
ఆకలి రక్కసి కబంధ హస్తాల్లోంచి స్వేచ్ఛను సాధించడమే ఇప్పుడు మన ప్రధాన కర్తవ్యం’ భారత తొలి ఆహార, వ్యవసాయ శాఖా మంత్రి’ బాబూ రాజేంద్రప్రసాద్ 1947 ఆగస్టు 15న జాతికి ఇచ్చిన పిలుపు. కానీ స్వాతంత్య్ర అమృత మహోత్సవాలు జరుపుకొంటున్న దేశం ఆకలి దారిద్య్రం నుంచి విముక్తి పొందలేక పోయింది. ఐర్లాండ్‌కు చెందిన కంసర్న్ వరల్డ్ వైడ్, జర్మనీకి చెందిన వెల్త్ హంగర్ లైఫ్ సంస్థలు ప్రపంచ వ్యాప్తంగా 127 దేశాల్లో చేసిన అధ్యయనం ఆధారంగా వెలువరించిన 19వ ప్రపంచ ఆకలి సూచీ-2024లో భారత్ 105వ స్థానంలో ఉంది.
ప్రపంచవ్యాప్తంగా 36 దేశాలు మాత్రమే ఆందోళనకర విభాగంలో ఉండగా అందులో మన దేశం కూడా ఉన్నది. గత రెండు దశాబ్దాలుగా పరిస్థితిలో కొంత మెరుగుదల కనిపిస్తున్నప్పటికీ ఇంకా భారత్‌లో ఆకలికేకలు తగ్గడం లేదని ఈ సూచీలో స్పష్టమైంది. 2030 నాటికి దుర్భర పేదరికాన్ని నిర్మూలించాలన్న లక్ష్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించకపోతే ఈ లక్ష్యాన్ని చేరుకోవడం కష్టసాధ్యమని నివేదిక వెల్లడించింది. ఈ పరిస్థితి ఇలాగే సాగితే మరికొన్ని శతాబ్దాలు పట్టే అవకాశం ఉందని తెలిపింది.
దాదాపు ఎనిమిది దశాబ్దాల స్వపరిపాలన,అనేక పంచవర్ష ప్రణాళికలూ, వివిధ సంక్షేమ పథకాల తర్వాత మనం ఎక్కడున్నాం? ప్రపంచ దేశాలన్నింటిలో మనమే ప్రబలమైన ఆర్థికశక్తిగా ఎదగబోతున్నామనీ సగర్వంగా చాటుకుంటున్న పాలకులు మనల్ని ఆత్మవంచనకు గురిచేస్తున్నాయా? సమాజంలోని ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన సమయమిది.
ఆధునిక ప్రపంచంలో అవకాశాలను అందిపుచ్చుకోవటంలో సగటుజీవికి ఆకలి,పేదరికం అడుగడుగునా అడ్డుపడుతున్నాయి. ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న సామాజిక సమస్యలలో ఇవి ప్రధానమైనవి.ఇవి మానవాళి మనుగడకే పెనుసవాళ్లు విసురుతున్నాయి. ఈ సమస్య కోట్లాది మంది ప్రజలను కనీస అవసరాలకు దూరం చేస్తోంది. పేదరికాన్ని 2030 నాటికి అంతం చేయాలని ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో పేర్కొన్నప్పటికీ నేడు అది నేరవేరే ఆనవాలు కనిపించడం లేదు.
ఆర్థిక సంక్షోభంలో కూరుకు పోయిన శ్రీలంక,అంతర్గత సంక్షోభాలను ఎదుర్కొంటున్నబంగ్లాదేశ్,మయన్మార్‌తో పాటు నేపాల్ లాంటి మన పొరుగు దేశాలు ఈ సూచీలో భారత్‌కంటే మెరుగైన స్థానంలో ఉన్నాయి. ఈ సూచీలో భారత్‌ను 29.3 స్కోర్‌తో ఆందోళనకర విభాగంలో చేర్చారు. ప్రపంచవ్యాప్తంగా 36 దేశాలు మాత్రమే ఆందోళనకర విభాగంలో ఉండగా ఇందులో భారత్ ఒకటి.
