
శ్రీమహావిష్ణువు ఎత్తిన పది అవతారాల్లో ఏడవ అవతారమే ఈ శ్రీ రామావతారం..
రాముడు ధైర్యవంతుడు, సత్యవంతుడు, సర్వ సమర్థుడు..
క్రోధాన్ని జయించినవాడు, సకల ప్రాణుల శ్రేయస్సూ కోరినవాడు.
నిజానికి రాముడి ఔన్నత్యం, నిబద్ధతల వల్ల తను, తనవాళ్లు ఇబ్బంది పడ్డారే తప్ప తనను నమ్మిన ప్రజలు మాత్రం ఏనాడూ తలదించుకుని జీవించలేదు.
ఆ రకంగా కొడుకుగా, భర్తగా, తండ్రిగా తను ధర్మం తప్పలేదు, తనవారిని తప్పనివ్వలేదు.
అటువంటి రామయ్య.. చైత్ర శుద్ధ నవమినాడు జన్మించాడు అందువల్లే.. ప్రతి ఏటా ఈరోజున శ్రీరామనవమిగా జరుపుకుంటున్నాం.
శ్రీ మహావిష్ణువు ఏడో అవతారమైన శ్రీరాముడు.. అయోధ్యలో మానవ రూపంలో అవతరించిన రోజే రామనవమిగా భావిస్తాం.
చైత్ర మాసంలో ఉగాది తర్వాత సరిగా ఎనిమిది రోజులకు నవమి రోజున రాముడు పుట్టినరోజు.. ఆయన పెళ్లి కూడా ఇదే రోజున జరగడం విశేషం! అందుకే దేశమంతటా కొలువై ఉన్న రామాలయాల్లో శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణ ఉత్సవాలు విశేషంగా జరిపిస్తారు.
రాముడ్ని విష్ణువు అర్ధ అంశగా పురాణాలు చెబుతున్నాయి. విష్ణువులోని సగానికి పైగా దైవిక లక్షణాలు రాముడిలో ఉంటాయి.
‘రామ’ అంటే దివ్యమైన ఆనందం..
ఇతరులకు ఆనందాన్నిచ్చేవాడని అర్థం.
ఆయన స్వతహాగా కరుణ, సౌమ్యత, దయ, నీతి, చిత్తశుద్ధి స్వభావాలనేవి జన్మతా కలిగిన సుగుణాభి రాముడు..
ఆయన అవతరించిన రోజు వల్లే రుషులు సైతం పురుషోత్తముడిగా కీర్తిస్తుంటారు.
రామాయణం ఒక గొప్ప ఇతిహాసం!
శ్రీరాముడు జన్మించిన రోజున శ్రీరాముని జయంతి జరపడం వేరు.. అలాంటిది ఈరోజున సీతారాముల కళ్యాణం జరపడం గొప్ప విశేషం కదూ!
శ్రీరాముని పుట్టుకకు గల కారణం రావణ వధ..
లోకకళ్యాణం కోసం సీతాదేవితో ముడిపడిన కారణంగా ఈరోజున వివాహం జరిపించడం ఆనవాయితీగా వస్తోంది.
ఈరోజున రాముల వారి కళ్యాణ కార్యక్రమాలు అన్ని కూడా మధ్యాహ్నం 12 గంటలకు చేయాలని పురాణ వ్రత గ్రంథాలు మనకు చెబుతున్నాయి. మిరియాల పొడి వేసిన బెల్లం పానకం, వడపప్పు ఈరోజున స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు.
రాముని జనన వృత్తాంతం..
పూర్వం అయోధ్యను పాలిస్తున్న దశరథ మహారాజుకు వారసులు లేరు. సంతానం కోసం ఒక విశేష యాగం చేయాలి అని అభీష్టించాడు. రుషి రుష్యశృంగుడు చేత ఈ యాగం జరిగింది. ఈ సమయంలోనే లంకా రాజు అయిన రావణుడు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. ఎవరినీ లెక్క చేయకుండా అందర్నీ ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. కారణం.. దేవతలు, గంధర్వులు, రాక్షసుల చేతిలో తనకు చావు ఉండకూడదని.. బ్రహ్మదేవుడి నుంచి ఒక వరం పొందడమే..
అందువల్లే ఎవరూ… ఏమీ చేయలేరనే గర్వం పెరిగిపోయింది రావణుడిలో…
ఇది తెలిసి.. ‘రావణుడికి చావు ఎలా వస్తుందో చెప్పమని’ దేవీదేవతలు వేడుకున్నారు. అప్పుడు బ్రహ్మ… ‘రావణుడు ఒక మనిషి చేతిలోనే చనిపోతాడ’ని హితవు పలుకుతాడు.
అప్పుడు దేవతలు విష్ణువు దగ్గరకు వెళ్లి ‘దశరథ మహారాజు కొడుకుగా పుట్టి, రావణుడ్ని చంపాలని’ కోరతారు.
దాంతో దశరథుడి యాగం ఫలించి.. కొన్నాళ్లకు దశరథుడి భార్యల్లోని కౌసల్యకు రాముడు, కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణ శత్రఘ్నులు జన్మిస్తారు. అలా రాముడు పుట్టిన రోజుని ‘రామనవమి’గా మనం భావిస్తున్నాం.
