Telugu News

తెలంగాణలో రహస్య జలపాతం అది

ఆకాశ గంగలా.. జాలువారే పాలనురుగలాంటి జల ధార -భారతదేశంలో ఎత్తైన జలపాతాలలో మూడవది

తెలంగాణ రాష్ట్రంలో రహస్య జలపాతంగా పేరు పొందిన జలపాతం ఒకటి ఉందని మీకు తెలుసా.. ఎన్నో ఏళ్లుగా ఉన్న ఈ జలపాతం నాలుగు సంవత్సరాల క్రితం నుండి ప్రజల్లో బాగా ప్రాచుర్యం పొందింది.  ఈ జలపాతం

భారతదేశంలో అత్యంత ఎత్తైన  జలపాతాలలో మూడవ జలపాతంగా నిలిచింది. అదే.. “ముత్యం ధార” వాటర్ ఫాల్.

దీన్ని గద్దెల సిరి, ముత్యాల ధార అని కూడా పిలుస్తారు. ఈ జలపాతం ఎక్కడుంది. దాని విశేషాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం..

తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన జలపాతం..

ఈ ముత్యం దార జలపాతం తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన జలపాతం. తెలుగు రాష్ట్రాల్లోని పర్యాటక ప్రాంతాల్లో ఇదొక స్వర్గధామం గా చెప్పుకోవచ్చు. దట్టమైన అటవీ మధ్యలో చుట్టూ పచ్చని చెట్లు ఎత్తైన కొండలు గుట్టలు, పక్షుల కిలకిలా రావాలు, నేలపై పారే సెలయేర్లు, ఆ కొండల మధ్యలో పాల పొంగు లాగా జాలువారే జలపాతం వింటుంటేనే వావ్.. అద్భుతం అనిపిస్తుంది కదూ.. అంతే కదా మరి.. చూస్తే ఇంకెంత పరవశించిపోతారో.. చెప్పాల్సిన అవసరం లేదు.

ఈ జలపాతం ఎక్కడుందంటే…

తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని వీరభద్రవరం గ్రామ సమీపంలో ఉన్నటువంటి దట్టమైన అడవిలో ఈ జలపాతం ఉంది. దీనిని రహస్య జలపాతం అని కూడా అంటారు. దట్టమైన అటవీ మధ్యలో ఎన్నో ఏళ్లుగా ఉన్నప్పటికీ ఇది గత కొంత కాలం నుండి ప్రజలకు తెలియడంతో.. ఇన్ని రోజులు రహస్యంగా ఉండడం వల్ల రహస్య జలపాతం అని అంటారు. ఎగువనున్న ఎత్తయిన కొండలను దాటుకొని పాలనరగలాంటి ఈ జలపాతం 10 కిలోమీటర్ల మేర ఈ జల ధార ప్రయాణిస్తుంది. ఈ అద్భుతమైన కనువిందు చేసే పాలధార లాంటి ఈ జలపాతాన్ని చూడడానికి నయనాలు సరిపోవు. దట్టమైన అడవుల్లోని సుమారు 700 అడుగుల ఎత్తు నుండి సాక్షాత్తు ఆకాశగంగ కిందికి దిగి వస్తున్నట్లుగా పాలపొంగు లాగా ఈ జలపాతం జాలువారుతుంటే పర్యాటకులు తన్మయత్వంతో .మైమరిచిపోతారు. అంత ఎత్తు నుండి నీటి ధార పడడంతో ఆ జల ధారలు ముత్యాల మెరుస్తూ ఉంటాయి. అందుకే దీనికి ముత్యం దారా అని పేరు. 

అయితే ఈ జలపాతాన్ని చూడాలన్న.. అక్కడికి చేరుకోవాలన్న కొంచెం కష్టపడాల్సిందే.

ముత్యం ధార ఎలా చేరుకోవాలంటే…

మొదటి మార్గం..