అయితే అశాస్త్రీయ విధానాల్లో అధ్యయనం ద్వారా క్షేత్రస్థాయి వాస్తవాలకు ఆ నివేదిక అద్దం పట్టడం లేదని కేంద్ర ప్రభుత్వం కొట్టిపారేస్తుంది. ప్రజల్లో పోషక విలువలను ఇనుమడింప జేస్తూ, వారి జీవన ప్రమాణాల వృద్ధికి బాటలు పరవడం పాలకుల విధి. ఆ మేరకు దిశానిర్దేశం చేస్తున్న 47వ రాజ్యాంగ అధికరణ స్ఫూర్తికి మన్నన దక్కితేనే అన్నమో రామచంద్రా అంటూ అలమటిస్తున్న అభాగ్యులకు సాంత్వన లభించి, ప్రజారోగ్యం మెరుగుపడుతుంది.
జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ఆసేతు హిమాచలం 80 కోట్ల మందికి పైగా క్రమం తప్పకుండా ఆహారధాన్యాలు చేరుతున్నట్లు సర్కారీ లెక్కలు సాక్ష్యమిస్తున్నాయి. అన్నార్తులకు అంతచక్కగా తోడ్పాటు, మానవీయ సహాయం లభిస్తుంటే దేశంలో ఇంకా ఆకలిచావులు ఎందుకు సంభవిస్తున్నాయి?
ప్రజాపంపిణీ వ్యవస్థలోని లోపాలతో లబ్ధిదారులకు చేరాల్సిన ఆహారధాన్యాలు పక్కదారి పడుతున్నాయని పార్లమెంటరీ స్థాయీ సంఘం ఇటీవల ఆక్షేపించింది. ఎఫ్‌సిఐ గోదాముల్లో గడచిన మూడేళ్లలో 10వేల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యపురాశులు పాడైపోవడాన్నీ అది ఎత్తిచూపింది.పస్తులతో జనం అల్లాడుతున్న దేశంలో తిండిగింజల వృధాను అరికట్టడానికి ప్రభుత్వం శ్రద్ధ వహించడం లేదని విమర్శించింది. సామాజిక భద్రతా కార్యక్రమాలు,గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ రంగాలపై 2030 వరకు ఏడాదికి 5.5 లక్షల కోట్ల రూపాయల చొప్పున భారతదేశం వెచ్చిస్తేనే ఆకలి కోరల్లోంచి బయట పడగలుగుతుందని ఐరాస గతంలో సూచిం చింది.
ఒక దేశంలో తక్కువ ఆదాయం, నిరుద్యోగం,అధిక జనాభా, వ్యవసాయం ప్రధానంగా ఉన్న ఆర్థిక వ్యవస్థ,ఆర్థిక అసమానతలు, వనరుల అల్ప వినియోగం, అల్ప వేతనాలు,పౌర భాగస్వామ్యం లోపం,సంక్షేమ పథకాల వైఫల్యం లాంటి అంశాలు ఇప్పటివరకు పేదరికానికి ప్రధాన కారణమని దారిద్య్రరేఖను నిర్వచించిన ఆర్థికవేత్తలు పేర్కొన్నారు.
భారత్‌లో మెజార్టీ మధ్య తరగతి కుటుంబాల్లో ఇంటి పెద్ద సంపాదనే కుటుంబ సభ్యులందరికీ ఆహార సముపార్జనకు సాధనం. ఆయనే ఉపాధి కోల్పోవడంతో పేదలతో పాటు మధ్య తరగతి కుటుంబాలు సైతం ప్రభుత్వ రేషన్ బియ్యంతో కాలం గడిపే పరిస్థితి వచ్చింది.చాలా కుటుంబాలు ఆకలి, అర్ధాకలితో పోషకాహార లోపం, ఆరోగ్య సమస్యలతో రోడ్డున పడ్డారు.ఇది వారి ఆహార, ఆరోగ్య సంరక్షణపై తీవ్ర ప్రభావం చూపింది.
భారత్‌లో ఆకలి కేకలకు ఆకలి సూచీ చెప్పిన కారణాలను చూస్తే భారత్‌లో ఆహార వినియోగంపై ఆధ్యాత్మిక ప్రభావం ఎక్కువగా ఉంది. కొన్ని ఆహార పదార్థాలపై నిషేధం ఉన్నది.బాలింతలు, గర్భిణులకు సరైన ఆహారం అందడం లేదు. పౌష్టికాహారం అందించడంలో కేరళ మినహా ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ఆహార సముపార్జన మరింత ఖరీదైపోయింది. ప్రాణాధార ఆహారాలపై పన్నుల ప్రభావం పడుతోంది.షెడ్యూల్డ్ కులాలు తీసుకునే ఆహారంపై నియంత్రణ,కొన్ని ప్రాంతాల్లో నిషేధం కూడా కొనసాగుతున్నది.
