భారతదేశంలో పారిశ్రామికీకరణకు స్వాతంత్ర్యానంతరం 6 ఏప్రిల్ 1948న నాటి పరిశ్రమల మంత్రి డా శ్యామా ప్రసాద్ ముఖర్జీ మొట్టమొదటి ఇండస్ట్రియల్ పాలసీ 1948ను పార్లమెంటులో ప్రవేశపెట్టడంతో బీజం పడింది. ఏ దేశ ప్రగతికైనా సంక్షేమం మరియు అభివృద్ధి రెండు కళ్ళ లాంటివి. ప్రభుత్వాలు ఒక పక్క ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే మరోపైపు ఆర్ధికాభివృద్ధిపై దృష్టి సారించాలి. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకునే పంచవర్ష ప్రణాలికలు రూపొందాయి.
స్వాతంత్ర్యానంతరం తీవ్ర ఆహార కొరతతో కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో, మొదటి పంచవర్ష ప్రణాళికలో (1951-56) వ్యవసాయరంగానికి, రెండవ పంచవర్ష ప్రణాళికలో (1956-61) పారిశ్రామికరంగానికి పెద్దపీట వేసారు. పారిశ్రామికీకరణతో చిన్న, మధ్యతరహా మరియు భారీ పరిశ్రమలలో ఉపాధి అవకాశాలు ఏర్పడడంతో దేశంలో నిరుద్యోగం తగ్గి ప్రజల తలసరి ఆదాయంతో పాటు సమాజ ఆదాయం పెరిగి ఉత్పాదక రంగం పరుగులు పెడుతుంది.
తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టిఎస్ఐఐసి)
1973లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ప్రారంభించబడిన “ఆంధ్ర ప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ” 2014లో రాష్ట్ర విభజన అనంతరం, “తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ”గా రూపాంతరం చెందింది. అభివృద్ధి చెందిన ప్లాట్లు/షెడ్‌లు, రోడ్లు, డ్రైనేజీ, నీరు, విద్యుత్ మరియు ఇతర మౌలిక సదుపాయాలతో కూడిన సంభావ్య వృద్ధి కేంద్రాలను గుర్తించడం మరియు అభివృద్ధి చేయడం, పారిశ్రామిక వాడలకు సమీపంలో కార్మికులకు గృహ నిర్మాణం వంటి సామాజిక మౌలిక సదుపాయాలను అందించడం; సంబంధిత శాఖల సమన్వయంతో సమాచార, రవాణా మరియు ఇతర సౌకర్యాలను కల్పించడం కోసం ఈ సంస్థ స్థాపించబడింది. ఈ సంస్థ పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో కూడా కొన్ని క్రియాశీల ప్రాజెక్ట్‌లను చేపట్టింది.
ప్రత్యేక ఆర్ధిక మండలాలు (Special Economic Zones – సెజ్)
ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను సృష్టించడం మరియు అనేక నియంత్రణలు మరియు అనుమతులను సులభతరం చేయడానికి, భారతదేశంలో ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి, పెట్టుబడిదారులలో విశ్వాసం కలిగించడానికి, స్థిరమైన ఆర్థిక విధాన పాలనను అందించడానికి, ఉపాధికల్పన కోసం భారత ప్రభుత్వం ఏప్రిల్ 2000లో ప్రత్యేక ఆర్థిక మండళ్ళ (సెజ్) విధానాన్ని ప్రకటించగా “ప్రత్యేక ఆర్థిక మండలాల చట్టం, 2005”కు మే, 2005లో పార్లమెంటులో మరియు జూన్ 23, 2005న రాష్ట్రపతి ఆమోదం లభించింది. భారతీయ సెజ్ విధానం ప్రభుత్వ, ప్రైవేట్ లేదా ఉమ్మడి భాగస్వామ్యంతో కొనసాగేందుకు జాతీయ మరియు అంతర్జాతీయ ప్రైవేట్ డెవలపర్‌లకు సమానావకాశాలను అందిస్తుంది.
