
అగ్రరాజ్యానికి అధినేత అయిన ట్రంప్ నకు, రష్యాతో యుద్ధాన్ని ఎదుర్కొంటున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మధ్య తాజాగా చోటుచేసుకున్న వివాదం.. ప్రపంచం మొత్తాన్నీ నివ్వెరపోయేలా చేసింది. ఖనిజాల ఒప్పందమే ప్రధాన అజెండాగా వీరిద్దరూ వైట్ హౌస్‌లో భేటీ అయ్యారు.
రష్యాపై చేస్తున్న యుద్ధాన్ని తెరదించేందుకు శాంతి ఒప్పందం కుదర్చుకునేందుకు.. బదులుగా ఉక్రెయిన్‌లోని అరుదైన ఖనిజాల తవ్వకానికి అనుమతించాలని అమెరికా చేసిన ప్రతిపాదనపై చర్చించడానికి జెలెన్‌స్కీ శ్వేతసౌధానికి వచ్చారు.
భవిష్యత్తులో తమపై రష్యా ఏదైనా దురాక్రమణకు పాల్పడితే రక్షణ కల్పించాలని జెలెన్ స్కీ ట్రంప్ పై ఒత్తిడి చేశారు. ఈ విషయం ట్రంప్, అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్‌లు ఇద్దరికీ ఆగ్రహం తెప్పించింది.
దీంతో ‘మాతో ఒప్పందం కుదుర్చుకుంటే సరే.. లేదంటే మీ దారి మీరు చూసుకోండి’ అని ట్రంప్ తెగేసి చెప్పారు.
నిజానికి ఉక్రెయిన్‌తో రష్యా వివాదం ఇప్పటిది కానే కాదు. వందల ఏళ్లుగా రష్యన్ సామ్రాజ్యంలో భాగంగానే ఉంది ఉక్రెయిన్. ఆ తర్వాత కూడా అవిభక్త సోవియట్ యూనియన్ లో భాగంగా కొనసాగుతూ వచ్చింది. ముఖ్యంగా ఉక్రెయిన్ యూరప్ దేశాలవైపు మొగ్గు చూపడం రష్యాను బాగా కలవరపెడుతూ వచ్చింది. మరోపక్క నాటో కూటమిలో తమను చేర్చుకోవాలని కూడా ఉక్రెయిన్ ఉవ్విళ్లూరింది. అమెరికాలాంటి సభ్యదేశాల సైనిక తోడ్పాటుతో ఉక్రెయిన్ మరింత బలోపేతమయ్యేసరికి రష్యా అధ్యక్షుడు పుతిన్ బాగా ఆందోళన చెందాడు.
తమకు యుద్ధం ఆలోచన లేదంటూనే మరోవైపు మోహరింపులను రెండు లక్షలదాకా పెంచుకుంటూ పోయింది రష్యా. ఉక్రెయిన్‌కు చరిత్రలో ఎన్నడూ ప్రత్యేక అస్తిత్వం లేదంటూ తన ఉద్దేశాలను చెప్పకనే బయట పెట్టింది. భౌగోళికంగా చూస్తే ఉక్రెయిన్ కన్నా రష్యా 28 రెట్లు పెద్దది. జనాభాపరంగా చూస్తే 3 రెట్లు.
యుఎస్ఎస్ఆర్ లో ఉక్రెయిన్, రష్యాలు కలిసి ఉండేవి. రష్యా ఎక్కువ సఖ్యతగా ఉంది కూడా ఉక్రెయిన్ తోనే.
1991 ఆగస్టులో ఉక్రెయిన్ సోవియట్ యూనియన్ నుంచి బయటకు వచ్చి, స్వతంత్ర దేశంగా మారింది. అదే ఏడాది డిసెంబరులో ఆ యూనియన్ కాస్త చీలిపోయింది. ఉక్రెయిన్ లో భాగంగా ఉన్న డొనెట్‌స్క్, లుహాన్‌స్క్ ప్రాంతాల్లో రష్యన్లే ఎక్కువమంది ఉండేవారు. తమ భూభాగాలను తమకే ఇవ్వాలని రష్యా ఉక్రెయిన్ మీద, ఉక్రెయిన్ రష్యాల నడుమ తరచూ గొడవలు జరిగేవి. నిజానికి ఉక్రెయిన్, రష్యాలు ఒక్కటే! అంతకుముందు వరకు కూడా వీరిని సోవియట్లు అనేవారు. గొడవ సద్దుమనక రెండు దేశాలు 2014లో ‘ది మిన్స్క్ అగ్రిమెంట్’ను చేసుకున్నాయి.
