భిన్నత్వంలో ఏకత్వం సువిశాల సుందర భారత జన నందన వనం. ప్రాంతాలు, భాషలు, సంస్కృతులు, సాంప్రదాయాలు వేరైనా నా భరతమాత కంఠాన చేరిన పలు పుష్పాలు ఏరి కూర్చిన అలంకరించిన సుగంధ మాల. ఇక్కడి వైవిధ్యత స్వదేశీయులకు గర్వకారణం, విదేశీయులకు ఈర్ష్యాజనకం. ఆధునిక పాశ్చాత్య సమాజం ప్రతి ఏట ఘనంగా జరుపుకునే 2025 నూతన సంవత్సర వేడుకలు నేడు ప్రపంచవ్యాప్తంగా బహుళ ప్రచారంలోకి రావడం, భారతీయులు కూడా ఈ వేడుకలను ఉత్సాహంగా నిర్వహించుకోవడం చూస్తున్నాం.
1582లో రోమన్ క్యాథలిక్ చర్చ్ ‘పోప్ గ్రిగోరీ’ స్థాపించిన గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏట 31 డిసెంబర్, 01 జనవరి రోజుల్లో గడిచిన 2024 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, రానున్న 2025 నూతన సంవత్సరానికి ఆహ్వానం తెలుపుతూ వయోభేదం లేకుండా పిల్లలు, పెద్దలు అందరూ కలిసి ఆ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది. నూతన సంవత్సర దినం రోజు ప్రభుత్వ సెలవు కానప్పటికీ ఇండియాలో ఆపాలగోపాలం 31 డిసెంబర్ రాత్రి నుంచి 01 జనవరి వరకు ఉత్సవాలు, పార్టీలు, సినిమాలు చూడడం, టివీ కార్యక్రమాలను తిలకించడం, కేకులు కట్ చేయడం, రెస్టరెంట్లు/రిసార్టుల్లో గడపడం, నూతన వస్త్రాలు ధరించడం, దేవాలయాలు/చర్చిలకు వెళ్లడం, నూతన సంవత్సర వేళ పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకోవడం లాంటివి సర్వసాధారణంగా జరుగుతుంటాయి.
సువిశాల భారతంలో వివిధ వైవిధ్యభరిత నూతన సంతవత్సర వేడుకలు:
భారత దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, ప్రాంతాలు, సాంప్రదాయాలు, భాషల 1.42 బిలియన్ల జనులు చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం తమ తమ నూతన సంవత్సర పండుగలను పంటలు కోసే సీజన్‌లో నిర్వహించుకోవడం అనాదిగా ఆనవాయితీగా వస్తున్నది. తెలుగు, కన్నడ ప్రజలు నూతన సంవత్సర వేడుకలను “ఉగాది పండుగ” రూపంలో జరుపుకుంటున్నారు. అదే విధంగా పంజాబీలు “బైసాకీ పండుగ”ను, గుజరాతీలు “బెస్తు వరస్ పండుగ”ను, బీహార్/ఝార్ఖండ్‌లో “జూడె శీతల్”ను, ఈశాన్య రాష్ట్రాలు “బోహగ్ బిహూ పండుగ”ను, మహారాష్ట్రలో “గుడి పడ్వా పండుగ”ను, సింధీలు “చెట్టీ ఛాంద్ పండుగ”ను, కాశ్మీరీ హిందువులు “నవ తేజ్ పండుగ”ను, పార్సీలు “జెమ్షేడీ నవ్రోజి పండుగ”ను, కేరళలో “విషు పండుగ”ను, తమిళనాడులో “పుతండు పండుగ”ను, ఒడిసాలో “పాన సంక్రాంతి పండుగ”ను, అస్సాంలో “బోహగ్ బిహూ పండుగ”ను, ముస్లిమ్‌లు హిజ్రీ క్యాలెండర్ ప్రకారం తమ తమ నూతన సంవత్సర పండుగలను ఘనంగా నిర్వహించుకుంటారు. ఈ కొత్త సంవత్సర వేడుకలతో పాటు ‘గ్రిగోరియన్ క్యాలెండర్’ ప్రకారం 01 జనవరి రోజున కూడా “న్యూ ఇయర్ డే” వేడుకలను ఘనంగా జరుపుకోవడం విశేషం.
2024 సింహావలోకనం – 2025లో చేపట్టవలసిన సత్కార్యాల తీర్మానాలు చేసుకుందాం:
భారత దేశవ్యాప్తంగా గ్రామాల నుండి మహానగరాల వరకు నూతన సంవత్సర వేడుకలను 31 రాత్రి నుంచి 01 జనవరి వరకు నిర్వహించుకోవడం, ఏటేటా ఈ సంస్కృతి పెరిగి పోవడం, పలు సందర్భాల్లో పరిధిలో దాటడం గమనిస్తున్నాం. మనకే స్వంతమైన నూతన సంవత్సర వేడుకల నిర్వహణను నిర్లక్ష్యం చేయకుండా వాటిని ఘనంగా జరుపుకుంటూనే 01 జనవరి “న్యూ ఇయర్ వేడుక”లను కూడా జరుపుకుందాం. 2024లో మనం సాధించిన ప్రగతిని గుర్తు చేసుకుంటూ, 2024 వైఫల్యాల నుంచి గుణపాఠాలు నేర్చుకుంటూ, 2025లో మనం చేపట్టవలసిన కార్యాలను నిర్ణయించుకొని, సాఫల్య సిద్ధికి సకల శక్తియుక్తులను ఒడ్డి ప్రతి ఏటా ఆశించిన స్థాయిలో ముందడుగు వేద్దాం, మనం ఎదుగుతూ మన దేశాభివృద్ధికి ఊతం ఇద్దాం.
పెరుగుతన్న పాశ్చాత్య వింత పోకడలు:
“పొరుగింటి పుల్ల కూర రుచి”గానే ఉంటుందని, “ఘర్‌కా మర్గీ దాల్ కీ బరాబర్” అవుతున్నదని గమనించి మన సంస్కృతులను కాపాడుకుంటూనే ఇతరుల వేడుకల్లో సహితం పాల్గొందాం. మన మహానగరాలు ఢిల్లీ, ముంబాయి, కోల్‌కతా, చెన్నై, బెంగుళూరు, హైదరాబాదు లాంటి నగరాల వీధులు 31 డిసెంబర్ రాత్రి యువతతో నిండి పోవడం, బాణాసంచా కాల్చుతూ సంబరాలు చేసుకోవడం, పిచ్చి ముదిరి అతిగా ఆల్కహాల్ సేవించి వాహనాలు నడపడం లేదా నడి వీధుల్లో వికారమైన నృత్యాలు చేయడం, పబ్బుల్లో గబ్బు పనులు చేయడం లాంటి విపరీతాలను చూస్తున్నాం.
పర్వదినాలు, వేడుకలు ఆరోగ్యకరమైన వాతావరణంలో జరుపుకోవాలని, ఇతరులు అసహ్యించుకునే దుస్థితిలోకి జారవద్దని గమనిద్దాం. మన ప్రవర్తన మన వారినే ఇబ్బంది పెట్టే విధం ఉండకూడదని గమనిద్దాం.