Telugu News

అపర కుబేరుడు.. అప్పుల పాలెందుకయ్యాడు..?!ది డౌన్ ఫాల్ ఆఫ్ అనిల్ అంబానీ..!

భారత పారిశ్రామికరంగంలో గొప్ప వ్యాపారవేత్త.. తండ్రి నుంచి వారసత్వంగా, అన్న నుంచి వాటాగా వచ్చిన 42 బిలియన్లతో మార్కెట్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుని.. కొన్ని అస్థిర నిర్ణయాల వల్ల..  చివరకు సర్వం కోల్పోయాడు.. 

ఒకప్పుడు కార్లు, జెట్‌ విమానాలు, హెలికాప్టర్‌, నౌకల్లో తిరిగిన తనకి ప్రపంచంలోనే ఆరో ధనవంతుడిగా పేరుంది.. తర్వాత చేసిన అప్పులు కట్టేందుకు డబ్బులు లేక కోర్టు మెట్లు ఎక్కాడు.. నాడు ఫ్యూచర్ లో ఎక్కువ డెవలప్ మెంట్ అయ్యేది… టెలికాం ఇండస్ట్రీయే అని నమ్మి, పెట్టిన పెట్టుబడులకు.. తగ్గ లాభాలను అర్జించలేక వ్యాపార జీవితంలో విఫలమయ్యాడు.. ఒకపక్క అన్న ముకేశ్‌ అంబానీ తన వ్యాపారాలతో సంపదను పెంచుకుంటూ పోతుంటే.. తమ్ముడు అనిల్ మాత్రం తనకున్న సంస్థలను నడపలేక దిగిపోయాడు..

ఇంతకీ అనిల్ చేసిన తప్పులేంటి.. కారణాలేంటో.. ఇప్పుడు చూద్దాం…

రిలయన్స్ గ్రూప్స్ కి పునాదులు వేసింది.. ధీరుబాయ్ అంబానీ.. ఆయన ఒకప్పుడు బతుకుదెరువుకోసమని వేరే దేశం ఉపాధి కోసం వెళ్ళి.. పెట్రోల్ బంక్ లో పనిచేసి.. కొంత ధనం కూడబెట్టుకొని, మరికొంత పెట్టుబడితో.. రిలయన్స్ అనే ఒక చిన్న కంపెనీని మొదలుపెట్టారు. తక్కువ రోజుల్లోనే టెక్స్ టైల్స్, టెలికాం, పెట్రోల్, కెమికల్స్, ఎనర్జీ… అంటూ ఒక్కొక్క రంగంలో విస్తరించుకుంటూ పోయారు. ఆయన కృషి ఫలితం కొన్నాళ్లకు వేల కోట్ల విలువ చేసే మహా వృక్షంగా ఎదిగింది. ధీరుభాయ్ అంబానీ బతికున్నంతకాలం తన ఇద్దరు కొడుకులు ముకేశ్, అనిల్ అంబానీలు అదే కంపెనీలో కలిసిమెలసి పనిచేశారు.

అప్పటివరకు అంతా బానే ఉంది అనుకునేలోపు… అనారోగ్యం కారణంగా దీరుభాయ్ అంబానీ 2002 జులై 2న కన్నుమూశారు.. తండ్రి మరణించిన రెండునెలలపాటు అన్నదమ్ములిద్దరూ కలిసే వ్యాపార లావాదేవీలు చూసుకున్నారు. పెద్ద కొడుకు ముకేశ్.. రిలయన్స్ గ్రూప్స్ కి ఛైర్మన్ అండ్ ఎండీగా, తమ్ముడు అనిల్ వైస్ ఛైర్మన్ గా బోర్డు మెంబర్స్ లో ఒకరిగా ఉన్నారు. మొదట్లో కొంతకాలం బాగానే సాగింది. కానీ కొన్ని కారణాలతో ఇద్దరూ విడిపోయారు. పైగా వీరి తండ్రి చనిపోయేముందు ఎటువంటి వీలునామాను రాయలేదు. వ్యాపారాన్ని కొడుకులిద్దరికీ సమంగా పంచి ఇవ్వలేదు. 

