Telugu News

షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్

ప్రతి పెట్టుబడి దీర్ఘకాలం కోసమే ఉండదు. కొన్ని ఆర్థిక అవసరాలకు తక్కువ సమయంలోనే డబ్బు అవసరమవుతుంది. ఉదాహరణకి, వచ్చే మూడు సంవత్సరాల్లో కారు కొనాలనుకుంటున్నారనుకుందాం. లేదా నాలుగు సంవత్సరాల్లో పిల్లల పెళ్లి ఉంటుందనుకుందాం. అలాంటి సందర్భాల్లో మనం తక్కువ కాలానికి పెట్టుబడులు పెట్టాల్సి వస్తుంది. దీనినే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ అంటారు. అంటే, 6 నెలల నుంచి 4 సంవత్సరాల లోపు డబ్బు అవసరమయ్యే పెట్టుబడులు. చాలామంది తమ షార్ట్ టర్మ్ లక్ష్యాల కోసం ఈ రకమైన ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్లను ఎంచుకుంటారు.

ఒక ఉదాహరణగా తీసుకుంటే – మీరు కారు కొనాలనుకుంటున్నారు. దానికి అవసరమైన మొత్తం డబ్బును ఒక్కసారిగా జమ చేయలేరు. అందుకే, మీరు ప్రతి నెలా రూ.15 వేలు మూడేళ్లపాటు వేరుచేసి పెట్టుబడి పెట్టాలనుకుంటారు. దీనికి తక్కువ రిస్క్ ఉన్న పెట్టుబడి మార్గాలను ఎంచుకోవాలి. అందులో ముఖ్యమైనవి డెట్ మ్యూచువల్ ఫండ్స్, రికరింగ్ డిపాజిట్స్ లాంటివి. ఈ విధంగా మీరు మీ అవసరాలకు అనుగుణంగా డబ్బును, కాలవ్యవధిని నిర్ణయించుకుంటూ పెట్టుబడి చేయాలి.

షార్ట్ టర్మ్ అవసరాల కోసం కొన్ని ముఖ్యమైన పెట్టుబడి ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. అవేంటో చూద్దాం.

ఫిక్స్‌డ్ డిపాజిట్:

మీ దగ్గర ఎక్కువ మొత్తంలో డబ్బు ఉంటే, దానిని 1 నుంచి 4 సంవత్సరాల కాలానికి ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయడం మంచి ఆప్షన్. దీనికి రిస్క్ తక్కువగా ఉంటుంది, వడ్డీ రేట్లు ముందే ఫిక్స్ అయి ఉంటాయి. పిల్లల చదువు, పెళ్లి, టూర్ లాంటి ఖర్చుల కోసం డబ్బు పెంచుకోవాలనుకునే వారు దీనిని ఎంచుకోవచ్చు. ప్రభుత్వ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు రెండూ ఈ ప్లాన్‌ను అందిస్తాయి.

రికరింగ్ డిపాజిట్:

ఒకేసారి పెద్ద మొత్తాన్ని పెట్టలేని వారు ఈ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. ఇందులో ప్రతి నెలా ఒక నిర్దిష్ట మొత్తం డబ్బు జమ చేస్తారు. మీరు నెలకి ఎంత ఇచ్చాలో ఆధారంగా చివరికి మిక్స్ అయిన వడ్డీతో కలిపి మీ డిపాజిట్ తిరిగి వస్తుంది. ఇది డిసిప్లిన్‌డ్ సేవింగ్‌కు అనువైన మార్గం. తక్కువ వేతనాలు ఉన్న వారు కూడా దీనిని సులభంగా ఎంచుకోగలరు.

డెట్ మ్యూచువల్ ఫండ్స్:

ఇవి ప్రధానంగా ప్రభుత్వ బాండ్స్, కార్పొరేట్ బాండ్స్, ట్రెజరీ బిల్స్ వంటి భద్రత కలిగిన మార్గాల్లో పెట్టుబడులు పెడతాయి. దీని వలన మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్‌తో పోల్చితే చాలా తక్కువ రిస్క్ ఉంటుంది. 6 నెలల నుంచి 3 సంవత్సరాల వరకు పెట్టుబడికి ఇవి అనువైనవి. దీర్ఘకాలంలో టాక్స్ పరంగా కూడా ఇవి కొంత ప్రయోజనం ఇస్తాయి. కానీ మార్కెట్ పరిస్థితులు కొంత ప్రభావం చూపుతాయి.

పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కం స్కీమ్:

ఈ స్కీం 5 సంవత్సరాల పాటు ఉంటుంది. ఒకేసారి పెద్ద మొత్తం డిపాజిట్ చేస్తే, దానిపై ప్రతి నెల వడ్డీ రూపంలో ఆదాయం వస్తుంది. ఇది రిటైర్డ్ వ్యక్తులకు లేదా నెలనెలా ఖర్చు అయ్యే అవసరాల కోసం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో జాయింట్ ఖాతా కలిగి ఉంటే గరిష్ఠంగా రూ.15 లక్షల వరకు పెట్టుబడి చేయొచ్చు. ఉదాహరణకు, మీరు రూ.15 లక్షలు పెట్టబడి చేస్తే, ప్రతి నెల దాదాపు రూ.9,250 వడ్డీ రూపంలో లభిస్తుంది. దాన్ని మళ్లీ రెఇన్వెస్ట్ చేయవచ్చు లేదా ఇంటి ఖర్చులకు ఉపయోగించుకోవచ్చు.

షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది చిన్నదిగా అనిపించినా, తెలివిగా ప్లాన్ చేస్తే జీవితంలో పెద్ద అవసరాలను సురక్షితంగా తీరుస్తుంది. అవసరాలకు అనుగుణంగా డబ్బును ఎలా, ఎక్కడ పెట్టాలో తెలుసుకుని ముందస్తుగా ప్రణాళిక వేస్తే – ఆర్థిక భద్రతతో పాటు, మానసిక నిశ్చలత కూడా పొందవచ్చు.

Show More
Back to top button