ఈ ఒప్పందం ప్రకారం సరిహద్దులో మోహరించిన ఇరు దేశాల భద్రత బలగాల్ని వెనక్కు తీసుకోవాలి. ఒకరిపై ఒకరు దాడి చేసుకోకూడదు. ఇలాంటి 13 శాంతియుత అంశాలతో కూడిన ఒప్పందాన్ని రాసుకున్నాయి. ఇలా ఇరు దేశాలు ఈ ఒప్పందాన్ని అంగీకరిస్తూ, సంతకాలు కూడా చేశాయి. కానీ ఉక్రెయిన్ ఎప్పుడైతే ఒప్పందం మీరి ప్రవర్తించిందో, రష్యా కూడా ఒప్పందం మీరి సరిహద్దులో మోహరింపులు మొదలుపెట్టింది. అప్పుడే ఈ సమస్యలోకి అమెరికా పరకాయ ప్రవేశం చేసింది. అమెరికా తనకు ఏమాత్రం సంబంధం లేని ఈ ఇరు దేశాల గొడవలో జోక్యం చేసుకొని, ఉక్రెయిన్ కు నాటోలో భాగస్వామ్యం ఇస్తానని ప్రకటించింది. అమెరికా అంటే గిట్టని పుతిన్ కు ఇది అసలు నచ్చలేదు. తమ దేశ భద్రతకు భంగం వాటిల్లకుండా ముందుగానే యుద్దాన్ని ప్రకటించింది.
నాటోలో అగ్రరాజ్యమైన అమెరికా ప్రధానంగా ఉంది. అమెరికా మొదట్నుంచి కూడా రష్యా మీద వ్యతిరేకత కలిగి ఉంది. అదను చూసి ఉక్రెయిన్ ను అడ్డుగా చేసుకొని, రష్యా మీద ప్రతీకార చర్యకు పాల్పడాలనుకుంది. ఇది ముందే గ్రహించిన రష్యా అధినేత పుతిన్… అమెరికా తోడ్పాటును కోరుకున్న ఉక్రెయిన్ పై యుద్ధాన్ని ప్రకటించడం జరిగింది. ఈ దేశాల మధ్య ఉన్న అపార్థాలకు సామాన్య ప్రజలు బలవుతున్నారు. ఈ యుద్ధానికి ముఖ్య కారణంగా మనకు పుతిన్ కనిపిస్తున్నా, కనపడని మరో కారణం ఉక్రెయిన్ ప్రెసిడెంట్ అయిన వ్లాదిమిర్ జెలెన్ స్కీ.
ఇతడు ఒక టీవీ షో ద్వారా హాస్యనటుడిగా చేరి, ప్రముఖుడిగా మారి, ఆపై 2019లో ఊహించని రీతిలో ఉక్రెయిన్ కు ప్రెసిడెంట్ అయ్యాడు.
అతడికి రాజకీయానుభవం లేదు. దౌత్యపరమైన విషయాల్లోనూ అవగాహన లేదు. అలా లేకే రష్యాతో సరిగా సమన్వయపర్చుకోలేదు. ఆయన తీసుకున్న సంచలన నిర్ణయం వల్ల ఈ యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చింది.
ఎందుకంటే సరిహద్దులో రష్యా భద్రత బలగాల్ని మోహరించినప్పుడు, ప్రజల్లోకి వచ్చినప్పుడు… ఏం చేయాలో తెలియని స్థితిలో, ఉక్రెయిన్ ప్రజల్ని స్వయంగా ఆయుధాలు పట్టుకోమన్నాడు. ఎదురు దాడికి పాల్పడమన్నాడు. అంటే అమాయక ప్రజల ప్రాణాల్ని బలమైన సేన కలిగిన దేశం చేతిలో పెట్టేశాడు. నేరుగా ఆ దేశం యుద్ధానికి దిగేలా చేశాడు. బాంబు దాడులతో, ప్రజలు తమ నివాసాలను విడిచి ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకొని తిరిగేలా చేశాడు.
తాజాగా జెలెన్ స్కీ వ్యవహార శైలి మరోసారి బయటపడింది.
ట్రంప్.. 10 నిమిషాల వాగ్వాదానికి ముగింపు పలుకుతూ.. ఇలాంటి పరిస్థితుల్లో ఉక్రెయిన్‌తో వాణిజ్య సంబంధాలు నెరపడం కష్టమని వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో జెలెన్‌స్కీ అమెరికాతో ఖనిజాల ఒప్పందంపై సంతకం చేయకుండానే అక్కడి నుంచి వెనుదిరిగారు. ఒకవేళ శాంతి ఒప్పందం కుదరకపోతే.. అమెరికా- ఉక్రెయిన్ మధ్య ఖనిజాల ఒప్పందం కూడా ముందుకు కదిలే అవకాశాలు కనిపించడంలేదు. భేటీ అనంతరం ట్రంప్ తన సామాజిక మాధ్యమం ద్వారా ట్రూత్ సోషల్‌లో ఓ పోస్టు పెట్టారు. రష్యాతో శాంతి ఒప్పందానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సుముఖంగా లేరని అర్థమైందంటూ రాసుకొచ్చారు.
శాంతి చర్చలకు జెలెన్‌స్కీ తిరిగి వచ్చినప్పటికీ.. అందుకు తాను సిద్ధంగా లేనని ట్రంప్ క్లారిటీ ఇచ్చారు.