
ధనుర్మాసంలో శుక్ల పక్షంలోని ఏకాదశి తిథినాడు వైకుంఠ ఏకాదశిని జరుపుకుంటారు. వైదిక సంప్రదాయం ప్రకారం, వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం చేస్తే అనేక విధాల ప్రయోజనం కలుగుతుందిట. శ్రీమన్నారాయణుని దర్శనం చేసుకుని వైకుంఠద్వారం నుంచి బయటకు వస్తే 7 జన్మల్లో చేసిన పాపాలు పరిహారమవుతాయి.
హైందవుల పండుగలన్నీ చంద్రమానం ప్రకారమో లేదంటే సౌరమానం ప్రకారమో వస్తాయి. అలానే జరుపుకొంటారు. కానీ ఈ రెండింటి కలయికతో ఆచరించే పండుగ ఒకే ఒక్కటి ఉంది. అదే ముక్కోటి ఏకాదశి! సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించిన తరువాత (సౌరమానం), వచ్చే శుద్ధ ఏకాదశి (చంద్రమానం) రోజున అంటే ఏకాదశి రోజున ముక్కోటి ఏకాదశిని వైభవంగా భావిస్తారు. హిందూ సంప్రదాయంలో వైకుంఠ ఏకాదశికి ముఖ్యమైన స్థానం ఉంది. వైకుంఠ ఏకాదశిగా జరుపుకునే ఈ రోజున కొన్ని ప్రత్యేక పూజలు చేయడం వల్ల మన కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. ఒక్క ఆరాధన మాత్రమే కాదు ఉపవాసం ఉన్నా వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని నమ్మకం. రోజంతా విష్ణు మంత్రాన్ని జపించాలి. ఇలా చేయడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. కోరికలు కూడా నెరవేరుతాయి. వైకుంఠ ఏకాదశి రోజున పసుపు రంగు దుస్తులు ధరించడం శుభసూచకం.
ఈ రోజున ముక్కోటి దేవతలందరూ విష్ణుమూర్తిని దర్శించుకున్నారని ఓ గాథ. అందుకనే ఈ రోజుకి ముక్కోటి ఏకాదశి అన్న పేరు వచ్చిందట.
పూర్వం దేవతలు ముర అనే రాక్షసుడి బాధలు భరించలేక విష్ణువును ప్రార్థిస్తారు. దీంతో స్వామివారు పోరుకు సిద్ధమవుతారు. ఈ విషయం తెలుసుకున్న ముర.. సముద్రంలోకి వెళ్లిపోతాడు. మరోసారి విష్ణుమూర్తి ఒక గుహలోకి వెళ్లి నిద్రిస్తున్న సమయంలో ముర ఆ గుహలోకి వస్తాడు. ఆ సమయంలో స్వామి దేహం నుంచి ఒక శక్తి వచ్చి మురను చంపివేస్తుంది. అలా శక్తి చర్యకు సంతుష్టుడైన స్వామి ఆమెకు ఏకాదశి అని పేరు పెడతాడు. ఆమెను ఏదైనా వరం కోరుకోమని అనగా.. మురను చంపిన రోజున ఉపవాసం ఉన్నవారి పాపాలను పోగొట్టాలని ఏకాదశి విష్ణువును ప్రార్థించింది. స్వామి తథాస్తు అనడంతోపాటు వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని వరమిచ్చాడు.
మరో కథనంలో.. మధుకైటభులు అనే ఇద్దరు రాక్షసులు స్వచ్ఛంద మరణం వరాన్ని పొంది, ఇక తమని ఎవరూ ఏం చెయ్యలేరనే అహంకారంతో లోకకంటకులుగా మారతారు. బ్రహ్మ వినతి మేరకు మహావిష్ణువు వారితో యుద్ధానికి దిగాడు. అయితే వారు వరం చేత ఓడిపోవడం లేదు. దీన్ని గ్రహించిన స్వామికి వరమిస్తామనగా వారు గర్వాతిశయంతో మేమే మీకు వరమిస్తాం అని కోరుకోమన్నారు. అయితే మీరు నాతో మరణం పొందాలి అని స్వామి అడిగాడు. అనంతరం వారిని సంహరించిన స్వామివారిని వైకుంఠం ఉత్తరద్వారం నుంచి పరమపదంలోకి తీసుకెళ్లాడు. మధుకైటభులు చేయని దుర్మార్గం లేదు. అయినా వారు తాము ఇచ్చిన మాట ప్రకారం ఆ వైకుంఠనాథుడి చేతిలో కన్నుమూశారు. అందుకే స్వామి వారి పాపాలను కడిగివేశాడు. వైకుంఠంలో వారిద్దరికీ స్థానమిచ్చాడు.