ముత్యం ద్వారా జలపాతాన్ని చేరుకోవాలంటే ప్రయాణికులు కష్టపడక తప్పదు. రెండు మార్గాల గుండా ఈ జలపాతాన్ని చేరుకోవచ్చు. ఈ జలపాతాన్ని చేరుకోవాలంటే దూర ప్రాంతం వారు ముందుగా వరంగల్ చేరుకొని అక్కడనుండి ములుగు జిల్లా చేరుకొని అక్కడనుండి  ఏటూరునాగారం చేరుకోవాలి. ముళ్ళ కట్ట వద్దనున్న గోదావరి నది బ్రిడ్జిని దాటుకుంటూ ప్రయాణిస్తే వెంకటాపురం వెళ్లే రహదారి కనిపిస్తుంది. ఆ విధంగా వెంకటాపురం మండల కేంద్రానికి చేరుకోవాలిన్ అక్కడ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో వీరభద్రవరం గ్రామానికి చేరుకోవాలి. వీరభద్రవరం నుంచి జలపాతాన్ని చేరుకోవాలంటే దట్టమైన అడవుల్లో ప్రయాణించాలి. వీరభద్రవరం చేరుకున్న తర్వాత అక్కడ ప్రయాణికులు నడుస్తూ వెళ్లి జలపాతాన్ని చూడొచ్చు. నడవలేము అనుకున్న వారికి అక్కడి గ్రామస్తులు ట్రాక్టర్ సదుపాయాన్ని కల్పిస్తారు.

వీరభద్రవరం నుంచి దాదాపు 8 కిలోమీటర్ల దూరంలో ఈ జలపాతం ఉంటుంది. ద్విచక్ర వాహనాల ద్వారా కూడా జలపాతం వద్దకు చేరుకోవచ్చు. కాలినడకన వెళ్లేవారు దాదాపు 8 కిలోమీటర్లు ఆ దట్టమైన అడవి గుండా వెళ్లాల్సి ఉంటుంది. అదే ట్రాక్టర్ ద్వారా వెళ్లాలి అనుకునేవారు ట్రాక్టరు ఒక ఆరు కిలోమీటర్ల వరకు మాత్రమే తీసుకెళుతుంది. అక్కడ నుంచి రెండు కిలోమీటర్లు నడిచి జలపాతం వద్దకు చేరుకోవచ్చు. అక్కడ కేవలం జలపాతాన్ని చూడ్డానికి వచ్చే సందర్శకుల కోసం గ్రామస్తులు ట్రాక్టర్లను ఏర్పాటు చేస్తారు. ఈ విధంగా ట్రాక్టర్ ద్వారా జలపాతాన్ని చూసే పర్యాటకుల నుంచి యజమానులు మనిషికి 500 నుండి 1000 చొప్పున చార్జీలు వసూలు చేస్తారు. 

మరో మార్గం…

ముత్యం దార జలపాతాన్ని చేరుకోవాలనుకుంటే మరో మార్గం కూడా ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం వ్ఛత్తీస్గడ్ రాష్ట్రానికి సరిహద్దు ప్రాంతం. ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన భద్రాచలం నుండి కూడా ముత్యం దారా జలపాతాన్ని చేరుకోవచ్చు.ఎక్కువగా ఆంధ్ర నుండి వచ్చే పర్యాటకులు భద్రాచలం మీదుగా ఈ జలపాతాన్ని చూడడానికి వెళతారు. భద్రాచలం పట్టణానికి చేరుకొని అక్కడ నుంచి దుమ్ముగూడెం మండలం, చర్ల మండలం మీదుగా వెంకటాపురం మండలానికి చేరుకోవచ్చు. వెంకటాపురం నుండి వీరభద్రవరం ద్వారా ట్రాక్టర్ల సౌకర్యంతో జలపాతాన్ని చేరుకోవచ్చు ఈ విధంగా భద్రాచలం మీదుగా వచ్చే పర్యాటకులు ముత్యం ద్వారా జలపాతాన్ని సందర్శిస్తారు.

