
ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.. అంతా ఫ్రీ దేశంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఎక్కడ చూసినా ఈ ఉచితాల స్కీములే పని చేస్తున్నాయి అధికారాన్ని కట్టబెడుతున్నాయి. మమ్మల్ని గెలిపించండి మీకు తినడానికి ఉప్పు, పప్పు కానుంచి బ్రతకడానికి అప్పు కూడా ఇస్తాం అని అమలు కాని హామీలు ఇస్తున్నారు. పుట్టినప్పటి నుంచి చనిపోమే వరకు ఏ పని చేయకున్నా కంటికి రెప్పలా చూసుకుంటాం అని చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజల్ని సోమర్లను చేస్తున్నారు.
ఎన్నికలు వస్తే చాలు మన దేశంలో ఇదొక పండుగైపోయింది. రాజకీయ పార్టీలు పోటీ పడి ప్రజలకు ఉచిత పథకాలు ప్రకటిస్తున్నాయి. వివిధ వర్గాల వారిని ఆకర్షించడానికి తాయిలాల వలలు విసురుతున్నాయి. తీరా అధికారంలోకి వచ్చాక హామీ ఇచ్చిన పథకాలు అమలు చేయడం తలకు మించిన భారం అవుతోంది. దాంతో ఇచ్చిన హామీల నుంచి తప్పించుకోడానికి కుప్పిగంతులు వేస్తున్నారు. తీరా మళ్లీ ఎన్నికల ముందు కొత్త అప్పులు చేసి తూతూ మంత్రంగా ఇచ్చిన హామీలను అమలు చేసినట్లు నటిస్తూ అమాయకపు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నం అవుతున్నారు.
ఉచితాలకే ఓట్లు..తరువాత పడతాం పాట్లు
ఒకప్పుడు నాయకుడని చూసి లేదా అభివృద్ధిని చూసి ప్రజలు ఓట్లు వేసేవారు. కానీ ఇప్పుడు రోజులు మారాయి. ఓటుకు నోటు తీసుకోని ఓటు వేసేవారు కొందరైతే.. ఆయా పార్టీలు ఎన్నికలకు ముందు ఇస్తున్న ఉచిత హామీలను నమ్మి ఏ కులానికి ఎంత లబ్ధి చేకూరుతుందో లెక్కలు వేసుకోని ఓట్లు వేస్తున్నారు. హామీలు ఇచ్చే నాయకులు కూడా ప్రజలకు ఎలాంటి ఉచితాలు ప్రకటిస్తే వారి బుట్టలో పడతారో ముందుగానే పసిగడుతున్నారు. ఉచితాలు లెక్క ఎక్కువైనా పర్వాలేదుగాని తక్కువ కాకుండా చూసుకుందాం..అమలు గురించి అడిగినప్పుడు అప్పుడు చూసుకుందాం అన్నట్లు ఆలోచిస్తున్నారు.
ఉచితాల విషయంలో ఏపీ, తెలంగాణే టాప్
ఉచిత పంపిణీ పథకాల వల్ల దేశంలో ఎన్నికల రాజకీయాలు భ్రష్టుపట్టాయి. కాల క్రమంలో సంక్షేమ పథకాలు ప్రజాకర్షణగా మారిపోయాయి. ఉచిత పంపిణీలు దిగజారాయి. ఉచిత హామీలు ఇవ్వడంలో ఒకప్పుడు తమిళనాడు మందంజలో ఉండేది. అక్కడ ఎన్నికలు వచ్చాయంటే ఉచితాలు ఉరుకులు పరుగులు పెడతాయి. జయలలిత సీఎంగా ఉన్న వరకు ఆ హవా నడిచింది. కానీ ఇదే హవా ఇప్పుడు ఉచిత పథకాలు అమలు చేయడంలో ఏపీ, తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉన్నాయి. దేశంలో ఎక్కడ లేని విధంగా మేము రైతులకు రైతు భరోసా (అంతక ముందు రైతు బంధు) ఇస్తున్నాం అని తెలంగాణ నాయకులు చెబితే.
దేశంలో అత్యధికంగా పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని గొప్పలు చెబుతున్నారు. అసలు అధికారంలోకి రావడానికి రాష్ట్రం దివాలా తీసినా పర్వాలేదు ఇంతక ముందు ఉన్నవాళ్లు ఇచ్చిన ఉచితాల కంటే ఎక్కుగా మేము ఇస్తాం మాకే ఓట్లు వేసి గెలిపించండి అని ఇల్లు ఇల్లు తిరిగి ప్రచారం చేస్తున్నారు. చివరికి ప్రజలు కూడా ఇప్పుడు ఇచ్చే దాని కంటే ఎక్కువగానే మనకు ఉచితంగా వస్తున్నాయి కదా అని వారికే ఓట్లు వేసి గెలిపిస్తున్నారు. కనీసం చదువుకున్న వారైన ఆలోచించడం లేదు.
ఉచితాలకు సంబరపడితే.. మనకు దూల తీరుతుంది
ఉచితాల పేరు చెప్పి వంద రూపాయాలు ఇచ్చి మన నుంచే వెయ్యి రూపాయాలు వసూళ్లు చేసి తలకు మించిన భారం మోపుతున్నారు. మళ్లి ప్రభుత్వం ఇచ్చే ఒక్క పథకం అమలు కాకపోతే రోడ్లు ఎక్కుతారు ధర్నాలు చేస్తారు. అసలు ఈ పథకాలకు పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి. ఎలా అమలు చేస్తున్నారు. అని కొంచెం కూడా ఆలోచించడం లేదు. ఏది అయితే మాకేంటి హామీ ఇచ్చాడు అమలు చేయాల్సిందే అని ప్రజలు మొండిగా వ్యవహరిస్తున్నారు.