కన్నుల పండువగా కల్యాణ వేడుకలు…
చైత్ర మాస శుక్ల పక్ష నవమి శ్రీరామనవమి. విష్ణుమూర్తి అవతారమైన శ్రీరాముడు పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం పన్నెండు గంటల వేళ జన్మించాడు. దీన్ని అభిజీత్ ముహూర్తంగా పిలుస్తారు.
హిందూవుల పండుగల్లో శ్రీరామనవమి ముఖ్యమైంది. శ్రీరామనవమి అంటే శ్రీరాముడి జన్మదినం, కళ్యాణం కూడా!
పురాణాలననుసరించి రాముడు త్రేతాయుగంలో పుట్టాడు. జ్యోతిష్య పండితులు పరిశోధనలు జరిపి శ్రీరాముడు క్రీ. పూ. 5,114, జనవరి 10న జన్మించి ఉండవచ్చని అంచనా వేశారు.
దశరథ మహారాజు, కౌసల్యల నందనుడు శ్రీరామచంద్రుడు. భరతునికి పట్టాభిషేకం జరగాలంటే శ్రీరాముడు రాజ్యంలో ఉండకూడదని తలచింది కైకేయి. అందుకే ఆమె రాముడ్ని 14 సంవత్సరాలపాటు అడవులకు పంపమని, దశరథుడ్ని కోరింది.
తండ్రికోసం ఆ ఆజ్ఞను అక్షరాలా పాటించి అరణ్యవాసం చేశాడు శ్రీరాముడు.
ఆయనతోపాటు లక్ష్మణుడు, సీతమ్మవారు అరణ్యవాసం చేశారు. రామబంటుగా పిలువబడే హనుమంతుడు కూడా నిరంతరం రాముడి వెన్నంటి ఉన్నాడు. తన హృదయంలో శ్రీరాముడ్ని ప్రతిష్టించుకున్నాడు.
పితృవాక్య పరిపాలకుడు.. ఏకపత్నీవ్రతుడు అయిన శ్రీరాముడ్ని ఎంత కీర్తించినా తక్కువే.
‘రామ’ పదానికి ఉన్న శక్తి అనంతం.
రామ నామం జపిస్తే చాలు ఇష్టార్ధసిద్ధి ప్రాప్తిస్తుంది. రామాయణాన్ని పారాయణం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది. రామనామం పరమ పవిత్రమైంది. రామనామ స్మరణతో చేసిన పాపాలు హరిస్తాయి. సర్వ సౌఖ్యాలూ కలుగుతాయి. మనసుకు ప్రశాంతత చేకూరుతుంది.
శ్రీరామనవమి పర్వదినాన మనసా వాచా కర్మణా శ్రీరాముని ఆరాధించి పుణ్యం సంపాదించుకుందాం.
కొందరు శ్రీరామనవమిని దసరా నవరాత్రులలా తొమ్మిదిరోజులపాటు నిర్వహిస్తారు. అనేక రామాలయాల్లో శ్రీరామనవమి నవరాత్రులు ఉత్సవాలు జరుపుతారు అందువల్లే ఈ పండుగను ‘శ్రీరామ నవరాత్రి’ అని కూడా అంటారు. కొందరు చైత్ర శుక్లపక్ష నవమి నాడు మాత్రమే వేడుక చేస్తారు. శ్రీరామనవమిని పురస్కరించుకుని అనేక ప్రాంతాల్లో హోలీని తలపించే వసంతోత్సవం జరుపుతారు. సాయంత్రం జరిగే ఉత్సవంలో పరస్పరం రంగునీళ్లు పోసుకుంటారు. ఈరోజున రథయాత్ర నిర్వహిస్తారు. రామ భక్తులు శ్రీరామనవమి రోజున ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఉండలేనివారు పానకం, పండ్లు సేవిస్తారు.
రామనవమి రోజున ఆలయాలను ఎంతో ఘనంగా అలంకరిస్తారు. వేదమంత్రాలతో పునీతమైన దేవాలయాలు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన భక్తులతో ఆరోజున కిటకిటలాడతాయి. శ్రీరాముడు మధ్యాహ్నం పుట్టినందున ఆ సమయానికే సీతారాముల కళ్యాణం చేస్తారు.
మన తెలుగు రాష్ట్రాల్లో.. భద్రాచలంలో సీతారాముల కళ్యాణం మహావైభవంగా జరుగుతుంది. ‘సీతారాముల కల్యాణం’ చూసి పరవశించేందుకు వేల సంఖ్యలో భక్తులు తరలివెళ్తారు. కల్యాణం ముగిసిన తర్వాత భక్తజన సందోహం అనుసరించి రాగా ఉత్సవమూర్తులను వీధుల్లో ఊరేగిస్తారు. కొన్ని దేవాలయాల్లో సీతారామ, లక్ష్మణ, హనుమంతుడి ఉత్సవ విగ్రహాలను ఊరేగిస్తారు. శ్రీరాముడి భక్తిగీతాలు, భజనలతో ఆలయాలు దివ్యత్వాన్ని సంతరించుకుంటాయి. అడుగడుగునా రామనామం వినిపిస్తూ చెవుల్లో అమృతం పోసినట్టుగా ఉంటుంది. రామనవమి సందర్భంగా సీతారామలక్ష్మణులతోపాటు రామభక్త హనుమంతుడ్ని కూడా ఆరాధిస్తారు.