*అప్పటినుంచీ ఉత్తర ద్వారం నుంచి శ్రీవారిని దర్శించుకునే ఆచారం మొదలైంది. ఈ ఏకాదశినాడే వైకుంఠంలోని విష్ణుమూర్తివారి ఆంతరంగిక ద్వారాలు తెరుచుకున్నాయి. కాబట్టి దీనికి ‘వైకుంఠ ఏకాదశి’ అన్న పేరూ స్థిరపడింది. అసలు ఏకాదశి అంటేనే హిందువులకి పరమపవిత్రమైన రోజు.
అయితే సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే ఈ ధనుర్మాసంలోని ముక్కోటి ఏకాదశినాడు ఉపవాసం చేస్తే గనుక మిగతా ఏకాదశి రోజులన్నింటిలోనూ ఉపవాసం ఉన్నంత ఫలం దక్కుతుందని నమ్మకం.
*వైకుంఠ ఏకాదశినాడు వైష్ణవాలయాల్లో ప్రత్యేకంగా తెరిచి ఉంచే వైకుంఠ ద్వారంగుండా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు ఎదురుచూస్తారు. కలియుగ వైకుంఠమైన తిరుమలలో కూడా ఈనాడు, శ్రీవారి గర్భాలయాన్ని ఆనుకుని ఉన్న వైకుంఠ ప్రదక్షిణ మార్గం ద్వారా భక్తులు నడిచే భాగ్యం లభిస్తుంది. ఏకాదశినాడు తిరుమలలో జరిగే మలయప్ప స్వామివారి ఊరేగింపు, ద్వాదశినాడు స్వామివారి పుష్కరణిలో జరిగే చక్రస్నానాలను దర్శించిన భక్తులు పుణీతులవుతారని చెప్పాలి.
*ముక్కోటి ఏకాదశి మార్గశిర మాసంలో వస్తే కనుక ఆ ఏకాదశిని మోక్షదైకాదశి అని కూడా అంటారు. వైఖానసుడు అనే ఒక రాజు తన తండ్రిని నరకలోకం నుంచి తప్పించేందుకు ఏకాదశి వ్రతాన్ని నిష్ఠగా ఆచరించాడట. అతడి వ్రత ఫలితంగా తండ్రి నరకం నుంచి విడుదలై స్వర్గలోకానికి చేరుకున్నాడట. అందుకని ఈ ఏకాదశికి మోక్షదైకాదశి అన్న పేరు వచ్చింది.
*మనకి పై దిశగా ఉండే దిక్కుని ఉత్తరం అంటాం. అలా ఉత్తరం దిక్కు అభివృద్ధిని, వికాసాన్నీ సూచిస్తుంది. బహుశా అందుకేనేమో పాతాళం వైపుకి సూచించే దక్షిణవైపు దిక్కుని మనం యమస్థానం అంటాం. మన శరీరంలోనూ జ్ఞానానికి నిలయమైన మెదడు ఉత్తరభాగంలో ఉంటుంది. ఆ జ్ఞానం సంపూర్ణంగా వికసించి, సిద్ధ స్థితిని చేరుకుంటేనే ఆ ఊర్థ్వభాగంలో ఉన్న సహస్రార చక్రం వికసిస్తుందని చెబుతారు.
అంటే ఆ హరి దర్శనం మనలోని అజ్ఞానాన్ని తొలగించి, శాశ్వతమైన శాంతినీ, సత్యమైన జ్ఞానాన్నీ ప్రసాదించమని ఆ విష్ణుమూర్తిని వేడుకోవడమే ఈ ఉత్తర ద్వార దర్శనం వెనుక ఉన్న ఆంతర్యం కావచ్చు.