బంగ్లాదేశ్‌లోని రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పోరాడిన విద్యార్థులను అక్కడి ప్రభుత్వం అణిచివేయడంతో మరోసారి హింసాత్మక ఘటనలు చెలరేగాయి. అయితే, ఈ ఘటనలో ఇప్పటివరకు 300 మంది చనిపోయారు. ప్రభుత్వమే ఈ ఘర్షనలకు బాధ్యత వహించాలని.. ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలంటూ నిరసనకారులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని షేక్ హసీనా ఆగస్టు 05(సోమవారం) మధ్యాహ్నం తన పదవికి రాజీనామా చేసి దేశాన్ని విడిచి పారిపోయారు. అయితే ఆమె ఎక్కడికి వెళ్లారన్న దానిపై ఇప్పటి వరకు పూర్తి క్లారిటీ రాలేదు. ప్రత్యేక మిలిటరీ విమానంలో హసీనాతో పాటు ఆమె సోదరి షేక్ రెహానా భారత్ వైపుకు పయనమైనట్లు కొన్ని వార్త సంస్థలు తెలిపాయి. అపై లండన్‌కు వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది.
రావణ కాష్టంగా ఎలా మరింది?
గత కొంతకాలంగా రిజర్వేషన్ల అంశంపై ఆ దేశంలో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. అయితే తాజాగా బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు రిజర్వేషన్లపై ఇచ్చిన తీర్పుతో ఆందోళనలు కొంతమేర తగ్గాయి. అయితే ఆగస్టు 4న ఆ దేశంలో మరోసారి హింస చెలరేగింది. శాసనోల్లంఘన ఉద్యమానికి పిలుపునిచ్చిన నిరసన కారులు పోలీసులు, ప్రభుత్వాధికారులు తమకు సపోర్టుగా నిలవాలని కోరారు. అంతేకాకుండా ప్రధానమంత్రి హసీనా తన పదవికి రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్ ను కొత్తగా తెరపైకి తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే ఆగస్టు 4న స్టూడెంట్స్ ఎగైనెస్ట్ డిస్క్రిమినేషన్ పేరిట సహాయ నిరాకరణ కార్యక్రమాన్ని పలు ప్రాంతాల నుంచి ఆందోళన కారులు హాజరవుతున్నారు.
అదే సమయంలో వారిని అధికార అవామీలీగ్, దాని విద్యారథి విభాగం ఛాత్ర లీగ్, జుబో లీగ్ కార్యకర్తలు అడ్డగించారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు ప్రారంభమయ్యాయి. దీంతో ఈ ఘర్షణలను నిలువరించేందుకు పలు చోట్ల భద్రతా బలగాలు కాల్పులకు దిగాయి. ఇలా దేశవ్యాప్తంగా రోజంతా జరిగిన గొడవల్లో దాదాపు 106 మంది చనిపోయినట్లు ఆ దేశ స్థానిక మీడియా వెల్లడించింది. కాగా, మొత్తంగా ఈ ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు సంబంధించిన చెలరేగిన హింసలో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 300 దాటింది. ఈ క్రమంలోనే మరోసారి బంగ్లాదేశ్ రావణ కాష్టంగా మారింది.
ప్రస్తుత పరిస్థితుల ఏంటి?
షేక్ హసీనా ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేయడంతో పాటు దేశాన్ని నడపడానికి తాత్కాలిక ప్రభుత్వం సిద్ధంగా ఉందని బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వాకర్- ఉజ్- జమాన్ వెల్లడించారు. తాము దేశంలో తిరిగి శాంతిని తీసుకు వస్తామన్నారు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న హింసను ఆపమని పౌరులను కోరుతున్నాం.. గత కొన్ని వారాలుగా జరిగిన అన్ని హత్యలపై దర్యాప్తు చేస్తాము అని ఆర్మీ చీఫ్ చెప్పారు. దేశవ్యాప్తంగా కర్ఫ్యూతో పాటు ఎలాంటి అత్యవసర ఆంక్షలు విధించలేదన్నారు. త్వరలోనే ఈ సంక్షోభానికి ఓ పరిష్కారం చూపిస్తామని బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వాకర్- ఉజ్- జమాన్ తెలిపారు. అయితే దీనిపై ఆ దేశ ఆర్మీ చీఫ్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాల్సివుంది.