
ప్రతి ఒక్కరు లైఫ్‌లో ఏదోఒకటి సాధించాలని అనుకుంటారు. కానీ దారిలో ఏవో చిన్న చిన్న సమస్యల వల్ల అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోతుంటారు. అయితే, కొందరు మాత్రం ఎన్ని కష్టాలు వచ్చినా.. అనుకున్నది సాధించేవరకు వెనుతిరగరు. అలాంటి వారిలో ఒకరే… ఒడిశాలోని అనుగుల్ జిల్లాలోని తాల్‌చేర్‌కు చెందిన అనిమేశ్ ప్రధాన్ అనే వ్యక్తి. ఇటీవల విడుదలైన సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో విజయం సాధించి దేశవ్యాప్తంగా రెండో ర్యాంకు సాధించారు.
అయితే, ఆయన ఆ లక్ష్యాన్ని చేరుకునే సమయంలో జీవితంలో ఊహించని విధంగా ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. ఒక వైపు నాన్న మరణం.. సరిగ్గా సివిల్స్ ఇంటర్వ్యూ సమయంలోనే తల్లి క్యాన్సర్‌తో పోరాడుతూ చనిపోయారట. ఇలాంటి క్లిష్టమైన సమయంలోనే తనలోని బాధను దిగమింగి.. సివిల్స్ ఇంటర్వ్యూకు హాజరయ్యానని అనిమేశ్ పలు ఇంటర్వ్యూల్లో తెలిపారు.
అభ్యర్థులకు అనిమేశ్ ఇచ్చే సలహాలు
ప్రస్తుత ఈ పోటీ ప్రపంచంలో ఏదైనా లక్ష్యాన్నిపెట్టుకుని మామూలుగా ప్రయత్నిస్తే.. ఎప్పటికీ విజయం సాధించ లేరు. కానీ అదే దృఢ సంకల్పంతో ప్రయత్నిస్తే మాత్రం తప్పక విజయం సాధిస్తారు. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ అనేవి కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి వాటిని నిత్యం గమనిస్తూనే ఉండాలి. దీంతోపాటు తరచూ మాక్ టెస్టులు రాయడం చేస్తుండాలి.
అప్పుడే మన ప్రిపరేషన్‌లో ఉన్న లోపాలు తెలుస్తాయి. ముందుగా కష్టంగా ఉన్న సబ్జెక్ట్స్ ప్రిపేర్ కావాలి. అయితే ఈ ప్రిపరేషన్‌లో వచ్చే కష్టాల వల్ల.. ఎందుకు ఈ చదువులు అనిపిస్తాయి. అయినా కూడా ఎక్కడా తగ్గకుండ ముందుకు సాగాలి అప్పుడే విజయం సాధిస్తాము.