
బంగారం తాకట్టు లోన్ అమౌంట్ విషయంలో దుర్వినియోగమవుతున్న నేపథ్యంలో.. రుణాల మంజూరు విషయంలో పలు సంస్థలు నిబంధనలను గాలికి వదిలేస్తున్నాయనే కారణంతో రిజర్వు బ్యాంకు కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.
బంగారం లేదా వెండి వస్తువుల తాకట్టుపై బ్యాంకుల నుంచి తీసుకున్న లోన్ సొమ్ముతో మనీలాండరింగ్ చేస్తున్నారా? లేదా? అనేది ఎప్పటికప్పుడు పక్కాగా బ్యాంకులు తనిఖీ చేయాలని ఆర్బీఐ తాజాగా జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది. ఫలానా బంగారం, వెండి వస్తువులు ఆ వ్యక్తికి చెందినవా.. కాదా అని తెలుసుకునేందుకు ఇకపై వారి నుంచి రిసిప్ట్స్ ను పరిశీలించాలి. అవి లేకపోతే అది సొంతదే అని రాతపూర్వక పత్రాలను తీసుకోవాలని సూచిస్తుంది. బంగారం తాకట్టు పెట్టుకుని సులభంగా రుణాలిచ్చేస్తామని రకరకాల ప్రకటనలను ఏవీ జారీ చేయవద్దని అన్ని బ్యాంకులకు, ఇతర ఆర్థిక సంస్థలకు ఆర్బీఐ స్పష్టం చేసింది. ఎందుకంటే అవి ఒక్కోసారి మోసపూరితం కావొచ్చు.
మార్గదర్శకాలు..
*ఒక్క వ్యక్తి పేరుతో కిలో బంగారం, పది కిలోల వెండి ఆభరణాలకు మించి బ్యాంకు/ ఆర్థిక సంస్థలు తాకట్టు పెట్టుకోకూడదు.
*ఆభరణాల విలువలో ఎంత రుణం ఇవ్వాలనేది తీసుకునే రుణ మొత్తం ఆధారంగా నిర్ణయిస్తారు.
ఉదాహరణకు, రూ.2.50 లక్షలలోపు రుణం అడిగితే… తాకట్టు పెట్టిన ఆభరణాల విలువ మొత్తంలో 85 శాతం వరకూ మాత్రమే ఇస్తారు అంటే ఆభరణం విలువ సుమారుకు ఇది సరిపోతుంది. అదే రూ.2.50 లక్షల నుంచి రూ.5 లక్షలలోపు అడిగితే 80శాతం, రూ.5 లక్షలకు మించి రుణం అడిగితే ఆభరణాల విలువలో 75 శాతం మాత్రమే బ్యాంకు లేదా ఇతర ఆర్థిక సంస్థలు రుణాలిస్తాయి.
*బంగారం నాణేలు, బిస్కెట్లు అయితే 50 గ్రాములకు.. వెండి అయితే 500 గ్రాములకు మించి తాకట్టుకు పెట్టుకోరు.
*బంగారం తాకట్టు రుణాలు ఒకేసారి పెద్దమొత్తంలో తీసుకుంటుంటే మాత్రం వాటిని తప్పనిసరిగా తనిఖీ చేసి, విచారిస్తాయి.
*అప్పుగా ఇచ్చే సొమ్మును రుణగ్రహీత బ్యాంకు ఖాతాలోనే జమ అవుతుంది.
*రుణం తీసుకున్న తేదీ నుంచి ఏడాదిలోగా తిరిగి అసలు చెల్లించాలి. లేకపోతే తాకట్టు సొత్తును వేలం వేస్తారు. మొదట.. బ్యాంకు ఉన్న జిల్లా పరిధిలో లేదంటే రెండోసారి.. ఆన్లైన్ విధానంలో లేదా పక్క జిల్లాలోనైనా ఈ వేలం నిర్వహిస్తారు.
*రుణ బకాయి చెల్లించిన రెండేళ్లలోపు సొత్తును తిరిగి తీసుకెళ్లకపోతే బ్యాంకు పాలకమండలికి వివరిస్తుంది. వారు రుణగ్రహీతలకు సంబంధించిన వారసులు ఎక్కడ ఉన్నారో తెలుసుకుని సమాచారం పంపుతారు.
ఇకపై ఇంటి అవసరాలకు, చదువు, పెళ్లి కోసమంటూ తాకట్టు పెట్టే విషయంలో పై నిబంధనలను దృష్టిలో పెట్టుకొని చేసుకుంటే చాలా మంచిది.