దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్ష ఏమిటంటే అందరూ సివిల్ సర్వీసెస్ పరీక్షే అంటారు. దాన్ని సాధించడానికి చాలామంది కష్టపడుతుంటారు. సాధించకపోతే బాధపడి అక్కడితో ప్రయత్నం విరమించుకుంటారు. కొందరు అహర్నిశలు కష్టపడి. గెలుపే లక్ష్యంగా చేసుకుని సాధిస్తారు. అలాంటి వారిలో ఒకరే.. హిమాచల్‌ప్రదేశ్‌లోని తథాల్కు చెందిన షాలిని అగ్నిహోత్రి. ఎలాంటి కోచింగ్ లేకుండానే తన తొలి ప్రయత్నంలోనే IPS అధికారిణి కావడంలో విజయం సాధించారు. ఈ విజయం సాధించే క్రమంలో ఆమె ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారని పలు ఇంటర్వ్యూల్లో తెలిపారు. అలాంటి షాలిని అగ్నిహోత్రి గురించి మరింత తెలుసుకుందాం.
ఓ రోజు షాలిని తన తల్లితో కలిసి బస్సులో ప్రయాణిస్తోంది. ప్రయాణంలో, ఒక వ్యక్తి తన తల్లి సీటు వెనుక నుంచి ఆమెపై చెయ్యి వేశాడు. దీంతో తల్లి ఇబ్బందిని గమనించిన షాలిని ఆ వ్యక్తిని చేయి తీయమని చాలాసార్లు అడిగింది. అతను కనీసం పట్టించుకోకుండా ఆమెపై కోపంతో నువ్వు ఏమన్నా అధికారివా అంటూ.. విరుచుకు పడ్డాడట. అప్పుడే ఏదో ఒకటి పెద్దగా సాధిస్తేనే.. ఈ సమాజం తనను గుర్తిస్తుందని అనుకుని సివిల్ సర్వీసెస్‌లో అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నారట. అంతేకాకుండా షాలిని సివిల్ సర్వీసెస్‌కు ప్రిపేర్ అవుతున్నప్పుడు, చాలామంది ఆమె తల్లితో ఆడపిల్లకు పెళ్లి చేయకుండా ఎందుకు చదివిస్తున్నావని అనేవారట. అయినా అవేం పట్టించుకోకుండా తాను సివిల్స్‌కి ప్రిపేర్ అయ్యానని పలు ఇంటర్వ్యూల్లో షాలిని తెలిపారు.
అభ్యర్థులకు షాలిని ఇచ్చే సలహా..
సివిల్స్ ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ, వాటిని అస్సలు పట్టించుకోవద్దు. అభ్యర్థులు ముందుగానే స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. వచ్చే సమస్యల్ని అధిగమిస్తూ పరీక్షలకు సిద్ధం కావాలి. అభ్యర్థులు ముందు సిలబస్‌ని ఒకటికి రెండుసార్లు చదువుకొని దానిపై పట్టు సాధించాలి. అప్పుడే ప్రిపరేషన్ సులభం అవుతుంది. ప్రతిరోజూ కరెంట్ అఫైర్స్ నోట్స్ రాసుకొని వాటిని నెలవారీగా మళ్లీ రివిజన్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు ప్రశ్నల సరళిపై అవగాహన పెంచుకోవడానికి సాధ్యమైనంత వరకు మాక్ టెస్టులు రాయాలి. గత సంవత్సరాల ప్రశ్నాపత్రాలను ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే వాటి స్థాయి ఏంటనేది, మన సామర్థ్యం ఏమిటనేది మనకు తెలుస్తుందని సలహా ఇస్తున్నారు.