్‌లో 28 మంది వృత్తి నిబద్దత కలిగిన జర్నలిస్టుల హత్యలు నమోదు అయ్యాయి. పర్యావరణ/మైనింగ్/ఇసుక మాఫియా/అన్వేషణాత్మక కథనాలకు సంబంధ జర్నలిస్టులు అధికంగా అక్రమార్కుల చేతుల్లో పట్ట పగలే హత్యలకు గురి అవుతున్నారు.
జర్నలిస్టు పెన్నును నొక్కి పడితే అక్రమార్కుల ఆటలకు అంతు ఉండదు. ప్రపంచంలో ఏ మూల ఏ రహస్యం జరిగిన క్షణాల్లో జర్నలిస్టులు పసిగట్టి బహిర్గత పరచడం చూస్తున్నాం. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు అత్యంత సాహసంతో వాస్తవాలను కళ్ల ముందుంచడానికి ఎంతో శ్రమ పడతారు. దుర్మార్గుల మోసాలను పసిగట్టిన జర్నలిస్టులను హత్య చేయడానికి కూడా మాఫియా వెనకాడడం లేదు. 4వ ఎస్టేట్‌గా భావించబడే జర్నలిజం నేడు పలు సవాళ్లను ఎదుర్కొంటూ కొనసాగుతున్నది. నీతి నిజాయితీ, నైతికత కలిగిన సమాజ నిర్మాణానికి జర్నలిస్టులు ప్రధాన భూమికను నిర్వహిస్తున్నారు. ఇలాంటి విలేకరుల వృత్తి నిబద్దతకు సలాం చేస్తూ, వారిని ప్రోత్సహిద్దాం, సముచితంగా గౌరవిద్దాం.