ప్రపంచాన్ని అభివృద్ధి పథంలో నడిపించటం కోసం మొదట చేయాల్సిన పని దారిద్య్రాన్ని నిర్మూలించటం. ప్రజారోగ్య వ్యవస్థను మెరుగుపర్చుకోవడం. అభివృద్ధిని పరుగులు పెట్టించటంతో పాటు అన్ని వర్గాలకు సమానంగా అందే విధంగా కృషి చేయాలి. సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంతో పాటు సాధికారిక కార్యక్రమాలకు నాంది పలకాలి. ముఖ్యంగా ప్రజల జీవన ప్రమాణాల పెంపుకై వ్యవసాయం, సామాజిక రంగం,ఉపాధి కల్పన వంటి రంగాలపై పెద్ద ఎత్తున ఖర్చు చేయాలి. అందరికీ సమానంగా విద్య, వైద్య సౌకర్యాలు అందరికీ అందుబాటులో ఉండే వాతావరణం సృష్టించాలి. లింగ భేదం లేకుండా మహిళలకు ఆర్థిక రక్షణ కల్పించే ప్రత్యేక విధానాలు తీసుకురావాలి.వారికి ఆర్థిక స్వావలంబన కల్పించాలి.
భారత్ వంటి దేశాల్లో వ్యవసాయానికి తగిన ప్రాధాన్యమివ్వటం తప్పనిసరి.ఈ రంగంలో సాధించే అభివృద్ధి వల్ల రెండింతలు పేదరికం తగ్గుతుందనే ఆర్థికవేత్తల అంచనాలున్నాయి. ఇప్పటివరకు దేశంలో అమలు చేస్తున్న పేదరిక నిర్మూలన కార్యక్రమాలను పటిష్టంగా అమలు పరచాలి. నైపుణ్యాల కల్పన,యువతకు విరివిగా ఉపాధి అవకాశాలు కల్పించటంపై ప్రభుత్వాలు దృష్టి సారించాలి. దానికై సాంకేతిక పరిజ్ఞానాన్ని కొత్త పుంతలు తొక్కించడంతో పాటు పరిశ్రమల స్థాపనకు పెట్టుబడి పెట్టాలి. పర్యావరణానికి హాని కలిగించని సుస్థిరాభివృద్ధి చర్యలకై ప్రతి ఒక్కరూ ప్రతినబూనాలి.
ప్రపంచ దేశాలు ఆర్థికాభివృద్ధితో పాటు మానవాభివృద్ధి దిశగా సమగ్ర కార్యాచరణ రూపొందించాలి. పౌర సేవల వినియోగానికై ప్రతి ఒక్కరినీ అభివృద్ధిలో భాగస్వామ్యం కల్పించే వికేంద్రీకత ప్రజాస్వామ్య వ్యవస్థలను బలోపేతం చేయాలి. ఐరాసతో పాటు ప్రపంచ బ్యాంకు గ్రూపు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ వంటివి పేదరిక నిర్మూలన కార్యక్రమాలకు ఆయా దేశాలకు తోడ్పాటు అందించాలి. అప్పుడే నేటి సంక్షోభానికి చరమ గీతం పాడడంతో పాటు పేదరికం అంతం అవుతుంది.
సాగుభూములు తరిగిపోతూ,
అన్నదాతలు అంతకంతకూ సమస్యల ఊబిలో మునిగిపోతూ దేశీయంగా వ్యవసాయం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. రైతుల కడగండ్లు తీర్చి ప్రభుత్వం వారికి అండగా నిలిస్తేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమ వుతుంది.నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను జోరెత్తిస్తూ, అర్హతలకు తగిన ఉపాధి అవకాశాలను కల్పిస్తూ జనావళి సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గొడుగు పట్టాలి. పార్లమెంటరీ స్థాయీ సంఘం సూచించినట్లుగా ప్రజాపంపిణీ వ్యవస్థను పటిష్ఠీకరించడమూ కీలకమే. సంక్షేమం, ఉపాధి కల్పనలను జోడు గుర్రాలుగా పరుగుతీయిస్తేనే జాతి జవజీవాలను తోడేస్తున్న ఆకలి సమస్యకు పరిష్కారం.
WRITER
నాదెండ్ల శ్రీనివాస్