నడిచి వెళ్లడానికి ఆసక్తి చూపుతున్న యువత…

ఫ్రెండ్స్ తో  వచ్చే యువత ఎక్కువగా కాలినడకన జలపాతాన్ని చేరుకోడానికే ఆసక్తి చూపుతారు. మధ్య మధ్యలో ఆగుతూ కొద్దిసేపు నడుస్తూ సరదాగా జలపాతం వద్దకు చేరుకోవడానికి ఇష్టపడతారు. అయితే నడవడం అలవాటు లేని వారు మాత్రం సాహసం చేయకుండా ఉంటేనే బెటర్. ఎందుకంటే అటవీ ప్రాంతంలో నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. విష సర్పాలు సైతం దర్శనం ఇస్తాయి. అదేవిధంగా రహదారి రాళ్లు బురదమయంగా ఉంటుంది. కాబట్టి నడుచుకుంటూ వెళ్లినప్పుడు జాగ్రత్తలను పాటించాలి. నడిచి వెళ్లాలి అనుకునేవారు కొంత దూరం నడిచాక ఇంకా మేము రాలేము అంటే ఎవరు సహాయం చేయరు. ట్రాక్టర్ నడిపే వారు కూడా మొదటి నుంచి ప్రయాణం చేసిన వారిని మాత్రమే తీసుకువెళ్తారు. మధ్యలో ఎక్కించుకోరు. ట్రెక్కింగ్ ప్రియులకు ఈ ప్రాంతం ఎంతో అమితంగా నచ్చుతుంది.

స్టే చేయాలంటే…

దూర ప్రాంతాల నుండి వచ్చే వారికోసం ఇక్కడ స్టే చేయాలంటే  హరిత రిసార్ట్స్ మాత్రమే. చిన్నచిన్న హోటల్స్ ఉంటాయి. కానీ రెస్టారెంట్స్ అలాంటివి మాత్రం ఇక్కడ ఉండడం చాలా కష్టం. చిరుత ఇల్లు అందుబాటులో ఉంటాయి కానీ ఫుడ్డు విషయంలో కష్టపడాల్సిందే. అందుకే దూర ప్రాంతాల నుండి వచ్చేవారు కొందరు ముందుగానే రైస్ ప్రిపేర్ చేసుకొని తీసుకువస్తారు.

తెలంగాణ టూరిజం శాఖ గుర్తించినట్లయితే…

దట్టమైన అడవుల్లో సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ అందమైన జలపాతం పచ్చదనానికి చిరునామాగా మారింది. అయితే దీనిని పర్యాటక ప్రాంతంగా తెలంగాణ టూరిజం శాఖ అభివృద్ధి చేసినట్లయితే ఈ జలపాతం మరింతగా ప్రాచుర్యం పొందుతుంది. పర్యాటకుల సంఖ్య కూడా పెరుగుతుంది. వర్షాకాలం మొదలైంది అంటే వందలాది మంది పర్యాటకులు ఈ జలపాతాన్ని సందర్శించడానికి వస్తూ ఉంటారు. ఈ విషయాన్ని తెలంగాణ టూరిజం శాఖ గుర్తించి  పర్యాటకుల కోసం తగు సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లయితే తెలంగాణ టూరిజం మరొక అద్భుతమైన పర్యటకాన్ని సొంతం చేసుకున్నట్లే. 

ఆ జలపాతం కొండపైన మనుషులు ఉన్నారట..

ఈ జలపాతం వెనుక ఓ చరిత్ర దాగి ఉంది. ఆదిమానవుల కాలంలో ఈ జలపాతాన్ని వారు ఆధారంగా చేసుకుని జీవించే వారట. అయితే ఆ కొండపై ఇప్పటికి ఆదివాసి జాతికి చెందిన కొందరు మనుషులు జీవిస్తున్నారని, వారికి తెలుగు రాదని అక్కడి స్థానికులు చెబుతున్నారు. సంవత్సరంలో రెండుసార్లు వారు ఎవరూ లేని సమయంలో కిందకు దిగివచ్చి వారికి కావలసిన వస్తువులను తీసుకువెళతారని చెబుతున్నారు. ఆ కొండపైనే వారు ప్రాచీన పద్ధతుల్లో వ్యవసాయం చేసుకుని బ్రతుకుతున్నారని చెబుతున్నారు. అక్కడ జీవించే మనుషులు విచిత్ర వేషధారణతో ఉంటారని ఆ కొండ నుంచే దిగివచ్చి ఆ కొండమీది నుంచి ఎక్కి పైకి వెళతారని స్థానికులు చెబుతున్నారు. వారు ఎవరికి ఎటువంటి హాని తలపెట్టరని అన్నారు. ఇంత అద్భుతమైన, ప్రకృతి సహజ సిద్ధమైన జలపాతం గురించి తెలుసుకున్నాం కదా.. మరి

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా త్వరగా ఈ జలపాతాన్ని చూసేయండి.

Show More
Back to top button