ఇండియా బ్రీఫింగ్ సంస్థ “ఇన్వెస్టింగ్ ఇన్ ఇండియాస్ తెలంగాణ స్టేట్: ఎ క్విక్ గైడ్” డిసెంబర్ 21, 2023 నివేదిక ప్రకారం తెలంగాణలో మొత్తం 67 నోటిఫైడ్ స్పెషల్ ఎకనామిక్ జోన్లు (సెజ్) ఉండగా వాటిలో క్రింద పేర్కొన్న 28 మాత్రమే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలోని నానక్ రాం గూడలో ఐటి మరియు ఐటి ఆధారిత సేవలు, మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల లోని రాజాపూర్ మరియు పోలేపల్లిలో ఫార్మాసూటికల్, మెదక్ జిల్లా ములుగు లోని కారకపట్లలో బయోటెక్నాలజీ, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం లోని ఆదిభట్లలో ఏరోస్పేస్ మరియు ప్రెసిషన్ ఇంజనీరింగ్, రంగారెడ్డి జిల్లా షామీర్ పేట్ లో
బయోటెక్నాలజీ, రంగారెడ్డి జిల్లా మాధాపూర్ లో రహేజా ఐటి మరియు ఐటి ఆధారిత సేవలు, రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో సేమీకండక్టర్స్, రంగారెడ్డి జిల్లాలో విప్రో ఐటి మరియు ఐటి ఆధారిత సేవలు, రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో జెమ్స్ మరియు జువెలర్స్, రంగారెడ్డి జిల్లా మాధాపూర్ లో టెక్ మహీంద్ర (సత్యం కంప్యూటర్స్) ఐటి మరియు ఐటి ఆధారిత సేవలు, రంగారెడ్డి జిల్లా మణికొండలో లాంకోహిల్స్ ఐటి మరియు ఐటి ఆధారిత సేవలు, రంగారెడ్డి జిల్లా రావిర్యాల్ లో ఇందు టెక్ జోన్ ఐటి మరియు ఐటి ఆధారిత సేవలు, రంగారెడ్డి జిల్లా రాయదుర్గ్ లో దివ్యశ్రీ ఎన్ ఎస్ ఎల్ ఇన్ఫ్రా ఐటి మరియు ఐటి ఆధారిత సేవలు
రంగారెడ్డి జిల్లా కాంచ ఇమారత్ లో జె టి హోల్డింగ్స్ ఐటి మరియు ఐటి ఆధారిత సేవలు, రంగారెడ్డి జిల్లా కాంచ ఇమారత్ లో స్టార్ గేజ్ ఐటి మరియు ఐటి ఆధారిత సేవలు, రంగారెడ్డి జిల్లా గోపన్ పల్లిలో విప్రో ఐటి మరియు ఐటి ఆధారిత సేవలు, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆదిభట్లలో టాటా కన్సల్టెన్సీ ఐటి మరియు ఐటి ఆధారిత సేవలు, రంగారెడ్డి జిల్లా ఘట్ కేసర్ లోని పోచారంలో ఇన్ఫోసిస్ ఐటి మరియు ఐటి ఆధారిత సేవలు, రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలో ఏ పి టెక్నో ప్రాజెక్ట్స్ ఐటి మరియు ఐటి ఆధారిత సేవలు
రంగారెడ్డి జిల్లా బహదూర్ పల్లిలో టెక్ మహీంద్ర (సత్యం కప్యూటర్స్) ఐటి మరియు ఐటి ఆధారిత సేవలు, రంగారెడ్డి జిల్లాలో సి ఎం సి, రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి లోని గచ్చిబౌలిలో డి ఎల్ ఎఫ్ ఐటి మరియు ఐటి ఆధారిత సేవలు, రంగారెడ్డి జిల్లా ఉప్పల్ ఇండస్ట్రియల్ డెవెలప్మెంట్ ఏరియాలో టాప్ నాచ్ ఇన్ఫ్రా ఐటి మరియు ఐటి ఆధారిత సేవలు, రంగారెడ్డి జిల్లా ఘట్ కేసర్ లోని పోచారంలో సెరీన్ ప్రాపర్టీస్ ఐటి మరియు ఐటి ఆధారిత సేవలు, రంగారెడ్డి జిల్లా బాచుపల్లిలో మైటాస్ హిల్ కౌంటీ ఐటి మరియు ఐటి ఆధారిత సేవలు, రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలో నవయుగ లీగల్ ఎస్టేట్స్ ఐటి మరియు ఐటి ఆధారిత సేవలు, రంగారెడ్డి జిల్లాలో జెన్ ప్యాక్ట్ ఐటి మరియు ఐటి ఆధారిత సేవలు, రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో జిఎంఆర్ అంతర్జాతీయ విమానాశ్రయం.
ప్రోత్సాహకాలు
ప్రత్యేక ఆర్థిక మండలాలలో వ్యాపారాన్ని సులభతరం చేయడానికి సంస్థలకు ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలను అందిస్తుంది. యూనిట్ల అభివృద్ధి, నిర్వహణ కోసం సుంకం లేని దిగుమతి లేదా దేశీయ వస్తువుల సేకరణ, విద్యుత్ సుంకం, మొదటి 5 సంవత్సరాలకు ఎగుమతి ఆదాయంపై 100 శాతం ఆదాయపు పన్ను మినహాయింపు, ఆ తర్వాత 5 సంవత్సరాలకు 50 శాతం మరియు తదుపరి 5 సంవత్సరాల్లో ఎగుమతి లాభంలో 50 శాతం, కనీస ప్రత్యామ్నాయ పన్ను, జీఎస్టీ, సర్వీస్ ట్యాక్స్ నుండి మినహాయింపు,
కేంద్ర మరియు రాష్ట్ర అనుమతుల కోసం సింగిల్ విండో క్లియరెన్స్, దిగుమతుల లైసెన్స్ మినహాయింపు, తయారీ రంగంలో కొన్ని విభాగాలను మినహాయించి, 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డిఐ) అనుమతి, కస్టమ్స్ మరియు ఎగుమతి-దిగుమతి విధానానికి ప్రత్యేక డాక్యుమెంటేషన్ నుండి మినహాయింపు, మెచ్యూరిటీ పరిమితులు లేకుండా గుర్తింపు పొందిన బ్యాంకుల నుండి సంవత్సరానికి 500 మిలియన్ డాలర్ల వరకు బాహ్య వాణిజ్య రుణాలపై అనుమతి లాంటి ప్రోత్సాహకాలతో పాటు అనేక సెజ్ లలో అభివృద్ధి చెందిన ప్లాట్లు మరియు వెంటనే వాణిజ్య కార్యకలాపాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్న స్థలాన్ని అందిస్తాయి. నిబంధనల ప్రకారం, సెజ్ అధికారిక ఆమోదం పొందిన మూడు సంవత్సరాలలోపు కార్యకలాపాలను ప్రారంభించాలి.
