అంతరిక్షయానం నుంచి అంతుచిక్కని రోదసీ రహస్యాలను చేధించడంతో పాటు జీవం మనుగడకు సాధ్యమయ్యే పరిస్థితులను సృష్టించడం వరకు.. భారత్ ప్రఖ్యాత పరిశోధన సంస్థ అయిన ఇస్రో ఎన్నో వినూత్న ప్రయోగాలను చేపడుతోంది. ఈ క్రమంలోనే రోదసిలో అలసంద విత్తనాలు మొలకెత్తేలా చేసి మరో ఘనత సాధించింది.
రోదసిలోకి పంపిన అలసంద విత్తనాలు అవే బొబ్బర్లు.. సూక్ష్మగురుత్వాకర్షణ కలిగిన వాతావరణంలో కేవలం నాలుగు రోజుల్లోనే మొలకెత్తాయి. వీటికి త్వరలో ఆకులు కూడా వస్తాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నట్లు ఇస్రో పేర్కొంది.
రోదసీలో వ్యోమనౌకల అనుసంధాన ప్రక్రియకు ఉద్దేశించిన ఈ స్పేస్ డాకింగ్ ఎక్స్‌పెరిమెంట్ (స్పేడెక్స్) కోసం గత నెల(డిసెంబరు) 30న పీఎస్‌ఎల్‌వీ- సి60 రాకెట్ ద్వారా రెండు ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించగా.. ఆ రాకెట్‌లోని నాలుగో దశ (పోయెమ్- 4)ను ఉపయోగించుకొని 24 పేలోడ్‌లను తన కక్ష్యలోకి పంపింది. ఇందులో కంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటాల్ ప్లాంట్ స్టడీస్ (క్రాప్స్) అనే సాధనం కూడా ఉంది. దీన్ని తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం (వీఎస్‌ఎస్‌సీ) అభివృద్ధి చేసింది. కాగా ఇందులో 8 అలసంద గింజలు వేయగా..
సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో అవి ఇప్పుడు మొలకెత్తాయి. మొక్కల ఎదుగుదలపై అధ్యయనం చేయడం ఉద్దేశించిందే ఈ క్రాప్స్…
భవిష్యత్‌లో చేపట్టబోయే సుదీర్ఘ అంతరిక్ష యాత్రలకు ఇది చాలా కీలకంగా నిలవనుంది. ఎందుకంటే భవిష్యత్తులో వ్యోమగాములు తమ ఆహారాన్ని రోదసిలోనే సాగు చేసుకోవాల్సి ఉంటుంది. అందుకనుగుణంగా అలసంద విత్తనాలు మొలకెత్తి, రెండు ఆకుల దశకు చేరుకునేవరకూ ఎదుగుదల కొనసాగేలా ‘క్రాప్స్’ ప్రయోగాన్ని రూపొందించారు. తొలుత ఈ విత్తనాలను ఒక పెట్టెలో ఉంచారు. దీని ఉష్ణోగ్రతలను ఎప్పటికప్పుడు నియంత్రించేందుకు తగిన ఏర్పాట్లు చేశారు.
ఇదెలా అంకురోత్పత్తి చెందుతుందనేది కెమెరాతో చిత్రీకరిస్తున్నారు. మొక్క ఎదుగుదలలో భాగంగా ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ గాఢతను కొలవడం, విత్తనం మొలకెత్తే విధానాన్ని పరీక్షించడం, రోదసిలోని వ్యర్థాలను ఒడిసిపట్టే రోబోటిక్ హస్తం, హరిత చోదక వ్యవస్థ పరీక్షలు వంటివి ఇందులో భాగంగా ఉన్నాయి. భవిష్యత్ లో చేపట్టబోయే పలు రోదసి కార్యక్రమాలకు అవసరమైన డాకింగ్ పరిజ్ఞానాన్ని వీటిద్వారానే టెస్ట్ చేయనున్నారు.
ఇకపోతే ముంబయిలోని అమిటీ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన ఏపీ ఈఎంఎస్ ద్వారా సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో పాలకూర వృద్ధిని పరీక్షిస్తారు. మొక్కలు గురుత్వాకర్షణ, కాంతి దిశను పసిగడుతున్న తీరు గురించి కొత్త అంశాలను ఈ ప్రయోగం వెలుగులోకి తెస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.