ప్రస్తుతం ప్రజలు ఉచితాలకు బాగా అలవాటుపడ్డారు. ఎంత సేపు ఉత్తగా ఏది వస్తుందా..ఎప్పుడు దాన్ని అందుకుందామా అని ఆరాటపడుతున్నారే తప్ప. అసలు వీళ్లు అధికారంలోకి వస్తే మన జీవన విధానం ఎంత వరకు మెరుగుపడింది. మనం ఆర్ధికంగా ఎంత ఎదిగాం. మన ఊరు, మండలం, జిల్లా, రాష్ట్రం, దేశం ఏ మేరకు అభివృద్ధి చెందిందో ఒక్కసారి అయినా ఆలోచిస్తున్నారా(చదువు రానివారు కాదు..) ఉచితాలు వద్దు అభివృద్ధి ముద్దు అని ఏ ఒక్క విద్యావంతుడైనా మాట్లాడుతున్నాడా..? అసలు అభివృద్ధి అంటే ఉచిత పథకాల తాయిలాలు కాదు. మన జీవన విధానంలో మార్పు అని ఎందుకు తెలుసుకోరు. నీకు ఉచితంగా విద్య, వైద్యం అందితే చాలు కదా. మరి అవరమైన వాటి గురించి ఆలోచించు. అనవసరం, అందని వాటి గురించి ఆరాటం ఎందుకు..?
గెలవాలని ఆశతో తలకు మించిన హామీలు
ఏ రాజకీయ నాయకుడైన.. ఏ పార్టీ అధిష్టానం అయిన అధికారంలోకి రావలనే చూస్తారు. దాని కోసం వాళ్లు ఎంతకైన తెగిస్తారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగులేదని ప్రతిపక్షంలో ఉన్నవారే అధికార పక్షంపై విమర్శలు గుప్పిస్తారు. కానీ తాము అధికారంలోకి వస్తే అది చేస్తాం. ఇది చేస్తాం. ఇప్పుడు వాళ్లు ఇస్తున్న దాని కంటె డబుల్ ఇస్తాం. మాకు ఓటు వేసి గెలిపించండి అని కల్లబొల్లి మాటలు చెబుతారు. తీర అధికారంలోకి వచ్చాక అన్నీ అప్పులే ఉన్నాయి. మేము ఇచ్చిన హామీలు అమలు చేయలేం. ఆర్థిక పరిస్థితి బాగలేదు అని ప్రజల్ని మభ్యపెడుతు.. గత ప్రభుత్వాన్ని తిడుతూ కాలం వెళ్లదీస్తారు.కానీ వాళ్లు మాత్రం ఇబ్బడి ముబ్బడిగా ఆస్తులు సంపాదించుకుంటారు. ఓట్లు వేసిన మనం వాళ్లు చెప్పిన మాటలు విని దారుణంగా మోసపోతాం.
ఒక్కసారి అభివృద్ది గురించి ఆలోచించండి
బడ్జెట్ లెక్కలు కోటలు దాటుతున్నాయి.. కానీ అభివృద్ధి గడప కూడా దాటడం లేదు. ఎందుకంటే అధికారంలోకి వాడు రావడానికి నీకు ఇచ్చిన హామీలు అమలు చేయడానికే బడ్జెట్ సరిపోదు. ఇంక అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది. అలాంటప్పుడు నీకు విద్యా, వైద్యం, రోడ్లు, తాగునీరు సమయానికి ఎలా అందుతాయి. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మూడు వేలు పింఛను అందిస్తున్న గ్రామాలకు సరైన రోడ్డు వసతి, విద్య , వైద్యం అందడం లేదు అంటే దానికి కారణం ఎవరు నువ్వే కదా. దేశంలో ఆర్థిక సమతుల్యత చాలా ముఖ్యం. అందరి దగ్గరా సమానంగా డబ్బు ఉండకపోవచ్చు.
కనీస అవసరాలైనా అందరికీ తీరేలా ఉండాలన్నది రాజ్యాంగ సూత్రం. ఈ ఉద్దేశంతోనే కొన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అమలౌతున్నాయి. అయితే కాలం గడుస్తున్న కొద్దీ.. సంక్షేమం శృతి మించి.. ఉచితాలు తెరపైకి వచ్చాయనే అభిప్రాయాలున్నాయి. కనీస అవసరాలు తీరని సమాజాల్లో తిరుగుబాట్లు చెలరేగే అవకాశం ఉంది. ఈ అవసరాలు మాజీ వలస దేశాలలోనూ కొనసాగుతున్నాయి. ఒక మేరకు ధనిక దేశాలలోనూ ఉన్నా యి. సంక్షేమ వ్యవస్థల్ని దశాబ్దాలుగా కొనసాగిస్తున్నారు.
ఐక్యరాజ్యసమితి చెప్పే మానవాభివృద్ధి గాని, దాని సూచికలు గాని ఈ వ్యవస్థలపైనే ఆధారపడి ఉన్నాయి. ఏది ఏమైనా ఉచితాలు శృతి మించితే దేశ ఆర్థిక వ్యస్ధకు పెను ప్రమాదంగా మారుతుంది. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలి ఆర్థిక మాంద్యం వైపు పయణించే అవకాశం లేకపోలేదు. ఇప్పటికైనా పాలకులు మేల్కొని మెరుగైన విద్య, వైద్యం మాత్రమే అందించి.. ఉపాధి కల్పించడంపై దృష్టి పెడితే వారి కొనుగోలు శక్తి పెరుగుతుంది. దీని వల్ల దేశం ఆర్థికంగా మెరుగుపడుతుంది.