
హిందూవులకు ఎంతో పవిత్రమైన మాసం.. శ్రావణమాసం… మన హిందూ సాంప్రదాయం ప్రకారం పురాణకాలం నుంచి కూడా శ్రావణమాసానికి ఒక విశిష్టత ఉంది. హరిహరులు ఇద్దరికీ ఎంతో ప్రీతిపాత్రమైన మాసం. శ్రీ మహావిష్ణువు అలాగే లక్ష్మీదేవికి శ్రావణమాసం ఎంతో ఇష్టమైన మాసం. అటు శివుడికి కూడా శ్రావణమాసం చాలా విశిష్టమైనది. శ్రావణమాసం దక్షిణాయణంలో వచ్చే పుణ్యమాసం. ఈ మాసంలో సకల శుభకార్యాలకు చాలా మంచిదని పండితులు చెబుతున్నారు.
తెలుగు మాసాల ప్రకారం చూస్తే ఇది వరుస క్రమంలో 5వ మాసం. చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు. అందువల్ల ఈ మాసాన్ని శ్రావణమాసం అని పిలుస్తారు. ముఖ్యంగా నోములు నోచేవారికి, వ్రతాలు చేసే వారికి శ్రావణమాసం చాలా శుభప్రదమైనది. అలాగే వివాహాది శుభకార్యాలకు శ్రావణమాసం చాలా మంచిది. ఈ మాసంలో తలబెట్టే పనులకు లక్ష్మీదేవి ఆశీర్వాదం, అనుగ్రహం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసాన్ని లక్ష్మీప్రదమైన మాసం అని కూడా అంటారు.
శ్రావణమాసంలో అనేక పర్వదినాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ మాసంలోనే వరలక్ష్మీ వ్రతం ఉంటుంది. ఇదికాకుండా ప్రతి శ్రావణ శుక్రవారం మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరిస్తారు. ముఖ్యంగా శ్రావణమాసంలో రెండవ శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం చేస్తారు. మంగళగౌరీ వ్రతం, వరలక్ష్మీ వ్రతం, నాగచతుర్థి, పుత్రదా ఏకాదశి, రాఖీ పూర్ణిమ, హయగ్రీవ జయంతి, రాఘవేంద్ర జయంతి, శ్రీ కృష్ణాష్టమి, కామిక ఏకాదశి, పోలాల అమావాస్య వంటి పండుగలను గొప్పగా నిర్వహిస్తారు. ఆ తర్వాత భాద్రపద మాసం ప్రారంభమవుతుంది.
శ్రావణమాసంలో ఆచరించాల్సిన వ్రతాలలో ప్రధానమైనది మంగళగౌరీ వ్రతం. శ్రావణమాసంలో వచ్చే 4 మంగళవారాలపాటు ఈ మంగళ గౌరీ వ్రతం ఆచరించాలి. పార్వతి దేవిని గౌరి అని పిలుస్తారు. మంగళ గౌరీ వ్రతం కొత్తగా పెళ్ళయిన మహిళలు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల తమ కుటుంబం భోగభాగ్యాలతో తులతూగుతుందని పురాణాల్లో రాసి ఉంది.
ఇక ఈ మాసంలో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే వరలక్ష్మీదేవి వ్రతం అత్యంత ముఖ్యమైనది. శ్రావణ శుక్రవారంరోజున మహిళలంతా భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీదేవి వ్రతం ఆచరిస్తారు.
ముఖ్యంగా మహిళలు తమ చుట్టూ ఉన్న ముత్తైదువులను ఆహ్వానించి పేరంటం నిర్వహిస్తారు. వరలక్ష్మి వ్రతం ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహిస్తారు. మహిళలు తమ సౌభాగ్యం, సంతానం అభివృద్ధి కోసం ఈ వ్రతం ఆచరిస్తారు. అలాగే శ్రావణమాసంలో నూతన గృహప్రవేశాలు, వ్యాపార ప్రారంభం ఇలా ఏది తలపెట్టినా అందులో విజయం సాధిస్తారనీ విశ్వాసం.
లక్ష్మీదేవి సకల సంపదలకు ప్రతీక. సకల సౌభాగ్యాలకు చిహ్నం. మనిషి సుఖమైన, శుభప్రదమైన జీవితం గడిపేందుకు కావాల్సిన సమస్త అంశాలను సంపదగానే పరిగణిస్తారు. ధనధాన్యాలు, సంతానం, ఆరోగ్యం, జ్ఞానం వంటివన్నీ సంపదల కిందే లెక్క. ధనం సరేసరి.. ‘ఇవన్నీ లక్ష్మీదేవి అనుగ్రహంతోనే లభిస్తాయి’ అని ప్రజల నమ్మకం. వీటిని కోరేవారంతా లక్ష్మీ కటాక్షం కోరుకుంటారు. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, ధైర్యలక్ష్మి… వంటి పేర్లతో ఆయా అంశాలవారీగా వారివారి అభీష్టం మేరకు ఆరాధిస్తారు.