దీంతో కుటుంబంలో, ఇంట్లో తరచూ గొడవలు.. ఒకానొక సమయంలో ముఖేష్‌ అంబానీ టెలికాం బిజినెస్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, అనిల్‌ అంబానీ పవర్ జనరేషన్‌ను విస్తరించాలని అనుకున్నారట. అయితే రిలయన్స్‌ గ్రూప్‌ వద్ద అప్పటికి ఒక ప్రాజెక్టులో మాత్రమే పెట్టుబడి పెట్టగలిగేంత సేవింగ్స్ ఉన్నాయి.. చివరికి రిలయన్స్‌ టెలికాం సర్వీసెస్‌లో పెట్టుబడి పెట్టింది. అందువల్ల అనిల్‌ అంబానీ ఈ విషయంలో ఇంకాస్త నొచ్చుకున్నాడట.. ఆయనకు ఇంట్లో తగిన గుర్తింపు, విలువ లేదని భావించిన అనిల్‌ బిజినెస్ తో పాటు.. పాలిటిక్స్‌వైపు అడుగులు వేశారు..

రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన కొన్నాళ్లకే సమాజ్‌ వాద్ పార్టీలో చేరాడు. అట్నుంచి రాజ్యసభకు ఎంపీ అయ్యాడు. సినీతార టీనా మునిమ్ ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ విషయంలో తనపై ఇంట్లో అయిష్టత ఇంకాస్త పెరిగింది.. దీంతో అనిల్ ఎక్కువగా పొలిటిషియన్స్‌, బాలీవుడ్‌ స్టార్స్‌తో తిరగడంతో.. ఈ వ్యవహారమంతా అన్న ముఖేష్‌ కి ఏమాత్రం నచ్చకపోవడంతో మనస్పర్థలు మరింతలా ఏర్పడ్డాయి. దీంతో తల్లి రిలయన్స్ ఆస్తులను ఇద్దరికి సమంగా పంచాలని నిర్ణయించుకుంది.

2005లో అప్పటి రిలయన్స్ గ్రూప్ లోని కంపెనీలు అన్నిటిని రెండు భాగాలుగా విభజించగా.. అందులో ఆయిల్‌, గ్యాస్‌, ఫార్మాస్యూటికల్, రిఫైనింగ్‌, మానిఫాక్చరింగ్‌ సంస్థలు అన్న ముకేశ్‌ కి వెళ్లగా.. టెలికాం, ఎలక్ట్రిసిటీ, ఫైనాన్షియల్‌ సర్వీస్‌లు అనిల్‌కు వచ్చాయి. అలా ముకేశ్ అంబానీకి వచ్చిన కంపెనీల విలువ సుమారు రూ. 96 వేల కోట్లు, అనిల్ అంబానికి వచ్చిన కంపెనీల విలువ రూ. 56 వేల కోట్లు.. వీరిద్దరిలో అనిల్ అంబానీ వాటా తక్కువగా ఉన్నప్పటికీ తన కంపెనీల్లో రిలయన్స్ కమ్యూనికేషన్స్ ప్లస్ అవుతుందని అనుకున్నాడు. ఎందుకంటే భవిష్యత్తులో అందరూ మొబైల్స్ వాడతారు కాబట్టి రిలయన్స్ నెట్వర్క్ కి మంచి డిమాండ్ ఉంటుందని భావించాడు. ఇలా ఇద్దరి వ్యాపార ప్రయాణం వేర్వేరుగా మొదలైంది.

కుటుంబం నుంచి విడిపోయి రెండేళ్లు గడిచిన తర్వాత ఇద్దరి సంపాదనలో అతి స్వల్ప తేడా మాత్రమే ఉండేది. సంపదపరంగా చూసుకుంటే 2006 వరకు అనిల్‌ అంబానీ.. అన్న ముకేశ్‌ను మించిపోయాడు. 2008లో రెండులక్షల కోట్ల రూపాయల ఆస్తితో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో ఆరోస్థానంలో నిలిచాడు. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలన్ని కూడా మొత్తం రివర్స్ అయ్యాయి. ఆయన బిజినెస్ గ్రాఫ్ నే తలకిందులు చేసేశాయి.