హైదరాబాద్ రాష్ట్రంలో పారిశ్రమలు
స్వాతంత్ర్యానికి పూర్వమే హైదరాబాద్ రాష్ట్ర పారిశ్రామిక పురోగతికి నిదర్శనమే నాటి నిజాం గ్యారంటీడ్ స్టేట్ రైల్వే – 1875, సబ్బు ఫ్యాక్టరీ – 1919, కార్ఖానా జిందా తిలిస్మాత్ – 1920, సింగరేణి కాలరీస్ – 1920, పారిశ్రామిక ఆల్కహాల్ ఫ్యాక్టరీ – 1925, షాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ – 1925, డెక్కన్ గ్లాస్ వర్క్స్ – 1927, హైదరాబాద్ దక్కన్ సిగరెట్ ఫ్యాక్టరీ – 1930, వజీర్ సుల్తాన్ టొబాకో కంపెనీ మరియు చార్మినార్ సిగరెట్ ఫ్యాక్టరీ – 1930, ఆజం జాహీ మిల్స్ (వరంగల్) – 1934, నిజాం చక్కర కర్మాగారం (నిజామాబాద్) – 1937, సిర్పూర్ పేపర్ మిల్స్ – 1938, ఆల్విన్ మెటల్ వర్క్స్ – 1942, ప్రాగా టూల్స్ – 1943, దక్కన్ ఎయిర్ వేస్ – 1945, హైదరాబాద్ ఆస్బెస్టాస్ – 1946 మరియు సిర్ సిల్క్ – 1946. 1912-13 నుండి హైదరాబాద్ రాష్ట్రంలో పరిశ్రమలు మరియు వాణిజ్యంపై వ్యయం క్రమంగా పెరిగింది. 1920 లోనే హైదరాబాద్ రాష్ట్రంలో పత్తి జిన్నింగ్, ప్రెస్సింగ్ మిల్లులు మినహా 120 ఫ్యాక్టరీలు ఉండేవి. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో యుద్ధ సంబంధిత సామాగ్రి తయారీ కోసం ఆల్విన్ మెటల్ వర్క్స్ మరియు ప్రాగా టూల్స్ కార్పొరేషన్ (1943) స్థాపించబడ్డాయి.
ప్రభుత్వ కృషి
ఫిబ్రవరి 10, 2024న శాసనసభలో బడ్జెట్ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఇటీవల స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన “వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్” సమావేశంలో ముఖ్యమంత్రి మరియు పరిశ్రమలు మరియు ఐటీ శాఖల మంత్రి పలు మల్టీనేషనల్ కంపెనీలతో రాష్ట్రంలో పెట్టుబడుల పెట్టేందుకు సంప్రదింపులు జరిపారని తెలిపారు. ఉపాధి అవకాశాలు కల్పించడంలో సూక్ష్మ, చిన్న పరిశ్రమలు (ఎం ఎస్ ఎం ఈ) ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని, కేంద్రం యొక్క మైక్రో స్మాల్ ఎంటర్‌ప్రైజెస్ క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (MSECDP) నిధులను తెలంగాణ సమర్థవంతంగా వినియోగించుకుంటుందన్నారు.
ప్రధానమంత్రి మిత్ర నిధులతో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కును, కేంద్ర సహకారంతో రెండు లెదర్ పార్కులను కూడా అభివృద్ధి చేస్తామన్నారు. ఫార్మా క్లస్టర్లను జనావాసాలకు దూరంగా ఏర్పాటు చేసి కనీస నష్టం వాటిల్లకుండా సంతులిత అభివృద్ధి సాధించేందుకు కృషి చేస్తామన్నారు. ఎగుమతులను సులభతరం చేసేందుకు రాష్ట్రంలో రెండు డ్రై పోర్ట్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. వార్షిక బడ్జెట్‌లో పరిశ్రమల శాఖకు రూ.2,543 కోట్లు ప్రతిపాదిస్తున్నామని, ఐటీ రంగాన్ని బలోపేతం చేసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించుకోవడం ద్వారా 2-3 టైర్ నగరాలను అభివృద్ధి చేస్తామని, ఫైబర్ నెట్‌వర్క్ కనెక్టివిటీలో రాష్ట్రాన్ని పటిష్టంగా మారుస్తామని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోసం కొత్త ఐటీ పాలసీని రూపొందించనున్నామని, వార్షిక బడ్జెట్‌లో రూ.774 కోట్లు ప్రతిపాదించామని తెలిపారు.