Telugu News

శ్రీ శబరి జయంతి.. విశేషాలివిగో..!

శబరి నీకు తోబుట్టువా.. ఎంగిలి పళ్ళను తిన్నావు..” అనే పాట,

శబరి అనే మాట వినగానే మనకు వెంటనే రామాయణం గుర్తుకొస్తుంది. శబరి పుట్టింది ఒక గిరిజన కుటుంబంలో.. కానీ అవతారమూర్తి అయిన రాముడి అనుగ్రహం పొంది పునీతురాలైంది. ఆమె జయంతి ఈ నెల 20న పురస్కరించుకొని శబరి జీవిత గాథను మనం ఇప్పుడు తెలుసుకుందాం:

శబరి గిరిజన బోయకులంలో పుట్టింది. పంపానది తీరానవున్న మాతంగ మహాముని ఆశ్రమంలో పెరిగింది. తాను ఉంటున్న మాతంగ ఆశ్రమాన్ని కైలాసంగా భావించేది. మాతంగ మహామునిని పరమేశ్వరుడిగా భావించి సేవించేది. అక్కడి రుషుల మాటలు వింటూ పెరిగింది. అలా తన మనసంతా భక్తితో నిండిపోయింది. కొన్నాళ్లకు ఇహపరాలను విడిచి, ముక్తిమార్గమే మేలని నిశ్చయించుకుంది. అదే సమయంలో విష్ణుమూర్తి, శ్రీరాముని రూపంలో అవతరించిన విషయాన్ని తెలుసుకుంది శబరి. ఆయన ఎప్పటికైనా తాను ఉన్నచోటుకు రాకపోతాడా అని, వేయి కళ్లతో ఎదురుచూడటం మొదలుపెట్టింది. అలా కాలం గడుస్తోంది. నడివయసులో ఉన్న శబరి వృద్ధాప్యంతో ఇంకాస్త బలహీనపడిపోయింది. చూపు సైతం మసకబారింది. కానీ రాముడు వస్తాడనే ఆశ మాత్రం తాను వీడలేదు. ఆ రఘుకుల రాముడు తనని అనుగ్రహిస్తాడనే నమ్మకంతోనే రోజులు గడిపింది. 

రాముడు వస్తాడని శబరికి చెబుతూ మాతంగ ముని కూడా దేహం చాలించారు. మాతంగుడు దూరమైనా సరే.. ఎప్పటికైనా రాముడు అటు వస్తాడనే కోరికతో రోజూ ఆ ఆశ్రమాన్ని శుభ్రం చేసేది.. పూలతో అలంకరించి, పండ్లు సేకరించి పెట్టేది. ఇలా చూసుకున్నా ఏళ్లు గడిచాయి. అయినా శబరి దినచర్యలో ఎటువంటి మార్పు రాలేదు.

శబరి గురించి కబంధుడు రాముడికి చెప్పాడు. రాముడు లక్ష్మణునితో సహా శబరిని చూడవచ్చాడు. తనకు చూపు సరిగా లేకపోవడంతో, ఆ అవతారమూర్తిని తడుముతూ ఆయనే రాముడని గ్రహించింది శబరి. ఆయన కోసం ఉంచిన రేగుపళ్లను కొరికి చూసి.. అవి మేలైన పళ్లుగా భావించి, అందించింది. 

ఈ చర్యకు లక్ష్మణుడు ఒక్కసారిగా ఆగ్రహించాడు.. అది శబరి నిర్మల భక్తికి తార్కాణం అంటూ రాముడు వివరించినట్లు మనకు రామాయణం కథల్లో కనిపిస్తుంది. చివరికి శబరి జీవితకాల వాంఛ నెరవేరింది. తను కోరుకున్న రాముడిని నేరుగా సేవించుకుంది. ఆయన నుంచి నేరుగా మోక్షాన్ని అందుకుంది. మరీ అంతకన్నా భాగ్యమైన రోజు ఇంకేం ఉంటుంది. అందులోనూ శబరి పుట్టినరోజు, రామ అనుగ్రహం పొందిన దివ్యమైన రోజు మాఘ బహుళ సప్తమి. ఇదే రోజును శబరి జయంతిగా భావిస్తుంటారు. ఉత్తరాదిలోని కొన్ని ప్రాంతాల్లో ఈ రోజున ప్రత్యేక పూజలు చేయడం విశేషం.

ఈ గాథ ప్రకారం, శబరి గొప్పగా చెప్పుకునే వంశంలో పుట్టింది కాదు.. తానేమీ గ్రంథాలు వల్లె వేయలేదు.. అయినా దేవుడైన రాముడు తనని వెతుక్కుంటూ కాలినడకన వచ్చాడు. కారణం… ఆమె భక్తి! నిర్మలమైన మనసు, విశ్వాసం.

శబరి జీవితం కేవలం భక్తులకు మాత్రమే ఉన్నతమైంది కాదు. 

జీవితంలో మనకంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకున్నప్పుడు, దాని గురించే ఆలోచిస్తూ, అది తప్పక నెరవేరుతుందనే నమ్మకంతో జీవిస్తూ.. అందుకు తగ్గట్టు జీవించినప్పుడే విజయం సాధ్యమవుతుందనే తత్వం బోధపడుతుంది.

Show More
Back to top button