2008లో అనిల్ తన రెండవ కంపెనీ అయిన రిలయన్స్‌ పవర్‌ ఐపీఓను తెరవాలనుకున్నాడు. అందుకోసం అనిల్‌ తన సోదరుడి పవర్‌ ప్లాంట్స్‌ విషయంలో మరోసారి తగాదా నెలకొంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ ఒకటిగా ఉన్నప్పుడు రిలయన్స్ పవర్ ప్లాంట్ లను తక్కువ ధరకే వాడేవారు. వీరిద్దరూ విడిపోయిన తర్వాత గ్యాస్ సెక్షన్ ముకేశ్ అంబానీకి వెళ్తే.. రిలయన్స్ పవర్ సెక్షన్ అనిల్ కి వెళ్ళింది. ఎప్పటిలాగే గ్యాస్ తక్కువ ధరకు సప్లై చేయాలని అనిల్ అంబానీ అంటే.. మార్కెట్ లో ఏ రేటు ఉంటే ఆ ధరకి గ్యాస్ ను అమ్మాలని ముకేశ్ ల మధ్య భేదాభిప్రాయాలు పెరిగిపోయాయి. చివరకు అనిల్ ఎక్కువ ధరలకు గ్యాస్ కొని, తన పవర్ ప్లాంట్ ను నడపవలసి వచ్చింది. ఒకవైపు ముకేశ్ అంబానీ కంపెనీల్లో ఒకటైన పెట్రోల్ నుంచి మంచి లాభాలు వస్తే.. అనిల్ లాభాలు కొద్దికొద్దిగా తగ్గాయి.

రిలయన్స్‌ క్యాపిటల్‌లో ఇన్వెస్ట్‌ తో పాటు ఇన్‌ఫ్రా, ఎంటర్టైన్‌మెంట్‌ సెక్టార్‌ లలో అనిల్ పెట్టుబడులు పెట్టారు. ఈ ప్రాజెక్టులను నడిపేందుకు వేలకోట్ల రూపాయల్లో అప్పు చేశారు. కొద్దీరోజుల్లోనే రిలయన్స్‌ కమ్యూనికేషన్‌, ఐపీఓ కూడా మొదలుపెట్టారు. అంత రిస్క్ చేసి ఇన్వేస్ట్ చేసిన టెలికాంలో అనుకోని కుదుపు వచ్చింది.. 2007లో టెలికాం రంగంలో రిలయన్స్ కు పోటీగా ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ లాంటి బిగ్ నెట్వర్క్ లు ఎంట్రీ ఇవ్వడం.. ఆదరణ పొందడంతో.. అనిల్ దశ దిశ మారింది.. మెల్లిగా రిలయన్స్‌ కమ్యూనికేషన్‌ మార్కెట్‌ షేర్‌ డౌన్ అయ్యింది. అప్పటికి కంపెనీని ఇంకా ఎవాల్వ్‌ చేయలేదు. కస్టమర్స్ డిమాండ్స్ ను తెలుసుకోలేకపోవడంతో.. రిలయన్స్ కు ఉన్న బేసిక్

కస్టరమర్స్‌ సైతం ఇతర నెట్‌వర్క్ లకు మారిపోవడం మొదలుపెట్టారు. దీంతో తనకున్న ఇతర వ్యాపారాలైన రిలయన్స్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, రిలయన్స్ పవర్ కంపెనీలను నడిపించడానికి మరింత మొత్తంలో డబ్బు కావాల్సి వచ్చింది. దానికి కావాల్సిన డబ్బును అనిల్ అంబానీ పలు బ్యాంకుల నుంచి అప్పుగా తీసుకున్నారు. తీసుకున్న అప్పులకి పెరుగుతున్న వడ్డీలను చెల్లించడానికి తనకున్న కంపెనీలో వాటాల్ని అమ్ముకోవాల్సిన అవసరం ఏర్పడింది అనిల్ అంబానీకి..

ఇక రిలయన్స్ కమ్యూనికేషన్స్ అయితే మూతపడే స్థాయికి వచ్చేసింది. 2015 నాటికి రిలయన్స్‌ క్యాపిటల్‌ మినహా మిగతా కంపెనీలన్ని నష్టాల్లోనే కొనసాగాయి. దాదాపు లక్షఇరవైఐదు వేలకోట్ల రూపాయల రుణాలకు అనిల్ అంబానీ సంస్థ చేరింది. అత్యంత అప్పులు తీసుకున్న సంస్థగానూ పేరు పొందింది. ఇంత నష్టం చవిచూసిన తర్వాత కూడా ధైర్యం చేసి, మరో రూ. 2వేల కోట్ల రూపాయలతో రిలయన్స్‌ డిఫెన్స్‌లో పెట్టుబడి పెట్టారు. ఈ రంగంలో అనుభవం లేనికారణంగా అనిల్‌ అంబానీ మరింత అప్పుల పాలయ్యారు.. దీనికితోడు జియో ఎంట్రీ కూడా అనిల్‌ అంబానీని పెద్ద దెబ్బ కొట్టిందనే చెప్పాలి.

2019లో అనిల్ అంబానీ స్వీడన్ కు చెందిన ఎరిక్సన్ అనే కంపెనీకి రూ. 550 కోట్ల రూపాయలు చెల్లించవలసి ఉండగా.. చెల్లించలేదు.. ఈ నేపథ్యంలో ఎరిక్సన్ కంపెనీ అనిల్ మీద కేసు ఫైల్‌ చేసింది. వారికి తిరిగి ఇవ్వాల్సిన అప్పును చెల్లించకపోతే జైలు శిక్ష తప్పదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.. ఆ పరిస్థితి నుంచి బయటపడేసేందుకు అన్న ముకేశ్ అంబానీ ఆ డబ్బును చెల్లించి తన తమ్ముడిని కాపాడారు. దీని బట్టి చూస్తే.. అనిల్ అంబానీ కెరీర్ తొలినాళ్లలో తీసుకున్న నిర్ణయాలు.. పెట్టిన పెట్టుబడుల వల్ల ఓ పదేళ్లు వ్యాపారంలో తిరుగులేని అధినేతగా నిలిచాడు.. కానీ తర్వాతి కాలంలో తను చేసిన చిన్న చిన్న పొరపాట్లు, తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల తన కంపెనీలన్నిటిలో కూడా వేలకోట్ల రూపాయలను నష్టపోయారు. తన అన్న కన్నా 550 కోట్ల సంపద అధికంగా ఆర్జించిన తాను.. 90 శాతానికి పైగా సంపదను కోల్పోయి.. అత్యంత ఫెయిల్యూర్ ని చవిచూశారు. 

2006లో ఇండియాలో అత్యంత ధనవంతుల జాబితాలో ముకేశ్ అంబానీ రెండో స్థానంలో ఉంటే అనిల్ అంబానీ మూడో స్థానంలో నిలిచారు. ఇద్దరు కూడా పోటాపోటీగా వ్యాపారాన్ని విస్తరించుకుంటూపోయారు. ఒకవేళ అన్నదమ్ములిద్దరూ మొదట్నుంచీ ఒక మాట మీద కలిసి నిలబడి ఉంటే.. వీరిద్దరి సంపదతో భారత్‌లోనే కాక ప్రపంచ కుబేరుల జాబితాలోనే నంబర్ వన్ ప్లేస్ లో ఉండేవారేమో.. కానీ కాలం కలిసి రాక.. టెలికాం వ్యాపారం దెబ్బతినడంతో.. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన అనిల్ జీవితం అందరికీ గుణపాఠమే కదా!

Show More
Back to top button